
రాష్ట్రపతి, ప్రధాని, హోం మంత్రికి ఆధారాలతో నివేదిస్తాం
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో 24న ఢిల్లీలో ధర్నా
ఏపీలో పరిస్థితిని యావత్ దేశానికి తెలిసేలా చేస్తాం.. రాష్ట్రంలో 45 రోజులుగా పూర్తిగా క్షీణించిన శాంతి భద్రతలు
అసెంబ్లీ వేదికగా గవర్నర్ ప్రసంగం సమయంలో నిలదీస్తాం.. నెలన్నరలో 36 రాజకీయ హత్యలు.. 300కుపైగా హత్యాయత్నాలు
టీడీపీ నేతల వేధింపులతో 35 మంది ఆత్మహత్య.. 560 ప్రైవేటు, 490 ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం
ఇళ్లలోకి చొరబడి దాడులు.. విధ్వంసాలు
వినుకొండలో సామాన్యుడైన రషీద్ దారుణ హత్య.. ఇంత జరుగుతుంటే ప్రేక్షక పాత్ర వహిస్తున్న పోలీసులు.. ఈనాడు,
ఆంధ్రజ్యోతి, టీవీ5.. దిగజారుడు రాతలు
మా ప్రభుత్వంలో టీడీపీ వాళ్లను చంపండని, వారికి పథకాలు ఇవ్వొద్దని చెప్పలేదు
గత 45 రోజుల్లో 36 రాజకీయ హత్యలు జరిగాయి. 300కుపైగా హత్యాయత్నాలు, టీడీపీ నాయకుల వేధింపులు తాళలేక 35 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇళ్లలోకి చొరబడి 560 చోట్ల ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేశారు. షాపులను కాల్చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల చీనీ చెట్లు నరికేస్తున్నారు.
490 చోట్ల ప్రభుత్వ ఆస్తులను సైతం ధ్వంసం చేశారు. ఇంతటితో ఆగకుండా వెయ్యికిపైగా దౌర్జన్యాలు, దాడులకు పాల్పడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా తయారైందని చెప్పడానికి ఇంత కంటే నిదర్శనం అవసరమా? – వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది. గత 45 రోజులుగా శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. ఏ సామాన్యుడిని కదిలించినా ఇదే ఆవేదన వ్యక్తం అవుతోంది. టీడీపీ నాయకులు ఎవరినైనా కొట్టొచ్చు.. ఎవరి ఆస్తులనైనా ధ్వంసం చేయొచ్చు.. హత్యలు, హత్యాయత్నాలకు పాల్పడొచ్చనే రీతిలో పాలన నడుస్తోంది. అరాచకాలను అరికట్టాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. ఈ పరిస్థితిలో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం రాష్ట్రపతి పాలన విధించాలి. ఇందుకు సంబంధించి రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోం మంత్రిని కలిసి అన్ని ఆధారాలను నివేదిస్తాం’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు.
పల్నాడు జిల్లా వినుకొండలో టీడీపీకి చెందిన వ్యక్తి చేతిలో దారుణ హత్యకు గురైన వైఎస్సార్‌సీపీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని శుక్రవారం ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ దిగజారుడు రాజకీయాలపై కచ్చితంగా తమ పార్టీ నిరసన గళాన్ని వినిపిస్తుందన్నారు. 24వ తేదీన (బుధవారం) తమ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో కలిసి రాష్ట్రంలోని పరిస్థితులు యావత్తు దేశానికి తెలిసేలా ఢిల్లీలో ధర్నా చేపడతామని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో కొనసాగుతున్న దురాగతాలను రాష్ట్రపతి, ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లేందుకు వారి అపాయింట్‌మెంట్ కోరామన్నారు. ఏపీలో రాష్ట్రపతి పాలనను విధించాల్సిన అవసరాన్ని ఆధారాలతో సహా నివేదిస్తామని చెప్పారు. అసెంబ్లీలో ఉభయ సభల వేదికగా గవర్నర్ ప్రసంగం సమయంలో ఆటవిక పాలనపై ప్రశ్నిస్తామన్నారు. ప్రజా సంక్షేమాన్ని అమలు చేయకుండా దౌర్జన్యాలతో తెలుగుదేశం పార్టీ భీతావహ వాతావరణాన్ని సృష్టిస్తోందని మండిపడ్డారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..
పోలీసుల ప్రేక్షకపాత్ర..
రాష్ట్రంలో దారుణమైన ఆటవిక చర్యలను అరికట్టాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. చివరికి టీడీపీ నాయకుల దాడుల్లో బాధితులైన వ్యక్తులు పోలీసుల వద్దకు వచ్చి గోడు వెళ్లబోసుకుంటుంటే తిరిగి బాధితులపైనే తప్పుడు కేసులు బనాయించే పరిస్థితి దాపురించింది. ఇలాంటి నీచ సంస్కృతి రాష్ట్రంలో రాజ్యమేలుతుండటం సిగ్గుచేటు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని చెప్పడానికి వినుకొండలో రషీద్ దారుణ హత్య పెద్ద ఉదాహరణ.

గతంలో పల్నాడు జిల్లాలో సమర్థవంతంగా విధులు నిర్వర్తించే అధికారి రవిశంకర్ ఎస్పీగా ఉంటే తెలుగుదేశం నాయకులు తమ పలుకుబడితో ఆయన్ను తప్పించేశారు. అనంతరం వారికి అనుకూలంగా పని చేసే బిందుమాధవ్‌ను ఎస్పీగా తెచ్చుకుని అరాచక పర్వానికి తెరలేపారు. బిందు మాధవ్ ఎన్నికల సమయంలో అత్యంత దారుణంగా వ్యవహరించడంతో ఎన్నికల కమిషన్ స్వయంగా సస్పెండ్ చేసింది. తర్వాత మరో మంచి అధికారి మలికా గార్గ్‌ను ఈసీ నియమిస్తే.. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెను సైతం పంపించేశారు.
చంద్రబాబుకు, టీడీపీ నాయకులకు సహాయ సహకారాలు అందించరనే కారణంతో మలికా గార్గ్‌ను తప్పించారు. ఇప్పుడు టీడీపీకే మద్దతు పలికే శ్రీనివాస్ అనే వ్యక్తికి పల్నాడు ఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు. కొత్త ఎస్పీ వచ్చిన రెండు, మూడు రోజుల్లోనే అత్యంత పాశవికంగా నడిరోడ్డుపై, ప్రజలంతా చూస్తుండగానే కత్తులతో నరికి రషీద్‌ను దారుణంగా హత్య చేశారు. రాష్ట్రంలోని వైఎస్సార్‌సీపీకి చెందిన సానుభూతి పరులను భయభ్రాంతులకు గురిచేసి, బెదిరించేందుకే అమాయకుడు, సాధారణ ఉద్యోగి అయిన రషీద్‌ను క్రూరంగా హత్య చేయడం దుర్మార్గం.
మీడియా ముసుగులో దిగజారుడుతనం
రాష్ట్రంలో దారుణాలు జరుగుతుంటే పోలీసు వ్యవస్థ టీడీపీకే కొమ్ముకాస్తోంది. వీరితో పాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వంటి సంస్థలు మీడియా ముసుగులో దిగజారిపోయి ప్రవర్తిస్తున్నాయి. రషీద్ హత్య ఉదంతాన్ని తప్పుదోవ పట్టించేలా చేస్తున్న దు్రష్పచారానికి సమాజం సిగ్గుతో తలదించుకుంటోంది. జిలానీకి చెందిన మోటార్ బైక్‌కు వైఎస్సార్‌సీపీకి చెందిన వ్యక్తులు నిప్పుపెట్టడంతోనే ఇప్పుడు ఈ హత్యకు పాల్పడినట్టు అసత్యాలు ప్రచారం చేయడం సిగ్గుచేటు.
వాస్తవానికి మోటార్ బైక్ జిలానీది కాదు. వైఎస్సార్‌సీపీకి చెందిన ఆసిఫ్ అనే వ్యక్తిది. ఆ బైక్‌ను టీడీపీకి చెందిన మాజీ చైర్మన్ షామీమ్, టీడీపీ స్టేట్ సెక్రటరీ ఆయూబ్ ఖాన్, మరికొంత మంది టీడీపీ నాయకులు తగలబెట్టి, ఆసిఫ్‌ను తీవ్రంగా గాయపరిచారు. దీనిపై ఈ ఏడాది జనవరి 17నే పోలీసులు కేసు నమోదు చేశారు.
10/2024తో క్రైమ్ నంబర్ కూడా నమోదైంది. అయితే ఇదంతా జరగలేదన్నట్టు ఎల్లో మీడియా సృష్టించి, పోలీసులు కేసు కూడా పెట్టలేదని చెబుతోంది. వాస్తవాలను వక్రీకరించారు. కొత్తగా వచ్చిన ఎస్పీ ఘటన జరిగిన గంటల్లోనే బయటకు వచ్చి వ్యక్తిగత కక్షలతో జరిగిందంటూ తప్పుడు మాటలు మాట్లాడుతూ, అబద్ధాలు చెబుతున్నారు.
ఈ సంబంధాలేంటి?
రషీద్ హత్యపై పోలీసులు కేసు పెట్టామని అంటున్నారు. ఈ కేసు జిలాని అనే వ్యక్తి మీద మాత్రమే పెట్టారు. జిలానీకి.. టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులుతో సత్సంబంధాలు ఉన్నాయి. ఎమ్మెల్యేతో ఫొటోలు దిగాడు. ఆయన భార్యకు కేక్‌లు తినిపించాడు. ఆ పార్టీ నాయకులు షమీమ్ ఖాన్‌తో సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ క్రమంలో వారందరి పేర్లు ఎందుకు ఎఫ్‌ఐఆర్‌లో లేవు? ఇదేంటి మరి? (ఫొటో చూపుతూ) ఇందులో జిలానీ స్వయంగా ఇక్కడి ఎమ్మెల్యే భార్యకు కేక్ తినిపిస్తున్నాడు.
లోకేష్ పుట్టిన రోజు సందర్భంగా వారు కేక్ కట్ చేయడం.. ఆ కేక్‌ను ఈ జిలానీ స్వయంగా ఎమ్మెల్యే భార్యకు తినిపించడం కళ్లెదుటే కనిపిస్తోంది. అంటే వీళ్ల మధ్య సంబంధాలు ఎంత బలంగా ఉన్నాయో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం కావాలా? (ఎమ్మెల్యేతో, ఆయూబ్‌ఖాన్, షమీమ్‌ఖాన్‌తో జిలానీ దిగిన ఫొటోలు చూపారు) మరి వీళ్లెవరూ కేసులో ఎందుకు లేరు? వారిపై కేసు ఎందుకు నమోదు చేయలేదు? ఇంతకన్నా అన్యాయం ఏమైనా ఉంటుందా? రషీద్‌ను ఫ్యాక్షన్ మూలాలున్న వ్యక్తిగా చిత్రీకరించడం దారుణం.
ఆ కుటుంబం ఏం పాపం చేసిందని ఒక మనిíÙని చంపారు? అంతటితో ఆగకుండా కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నారు. హత్యకు గురైన వ్యక్తులకు సానుభూతి తెలపకుండా తప్పుడు ప్రచారం చేయడం దారుణం. చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. పోలీసులు ప్రేక్షక పాత్ర వీడాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం అవ్వవు అని ప్రజలకు విశ్వాసం కల్పించాలి.
ఎంపీలను తిరగనివ్వట్లేదు
ఎంపీ మిథున్ రెడ్డి తన పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని పుంగనూరులో తిరగకూడదా? మా మాజీ ఎంపీ రెడ్డెప్ప ఇంటికి వెళితే.. ఆ ఇంటిని దిగ్బంధం చేసి ఇంటి మీద రాళ్లు వేసి, రెడ్డెప్ప కారుకు నిప్పు పెట్టారు. ఇవన్నీ పోలీసుల సమక్షంలోనే జరిగాయి. ఇంతకన్నా శాంతి భద్రతలు దిగజారిన పరిస్థితులు ఎక్కడైనా ఉంటాయా? చివరికి అమ్మాయిల మీద అత్యాచారాలు జరుగుతున్నా కూడా పోలీసులు పట్టించుకోవడం లేదు.
చంద్రబాబే పట్టించుకోవద్దని చెప్పడంతో పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. మా ప్రభుత్వంలో ఏ రోజు టీడీపీ వాళ్లను కొట్టండి, చంపండి, వారికి పథకాలు ఇవ్వద్దు అని చెప్పలేదు. ఏ అక్కచెల్లెమ్మ ఇంటి నుంచి బయటకు వెళ్లినా ఏదైనా ఆపద వస్తే మొబైల్ ఫోన్‌లో ‘దిశ’ యాప్ ద్వారా పోలీసులను సంప్రదిస్తే వెంటనే రక్షించే వ్యవస్థను తెచ్చాం.
Comments
Please login to add a commentAdd a comment