
చట్టం వీరి చుట్టం
ప్రభుత్వం మాది ... ప్రభుత్వ భూమీ మాదే
ప్రభుత్వం అంటే ప్రభుత్వ భూములు కూడా తమవే అనుకుంటున్నారేమో తెలుగు తమ్ముళ్లు ... సర్కారు జాగా కనిపిస్తే చాలు పాగా వేయడానికి పరుగులు తీస్తున్నారు. ఆచరణకు సాధ్యంకాని హామీలిచ్చి ... ఓటర్లను ఏమార్చి గద్దెనెక్కిన ఆరు నెలల కాలంలోనే జిల్లాలో నలుదిక్కులా చెలరేగిపోతున్నారు. మంత్రి మద్దతుదారులమంటూ కొంతమంది, ఎమ్మెల్యే అనుచరులంటూ మరికొంతమంది ఏకంగా పొక్లెయిన్లతో భూములను చదును చేసేస్తున్నారు.
మరీ ముక్కుసూటిగా పోవద్దు ... మా వాళ్లు ఏమి చేసినా చూసీచూడనట్టుగా వెళ్లిపోండని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబే హుకుం జారీ చేయడంతో మనకెందుకులే గొడవనుకున్నారేమో అడ్డుకోవాల్సిన రెవెన్యూ యంత్రాంగం కూడా చోద్యం చూస్తూ చర్యలకు ఉపక్రమించడం లేదు.
తాళ్లూరు: అధికారమే పరమావధిగా తెలుగు తమ్ముళ్లు రెవెన్యూ భూముల ఆక్రమణలపర్వానికి తెరలేపారు. రెవెన్యూ అధికారులు, సిబ్బంది ప్రేక్షకపాత్ర పోషించడంతో కబ్జాదారుల కోరల్లో సర్కారు భూములతోపాటు చెరువు, వాగులు సైతం చిక్కుకున్నాయి. సోమవరప్పాడు రెవెన్యూ పరధిలోని సర్వే నెం 336లో 5.25, 337లో 5.90, 339లో 6.72, 322/1లో 23.72 ఎకరాలను తూర్పు గంగవరం గ్రామానికి చెందిన పలువురు అధికార పార్టీ నేతలు ఆక్రమించారు. కొండలు, వాగులు, చెరువుల కట్టలను సైతం భారీ యంత్రాలతో చదును చేస్తున్నా పట్టించుకునే నాధుడే కరవయ్యాడు. ఎవరూ పట్టించుకోవడంలేదన్న ధైర్యంతో మరికొందరు బరి తెగించి వరి, బత్తాయి చెట్లను సైతం సాగు చేసుకున్నారు.
ప్రభుత్వ భరోసాతో...
ఆక్రమణల్లో ఉన్న భూములను క్రమబద్ధీకరించేందుకు టీడీపీ ప్రభుత్వం సమాయత్తమవుతుండడంతో తెలుగు తమ్ముళ్లు సర్కారు భూమి కనిపిస్తే చాలు కబ్జాకు దిగుతున్నారు. రెవెన్యూ సిబ్బంది నుంచే ప్రభుత్వ భూముల సమాచారం సర్వే నంబర్లతో సహా తెప్పించుకొని కంచెలు ఏర్పాటు చేసేసుకుంటున్నారు. వీరి స్పీడు చూసిన చోటామోటా నేతలుతోపాటు ఇతరులు కూడా పాగా వేయడానికి పరుగులు తీస్తున్నారు.
చట్టం వీరి చుట్టం
ప్రభుత్వ భూములు కబ్జా చేసిన వారిపై , ఆక్రమించిన వారిపై చర్యలు చేపట్టేందుకు 1982లో భూ కబ్జా చట్టం రూపొందింది. ఆ చట్టం ద్వారా చర్యలు తీసుకోవల్సిన ఏమీ పట్టనట్టు వ్యవహరించడం పట్ల పలు విమర్శలు వనిపిస్తున్నాయి. ప్రభుత్వ స్థలం ఆక్రమించినట్లు రుజువైతే జైలు శిక్ష, జరిమానా కూడా విధించే అవకాశం చట్టంలో ఉంది. సంబంధితాధికారులు కనీసం అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో ఈ ఆక్రమణల జోరు మరింత జోరందుకుంటోంది.
పరిశీలిస్తాం: కె. ఇంద్రాదేవి, తహసీల్ధార్
భూ ఆక్రమణలు నా దృష్టికి రాలేదు. సంబంధిత సర్వే నంబర్లలో కబ్జాను పరిశీలించి వాస్తవమైతే చర్యలు తీసుకుంటాం.