ప్రత్యేక హోదాకు అడ్డెవరు? | Who is stopping the AP special status? | Sakshi
Sakshi News home page

ప్రత్యేక హోదాకు అడ్డెవరు?

Published Thu, Feb 22 2018 1:29 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

Who is stopping the AP special status? - Sakshi

సాక్షి, అమరావతి: ‘‘ప్రత్యేక హోదా కుదరదు. ఇక ఏ రాష్ట్రానికీ హోదా ఉండదు అని 14వ ఆర్థిక సంఘం చెబుతోంది కాబట్టి మనకు హోదా ఇవ్వలేకపోతున్నట్లు కేంద్రం చెప్పింది. కానీ ఆ రాష్ట్రాలలో ఇప్పటికీ ప్రత్యేక హోదా కొనసాగుతున్నపుడు ఏపీకి కూడా ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఆటంకం ఏమిటి?’’ఇదీ పార్టీ సమన్వయ కమిటీ సమావేశం తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నట్లుగా ప్రచారంలో ఉన్న లీకు వార్త సారాంశం. చంద్రబాబు కూడా ప్రత్యేక హోదాకు అనుకూలంగా ఉన్నారని ప్రచారం కల్పించడమే ఈ వార్త ప్రధాన ఉద్దేశం. అయితే ఆర్థిక సంఘం వద్దనలేదు అన్న విషయాన్ని కనుక్కోవడానికి ముఖ్యమంత్రికి నాలుగేళ్లు పట్టిందా? అని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.

నాలుగేళ్లుగా ప్రతిపక్ష వైఎస్సార్సీపీ సాక్ష్యాలతో సహా చెబుతున్నది అదే కదా అని జనం చర్చించుకుంటున్నారు. అయినా ఐదు కోట్ల ఆంధ్రులకు సంజీవని వంటి ప్రత్యేక హోదాపైన స్పష్టమైన వైఖరిని ప్రకటించకుండా లీకు వార్తలతో పొద్దుపుచ్చడంలోనే ముఖ్యమంత్రి ఉద్దేశమేమిటో అర్ధమౌతున్నదని విశ్లేషకులంటున్నారు. తాను హోదాకు వ్యతిరేకం కాదనే అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికే ముఖ్యమంత్రి ప్రత్యేక హోదాకు అనుకూలంగా మాట్లాడారనే లీకులు మీడియాకు అందించారని వారు పేర్కొంటున్నారు. అసలు ఈ నాలుగేళ్లు ప్రత్యేక హోదాకు అడ్డం పడిందెవరు? ప్రత్యేక హోదా శుద్ధ దండగ అని వాదించిందెవరు? ప్రత్యేక హోదాతో ఏం వస్తుంది అదేమన్నా సంజీవనా అని ప్రశ్నించిందెవరు? హోదా కన్నా ప్యాకేజీ మెరుగైనదని ప్రచారం చేసిందెవరు? అని గతంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను వారు గుర్తుచేస్తున్నారు. 

ప్రభుత్వ వైఖరిగానీ, పార్టీ వైఖరిగానీ చెప్పరా.. 
ప్రత్యేకహోదా కోసం నాలుగేళ్లుగా ప్రతిపక్షనేత అలుపెరుగకుండా జరుపుతున్న పోరాటం మరింత ఉధృతరూపం తీసుకుంది. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ప్రజలు ఎక్కడికక్కడ ఉద్యమిస్తున్నారు. రోడ్లపైకి వచ్చి నినదిస్తున్నారు. మేధావులంతా సదస్సులు, సమావేశాలు జరుపుతున్నారు. భవిష్యత్‌ కార్యాచరణకు అటు ప్రజలు, ఇటు రాజకీయపార్టీలు, వివిధ ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థలు సన్నద్ధమవుతున్నాయి. ఇలాంటి తరుణంలో ప్రత్యేక హోదాపైనా, అందుకోసం జరుగుతున్న పోరాటాలపైనా బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి పదవిలో ఉన్న చంద్రబాబు స్పష్టమైన వైఖరి చెప్పకుండా లీకులివ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రజలలో తనపట్ల వ్యక్తమౌతున్న వ్యతిరేకభావనను తప్పించుకునేందుకే ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రయోజనాలపై చిత్తశుద్ధితో కాదన్న విమర్శలున్నాయి. కీలకమైన సమన్వయ కమిటీ సమావేశాలు జరుపుతుండడంతో ప్రభుత్వం తరఫున అధికారిక ప్రకటన చేస్తారనుకున్న వారికి నిరాశే ఎదురయ్యింది. కనీసం చంద్రబాబు మీడియా ముందుకు వచ్చి పార్టీ వైఖరిని గానీ, ప్రభుత్వం తరఫున తాము ఏం చేయదలచుకుంటున్నామన్న విషయాన్ని గానీ వెల్లడించలేదు. ప్రజలలో పెరుగుతున్న భావోద్వేగాలను గమనించి తాను హోదాకు వ్యతిరేకం కాదనే లీకులిస్తూ తాను కూడా వార్తల్లో ఉండేలా చూసుకోవడమే ఆయన ఎత్తుగడలా కనిపిస్తున్నదని జనం చర్చించుకుంటున్నారు. ప్రజలంతా ప్రత్యేక హోదా కోసం పోరాడుతుండడంతో తానూ అందు కోసం కృషి చేస్తున్నాను అనే భావన కల్పించడం కోసమే మీడియాకు లీకులిస్తున్నారని విశ్లేషకులంటున్నారు.  

మన వాదనను బలహీన పరిచినదెవరు? 
కలసి పోటీచేసి కేంద్ర ప్రభుత్వంతో అధికారాన్ని పంచుకుంటూ ప్రత్యేక హోదా కోసం ముందుండి పోరాడాల్సిన ముఖ్యమంత్రి పోరాడేవాళ్లను అడ్డుకుంటూ కమీషన్ల కోసం ప్యాకేజీని స్వాగతించడం పట్ల అప్పట్లో తీవ్రస్థాయిలో నిరసనలువ్యక్తమయ్యాయి. సాధించాల్సిన స్థానంలో ఉండి సాధించకపోగా హోదాను ప్రజల మనసుల్లోంచి తీసేసి ప్యాకేజీయే ఉత్తమం అనే భావనను చొప్పించేందుకు స్వయంగా ఆయనే ప్రయత్నించడం పట్ల కూడా విమర్శలు వ్యక్తమౌతున్నాయి.ప్రత్యేక హోదా కోసం ముందుండి పోరాడవలసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ పని చేయకపోగా నిజానికి మన వాదన బలహీన పడడానికి కావలసినదంతా చేశారు. జీఎస్‌డీపీ గణాంకాలను పెంచి చూపించారు.

దేశమంతా జీడీపీ 6.7శాతం వృద్ధి ఉంటే ఆంధ్రప్రదేశ్‌ జీఎస్‌డీపీ 12శాతానికి పైగా వృద్ధి ఉందని ప్రచారం చేశారు. రెండు భాగస్వామ్య సదస్సులు నిర్వహించి రూ.15 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చేశాయని ముఖ్యమంత్రి ప్రచారం చేశారు. ఇలా పెంచి ప్రచారం చేసుకున్న గణాంకాలు ఎడాపెడా అప్పులు చేయడానికే ఉపయోగపడ్డాయి. ఈ తప్పుడు గణాంకాల వల్ల మనకు జరిగిన నష్టం అంతా ఇంతా కాదు. ఈ తప్పుడు గణాంకాలతో ప్రత్యేకహోదాను అడ్డుకుంటున్నానన్న స్పృహ ముఖ్యమంత్రికి లేకుండా పోయిందని విశ్లేషకులంటున్నారు. ప్యాకేజీ కోసం, అదనపు అప్పులకోసం మాత్రమే ఆయన పనిచేశారు. ప్యాకేజీలతో వచ్చే నిధుల నుంచి కమీషన్లు, లంచాలు తీసుకోవడానికి వీలవుతుందని మాత్రమే ఆలోచించారు. అంతేగానీ న్యాయంగా, ధర్మంగా మనకు రావలసిన ప్రత్యేక హోదా కోసం ఒత్తిడి చేసి సాధించాలన్న ఆలోచన చేయలేదు. పైగా పలు సందర్భాలలో అనేక రకాలుగా వ్యాఖ్యానాలు చేసి మన వాదనను బలహీన పరిచారు. 

14వ ఆర్థిక సంఘానికి సంబంధమేమిటి? 
14వ ఆర్థిక సంఘం చెబుతోంది కాబట్టి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతున్నట్లు కేంద్రం చెప్పిందని అంటున్నారు. అయితే 14వ ఆర్థిక సంఘానికి ఎలాంటి సంబంధమూ లేదని, తాము అలాంటి సిఫార్సులేవీ చేయలేదని 14వ ఆర్థిక సంఘం చైర్మన్‌ వైవీ రెడ్డి స్పష్టం చేశారు. ఆర్థిక సంఘం సభ్యుడు అభిజిత్‌సేన్‌ లిఖిత పూర్వకంగా కూడా వివరించారు. అసలు 14వ ఆర్థిక సంఘానికి ఏపీ ప్రత్యేక హోదాకు ఎలాంటి సంబంధమూ లేదు. 2015 ఏప్రిల్‌లో ఏర్పడిన 14వ ఆర్థిక సంఘం 2020 మార్చి 31 వరకు అమలులో ఉంటుంది. పార్లమెంటులో హామీ ఇచ్చిన మేరకు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడానికి సంబంధించి 2014 మార్చి 2న నాటి కేంద్ర కేబినెట్‌ తీర్మానం చేసింది. ఆ రోజున 13వ ఆర్థిక సంఘం పనిచేస్తోంది. ఆ తీర్మానాన్ని అమలు చేయాల్సిందిగా ఆదేశిస్తూ నాటి ప్రణాళికా సంఘానికి కేబినెట్‌ పంపించింది. ఆ తర్వాత 14వ ఆర్థిక సంఘం అమలులోకి వచ్చే వరకు దాదాపు ఏడునెలల పాటు ఆనాటి ప్రణాళికా సంఘం వద్ద ఈ ప్రత్యేక హోదా ఫైలు పెండింగ్‌లో ఉంది. అంటే 14వ ఆర్థిక సంఘం ఆవిర్భావానికి ముందే కేంద్ర కేబినెట్‌ సిఫార్సు చేయడం కూడా జరిగిపోయింది. కనుక ఆర్థిక సంఘం అడ్డుచెప్పిందన్న వాదన తప్పు అని అర్ధమౌతోంది.  

హోదాపై పూటకోమాట 
ఐదుకోట్ల మంది ఆంధ్రుల భవితవ్యానికి సంబంధించిన ప్రత్యేక హోదాపై కేంద్రంపై ఒత్తిడి చేయడానికి గానీ, దానిని సాధించడానికి గానీ చంద్రబాబుకు మనసొప్పలేదు. చంద్రబాబు చేసినన్ని విరుద్ధమైన ప్రకటనలు మరెవరూ చేసి ఉండరు. ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా సంజీవని అన్నారు. ప్రత్యేక హోదా పదేళ్లు కూడా సరిపోదు.. పదిహేనేళ్లు కావాలని ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ సాక్షిగా సభలలో డిమాండ్‌ చేశారు. తమ కూటమి గెలిస్తే ఏపీకి పదిహేనేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు.

ఎన్నికలు ముగిసిన వెంటనే చంద్రబాబు మాటమార్చారు. 14వ ఆర్థిక సంఘం కుదరదన్నది.. నీతి ఆయోగ్‌ వద్దంటోంది.. అంటూ హోదాకు మంగళం పాడేశారు. ప్రత్యేకహోదా ఇవ్వడానికి ఆర్థికసంఘం, నీతిఆయోగ్‌లకు సంబంధంలేదని, జాతీయఅభివృద్ధిమండలి చైర్మన్‌ హోదాలో ప్రధానమంత్రి ఒక్క సంతకం చేస్తే ఏ రాష్ట్రానికైనా ప్రత్యేకహోదా ఇవ్వవచ్చని ప్రతిపక్ష వైఎస్సార్సీపీ పలుమార్లు చెబుతూ వచ్చింది. అయితే ప్రత్యేకహోదాకు వీలుకాదని, హోదాకు సమానంగా కేంద్రం నిధులు ఇస్తానంటోందని, ప్రత్యేక హోదాతో వచ్చేవన్నీ ఇస్తున్నందుకే ప్యాకేజీకి ఒప్పుకున్నామని ఇలా చంద్రబాబు రకరకాల సాకులు చెప్పారు. హోదా ఏమన్నా సంజీవనా అని ప్రశ్నించారు. హోదాతో ఏం వస్తాయి? అని అడిగారు. హోదా కన్నా మెరుగైన ప్యాకేజీ ఇస్తామంటే వద్దంటామా అని అంటూ కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా అని ఎద్దేవా చేశారు. 

మనమే ఎక్కువ సాధించామన్నారు.. 
ప్రత్యేకహోదా కన్నా ప్రత్యేక ప్యాకేజీ ఎంతో మేలైనదని చంద్రబాబు ప్రచారం చేశారు. మనమే ఎక్కువ సాధించామని, ఏ రాష్ట్రానికైనా ఇంతకన్నా ఎక్కువ రాలేదని నాలుగేళ్లుగా చంద్రబాబు చెబుతూ వచ్చారు. ప్రత్యేక హోదాతో వచ్చేవన్నీ ఇస్తున్నందునే ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నామన్నారు. హోదాలో పరిశ్రమలకు రాయితీలు లేవన్నారు. కేంద్రానికి ధన్యవాదాలు చెబుతూ అసెంబ్లీలో తీర్మానాలు చేశారు. ప్యాకేజీలో లేనిదేంటి? హోదాతో జరిగే మేళ్లేమిటి? అని ప్రశ్నించారు. అలా ప్యాకేజీ గురించి ప్రచారం చేస్తూ ప్రత్యేక హోదా వాదనను బలహీనపరిచేందుకు చంద్రబాబు ప్రయత్నం చేశా>రు. ప్రత్యేక హోదా రాకపోవడానికి నాలుగేళ్లు కారణమైనది చంద్రబాబే. కేబినెట్‌ సమావేశంలో, సమన్వయ కమిటీలో ప్రత్యేక హోదా మంచిదేనని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించినట్లు లీకులు వస్తున్నాయి. అవి నిజమైతే సంతోషమేనని ప్రజలు భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఆయనే స్వయంగా మాట్లాడతారా.. లేకపోతే ఏదైనా ప్రకటన చేస్తారా అన్నది చూడాల్సి ఉంది. దీంతోపాటు హోదాను విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలను ఆయన వెనక్కు తీసుకుంటారా అన్నది కూడా చూడాల్సి ఉందని విశ్లేషకులంటున్నారు. 

హోదా ఉద్యమంపై అంతులేని నిర్బంధం.. 
ప్రత్యేకహోదా కోసం తాను ముందుండి పోరాడవలసిన ముఖ్యమంత్రి పోరాటం చేస్తున్నవారిపై నిర్బంధం ప్రయోగించారు. ముఖ్యంగా ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ప్రత్యేక హోదా కోసం అనేక రూపాలలో పోరాడింది. ధర్నాలు, రాస్తారోకోలు, కలెక్టరేట్ల ముట్టడి, రాష్ట్రబంద్‌లు నిర్వహించింది. ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ నుంచి గల్లీ వరకు పలుమార్లు నిరసన దీక్షలు నిర్వహించారు. చివరకు ఆమరణ నిరాహార దీక్ష కూడా చేశారు.

వైఎస్సార్సీపీ ప్రత్యేక హోదా కోసం ఏ పోరాటానికి పిలుపునిచ్చినా పార్టీ ముఖ్యనాయకులందరినీ పోలీసులు హౌస్‌ అరెస్టులు చేశారు. బైటకనిపిస్తే అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్లకు తరలించారు. లాఠీచార్జీలు జరిపారు. ముఖ్యమంత్రి స్వయంగా జోక్యం చేసుకుని మరీ బంద్‌లు విఫలమయ్యేట్లు చేసేవారు. బస్సులను బలవంతంగా తిప్పించి బంద్‌ ప్రభావం లేకుండా చేసేవారు. ప్రత్యేక హోదా భావన సజీవంగా ఉండడానికి, యువతలో హోదా పట్ల చైతన్యం రగలడానికి జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలోని ముఖ్య పట్టణాలలో నిర్వహించిన యువభేరి కార్యక్రమాలు విశేషంగా దోహదపడ్డాయని, అయితే ఆ సదస్సులు జరక్కుండా చేయడానికి రాష్ట్రప్రభుత్వం అనేక రకాలుగా ప్రయత్నించిందని వైఎస్సార్సీపీ సీనియర్‌ నాయకుడొకరు వివరించారు. చివరకు యువభేరి సదస్సులకు హాజరైతే విద్యార్థులపై పీడీయాక్టు ప్రయోగిస్తామని కూడా స్వయంగా చంద్రబాబు బెదిరించారని ఆయన గుర్తుచేశారు. 

ప్రత్యేక హోదాపై వివిధ సందర్భాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలివీ.. 
18.5.2016 – హోదాతో ఏం వస్తుంది? హోదా ఇచ్చి నిధులు ఇవ్వకపోతే ఏం లాభం? ఈశాన్యరాష్ట్రాలు ఏం బాగుపడ్డాయి? 
19.5.2016 – హోదాతోనే అంతా కాదు. హోదా సంజీవని కాదు. అందుకే ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని ప్రధానికి విన్నవించా.  
11.9.2016 – ప్రత్యేక హోదావస్తే ఏం వస్తుంది? ప్యాకేజీ వద్దంటే అభివృద్ధి పనులకు ఆటంకం.  
16.9.2016 – హోదాతో పరిశ్రమలు రావు. పారిశ్రామికరాయితీలకు హోదాకు సంబంధం లేదు. 
18.9.2016 – ప్రత్యేక హోదాతో ప్రయోజనం సున్నా. దానివల్ల పారిశ్రామిక రాయితీలు రావు. వస్తాయని నిరూపిస్తే దేనికైనా సిద్ధం 
23.9.2016 – హోదాకన్నా మెరుగైన ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. ప్యాకేజీపై విస్తృత ప్రచారం చేయండి. 
4.2.2017 – హోదా వేస్ట్, ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలలో పరిశ్రమలకు ప్రోత్సాహకాల్లేవు 
16.2.2017 – ప్రత్యేక హోదాతో ప్రయోజనం సున్నా. హోదాతో వచ్చేవన్నీ ప్యాకేజీలో ఇస్తామన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement