సాక్షి, అమరావతి, మంగళగిరి టౌన్: ప్రత్యేక హోదా కోసం బంద్‌లు చేసి ఏం సాధిస్తారని సీఎం చంద్రబాబునాయుడు విపక్షాలను ప్రశ్నించారు. ఆందోళనలు చేస్తే అభివృద్ధి ఆగిపోతుందన్నారు. ప్రత్యేక హోదా సాంకేతిక అంశం కాదని, రాజకీయ అంశమని చెప్పారు. హోదా విషయంలో కేంద్రం వక్రీకరించి మాట్లాడిందని ఆరోపించారు. విపక్షాలు రాజకీయ లబ్ధి కోసం రెచ్చగొడుతున్నాయని విమర్శించారు. తాను తలుచుకుంటే కేంద్ర ప్రభుత్వ వాహనాలను రాష్ట్రంలో తిరగనివ్వబోనని చంద్రబాబు హెచ్చరించారు.
బీజేపీకి ఏపీలో అడ్రస్ లేకుండా చేస్తానన్నారు. నేషనల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ (ఎన్‌ఇఆర్‌ఎస్) కింద రూ.18 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో గుంటూరు జిల్లా మంగళగిరిలోని డీజీపీ కార్యాలయం ఆవరణలో అధునాతనంగా నిర్మించిన పోలీస్ టెక్ భవనాన్ని చంద్రబాబు గురువారం ప్రారంభించి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున తాను ఒక్క పిలుపు ఇస్తే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వాహనాలు ఏ ఒక్కటీ రాష్ట్రంలో తిరగవని, అది తనకు ఒక్క నిమిషం పని చంద్రబాబు పేర్కొన్నారు.
కానీ దానివల్ల జాతి ఎంతో నష్టపోతుందని, రాష్ట్రం డైవర్ట్ అయిపోతుందన్నారు. టీడీపీ ఎంపీలతో ప్రతిపాదించి మోదీని ప్రధానిగా నిలబెట్టింది తానేనని చెప్పారు. దేశంలో ఉన్న అన్ని పార్టీలనూ ఏకం చేసి మోదీని ప్రధానిని చేశామని చెప్పారు. ఏ రాష్ట్రాలకు ఎన్ని నిధులు ఇచ్చారో చర్చించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి న్యాయం చేయాలని అడిగితే తనపై ఎదురుదాడి చేస్తూ తిడుతున్నారని, అసమర్థ నాయకుడినని అంటున్నారని చంద్రబాబు పేర్కొన్నారు.
భయపడటం తన చరిత్రలోనే లేదన్నారు. నరేంద్ర మోదీపై రాజీలేని పోరాటం చేస్తామని, ఆయనపై దేశం మొత్తం తిరుగుబాటు చేసే పరిస్థితిని తెచ్చామన్నారు. కాగా, చంద్రబాబు గురువారం రాత్రి సింగపూర్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. సాయంత్రం గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి హైదరాబాద్ వెళ్లిన ఆయన అక్కడి నుంచి సింగపూర్ వెళ్లారు. 14న సింగపూర్ నుంచి విశాఖపట్నం రానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment