
అన్నమయ్య జిల్లా : అన్నమయ్య జిల్లా చిట్వేలి మండలం ఎం. రాచపల్లిలో శుక్రవారం సాయంత్రం ప్రమాదవశాత్తూ నీటి కుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన చొక్కారాజు దేవాన్స్ (5), చొక్కారాజు విజయ్(4), రెడ్డిచెర్ల యశ్వంత్ (5) ఆడుకోవడానికి పక్కనే ఉన్న కుంట వద్దకు వెళ్లారు.
ప్రమాదవశాత్తూ అందులో ఉన్న నీటిలో పడి మృతి చెందారు. చిన్నారుల ఆచూకీ కోసం వెతుకుతుండగా కుంటలో విగతజీవులుగా పడి ఉన్నారు. వెంటనే ముగ్గురిని చిట్వేలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. దీంతో గ్రామమంతా శోకసముద్రంలో మునిగిపోయింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.