వైఎస్సార్‌సీపీ జెండా దిమ్మ ధ్వంసం
ముక్కలుముక్కలుగా శిలాఫలకాలు
సాక్షి నెట్‌వర్క్: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో టీడీపీ నేతలు, కార్యకర్తల విధ్వంసం కొనసాగుతోంది. వైఎస్సార్‌సీపీ జెండా దిమ్మ, ప్రగతిపనుల శిలాఫలకాలను ముక్కలు చేశారు. బాపట్ల జిల్లా కర్లపాలెం మండల కేంద్రంలోని గమేషన్ మిల్లు సెంటర్‌లో వైఎస్సార్‌సీపీ మండల కార్యాలయం సమీపంలోని ఆ పార్టీ జెండా దిమ్మను సోమవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. బుద్ధాం గ్రామంలో సచివాలయ శిలాఫలకాన్ని సోమవారం తెలుగుదేశం కార్యకర్త పొలుగుతో పొడిచి ధ్వంసం చేశాడని వైఎస్సార్‌సీపీ నాయకులు తెలిపారు.
వైఎస్సార్‌సీపీ జెండా దిమ్మను, సచివాలయ శిలాఫలకాన్ని ధ్వంసం చేసినవారిని అరెస్టుచేసి చట్టప్రకారం శిక్షించాలని వైఎస్సార్‌సీపీ కర్లపాలెం మండల అధ్యక్షుడు యల్లావుల ఏడుకొండలు, నల్లమోతువారిపాలెం సర్పంచ్ మాడా సుబ్రమణ్యం, బాపట్ల ఏఎంసీ మాజీ చైర్మన్ దొంతిబోయిన సీతారామిరెడ్డి డిమాండ్ చేశారు. వారు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మంగళవారం కర్లపాలెం పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్ రహీమ్‌రెడ్డికి ఫిర్యాదు అందజేశారు. ఈ సందర్భంగా సీతారామిరెడ్డి మాట్లాడుతూ గణపవరం పంచాయతీ వార్డు మెంబరైన పి.నాగరాజురెడ్డిపై ఇటీవల దాడిచేసిన వారిమీద కూడా చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని కోరారు.
పోలీస్ స్టేషన్‌కు వెళ్లినవారిలో కర్లపాలెం ఎంపీటీసీ సభ్యుడు ఎస్‌కె ఆసిఫ్ అలీ, పేరలి సర్పంచ్ మల్లెల వెంకటేశ్వర్లు, పెదగొల్లపాలెం సర్పంచ్ యల్లావుల సురేష్, వైఎస్సార్‌సీపీ నాయకులు ఆట్ల నాగేశ్వరరెడ్డి, సమ్మెట వెంకటేశ్వరరెడ్డి, దొంతిరెడ్డి జయభారత్‌రెడ్డి, సలగల ధర్మేంద్ర, తాజుద్దీన్, షంషీర్, మనోహర్, మహేష్, నాగరాజురెడ్డి తదితరులున్నారు. పల్నాడు జిల్లా నాదెండ్ల గ్రామంలో సోమవారం రాత్రి టీడీపీ కార్యకర్తలు ఓ శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. ఎంపీ ఆర్.కృష్ణయ్య ఎంపీ కోటా నిధుల నుంచి గ్రామాభివృద్ధికి రూ.20 లక్షలు మంజూరు చేయగా.. తిమ్మాపురం నుంచి గ్రామంలోకి వచ్చే రహదారిలో ఎస్సీ కాలనీలో సీసీ రోడ్డు నిర్మించారు.
అప్పట్లో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. సోమవారం రాత్రి టీడీపీ కార్యకర్తలు మద్యం తాగి ఈ శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. దీనిపై వైఎస్సార్‌సీపీ నాయకులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఏలూరు జిల్లా దెందులూరు మండలం సీతంపేట పంచాయతీ కొమిరేపల్లికి వెళ్లే రోడ్డులో ఉన్న శిలాఫలకాన్ని టీడీపీ కార్యకర్తలు సోమవారం ధ్వంసం చేశారు. ఆ శిథిలాలను మంగళవారం వైఎస్సార్‌సీపీ ఏలూరు పార్లమెంటరీ జిల్లా కార్యదర్శి పులవర్తి సంతోష్, పార్టీ నాయకులు రాజు, గంటా పండు, దిలీప్ పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దశాబ్దాల కాలంగా గుండుగొలను రోడ్డు నుంచి కొమిరేపల్లి గ్రామానికి రాకపోకలకు నరకాన్ని చవిచూశామని చెప్పారు. గత ఎన్నికల్లో కొఠారు రామచంద్రరావు పల్లె నిద్ర సమయంలో కొమిరేపల్లికి తారురోడ్డు నిర్మిస్తామని హామీ ఇచ్చారన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత కొఠారు అబ్బయ్యచౌదరి ఎమ్మెల్యేగా గుండుగొలను రోడ్డు నుంచి కొమిరేపల్లి గ్రామానికి కిలోమీటరున్నర మేర రూ.కోటికిపైగా వ్యయంతో తారురోడ్డు నిర్మించారని చెప్పారు. మాజీ సీఎం, మాజీ ఎమ్మెల్యే ఫొటోలున్న శిలాఫలకాన్ని కూల్చివేయడం, అగౌరవపర్చడం బాధాకరమని పేర్కొన్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పారు.
టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేసిన శిలాఫలకం ఫొటోలను పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని, రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి, ఏపీ ఆయిల్ ఫెడ్ మాజీ చైర్మన్ కొఠారు రామచంద్రరావుకు పంపించారు. పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలిలోని గ్రామ సచివాలయంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రంతో ఉన్న శిలాఫలకాన్ని తెలుగుదేశం కార్యకర్త మంగళవారం ధ్వంసం చేశాడు. ఈ విషయమై గ్రామ కార్యదర్శి పాలా శారదా శ్రీనివాస్‌ను అడగగా.. తాను కార్యాలయం నుంచి ఇంటికి వచ్చిన తరువాత ఈ దుశ్చర్య జరిగినట్టు తెలిసిందన్నారు. దీనిపై బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment