ఆ సర్టిఫికెట్‌ కోసం.. ‘వేమూరి’ బెదిరించారు | Signam Digital Ltd Chief Gauri Shankar Comments With Sakshi | Sakshi
Sakshi News home page

ఆ సర్టిఫికెట్‌ కోసం.. ‘వేమూరి’ బెదిరించారు

Published Tue, Sep 14 2021 3:15 AM | Last Updated on Tue, Sep 14 2021 12:43 PM

Signam Digital Ltd Chief Gauri Shankar Comments With Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, అమరావతి: ‘టీడీపీ ప్రభుత్వంలో సలహాదారుడు, ఇ–గవర్నెన్స్‌ అథారిటీ గవర్నెన్స్‌ కమిటీలో సభ్యుడు వేమూరి హరికృష్ణ ప్రసాద్‌ నన్ను తీవ్రంగా బెదిరించారు. దీంతో డిజిటల్‌ హెడ్‌ ఎండ్‌ పరికరాల సరఫరాలో టెరాసాఫ్ట్‌ కంపెనీకి అనుభవం ఉన్నట్లుగా తప్పుడు సర్టిఫికెట్‌ ఇచ్చాను’.. అని సిగ్నం డిజిటల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ అధిపతి గౌరీశంకర్‌ వివరించారు. ‘మేం చెప్పినట్లు సర్టిఫికెట్‌ ఇవ్వకపోతే విజయవాడలో ఎలా వ్యాపారం చేస్తావో చూస్తాం’.. అని కూడా వేమూరి హరికృష్ణ తనను తీవ్రస్థాయిలో బెదిరించడంతో భయపడి ఆ విధంగా తాను సర్టిఫికెట్‌ ఇచ్చానని ఆయన వెల్లడించారు. ఫైబర్‌నెట్‌ టెండర్ల కుంభకోణానికి పాల్పడినందుకు వేమూరి హరికృష్ణ ప్రసాద్, టెరాసాఫ్ట్‌ కంపెనీ యాజమాన్యంతోపాటు 19మందిపై సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. డిజిటల్‌ హెడ్‌ ఎండ్‌ పరికరాల సరఫరాలో టెరాసాఫ్ట్‌ సంస్థకు అనుభవం లేకపోయినా సరే ఉన్నట్లుగా సిగ్నం డిజిటల్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థను బెదిరించి సర్టిఫికెట్‌ పొందినట్లుగా సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది. ఈ నేపథ్యంలో సిగ్నం డిజిటల్‌ ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీ అధినేత గౌరీశంకర్‌ను ‘సాక్షి’ సంప్రదించగా అప్పట్లో జరిగిన విషయాలను ఆయన వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

నా ప్రాజెక్టు వేమూరి తీసుకున్నారు
ఇంటర్నెట్‌–టీవీ సేవలు కలిపి కేబుల్‌ సేవలు అందించేందుకు నేను 2013లోనే ఓ ప్రాజెక్టు రిపోర్ట్‌ తయారుచేశా. అందుకు మూడు కంపెనీల నుంచి రూ.18 లక్షలు విలువైన డిజిటల్‌ హెడ్‌ ఎండ్‌ పరికరాలు కొనుగోలు చేశాను. ఈ విషయం తెలిసి టెరాసాఫ్ట్‌ సంస్థ ప్రతినిధి వేమూరి హరికృష్ణ ప్రసాద్‌ నన్ను కలిశారు. ఆయనకు ప్రాజెక్టు గురించి పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్‌ (పీపీటీ) చూపించాను. ఆ తరువాత ఎన్నికల రావడంతో ఆ ప్రాజెక్టు ముందుకు సాగలేదు. 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వేమూరి హరికృష్ణ ప్రసాద్‌ నన్ను హైదరాబాద్‌లో అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు వద్దకు తీసుకువెళ్లారు. నా పీపీటీనే తనదని చెబుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వమే ఫైబర్‌ కేబుల్‌ సేవలు అందిస్తుందని చెప్పారు. నన్ను టెక్నికల్‌ సపోర్ట్‌ అందించమన్నారు. ప్రభుత్వం చేస్తుంది కదా అని నేను సరేనన్నాను. డీపీఆర్‌ తయారుచేసి ప్రభుత్వానికి ఇచ్చాను. కానీ, ఆ తరువాత టెండర్లు పిలవడం.. టెక్నికల్‌ కమిటీలో వేమూరి హరికృష్ణ ప్రసాద్‌ సభ్యుడిగా ఉన్నట్లు తెలిసింది. చివరికి నా పీపీటీ ఆధారంగానే టెరాసాఫ్ట్‌ బిడ్డింగ్‌ వేసి టెండర్లు దక్కించుకుంది. దాంతో వేమూరి హరికృష్ణ ప్రసాద్‌ చేసిన మోసం చూసి ఆశ్చర్యపోయాను. 

సర్టిఫికెట్‌ కోసం బెదరించారు..
ఓ రోజు రాష్ట్ర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ (ఇన్‌క్యాప్‌) ఎండీ సాంబశివరావు నాకు ఫోన్‌చేశారు. నా మెయిల్‌కు ఓ లెటర్‌ పంపించానని చెబుతూ అది చూసి కాస్త సమయం తీసుకుని రిప్లై ఇవ్వమన్నారు. ఆ వెంటనే వేమూరి హరికృష్ణ ప్రసాద్‌ కూడా ఫోన్‌చేసి నా మెయిల్‌కు ఓ డాక్యుమెంట్‌ పంపానని చెబుతూ దానిపై సంతకం చేసి ఇన్‌క్యాప్‌ ఎండీ మెయిల్‌కు సమాధానంగా పంపించమన్నారు. నాకేమీ అర్థంకాలేదు. తీరా ఆ మెయిళ్లు చూస్తే అసలు విషయం తెలిసింది. టెరాసాఫ్ట్‌ కంపెనీ మా సిగ్నం డిజిటల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు డిజిటల్‌ హెడ్‌ ఎండ్‌ పరికరాలు సరఫరా చేసినట్లుగా నేను సర్టిఫై చేస్తున్నట్లుగా ఆ డాక్యుమెంట్‌ ఉంది. నిజానికి మాకు టెరాసాఫ్ట్‌ ఎలాంటి పరికరాలు సరఫరా చేయలేదు. దాంతో నేనెందుకు సర్టిఫికెట్‌ ఇవ్వాలని అనుకున్నాను. అసలు ఏం జరిగిందో అని ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది.

మా కంపెనీకి డిజిటల్‌ హెడ్‌ ఎండ్‌ పరికరాలు సరఫరా చేసిన అనుభవం ఉందని టెరాసాఫ్ట్‌ కంపెనీ ఫైబర్‌నెట్‌ టెండర్ల అప్టికేషన్‌లో పేర్కొంది. దీనిపై ఆ టెండర్లలో పాల్గొన్న మరో కంపెనీ అభ్యంతరం వ్యక్తంచేసింది. ఈ విషయంపై కేంద్ర టెలీకమ్యూనికేషన్ల శాఖకు కూడా ఫిర్యాదు చేస్తే టెరాసాఫ్ట్‌ కంపెనీకి ఆ టెండరు దక్కదు.. కాబట్టి టెరాసాఫ్ట్‌ కంపెనీ మాకు పరికరాలు సరఫరా చేసినట్లుగా నేను సర్టిఫికెట్‌ ఇవ్వాలన్నారు. నేను అందుకు ఒప్పుకోలేదు. దాంతో వేమూరి హరికృష్ణ నాకు ఫోన్‌చేసి బెదిరించారు. సర్టిఫికెట్‌ ఇవ్వకపోతే విజయవాడలో వ్యాపారం ఎలా చేస్తావో చూస్తాను అని వార్నింగ్‌ ఇచ్చారు. నా వెనక ఎంత పెద్దలు ఉన్నారో తెలుసు కదా అని కూడా అన్నారు. కానీ, నేను సర్టిఫికెట్‌ ఇవ్వలేదు. దాంతో తెనాలి నుంచి ఒకర్ని మా ఆఫీసుకు పంపించారు.

వేమూరి హరికృష్ణ నాతో ఫోన్లో మాట్లాడుతూ.. వెంటనే సర్టిఫికెట్‌ ఆయనకిచ్చి పంపించమన్నారు. లేకపోతే ఏం జరుగుతుందో చెప్పలేనని తీవ్రస్వరంతో మాట్లాడారు. దాంతో నేను భయపడి టెరాసాఫ్ట్‌ కంపెనీకి ఎక్స్‌పీరియన్స్‌ ఉందని సర్టిఫికెట్‌ ఇచ్చాను. కానీ, దీనిపై ఎప్పటికైనా సరే విచారణ జరుగుతుందని ఊహించా. అందుకే ‘మీరు నాకు చెప్పినట్లుగా టెరాసాఫ్ట్‌కు డిజిటల్‌ ఎండ్‌ పరికరాల సరఫరాలో ఎక్స్‌పీరియన్స్‌ ఉందని సర్టిఫికెట్‌ ఇచ్చాను’.. అని వేమూరి హరికృష్ణ ప్రసాద్‌కు ఓ మెయిల్‌ పంపించాను. ఆ మెయిల్‌ను భద్రపరిచాను. భవిష్యత్‌లో ఎవరైనా అడిగితే వేమూరి హరికృష్ణ ప్రసాద్‌ బెదిరిస్తేనే ఆ సర్టిఫికెట్‌ ఇచ్చినట్లుగా ఆధారం ఉండాలి కదా. ఇటీవల సీఐడీ అధికారులు నన్ను విచారించినప్పుడు అన్ని విషయాలు చెప్పాను. ఆ మెయిల్‌తోపాటు నా వద్ద ఉన్న ఇతర డాక్యుమెంటరీ ఆధారాలన్నీ కూడా సమర్పించాను. వాస్తవానికి సిగ్నం డిజిటల్‌ లిమిటెడ్‌కు పరికరాలు ఎవరు సరఫరా చేశారో ఆ డాక్యుమెంట్లు, బిల్లులు అన్నీ అందించాను. ఈ కేసు విచారణలో సీఐడీకి పూర్తిగా సహకరిస్తాను.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement