గ్రామగ్రామానికీ రోడ్ నెట్‌వర్క్
- ఇంజనీరింగ్ అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష
- నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ రోడ్ల అభివృద్ధిని అత్యంత ప్రాధాన్యం కలిగిన అంశంగా ప్రభుత్వం భావిస్తోందని, రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి సరైన రోడ్ నెట్‌వర్క్ ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. గ్రామీణ రహదారుల నిర్మాణంపై శనివారం ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో జరిగిన ఈ సమీక్షకు రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
గ్రామీణ రహదారులను అభివృద్ధి పరిచేందుకు ప్రత్యేకంగా రూరల్ రోడ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. అంతేకాకుండా పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగాలన్నింటినీ ఒకే వ్యవస్థగా మార్చనున్నామన్నారు. ఇప్పటికే 12,039 కిలోమీటర్ల తారు రోడ్ల రెన్యువల్స్ (తిరిగి వేయడం)కు టెండర్లు పిలిచామని, రోడ్ల నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు టెండర్ల సమయం కూడా తగ్గించామని పేర్కొన్నారు.
గ్రామాలకు ప్రజాప్రతినిధులు..
అసెంబ్లీ సమావేశాలు ముగియగానే ముఖ్యమంత్రి నుంచి ఎమ్మెల్యే వరకు ప్రజాప్రతినిధులందరూ గ్రామాలను సందర్శించి, రోడ్ల నిర్మాణ పనులను పర్యవేక్షిస్తారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా నాణ్యతాలోపాలు కనిపిస్తే కఠినచర్యలు తీసుకుంటామన్నారు. గతంలో రోడ్లకు సంబంధించి రూ.153 కోట్ల బకాయిలను విడుదల చేశామన్నారు. తారు రోడ్లతో పాటు ప్రతి గ్రామంలోనూ మట్టిరోడ్లు సుమారు 20 వేల కిలోమీటర్ల మేర నిర్మించనున్నట్టు తెలిపారు.
చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం ద్వారా వచ్చిన మట్టిని రోడ్లకు వినియోగిస్తామన్నారు. వచ్చే ఏడాది మే నెలాఖరు కల్లా ఈ రహదారుల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లాలో రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.220 కోట్లు కేటాయించిందన్నారు.