సాక్షి, విజయవాడ : అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలిచ్చిన తీర్పుకు టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మైండ్ బ్లాకైపోయిందని పెడన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ ఎద్దేవా చేశారు. తాజాగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రస్తుతం చంద్రబాబు ప్రజలను ఓదార్చాల్సిన అవసరం లేదని, చంద్రబాబునే ఓదార్చాల్సిన అవసరం ఉందని విమర్శించారు. ‘నేను నీళ్లు ఇచ్చాను కాని ప్రజలు మాకు ఓట్లు వేయలేదని’ చంద్రబాబు ముసలి కన్నీరు కారుస్తున్నారు, ఇలాంటి మాటలకే ప్రజలు చంద్రబాబుకు తగిన బుద్ది చెప్పినా.. ఇంకా బుద్ది రాలేదని మండిపడ్డారు. బాబు ఐదేళ్ల పాలనంతా అవినీతి, అక్రమాలు, కుట్రలు, వెన్నుపోట్లేనని తెలిపారు.
రాజకీయ నాయకులైనా, ప్రజా ప్రతినిధులైనా, అధికారులైనా, ఎవరైనా అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవని మా నాయకుడు సిఎం జగన్ ఖరాఖండిగా చెప్పారని గుర్తుచేశారు. నెలన్నర పాలనలో చారిత్రక చట్టాలను చేసిన ఘనత ఒక్క జగన్కే చెందుతుందని స్పష్టం చేశారు. కడప రౌడీలు, పులివెందుల రౌడీలు, రాయలసీమ రౌడీలు అనే మాటలు తప్ప చంద్రబాబుకు వేరే మాటలు రావా?. ఏం చంద్రబాబు రాయలసీమలో పుట్టలేదా?. ఆయనకు రాయలసీమ పౌరుషంలేదా?. అని ప్రశ్నించారు. చంద్రబాబు చౌకబారు వేషాలు ఇంకా మానుకోకపోతే ప్రజలు తరిమి కొట్టే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు. ‘ప్రజల సొమ్మును దోచేసుకుని కోట్లు కాజేసిన నీవా ఈ రోజు నీతి మాటలు చెప్పేది. ఇసుకకు కొరత వచ్చిందని విమర్శించే ముందర టీడీపీ పార్టీ పందికొక్కుల వల్లే ఇసుకకు కొరత వచ్చిందని గుర్తించాలని, దీనిపై చర్చకు ఎక్కడైనా సిద్ధం’ అని సవాల్ విసిరారు.
ఈనాడు అమరావతి దిక్కులేనిది అయిందని అంటున్నావు.. దిక్కులేని అనాధగా మిగిలింది నీవేనని, అమరావతికి నువ్వు ఏంచేశావో చెప్పాలని ప్రశ్నించారు. భ్రమలలో అమరావతిని చూపించావు, రాష్ట్ర ప్రజలకోసం కష్టపడుతున్నానంటూ..నీ కొడుకు కోసం కష్టపడ్డావని మండిపడ్డారు. పోలవరం కట్టాలని చంద్రబాబుకు ఏనాడు లేదని, పట్టిసీమ ద్వారా డబ్బులు దండుకోవడానికి కుటిల పన్నాగం పన్నాడని విమర్శించారు. సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడదాం రమ్మంటే దొడ్డిదారిన పారిపోయాడని ఎద్దేవాచేశారు. మేం చంద్రబాబులాగా రైతులను మోసం చేయమని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment