ఫ్రాన్స్‌ పిలుస్తోంది.. భారత విద్యార్థులకు శుభవార్త | France Becoming Top Choice For Indian Students | Sakshi
Sakshi News home page

ఫ్రాన్స్‌ పిలుస్తోంది.. భారత విద్యార్థులకు శుభవార్త

Published Wed, Feb 12 2025 7:25 AM | Last Updated on Wed, Feb 12 2025 11:53 AM

France Becoming Top Choice For Indian Students

పారిస్‌: మూడు రోజుల ఫ్రెంచ్‌ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లడంతో ఇప్పుడు అందరి దృష్టి పారిస్‌ వైపు మళ్లింది. ప్రధాని మోదీ ఫ్రాన్స్‌లో పర్యటించడం ఇది ఆరోసారి. అధ్యక్షుడు మాక్రాన్‌తో కీలక రక్షణ, అణు ఇంధన ఒప్పందాలపై సంతకాలు చేసి భారత్‌ –ఫ్రాన్స్‌ సంబంధాలను మరింత బలోపేతం చేయనున్నారు. ఇవన్నీ పక్కన పెడితే భారతీయ విద్యార్థులను ఆకర్షించడానికి అనుకూలమైన విద్యార్థి వీసా, వర్క్‌ పర్మిట్లను పారిస్‌ ప్రకటిస్తుందని నివేదికలు చెబుతున్నాయి.

ఇంతకుముందు బిగ్‌ ఫోర్‌గా పేరుగాంచిన అమెరికా, బ్రిటన్, కెనడా, ఆ్రస్టేలియా దేశాలు భారతీయ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి తొలు నాలుగు గమ్యస్థానాలుగా ఉండేవి. ఇటీవలి కాలంలో ఈ ధోరణి మారింది. యూరప్‌ దేశాలు ముఖ్యంగా ఫ్రాన్స్‌ భారతీయ విద్యార్థులకు టాప్‌ చాయిస్‌గా మారింది. హెచ్‌ఈసీ పారిస్‌ బిజినెస్‌ స్కూల్, సోర్బోన్‌ విశ్వవిద్యాలయం, ఎకోల్‌ పాలిటెక్నిక్‌ వంటి 75 కి పైగా ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు, వ్యాపారం, కళలు, సాంకేతికత, శాస్త్రాలలో అగ్రశ్రేణి ప్రోగ్రామ్‌లను అందిస్తున్నాయి. దీంతో ఫ్రాన్స్‌లో ఉన్నత విద్య పట్ల భారతీయ విద్యార్థులకు మక్కువ ఎక్కువైంది.

2023–24 విద్యా సంవత్సరంలో 7,344 మంది భారతీయ విద్యార్థులు ఫ్రాన్స్‌లోని విద్యాసంస్థల్లో చేరారు. 2030 నాటికి ఈ సంఖ్య 200 శాతం పెరుగుతుందని అంచనా. 2024 జనవరిలో రెండు రోజులపాటు భారత్‌లో పర్యటించిన ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ భారతీయ విద్యార్థులతో ముఖాముఖిలో మాట్లాడారు. 2030 నాటికి భారత్‌ నుంచి 30,000 మంది విద్యార్థులను ఆహ్వానించడమే తమ దేశ లక్ష్యమని ఆనాడు మాక్రాన్‌ తన మనసులో మాట చెప్పారు. ఇటీవల వేలాది మంది భారతీయ విద్యార్థులతో అభిప్రాయాలతో రూపొందిన క్యూఎస్‌ నివేదిక ప్రకారం ఫ్రాన్స్‌ తమ ఇష్టమైన గమ్యస్థానమని 31 శాతం మంది భారతీయ విద్యార్థులు చెప్పడం విశేషం. భారతీయ విద్యార్థులలో దాదాపు 50 శాతం మంది ఫ్రాన్స్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌లలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. 21 శాతం మంది అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులపై ఆసక్తి చూపుతున్నారు.

ఫ్రెంచ్‌ నేర్చుకుంటే.. 
ట్రంప్‌ రాకతో మారిన అమెరికా విధానాలు, నిజ్జర్‌ ఉదంతంతో భారత్‌–కెనడా మధ్య సత్సంబంధాలు సన్నగిల్లిన నేపథ్యంలో భారతీయ విద్యార్థులను ఆకర్షించేందుకు ఫ్రాన్స్‌ తన వీసా ప్రక్రియలను సరళతరం చేస్తోంది. ఎక్కువ మంది విద్యార్థులను ఆకట్టుకోవడానికి ఫ్రెంచ్‌తోపాటు ఇంగ్లీష్‌ భాషలోనూ కోర్సులను అందిస్తోంది. అంతర్జాతీయ తరగతుల ద్వారా ఫ్రెంచ్‌ బోధిస్తూ అది పూర్తి చేసిన వారికి అండర్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్స్‌కు అనుమతిస్తోంది. దీనివల్ల విదేశీ విద్యార్థులకు ఫ్రెంచ్‌ భాషలో బోధించే 200కి పైగా విద్యా కార్యక్రమాల్లో అవకాశం లభిస్తుంది. అనేక ఫ్రెంచ్‌ విశ్వవిద్యాలయాలు డ్యూయల్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌లను అందిస్తున్నాయి. మాస్టర్స్‌ డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హత ఉండి, ఫ్రాన్స్‌లో ఒక సెమిస్టర్‌ చదివిన భారతీయ విద్యార్థులు ఐదేళ్ల షార్ట్‌–స్టే స్కెంజెన్‌ వీసా పొందేందుకు అర్హులు అవుతారు. ఫ్రెంచ్‌ మాస్టర్స్‌ డిగ్రీతో పోస్ట్‌ గ్రాడ్యుయేట్లకు రెండేళ్ల పోస్ట్‌–స్టడీ వర్క్‌ వీసాను కూడా ఫ్రాన్స్‌ అందిస్తుంది. ఈ వీసాను మొత్తం రెండేళ్లపాటు జారీ చేస్తారు. దీంతో భారతీయ విద్యార్థులు ఫ్రాన్స్‌ వైపు మొగ్గుచూపుతున్నారు.

ఖర్చు తక్కువ..
భారతీయ విద్యార్థులను ఫ్రెంచ్‌ విశ్వవిద్యాలయాల వైపు నడిపించిన అంశాలు అనేకం ఉన్నాయి. ఫ్రెంచ్‌ ప్రభుత్వ, ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల్లో విద్యా ప్రమాణాలు ఉన్నతంగా ఉన్నాయి. బిజినెస్, డేటా అనలిటిక్స్, ఫ్యాషన్‌తోపాటు విస్తృతమైన కోర్సులను కూడా అందిస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తయితే ఫ్రాన్స్‌లో ఉన్నత విద్య ఖర్చు మిగతా బిగ్‌ఫోర్‌ దేశాలతో పోలిస్తే తక్కువ. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో తక్కువ ట్యూషన్‌ ఫీజులు ఉంటాయి. చార్పాక్, ఈఫిల్‌ ఎక్సలెన్స్‌ ప్రోగ్రామ్‌ వంటి అనేక ఆర్థిక సహాయ కార్యక్రమాలు కూడా ఇక్కడ చేపడతారు. భారత విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన 15 కోట్ల రూపాయలకు పైగా ఉపకార వేతనాలను ఫ్రాన్స్‌ అందిస్తోంది. ఫ్రాన్స్‌లో జీవన వ్యయం కూడా తక్కువే. పారిస్‌లో నెలకు సగటున రూ.1.54 లక్షలు, లియోన్‌లో రూ.1.01 లక్షలు వంటి బడ్జెట్‌ ఫ్రెండ్లీ ఆప్షన్స్‌ ఉన్నాయి. ఇతర నగరాల్లో సగటు జీవన వ్యయం నెలకు లక్ష రూపాయల కన్నా తక్కువ. ఫ్రాన్స్‌లోని విశ్వవిద్యాలయాలు చాలా మంచి ప్లేస్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లను అందిస్తున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement