బెజవాడలో కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ ఆస్తులను తెగనమ్మేందుకు టీడీపీ సర్కార్ స్కేచ్ వేసింది. ఇందుకు అభివృద్ధి, పర్యాటకం కలర్ ఇస్తోంది. చారిత్రక, వారసత్వ సంపదగా వెలుగొందుతున్న స్వరాజ్యమైదానాన్ని చైనా కంపెనీకి కట్టబెడుతున్న పాలకులు తాజాగా రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ముసుగులో కార్పొరేషన్ కార్యాలయంతోపాటు పరిసరప్రాంతాలను కాజేసేందుకు కుట్ర పన్నారు. సర్కార్ ఏకపక్ష నిర్ణయాలనునగరవాసులు నిరసిస్తుండగా, ప్రతిపక్షాలు ఆందోళన బాట పట్టాయి.
విజయవాడసెంట్రల్ : బెజవాడలో ప్రభుత్వ ఆస్తులు అంగట్లో సరుకుగా మారాయి. నగరాభివృద్ధి, పర్యాటకం సాకుతో కోట్లాది రూపాయల విలువైన ఆస్తులను కారుచౌకగా విదేశీ, కార్పొరేట్ కంపెనీల పరం అవుతున్నాయి. స్వరాజ్యమైదానం, స్టేట్ గెస్ట్‌హౌస్, డీజీపీ క్యాంప్ కార్యాలయం, ట్రాన్స్‌కో కార్యాలయం, మునిసిపల్ కార్యాలయం, కౌన్సిల్ హాల్, రాజీవ్‌గాంధీ పార్కు, పూల, కూరగాయల మార్కెట్, విద్యుత్ సబ్‌స్టేషన్, పాతపోలీస్ క్వార్టర్స్, సీతమ్మవారిపాదాల స్థలం వెరసి 48.33 ఎకరాల భూమిని లీజుల ముసుగులో తెగనమ్మేందుకు పాలకులు సిద్ధమయ్యారు. ఇందుకు అవసరమైన చర్యలు చురుగ్గా సాగుతున్నాయి. భూ వినియోగమార్పిడికి సంబంధించి గత నెల 15వ తేదీన కౌన్సిల్ తీర్మానం చేసి ఏపీ సీఆర్‌డీఏకు పంపింది. ప్రభుత్వం అప్పనంగా అప్పగిస్తున్న స్థలాల మార్కెట్ విలువ సుమారు రూ.3,500 కోట్లు ఉంటుందని అంచనా.
చెప్పినట్లు చేయండి
కార్పొరేషన్ కార్యాలయం, విద్యుత్ సబ్‌స్టేషన్, రాజీవ్‌గాంధీ పార్కు, హోల్‌సేల్ ఫ్లవర్, కూరగాయల మార్కెట్ స్థలం కలిపి 20.04 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. ఇందులో ప్రస్తుత కౌన్సిల్ హాల్, నిర్మాణంలో ఉన్న కొత్త భవనం 82 సెంట్ల స్థలంలో ఉంటాయి. ఈ 82 సెంట్లు మినహా మిగితా స్థలాన్ని రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్‌లో భాగంగా భూవినియోగ మార్పిడి చేయాలని కోరుతూ కౌన్సిల్‌లో తీర్మానం చేసి సీఆర్‌డీఏకు పంపారు.
కార్పొరేషన్ కార్యాలయాన్ని కొత్త భవనంలోకి మార్చి పరిపాలన సాగిస్తామని, తరలింపు ఉండబోదని తీర్మానం సందర్భంగా పాలకులు స్పష్టం చేశారు. సీన్ కట్ చేస్తే ఇటీవల జరిగిన ఏడీసీ (అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్) సమావేశంలో కౌన్సిల్ మినహాయించిన 82 సెంట్ల స్థలాన్ని కూడా సేకరించాలని నిర్ణయించారు. ఈ విషయమై మేయర్, డెప్యూటీ మేయర్, కమిషనర్‌లతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించి చెప్పినట్లు చేయండి అంటూ ఆదేశాలు ఇచ్చినట్లు భోగట్టా. బందరురోడ్డులోని మునిసిపల్ గెస్ట్‌హౌస్ స్థలంలో నగరపాలక సంస్థ కార్యాలయాన్ని నిర్మాణం చేసుకోవాల్సిందిగా సూచించినట్లు తెలుస్తోంది.
రోడ్డున పడాలా?
మునిసిపల్ కార్యాలయానికి 130 ఏళ్లచరిత్ర ఉంది. 1981లో నగరపాలక సంస్థగా రూపాంతరం చెందింది. మొత్తం 16 సెక్షన్లలో 400 మంది ఉద్యోగులు ఈ కార్యాలయంలో విధులు నిర్వహిస్తుంటారు. రోజూ 1,500 నుంచి 2 వేల మంది ప్రజలు వివిధ పనులపై కార్యాలయానికి వచ్చిపోతుంటారు. ఈ క్రమంలో హఠాత్తుగా కార్యాలయాన్ని మార్చడం అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. నగరపాకల సంస్థకు చెందిన షాపింగ్ కాంప్లెక్స్‌లన్నీ లీజుల్లోనే కొనసాగుతున్నాయి. వాటిలోకి తాత్కాలి కంగా కార్యాలయాన్ని మార్చే పరిస్థితి లేదు. ప్రభుత్వం సూచించిన విధంగా గెస్ట్‌హౌస్ స్థలంలో కార్యాలయ నిర్మాణం చేపట్టినా అది పూర్తయ్యే వరకు ఎక్కడ ఉండాలన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
నిబంధనలకు తూట్లు
సిటీస్క్వేర్ పేరుతో స్వరాజ్య మైదానం స్థలం 26 ఎకరాలను చైనా కంపెనీకి కట్టబెట్టేందుకు గప్‌చుప్‌గా డీటెల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు(డీపీఆర్)ను సిద్ధం చేసిన టీడీపీ సర్కార్ కౌన్సిల్‌తో ఆమోదముద్ర వేయించింది. రిక్రియేషన్ జోన్‌లో ఉన్న గ్రౌండ్‌ను కమర్షియల్‌గా మార్చే అవకాశం లేదు. అయితే నిబంధలకు తూట్లు పొడిచి మిక్స్‌డ్ జోన్‌లోకి మారుస్తూ తీర్మానం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment