
సాక్షి, అమరావతి: ఎన్డీఏ నుంచి తాము వైదొలిగాక పట్టిసీమ ఎత్తిపోతల పథకంలో అక్రమాలు జరిగాయంటూ బీజేపీ దుర్మార్గమైన రాజకీయాలు చేస్తోందని సీఎం చంద్రబాబు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలపై కాగ్ వ్యక్తం చేసిన అభ్యంతరాలపైనా సీబీఐతో విచారణ జరిపిస్తారా? అని బీజేపీని ప్రశ్నించారు. ప్రపంచ జలదినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం చంద్రబాబు గురువారం శాసనసభలో ఓ ప్రకటన చేశారు. కేంద్రమంత్రి గడ్కారీ ప్రతిపాదనల మేరకే పోలవరం స్పిల్‌వే కాంక్రీట్ పనులను నవయుగ సంస్థకు అప్పగించామని చెప్పారు. కేవలం పేరుకోసమే పాత ధరలకే పనులు చేసేందుకు నవయుగ ముందుకొచ్చిందన్నారు.
హోదా పేరుతో కాకపోయినా.... ఈశాన్య రాష్ట్రాల్లా రాయితీలిస్తే సరే: సీఎం
ప్రత్యేక హోదా పేరుతో కాకపోయినా ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలకు కేంద్రమిస్తున్న రాయితీలన్నింటినీ మన రాష్ట్రానికి ఇస్తే రాష్ట్ర ప్రజలందరినీ తాను ఒప్పిస్తానంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. శాసనమండలిలో ఆయన ప్రత్యేక హోదా అంశం గురించి ప్రసంగించే సమయంలో బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ జోక్యం చేసుకుంటూ ఈశాన్య రాష్ట్రాలకు రాయితీలు ఇస్తున్నప్పటికీ ప్రత్యేక హోదా పేరును ఉపయోగించడం లేదన్నారు. మన రాష్ట్రానికి కూడా 90:10 నిష్పత్తిలో నిధులు ఇవ్వడానికి కేంద్రం అంగీకరించిందని, పారిశ్రామిక రాయితీలు పొందేందుకు కలిసికట్టుగా ప్రయత్నం చేద్దామని సూచించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలకు బీజేపీ నేతలు కట్టుబడి ఉండాలని కోరారు.
ఈశాన్య రాష్ట్రాలకు కేంద్రమిస్తున్న రాయితీలన్నీ మన రాష్ట్రానికి ఇస్తే కమ్యూనిస్టు పార్టీలను కూడా తానే ఒప్పిస్తానని, ఆందోళన చేస్తున్న ప్రజలను ఒప్పించే బాధ్యత కూడా తనదేనన్నారు. కేంద్రం మన రాష్ట్రానికి 90: 10 నిష్పత్తిలో నిధులతో పాటు ఈఏపీ ఇవ్వాలని, పారిశ్రామిక రాయితీలు కల్పించాలని తాను మొదట నుంచీ చెబుతున్నానన్నారు. కాగా, అమరావతిలో 46 అంతస్తులతో సీఎం టవర్, అందులో ముఖ్యమంత్రి కార్యాలయం, సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ఉండేలా డిజైన్ రూపొందించారు. గురువారం సీఆర్‌డీఏ సమావేశంలో చంద్రబాబుకు ‘ఫోస్టర్ అండ్ పార్ట్‌నర్స్’ ప్రతినిధులు సచివాలయం తుది ఆకృతులపై ప్రజెంటేషన్ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment