khabja
-
ఈ భూమి మనదిరో...
‘ఊరు మనదిరో, ఈ వాడ మనదిరో, పలుగు మనదిరో, ఆ పార మనదిరో, దొర ఏందిరో, వారి పీకుడేందిరో’ అంటూ ప్రభుత్వ భూములను తమ ఆధీనంలోకి తెచ్చుకోడానికి విప్లవ సినిమాల్లో పేదవర్గాలు ఎర్రజెండాలతో దండుగా వెండితెరపై కదుల్తుంటే వారికి మద్దతుగా ప్రేక్షకులు ఈలలు, కరతాళ ధ్వనులతో హోరెత్తించడం చూశాం. కానీ పాలనాపగ్గాలు టీడీపీ చేపట్టిన తరువాత పాట పల్లవిలో అపశ్రుతి చోటుచేసుకున్నట్టుంది. కనిపించిన ప్రభుత్వ భూమంతా మాదేనన్న చందంగా కొంతమంది నేతలు తమ అనుచరులతో దర్జాగా కబ్జా చేస్తూ ‘పోలీసెవడురో, రెవెన్యూ పితలాటమేందిరో’ అంటూ పలుగు, పారా కాదు ఏకంగా పొక్లెయిన్లు, జేసీబీలతో చదును చేసేసుకుంటున్నారు. ఇదేదీ అర్థంకాని సామాన్య జనం మాత్రం ‘ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నవాళ్లదే ప్రభుత్వ భూమా’ అని అమాయకంగా ప్రశ్నిస్తూ ముక్కున వేలేసుకుంటున్నారు. అడ్డుకోవల్సిన సర్కారు యంత్రాంగం మాత్రం ఈలలు, కరతాళ ధ్వనులతో మద్దతు బహిరంగంగా తెలపకపోయినా అంతర్గతంగా అంతకన్నా ఎక్కువగానే వత్తాసు పలుకుతోందని పరిసర గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుడ్లూరు: ప్రభుత్వ భూములను యథేచ్ఛగా ఆక్రమించుకుంటున్నా అడ్డుకోవల్సిన రెవెన్యూ యంత్రాంగం చేష్టలుడిగి చూస్తోంది. ప్రభుత్వ భూములు అధికంగా ఉన్న రెండు గ్రామాల్లో గత పది రోజుల నుంచి జేసీబీలతో చదును చేస్తున్నా చలనం లేదాయే. మండలంలోని జానకంపేట గ్రామంలో సర్వే నెంబర్లు 603-48 వరకు రోడ్డు పక్కనే 200 ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి. ఎకరా విలువ సుమారు రూ. 5 లక్షలు వరకూ ఉంటుంది. చనలాటరఫి, జానకంపేట గ్రామాలకు చెందిన రాజకీయ నాయుకుల కన్ను ఆ భూములపై పడింది. రెవెన్యూ అధికారులను మచ్చిక చేసుకొని ఆ భూములు వైపు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకంటున్నారు. గత పది రోజులు నుంచి రాత్రీపగలనకుండా జేసీబీలను పెట్టి చె ట్లను తొలిగించి ఆక్రమణలకు పాల్పడుతున్నా పట్టించుకున్న నాథుడే కనిపించడం లేదు. ఆ భూముల్లో సిమెంటు స్తంభాలు, ఇనుప కంచెలతో ‘హద్దులు’ మీరుతున్నా రెవెన్యూ అధికారులు కనీసం హెచ్చరిక బోర్డు కూడా పెట్టడానికి అడుగులు వేయకపోవడం వెనుక మతలబేమిటని పరిసర గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. వారంతా ఆక్రమిస్తే లేనిది మాకేంటంటూ అప్పటి వరకు కబ్జాకు దూరంగా ఉన్న చిన్నా, చితకా గ్రామస్థాయి నేతలు కూడా పలుగు, పార పట్టుకొని గ్రామ కంఠాలనూ తమ స్వాధీనంలోకి తీసుకుంటున్నారు. ఓ గ్రామ నాయుకుడు ఏకంగా 40 ఎకరాలను ఆక్రమించుకొని చుట్టూ కంచె కూడా వేయించాడంటే ఏ స్థాయిలో సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. నిరుపేదలు గూడు కోసం కర్రలు పాతుకుంటే చాలు విరుచుపడే రెవెన్యూ యంత్రాంగం కోట్ల రూపాయల భూములు అన్యాక్రాంతమవుతున్నా అడ్డుకోకపోవడం పట్ల పలు వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ రెండు గ్రామాల్లో ఇప్పటికే 500 ఎకరాలు ఆక్రమణదారుల చేతుల్లో ఉండగా తాజాగా మరో 200 ఎకరాలు వారి కబంధ హస్తాల్లో చిక్కుకుంటోంది. నాయుడుపాలెం పంచాయతీ పరిధిలోని నరసాపురం గ్రామంలో కూడా పెద్దపవని-కావలి ప్రధాన రహదారి పక్కనే ఉన్న సర్వే నెంబరు 104 ఎద్దులబీడులో ఉన్న సుమారు 200 ఎకరాల భూములు కూడా జేసీబీలతో దున్ని ఆక్రమించుకోవాడానికి గ్రామానికి చెందిన నాయుకులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ తంతు రెండు నెలల నుంచి జరుగుతోంది. ఇక్కడ కూడా ప్రభుత్వ యంత్రాంగానిది ఇదే పరిస్థితి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి విలువైన ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురికాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. రెవెన్యూ అధికారులు పట్టించుకోక పోతే జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేస్తామంటున్నారు. చర్యలు తీసుకుంటాం ఆక్రమణలకు గురవుతున్న ప్రభుత్వ భూములుపై తహశీల్థార్ మెర్సీ కుమారిని వివరణ కోరగా ఆ గ్రామాలకు వెళ్ళి ఆక్రమణలకు గురైన భూములను పరిశీలించి స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. ఆక్రమణదారులపై కూడా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. -
తీరం కబ్జా
ఉలవపాడు: సాగర తీరం కబ్జా కోరల్లో చిక్కుకుపోయింది. బడాబాబుల చేతుల్లో పడి రొయ్యల చెరువులుగా మారిపోయింది. పొరుగు జిల్లా నుంచి వచ్చి మరీ ఇక్కడి తీరంలో వ్యాపారం సాగిస్తున్నా రెవెన్యూ అధికారులు కిమ్మనడం లేదు. మండల పరిధిలోని కరేడు కొత్త పల్లెపాలెం తీరప్రాంతంలో బకింగ్ హామ్ కెనాల్‌కు, సముద్రానికి మధ్యలోని సుమారు 125 ఎకరాలు ఆక్రమించి రొయ్యల చెరువులు వేసి వ్యాపారం చేస్తున్నారు. సముద్రం ఆనుకుని ఈ చెరువులు ఏర్పాటు చేయడం గమనార్హం. ఆక్రమణ జరిగిందిలా... కరేడు కొత్త పల్లెపాలెం గ్రామస్తులను రొయ్యల వ్యాపారులు మంచి చేసుకున్నారు. తాము ఆ భూమిలో రొయ్యల చెరువులు నిర్మిస్తామని, దానికి ప్రతిఫలంగా ఎకరానికి ఏడాదికి రూ.10 వేలు చొప్పున గ్రామానికి ఇస్తామని ఆశచూపారు. ప్రభుత్వ పొలాల వలన తమకు ఆదాయం వస్తుందని గ్రామస్తులు సంతోషించారు. నగదు చెల్లించి గ్రామస్తుల నుంచి వ్యతిరేకత రాకుండా చేసుకున్న వ్యాపారులు దాదాపు 5 నెలల నుంచి రొయ్యల చెరువులు సాగు చేస్తున్నారు. అయినా రెవెన్యూ అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోగా అక్రమార్కులకు అండగా నిలవడంతో వారి వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోంది. అధికారుల అండతోనే... అధికారుల అండతోనే ఇక్కడ రొయ్యల చెరువులు వేయగలిగారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ముందుగా వచ్చిన తహశీల్దార్‌తో మాట్లాడి తమ వ్యాపారానికి అడ్డు లేకుండా చేసుకున్నారు. గ్రామస్తుల సహకారం కూడా ఉండడంతో ఒక పంటను అమ్మారు. వెనామీ రొయ్యలను పెంచి కేజీ 300 రూపాయల చొప్పున అమ్మి వ్యాపారం చేసుకుంటున్నారు. ఇక్కడి వ్యాపారులంతా పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన వారు. 80 కి.మీ ల దూరం నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తున్నారంటే ఎంత మేరకు లాభాలు వస్తున్నాయో ఇట్టే అర్థమవుతుంది. జనరేటర్లతోనే నిర్వహణ... ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి ఏర్పాటు చేసిన రొయ్యల చెరువులకు విద్యుత్ శాఖాధికారులు విద్యుత్ సౌకర్యం కల్పించలేదు. పట్టా భూములకు మాత్రమే ఇస్తామని తేల్చి చెప్పారు. దీని కోసం చాలా పాట్లు పడ్డారు కానీ ఉపయోగం లేకుండా పోయింది. తహశీల్దార్ ధ్రువీకరణ పత్రం అందిస్తేనే విద్యుత్ కనెక్షన్ ఇస్తామని చెప్పడంతో ప్రయత్నించి విఫలమయ్యారు. కానీ చెరువుల నిర్వహణ మాత్రం ఆగలేదు. జనరేటర్లతో బోర్లను ఏర్పాటు చేసి రొయ్యల చెరువులు నిర్వహిస్తున్నారు. కొంత నీరు సముద్రం నుంచి కూడా పంపింగ్ చేసి చెరువులకు పెడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం మామూళ్ల మత్తులో తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. గతంలో బకింగ్‌హామ్ కెనాల్, సముద్రం మధ్య భాగాన్ని ఎంతో విలువైనదిగా చూసేవారు. బకింగ్‌హామ్ కెనాల్ ద్వారా భారీ ఓడలు కూడా వెళ్లేవి. ప్రభుత్వం మళ్లీ ఈ కెనాల్ అభివృద్ధి చేయాలని చూస్తున్న తరుణంలోనూ ఆక్రమణలను అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరం. ఈ విషయమై తహశీల్దార్ శ్రీశిల్పను సాక్షి వివరణ కోరగా ‘వంద ఎకరాలకుపైగా ఆక్రమణకు గురైందా..అవునా..నేను సోమవారం ఉదయం వచ్చి మాట్లాడతాను’ అని చెప్పారు. -
చట్టం వీరి చుట్టం
ప్రభుత్వం మాది ... ప్రభుత్వ భూమీ మాదే ప్రభుత్వం అంటే ప్రభుత్వ భూములు కూడా తమవే అనుకుంటున్నారేమో తెలుగు తమ్ముళ్లు ... సర్కారు జాగా కనిపిస్తే చాలు పాగా వేయడానికి పరుగులు తీస్తున్నారు. ఆచరణకు సాధ్యంకాని హామీలిచ్చి ... ఓటర్లను ఏమార్చి గద్దెనెక్కిన ఆరు నెలల కాలంలోనే జిల్లాలో నలుదిక్కులా చెలరేగిపోతున్నారు. మంత్రి మద్దతుదారులమంటూ కొంతమంది, ఎమ్మెల్యే అనుచరులంటూ మరికొంతమంది ఏకంగా పొక్లెయిన్లతో భూములను చదును చేసేస్తున్నారు. మరీ ముక్కుసూటిగా పోవద్దు ... మా వాళ్లు ఏమి చేసినా చూసీచూడనట్టుగా వెళ్లిపోండని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబే హుకుం జారీ చేయడంతో మనకెందుకులే గొడవనుకున్నారేమో అడ్డుకోవాల్సిన రెవెన్యూ యంత్రాంగం కూడా చోద్యం చూస్తూ చర్యలకు ఉపక్రమించడం లేదు. తాళ్లూరు: అధికారమే పరమావధిగా తెలుగు తమ్ముళ్లు రెవెన్యూ భూముల ఆక్రమణలపర్వానికి తెరలేపారు. రెవెన్యూ అధికారులు, సిబ్బంది ప్రేక్షకపాత్ర పోషించడంతో కబ్జాదారుల కోరల్లో సర్కారు భూములతోపాటు చెరువు, వాగులు సైతం చిక్కుకున్నాయి. సోమవరప్పాడు రెవెన్యూ పరధిలోని సర్వే నెం 336లో 5.25, 337లో 5.90, 339లో 6.72, 322/1లో 23.72 ఎకరాలను తూర్పు గంగవరం గ్రామానికి చెందిన పలువురు అధికార పార్టీ నేతలు ఆక్రమించారు. కొండలు, వాగులు, చెరువుల కట్టలను సైతం భారీ యంత్రాలతో చదును చేస్తున్నా పట్టించుకునే నాధుడే కరవయ్యాడు. ఎవరూ పట్టించుకోవడంలేదన్న ధైర్యంతో మరికొందరు బరి తెగించి వరి, బత్తాయి చెట్లను సైతం సాగు చేసుకున్నారు. ప్రభుత్వ భరోసాతో... ఆక్రమణల్లో ఉన్న భూములను క్రమబద్ధీకరించేందుకు టీడీపీ ప్రభుత్వం సమాయత్తమవుతుండడంతో తెలుగు తమ్ముళ్లు సర్కారు భూమి కనిపిస్తే చాలు కబ్జాకు దిగుతున్నారు. రెవెన్యూ సిబ్బంది నుంచే ప్రభుత్వ భూముల సమాచారం సర్వే నంబర్లతో సహా తెప్పించుకొని కంచెలు ఏర్పాటు చేసేసుకుంటున్నారు. వీరి స్పీడు చూసిన చోటామోటా నేతలుతోపాటు ఇతరులు కూడా పాగా వేయడానికి పరుగులు తీస్తున్నారు. చట్టం వీరి చుట్టం ప్రభుత్వ భూములు కబ్జా చేసిన వారిపై , ఆక్రమించిన వారిపై చర్యలు చేపట్టేందుకు 1982లో భూ కబ్జా చట్టం రూపొందింది. ఆ చట్టం ద్వారా చర్యలు తీసుకోవల్సిన ఏమీ పట్టనట్టు వ్యవహరించడం పట్ల పలు విమర్శలు వనిపిస్తున్నాయి. ప్రభుత్వ స్థలం ఆక్రమించినట్లు రుజువైతే జైలు శిక్ష, జరిమానా కూడా విధించే అవకాశం చట్టంలో ఉంది. సంబంధితాధికారులు కనీసం అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో ఈ ఆక్రమణల జోరు మరింత జోరందుకుంటోంది. పరిశీలిస్తాం: కె. ఇంద్రాదేవి, తహసీల్ధార్ భూ ఆక్రమణలు నా దృష్టికి రాలేదు. సంబంధిత సర్వే నంబర్లలో కబ్జాను పరిశీలించి వాస్తవమైతే చర్యలు తీసుకుంటాం. -
పగ్గాలు రాగానే పాగాలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ : బడి, గుడి, లెబ్రరీ, మార్కెట్, కమ్యూనిటీహాలు.. కబ్జాకు అనర్హమైన దేదీ లేదంటున్నారు కాకినాడలో టీడీపీ నేతలు. ఇందుకు నిదర్శనంగా కబ్జా బాగోతమొకటి పర్లోపేటలో వెలుగులోకి వచ్చింది. ‘సాక్షి’ పరిశీలనలో తేలిన వివరాలిలా ఉన్నాయి. ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ముఖ్య అనుచరుడు, మాజీ కౌన్సిలర్ వి.పవన్‌మూర్తి పర్లోపేటలో మార్కెట్‌కు ఆనుకుని 122/98 సర్వే నంబరులోని సుమారు 400 గజాల స్థలాన్ని కబ్జా చేసి చుట్టూ ప్రహారీ కట్టేశారు. ఆ స్థలం వదిన వి.సీతారత్నంకు చెందిందని గోడ మీద రాయిం చారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న కాకినాడలో మారుమూల జాగా అయినా గజం రూ.10 వేల పైమాటే. ఆ ప్రకారం చూసినా పవన్‌మూర్తి ఆక్రమించిన స్థలం విలువ రూ.40లక్షలు. పవన్‌మూర్తి ఆ స్థలానికి ఆనుకుని మత్స్యకారులకు మున్సిపల్ కార్పొరేషన్ నిర్మించిన కమ్యూనిటీహాల్ గుమ్మాలకు గోడలు కట్టించి, తన ఆధీనంలో ఉంచుకున్నారు. చిన్నారుల సదుపాయానికి సంకెళ్లు కబ్జా చేసిన స్థలానికి సమీపంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులంతా కమ్యూనిటీ హాలు లోపలి నుంచి వెళ్లేందుకు దారి ఉండేది. విద్యార్థులు కమ్యూనిటీహాలు ఖాళీ స్థలంలో సాయంత్రం ఆడుకునే వారు. వారికి అదే కమ్యూనిటీహాలులో మధ్యాహ్నభోజనంవడ్డించేవారు. కమ్యూనిటీ హాలును కబ్జా చేసే క్ర మంలో హాలుకు, స్కూలుకు మధ్య గోడ నిర్మించేశారు. పాఠశాలకు డ్రెయిన్ మీదుగా చిన్నదారి ఏర్పాటు చేశారు. చివరకు పాఠశాల వైపున్న కమ్యూనిటీ హాలు గుమ్మాలకు సగం వరకు సిమెంట్ గోడలు కట్టించి, చిన్నారులను కట్టడి చేశారని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. పాఠశాలలో గాంధీజీ విగ్రహాన్ని కూడా మార్చేశారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘దేశం’ గెలిచాకే ఈ దందా.. స్థానిక మత్స్యకారుల కుటుంబాల్లో జరిగే కార్యక్రమాల కోసం వినియోగించే కమ్యూనిటీ హాల్‌ను పవన్‌మూర్తి నిర్వహించే వారు. హాలు తాళాలను తన ఆధీనంలో పెట్టుకుని ఎవరికీ ఇవ్వకపోవడం, గ్రంథాలయం, జిమ్ నిర్మించేందుకు ప్రతిపాదించిన 400 గజాల కార్పొరేషన్ స్థలాన్ని కబ్జాచేసి గోడలు కట్టేయడం ఇవన్నీ కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా వనమాడి గెలిచాక జరిగినవేనని స్థానికులంటున్నారు. మార్కెట్ స్థలా న్ని కూడా ఆక్రమించి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించే ప్రయత్నాల్లో ఉన్నాడని ఆరోపిస్తున్నారు. ఈ విషయమై గత నెల 16నే మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, కార్పొరేషన్ ప్రత్యేకాధికారి, కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్‌లకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా, అధికార పార్టీ ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు కావడంతో ఎందుకొచ్చిన గొడవ అనుకున్నారో ఏమో ఇంతవరకూ చర్యలు తీసుకున్న దాఖలా లేదు. కబ్జాలపై కార్పొరేషన్ అధికారులకు సమగ్రమైన వివరాలు అందచేసినా కన్నెత్తి చూడటం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాకినాడ దుగ్గిరాలవారివీధిలో ఒక ఎయిడెడ్ పాఠశాల పాత భవనాలను కూల్చేసి తెగనమ్మేందుకు ప్రయత్నించిన తెలుగుతమ్ముళ్లు స్థానికుల వ్యతిరేకతతో తోకముడవక తప్పలేదు. ఇప్పుడు పర్లోపేటలో బరితెగించిన ఎమ్మెల్యే అనుచరుడిపై అధికారులు కొరడా ఝుళిపిస్తారో, జో హుకుం అంటారో వేచి చూడాలి. విచారణకు ఆదేశించాం.. పర్లోపేటలో మున్సిపల్ స్థలం ఆక్రమణకు గురైందన్న ఫిర్యాదుపై విచారణ జరపాల్సిందిగా టౌన్‌ప్లానింగ్ అధికారులను ఆదేశించామని కార్పొరేషన్ కమిషనర్ ఎస్.గోవిందస్వామి చెప్పారు. విచారణ అనంతరం మున్సిపల్ స్థలంగా తేలితే స్వాధీనం చేసుకుని బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ స్థలాలు, ఆస్తులను పరిరక్షించాలి.. ప్రభుత్వ ఆస్తులపై స్థానిక ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అనుచరుడు, మాజీ కౌన్సిలర్ పవన్‌మూర్తి పెత్తనం చలాయిస్తున్నాడు. అతని కబంధ హస్తాల్లో ఉన్న ప్రభుత్వాస్తులను అధికారులు పరిరక్షించాలి. మార్కెట్ స్థలాన్ని కబ్జా చేసి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాలనుకుంటున్నాడు. 400 గజాల స్థలాన్ని ఆక్రమించి ప్రహారీ నిర్మించాడు. కమ్యూనిటీ హాలుకు తాళాలు వేసి పెత్తనంసాగిస్తున్నాడు. - దిబ్బాడ సత్తిరాజు, శ్రీ వెంకట సత్యసాయి మెరైన్ ఫిషర్మెన్ కో-ఆపరేటివ్ సొసైటి అధ్యక్షుడు