టూరిజం రాయితీ 213 కోట్లు
⇒ స్టార్ హోటళ్లు, రెస్టారెంట్లకు చెల్లించేందుకు ఏపీ సిద్ధం
⇒ 2017 పర్యాటక విధానం రూపొందించిన అధికారులు
సాక్షి, అమరావతి: పర్యాటకం పేరుతో స్టార్ హోటళ్లకు భారీ రాయితీలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. 2015లో తీసుకువచ్చిన పర్యాటక విధానంలో పేర్కొన్న రాయితీలను చూసి స్టార్ హోటళ్లతో పాటు ఇతర పర్యాటక ప్రాజెక్టులు చేపట్టడానికి ఎవరూ ముందుకు రావడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే పర్యాటక పెట్టుబడిదారులతో ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరుల్లో పలుసార్లు రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరిపింది.
ఈ సంప్రదింపుల్లో వయబిలిటీ గ్యాప్ ఫండింగ్, కేపిటల్ సబ్సిడీతో పాటు భారీ రాయితీలు ఇవ్వాల్సిం దిగా పర్యాటక పెట్టుబడి దారులు ప్రభుత్వాన్ని కోరారు. దీంతో సీఎం ఆదేశం మేరకు ప్రభుత్వ అధికారులు 2017 పర్యాటక రాయితీల విధానాన్ని రూపొందించారు. ఈ విధానం మేరకు ఏడాదికి రూ. 213 కోట్ల మేర రాయితీలు ఇవ్వాల్సి ఉంటుందని, ఈ మొత్తాన్ని ప్రతీ ఏడాది కొన్ని సంవత్సరాల పాటు బడ్జెట్‌లో కేటాయింపులు చేయాలని అధికారులు అంచనా వేశారు. 213 కోట్ల రూపాయల రాయితీల్లో హోటళ్లు, రెస్టారెంట్లకే రూ. 150 కోట్ల మేర చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. రూ. 100 కోట్ల పెట్టుబడి గల హోటళ్లు, ఇతర పర్యాటక ప్రాజెక్టులకు అవసరమైన భూములను నామినేషన్‌పై కేటాయించాలని కూడా నిర్ణయించారు.
హోటల్ రూముల కొరత!
రాష్ట్రంలో ప్రస్తుతం 18,000 హోటల్ రూముల కొరత ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. అలాగే కన్వెన్షన్ కేంద్రాల కొరత ఉందని, జాతీయ రహదారుల పక్కన పర్యాటక సౌకర్యాలను కల్పించాలని, వాటర్ స్పోర్ట్స్‌ను ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా భారీ రాయితీలు ఇవ్వనుంది. త్వరలోనే ఈ రాయితీల విధానానికి కేబినెట్ ఆమోదం తెలపనుందని ఉన్నతస్థాయి అధికారి తెలిపారు. 2017 రాయితీల విధానం అయినప్పటికీ గతంలోనే పర్యాటక ప్రాజెక్టుల ఏర్పాటునకు ముందుకు వచ్చిన వారికి కూడా ఈ నూతన రాయితీలను వర్తింపజేయనున్నట్లు ఆ అధికారి పేర్కొన్నారు.
ప్రభుత్వం ఇవ్వనున్న రాయితీల వివరాలు...
ప్రభుత్వ భూములను సమకూర్చడం, నూరు శాతం భూ వినియోగ మార్పిడి చార్జీలు మినహాయింపు, నూరు శాతం రిజిస్ట్రేషన్ చార్జీలను రీయింబర్స్ చేయడం, కాంప్లిమెంటరీ మౌలిక సదుపాయాలను ప్రభుత్వమే సమకూర్చడం, కేపిటల్ సబ్సిడీ, వడ్డీ సబ్సిడీ, వ్యాట్–జీఎస్టీ, లగ్జరీ, వినోదపు పన్ను మినహాయింపు. విద్యుత్ చార్జీలు రీయింబర్స్ చేయడం, 25 శాతం మేర వాహనాల రోడ్డు పన్ను రీయింబర్స్ చేయడం, మార్కెటింగ్ సహాయం, ఉపాధికి అవసరమైన శిక్షణకు ప్రభుత్వ సాయం, ఫ్లెక్సిబుల్ బార్ విధానం, వాటర్ చార్జీలు ప్రభుత్వమే భరించడం.