ఆంధ్రప్రదేశ్‌లోప్రజాస్వామ్యంపైనే దాడి
అది యావత్ దేశ ప్రజలకు తెలియజేయాలనే ఢిల్లీలో ధర్నా
మా నిరసనకు మద్దతిచ్చిన వారందరికీ ధన్యవాదాలు
ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ పోస్ట్
గుంటూరు, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో సాధారణ ఎన్నికల తర్వాత జరుగున్న దాడులు, ఆస్తుల విధ్వంసం, హత్యలు, హత్యాచారాలు.. ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై దాడి మాత్రమే కాదని, అవి ముమ్మాటికీ ప్రజాస్వామ్యంపై దాడి అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి, చట్టం ముందు అందరూ సమానులే అన్న స్ఫూర్తికీ విఘాతం కలుగుతున్న నేపథ్యంలో యావత్ దేశ ప్రజలందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే ఢిల్లీలో నిరసన కార్యక్రమం చేపట్టామని స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన సామాజిక మాద్యమం ఎక్స్ (ట్విటర్)లో పోస్ట్ చేశారు. అందులోని వివరాలు ఇలా ఉన్నాయి.
» రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అరాచక, ఆటవిక పాలన కొనసాగుతోంది. అంతులేని దారుణాలు జరుగుతున్నాయి. శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. యథేచ్ఛగా హత్యలు, దాడులు, ఆస్తుల విధ్వంసం, వైఎస్సార్‌సీపీని అణగదొక్కడమే ప్రభుత్వ లక్ష్యం అయింది. అందుకే హత్యలు, దాడులు, అకృత్యాలను ప్రభుత్వం దగ్గరుండి ప్రోత్సహిస్తోంది.
» రాష్ట్రంలో ఇప్పుడు అంబేడ్కర్ రచించిన భారత రాజ్యాంగం కాకుండా, లోకేశ్ రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోంది. గతంలో వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి వేమీ జరగలేదు. విధ్వంసాన్ని ప్రశ్నించకపోతే, వాటన్నింటినీ వెంటనే ఆపలేకపోతే, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోలేం.
» ఇన్ని జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. ఆ విధంగా రాజ్యాంగ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేశారు. ప్రజల మానవ హక్కులను తిరస్కరించడం అంటే వారి మానవత్వాన్ని సవాలు చేయడమే అని నెల్సన్ మండేలా చెప్పినట్లు.. రాష్ట్రంలో దారుణ పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో అండగా నిలవండి.
మీ సంఘీభావం ప్రజాస్వామ్యాన్ని నిలబెడుతుంది
టీడీపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో సాగిస్తున్న హింస, అన్యాయం, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ధర్నాకు అనేక పార్టీలు, పలువురు ఎంపీలు సంఘీభావం తెలిపారు. వారందరికీ ధన్యవాదాలు.
సమాజ్‌వాది పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, ఏఐఏడీఎంకే, శివసేన, ఏఐటీసీ, వీసీకే, ఐయూఎంఎల్, ఎంపీలు అఖిలేష్ యాదవ్, ప్రియాంక చతుర్వేది, పీవీ అబ్దుల్ వాహేబ్, ప్రొఫెసర్ రాంగోపాల్ యాదవ్, తంబిదురై, ఎండీ నదిముల్ హక్వీ, అరవింద్ సావంత్, తిరుమవలన్‌లు అందించిన మద్దతు కేవలం ఆంధ్రప్రదేశ్‌కే కాకుండా యావత్తు దేశానికి.. ప్రజాస్వామ్యం, సమానత్వం, న్యాయాన్ని నిలబెట్టడంలో సహాయపడుతుంది.
– వైఎస్ జగన్
I sincerely thank the @samajwadiparty, @AamAadmiParty, @AIADMKOfficial, @ShivSenaUBT_, @AITCofficial, @VCKofficials, IUML, @yadavakhilesh, @priyankac19, @rautsanjay61, @AdvRajendraPal, @AbdulWahabPV, @proframgopalya1, Thambi Durai, @MdNadimulHaque6, @AGSawant and @thirumaofficial…
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 24, 2024
ధర్నా సైడ్‌లైట్స్
» వైఎస్సార్‌సీపీ శ్రేణుల జై జగన్ నినాదాలతో హస్తిన మార్మోగింది. జంతర్ మంతర్ రూట్‌లో వైఎస్ జగన్ వస్తున్న కారు కనిపించిన వెంటనే ప్రారంభమైన ‘జై జగన్’ నినాదాలు మీడియాతో మాట్లాడుతున్నంత సేపూ కొనసాగాయి. జగన్ కారు దిగి మీడియా పాయింట్ వద్దకు వచ్చేందుకు అభిమానులు, కార్యకర్తల తోపులాట మధ్య దాదాపు 15 నిమిషాల సమయం పట్టింది.
» ఫొటో ఎగ్జిబిషన్ తిలకిస్తున్న వైఎస్ జగన్‌ను కార్యకర్తలు, నాయకులు చుట్టుముట్టారు. ‘జగనన్నా హౌఆర్‌యూ, అన్నా నా వైపు ఒకసారి చూడన్నా, జగనన్నా నీకు పెద్ద ఫ్యాన్‌ని..’ అంటూ కార్యకర్తలు తమ అభిమాన నాయకుడి కరచాలనం కోసం ఎగబడ్డారు.
» వైఎస్ జగన్ సభా వేదికపైకి రాగానే ఫొటో ఎగ్జిబిషన్ వద్దకు ఏర్పాటు చేసిన దారి అంతా జనంతో కిక్కిరిసిపోయింది. వారిని ఎలా కంట్రోల్ చేయాలో తెలియక నేతలు ఆందోళనకు గురయ్యారు. అది గమనించిన వైఎస్ జగన్.. మైక్ తీసుకుని ‘అన్నా.. ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించేందుకు మీరంతా దారి ఇవ్వాలి. మనం ఇక్కడకు వచ్చింది ఏపీలో జరుగుతోన్న దమనకాండను దేశ ప్రజలకు, నేతలకు చూపించేందుకు. అక్కడ దారిలేకపోతే ఇబ్బంది అవుతుంది కదా.. సహకరించాలి.. ప్లీజ్’ అని చెప్పగానే కార్యకర్తలు క్షణాల్లో అక్కడి నుంచి వేదిక వద్ద ఏర్పాటు చేసిన కుర్చీల్లోకి వచ్చి కూర్చున్నారు.
సంబంధిత వార్త: ఏపీ నరమేధంపై జాతీయ పార్టీల కన్నెర్ర
» ‘మీ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకంతా నా సెల్యూట్’ అంటూ అఖిలేశ్ యాదవ్ జగన్‌తో అన్నారు. అఖిలేశ్ నోటి వెంట వచ్చిన ఆ మాటతో జై జగన్, జై అఖిలేష్ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు.
» ‘రాబోయే రోజుల్లో వైఎస్ జగన్ ప్రధాని అవుతారు’ అంటూ అబ్థుల్ వాహెబ్ తన ప్రసంగంలో అన్నారు. ఆ ఒక్క మాటకు ఐదు నిమిషాల పాటు కార్యకర్తల నినాదాలతో జంతర్ మంతర్ దద్దరిల్లింది. ఎప్పుడు నినాదాలు ఆపుతారా? అంటూ వేచి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది.
» వైఎస్ జగన్‌ను కలిసేందుకు, ఫొటో దిగేందుకు వేదికపైకి వందలాది మంది ఎక్కారు. ఒక్క సెల్ఫీ అన్నా అంటూ రిక్వెస్ట్ చేశారు. ఇది గమనించిన వైఎస్ జగన్.. ఇక్కడికి వచ్చే ప్రముఖులకు ఇబ్బంది కలగకూడదంటూ అంతకంటే ఎక్కువ రిక్వెస్ట్‌తో వాళ్లు స్టేజ్ కిందకు వెళ్లేలా చూశారు.
» ‘ఏం విక్టర్ బాగున్నావా’ అంటూ మాజీ ఎంఎంసీ ఛైర్మన్(గుడివాడ) మట్టా జాన్ విక్టర్‌ను వైఎస్ జగన్ పలకరించారు. అంతమందిలో పేరుపెట్టి మరీ పిలవడంతో జగనన్నకు కార్యకర్తలంటే ఎంత ప్రేమ, ఆప్యాయత అంటూ అక్కడున్న వారంతా సంతోషంతో ఉబ్బిపోయారు. విక్టర్ పది నిమిషాల పాటు ఆశ్చర్యంతో ఆ సంతోషం నుంచి తేరుకోలేదు.
» ‘అప్పుడెప్పుడో చూశాం జగన్‌ని. మళ్లీ ఇప్పుడు ఢిల్లీకి వచ్చారా? ఏక్ బార్ దేక్నాహే..’ అంటూ ఉత్తరాది ప్రజలు క్యూ కట్టారు.
» మహిళా కార్యకర్తలు వైఎస్ జగన్‌ను తమ సెల్‌ఫోన్‌లలో చిత్రీకరించి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తూ కనిపించారు.
:::సాక్షి, న్యూఢిల్లీ
Comments
Please login to add a commentAdd a comment