ఏపీలో కూటమి ప్రభుత్వ అరాచకాలను కళ్లకు కట్టిన ఫొటో ఎగ్జిబిషన్
దమనకాండ గురించి వివరిస్తూ వైఎస్ జగన్ భావోద్వేగం
ఫొటో ఎగ్జిబిషన్‌పై జాతీయ మీడియా ప్రత్యేక కథనాలు
ఏపీలో ఏం జరుగుతోందని ఉత్తరాది ప్రజల్లో చర్చ
సాక్షి, న్యూఢిల్లీ: ‘50 రోజుల్లో 36 హత్యలు, నలుగురిపై అత్యాచారాలు.. ఆపై హత్యలు, 16 అత్యాచారాలు, వెయ్యికి పైగా దాడులు, వందల్లో విధ్వంసాలు’ ..ఇదీ టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలో జరుగుతున్న దమనకాండ అని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఏపీలో జరిగిన హత్యలు, అత్యాచారాలు, హత్యాయత్నాలు, ఆస్తుల విధ్వంసాన్ని దేశ ప్రజలకు, జాతీయ మీడియాకు తెలిపేందుకు జంతర్ మంతర్ వద్ద కళ్లకు కట్టినట్లుగా ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు.
తొలుత మీడియాతో మాట్లాడిన వైఎస్ జగన్.. ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకిస్తూ వేదిక వద్దకు చేరుకున్నారు. దాదాపు 15 నిమిషాల పాటు ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. ఒక్కో ఫొటోను వీక్షిస్తున్న సందర్భంలో ఆ ఘటనలను గుర్తు చేసుకుంటూ వైఎస్ జగన్ భావోద్వేగానికి గురయ్యారు. జాతీయ మీడియాకు ఒక్కో సంఘటన గురించి వివరిస్తూ వేదికపైకి వచ్చారు.
కంట తడి పెట్టించిన ఫొటోలు
జూలై 17న పల్నాడు జిల్లా వినుకొండలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త రషీద్‌ను నడిరోడ్డుపై టీడీపీ గూండా జిలానీ నరికి చంపుతున్న దృశ్యాలతో ఫొటో ఎగ్జిబిషన్ మొదలైంది. నడిరోడ్డుపై వేటాడి మరీ నరుకుతున్న చిత్రాలు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించాయి. చిత్తూరు జిల్లా పుంగనూరులో మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటిపై దాడి దృశ్యాలు.. అదే సమయంలో రెడ్డప్పతో పాటు ఎంపీ, లోక్‌సభ ఫ్లోర్ లీడర్ మిథున్‌రెడ్డి ఉన్న ఆ ఇంటిపై టీడీపీ గూండాలు రాళ్లు రువ్వుతున్న చిత్రాలను కళ్లకు కట్టేట్టు ఏర్పాటు చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్త పాలేటి రాజ్‌కుమార్‌ను మోకాళ్లపై కూర్చోబెట్టి, మంత్రి లోకేశ్ బ్యానర్‌కు మొక్కిస్తూ, బలవంతంగా క్షమాపణలు చెప్పించిన చిత్రాలను ఏర్పాటు చేశారు.
అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో టీడీపీ నేతలు ఇద్దరు మహిళల బట్టలను తొలగిస్తూ అరాచకానికి పాల్పడుతున్న ఫొటోలను అక్కడ ప్రదర్శించారు. ఈ ఘటన స్వయాన హోం మంత్రి నియోజకవర్గంలో జరిగిందని వివరించారు. గుంటూరు జిల్లాలోని వైఎస్సార్‌సీపీ కార్యాల యాన్ని ధ్వంసం చేస్తున్న, చిత్తూరు జిల్లా పుంగనూరులో టీడీపీ నేతలు బ్యాడ్మింటన్ స్టేడియాన్ని ధ్వంసం చేస్తున్న, ఇదే ప్రాంతంలోని వాటర్ ట్యాంకులను ధ్వంసం చేస్తున్న ఫొటోలను ప్రదర్శించారు. గుంటూరు జిల్లా తెనాలిలో వైఎస్సార్‌సీపీ నాయకుడు కాళిదాస వెంకట సత్యనారాయ ణను కత్తితో టీడీపీ గూండాలు పొడిచిన దృశ్యాలు, కడప జిల్లా పులివెందులలో వైఎస్సార్‌సీసీ కార్యకర్త అజయ్‌కుమార్ రెడ్డిపై బ్యాట్‌లతో దాడి చేసిన ఫొటోలను అమర్చారు.
అనంతపురం జిల్లా ధర్మవరం మండలం కొత్తకోటలో చాకలి సూర్యనారా యణను హత్య చేస్తున్న దృశ్యాలు, తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో టీడీపీ కార్య కర్తలు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై జరిపిన దాడుల ఫొటోలను ఏర్పాటు చేశారు. ఇలా రాష్ట్రంలో జరిగిన హత్యలు, హత్యాయత్నాలు, దాడులు, విధ్వంసాలు, ఆస్తుల విధ్వంసం వంటి ఫొటోలతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను తిలకించేందుకు ఉత్తరాది ప్రజలు క్యూకట్టారు.
సోషల్ మీడియాలో వైరల్
వేదికకు రెండు వైపులా ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌పై జాతీయ మీడియా దృష్టి సారించింది. రెండు వైపులా ప్రతి ఒక్క ఫొటోను తమ తమ కెమెరాల్లో బంధించారు. జర్నలిస్టులు ఆ ఫొటోలను విశ్లేషిస్తూ లైవ్ రిపోర్టింగ్ చేశారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఫొటో ఎగ్జిబిషన్‌పై జాతీయ మీడియాలో భిన్నమైన కథనాలు ప్రసారమయ్యాయి. దేశ ప్రజలంతా ఏపీలో జరుగుతోన్న దమనకాండపై చర్చించుకు నేలా జాతీయ మీడియా ఫోకస్ చేయడం విశేషం.
కాగా, వైఎస్ జగన్ చేపట్టిన ధర్నా, ఫొటో ఎగ్జిబిషన్Mý ు సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఎంపీ ప్రియాంక చతుర్వేది, శివసేన (ఉద్ధవ్) ఎంపీలు అరవింద్ సావంత్, సంజయ్ రౌత్, ఐయూఎంఎల్ ఎంపీ అబ్దుల్ వాహబ్, హ్యారిస్ బీరన్, ఏఐఏడీఎంకే ఎంపీ నటరాజన్ చంద్రశేఖరన్, ఎస్పీ నేత రాంగోపాల్ యాదవ్, టీఎంసీ ఎంపీ నదీముల్ హక్, వీసీకే పార్టీ అధినేత తిరుమావలన్, ఆప్ ఎమ్మెల్యే రాజేంద్రపాల్ గౌతమ్‌లు విచ్చేసి మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఈ నేతల వెంట వచ్చిన వందలాది మంది నేతలు, కార్యకర్తలు దమనకాండపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను క్షుణ్ణంగా తిలకించారు.
వాటిని ఫొటోలు తీసి సోషల్ మీడియా గ్రూపుల్లో షేర్ చేయడం విశేషం. దీంతో ఏపీలో ఏం జరుగుతోందని ఉత్తరాది ప్రజల్లో చర్చ మొదలైంది. కొన్ని ఫొటోల గురించి అక్కడున్న వైఎస్సార్‌సీపీ నేతలను అడిగి మరీ తెలుసుకున్నారు. ఇటువంటి దాడులు భవిష్యత్‌లో ఎక్కడా జరగకుండా వైఎస్ జగన్ ఢిల్లీలో ధర్నా చేపట్టడం హర్షించదగ్గ విషయమని ఆయా పార్టీల నేతలు, ఉత్తరాది ప్రజలు వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment