
సాక్షి, తాడేపల్లి: పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా వైఎస్సార్‌సీపీ చేపట్టిన శాంతి ర్యాలీ తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రారంభమైంది. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ చేస్తున్నారు. పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణమూర్తి, అధికార ప్రతినిధులు కారుమూరి వెంకటరెడ్డి, శివశంకర్, మాజీ ఎంపీ నందిగం సురేష్, ఎన్.చంద్రశేఖర్ రెడ్డి, మంగళగిరి ఇన్‌ఛార్జి వేమారెడ్డి, అనుబంధ సంఘాల నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, పహల్గాం ఘటన పిరికిపంద చర్య అని.. ఇలాంటి దాడులతో భారతీయ స్ఫూర్తిని చెదరగొట్టలేరన్నారు. వైఎస్ జగన్ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా క్యాండిల్ ర్యాలీలు నిర్వహించామని సజ్జల పేర్కొన్నారు. ‘‘మా ఉక్కు సంకల్పాన్ని కొనసాగిస్తాం. మృతుల కుటుంబాలకు వైఎస్సార్‌సీపీ తరపున సానుభూతి తెలియజేస్తున్నాం.. అందరం సంఘటితంగా నిలపడాల్సిన సమయం ఇది’’ అని సజ్జల చెప్పారు.
కశ్మీర్‌లోని పహల్గామ్‌లో టూరిస్టులపై ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ వైఎస్సార్‌సీపీ.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో క్యాండిల్ ర్యాలీలు చేపట్టింది. ఉగ్రవాద దాడిని ఖండిస్తూ ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి క్యాండిల్ ర్యాలీలు నిర్వహించాలని పార్టీ నాయకులకు, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఉగ్రవాదుల దాడిని అమానుష చర్యగా పేర్కొన్న వైఎస్ జగన్.. దేశం అంతా ఒక్కతాటిపై నిలవాలన్నారు. పహల్గాం ఘటనలో పలువురు మరణించండం అత్యంత బాధాకరమన్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఏపీకి చెందిన ఇద్దరు వ్యక్తులు మరణించడం అత్యంత బాధాకరమన్నారు.

విజయవాడ నగరంలో..
పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా వైఎస్సార్‌సీపీ నేతలు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కార్పొరేటర్లు, వైఎస్సార్‌సీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ఉగ్ర దాడిలో పర్యాటకులు మృతి చెందడం విచారకరమన్నారు. ఉగ్రదాడిలో ఏపీకి చెందిన ఇద్దరు మరణించారని.. వారి కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ఉగ్ర వాదంపై కేంద్రం కఠినంగా వ్యవహరించాలన్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో..
పహల్గాం జరిగిన ఉగ్ర దాడిని నిరసిస్తూ రాజమండ్రిలో వైఎస్సార్‌సీపీ నేతలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వైఎస్ జగన్ పిలుపు మేరకు భారీ శాంతి ర్యాలీ చేపట్టారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలని, ఉగ్రవాదులకు బుద్ధి చెప్పాలని వైఎస్సార్‌సీపీ నేతలు నినదించారు. ఈ ర్యాలీలో మాజీ మంత్రులు తానేటి వనిత, వేణుగోపాలకృష్ణ, మాజీ ఎంపీ మార్గాన్ని భరత్, మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, వెంకటరావు, డాక్టర్ గూడూరు శ్రీనివాస్ పాల్గొన్నారు.
అనంతపురం జిల్లాలో..
అనంతపురం జిల్లా: జమ్మూ కాశ్మీర్ లో పర్యాటకులపై ఉగ్రవాదుల దుశ్చర్యకు నిరసనగా అనంతపురంలో వైఎస్సార్‌సీపీ క్యాండిల్ ర్యాలీ నిర్వహించింది. అనంతపురంలోని అంబేద్కర్ విగ్రహం నుంచి సప్తగిరి సర్కిల్ దాకా నిరసన ప్రదర్శన చేపట్టింది. ఉగ్రవాదులపై కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని.. మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ నేతలు డిమాండ్ చేశారు.
వైఎస్సార్ జిల్లాలో..
జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన ఉగ్ర దాడులకు నిరసనగా కడపలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో శాంతియుత కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేసింది. దుశ్చర్యకు పాల్పడిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలన్నారు. మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాషా, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు.
తిరుపతిలో..
జమ్మూకశ్మీర్ పహల్గాం ఘటనకు నిరసనగా వైఎస్సార్‌సీపీ భారీ ర్యాలీ నిర్వహించింది. పద్మావతిపురంలో భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ చేపట్టింది. జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడిని ఖండిస్తున్నాం. ఉగ్రవాదులను సమూలంగా ఏరివేయాలని భూమన అన్నారు.
విశాఖలో..
కశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ వైఎస్సార్‌సీపీ శ్రేణులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించాయి. జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి వైఎస్సార్ పార్కు వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మాట్లాడుతూ.. ఉగ్ర దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని.. ఈ ఘటనలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలన్నారు. అమాయకులైన ప్రజల ప్రాణాలను తీసుకోవడం ఉన్మాద చర్యగా ఆయన అభివర్ణించారు. 145 కోట్ల భారతీయులు ఏకతాటిపైకి రావాలని.. తీవ్రవాదం ఏ రూపంలో ఉన్న మట్టు పెట్టాలన్నారు. బాధితులకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉండాలన్నారు.