
రాష్ట్రంలో అత్యధిక ఆదాయం వచ్చే 11 యూనిట్లపై కన్ను
11 యూనిట్లలో రూ.82.12 కోట్లతో ఆధునికీకరణ పనులు చేపట్టిన గత ప్రభుత్వం
చెన్నై స్టెర్లింగ్ రిసార్ట్స్‌కు కట్టబెట్టేందుకు సిద్ధమైన కూటమి సర్కారు
వాటి ఆస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి లెక్కగట్టిన స్టెర్లింగ్ ప్రతినిధులు
పర్యటనపై అధికారికంగా ఆదేశాలిచ్చిన టూరిజం ఈడీ
ప్రమాదంలో 436 మంది ఉద్యోగుల భవిష్యత్
బి.కొత్తకోట (అన్నమయ్య జిల్లా): వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యాటక శాఖకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చేందుకు ప్రణాళికలు రచించి అభివృద్ధికి కృషిచేస్తే.. ప్రస్తుత కూటమి ప్రభుత్వం పర్యాటక రంగాన్ని తిరోగమనంలోకి తీసుకెళ్తోంది. పర్యాటక యూనిట్ల అభివృద్ధి, ఆధునికీకరణ, పర్యాటకుల ఆకర్షణ కోసం ప్రత్యేకంగా ఒక్క చర్య చేపట్టకపోగా.. వాటిని ప్రైవేటు సంస్థకు అప్పగించే చర్యలను వేగవంతం చేసింది.
రాష్ట్రంలోని 11 కీలమైన యూనిట్లు, వాటి నిర్వహణ, ఆస్తులను చెన్నైకి చెందిన స్టెర్లింగ్‌కు అప్పగింత ఖరారైందని సమాచారం. ఈ నేపథ్యంలోనే స్టెర్లింగ్ ప్రతినిధులు 11 టూరిజం యూనిట్లలో పర్యటించి ఆస్తులు, వ్యాపార కార్యకలాపాలపై మదింపు ప్రక్రియ పూర్తి చేస్తున్నారు.
కీలకమైన యూనిట్లే ప్రైవేటుకు..
రాష్ట్రంలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న కీలకమైన 11 యూనిట్లు ఆదాయంతోపాటు అభివృద్ధిలోనూ ముందున్నాయి. వీటికి సొంత ఆస్తులు కూడా ఉన్నాయి. ఏపీలో ఏకైక పర్వత నివాస ప్రాంతమైన అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలంలోని హార్సిలీహిల్స్, బాపట్ల జిల్లాలోని సూర్యలంక, విశాఖ జిలా్లలోని అరకు, టైడా, అనంతగిరి, యాత్రి నివాస్, విజయవాడలోని భవానీ ఐలాండ్, బెరమ్ పార్క్, కోనసీమ జిల్లాలోని దిండి, నంద్యాల జిల్లాలోని శ్రీశైలం, నెల్లూరులోని రిసార్ట్స్, బార్, రెస్టారెంట్, అతిథి గృహలు ఉన్నాయి. ఇవన్నీ వ్యాపారం,ఆదాయంలో ప్రాధాన్యత సాధించాయి. ఈ యూనిట్ల ఏటా ఆదాయం రూ.కోట్లలోనే ఉంటుంది. నెల ఆదాయం రూ.18 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు ఉంటోంది.
436 మంది భవిష్యత్ ప్రశ్నార్థకం
ఈ11టూరిజం యూనిట్లలో 436 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇవి ప్రైవేటు సంస్థ చేతికి వెళ్లిపోతే ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారుతుంది. వీరిని ఉద్యోగులుగా కొనసాగించడం, కొనసాగించకపోవడం ఆ సంస్థ ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. ఉద్యోగుల్లో ఆప్కాస్, కాంట్రాక్టు, రెగ్యులర్ ప్రాతిపదికన నియమితులైన వారున్నారు.
ప్రైవేటు చేతికి యూనిట్లు వెళితే వీరంతా ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడాల్సి వస్తుందని ఏపీ టూరిజం ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు. స్టెర్లింగ్ సంస్థకు చెందిన ఉద్యోగులు, సిబ్బందిని టూరిజం యూనిట్లలో నియమించుకుని కార్యకలాపాలను కొనసాగించే అవకాశాలే అధికంగా ఉంటాయని అంటున్నారు.
గత ప్రభుత్వంలో రూ.82 కోట్లతో అభివృద్ధి
పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి సందర్శకులను విశేషంగా ఆకర్షించడం ద్వారా ఏపీని అగ్రగామిగా నిలిపేందుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేశారు. ఈ నేపథ్యంలో 11 టూరిజం యూనిట్లలో నవీకరణ, పునరుద్ధరణ పనుల కోసం రూ.82.12 కోట్లతో పనులు మంజూరు చేయగా.. 2023–24 ఆర్థిక సంవత్సరంలో టెండర్లు నిర్వహించి పనులు అప్పగించారు. అభివృద్ధి పనులు పూర్తయితే పర్యాటక శాఖకు మరింత ఆదాయం పెరుగుతుంది. ప్రైవేటుకు అప్పగిస్తే అభివృద్ధి చేసి అప్పనంగా ఇచ్చినట్టే.
భరోసా ఇవ్వడం లేదు
పర్యాటక శాఖకు చెందిన 11 యూనిట్లను ప్రైవేటుకు అప్పగిస్తే మా పరిస్థితి ఏంటనేది ప్రభుత్వం భరోసా ఇవ్వడం లేదు. 25 ఏళ్ల నుంచి పని చేస్తున్న ఉద్యోగుల వయసు 50–55 ఏళ్లు. ఉన్నపళంగా వీళ్లని తొలగిస్తే ఎలా బతకాలి. రూ.కోట్లు ఖర్చు చేసి అభివృద్ధి చేశాక ప్రైవేటుకు అప్పగించడం సరైన నిర్ణయం కాదు.
ఇప్పుడున్న విధానం కొనసాగిస్తే మరింత ఆదాయం కోసం ఉద్యోగులు కష్టపడి పనిచేస్తారు. దీనిపై ప్రభుత్వం ముందుకు వెళ్లకూడదు. అందుకనే ఉద్యోగులతో కలిసి సీఎంకు విన్నవించనున్నాం. – పీటీ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి, ఏపీ టూరిజం ఎంప్లాయీస్ యూనియన్
‘స్టెర్లింగ్’ పరిశీలన పూర్తి
పది టూరిజం యూనిట్ల ఆస్తులు, వ్యాపార కార్యకలాపాలను మదింపు చేసేందుకు ఆతిథ్య రంగంలో చెన్నైకు చెందిన స్టెర్లింగ్ కంపెనీ ప్రతినిధులు పర్యటించారు. డిసెంబర్ 26 నుంచి జనవరి 5 వరకు పది యూనిట్లలో పర్యటించి పరిశీలనలు పూర్తి చేశారు.
ఈ పర్యటన సందర్భంగా ఆయా యూనిట్లలో ప్రతినిధులకు అతిథి మర్యాదలు చేయాలని ఈడీ నుంచి ఆదేశాలు వెళ్లాయి. యూనిట్ల మేనేజర్లు దగ్గరుండి మర్యాదలు చేయడంతో పాటు పరిశీలనకు సహకరించి వారు అడిగిన సమాచారం ఇచ్చారు. ఆస్తులను పరిశీలించి వాటి స్థితిగతులపై సమీక్షించుకుని వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment