CID officials
-
'దొరికారు దొంగలు' ఏ–1 చంద్రబాబు, ఏ–2 నారాయణ
సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు యథేచ్ఛగా సాగించిన కుంభకోణాలపై సీఐడీ దూకుడు పెంచింది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో గురువారం చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో ఏ–1గా చంద్రబాబు, ఏ–2గా పొంగూరి నారాయణలను పేర్కొంది. లింగమనేని కుటుంబంతో కలిసి సాగించిన ఈ క్విడ్ ప్రో కో కుంభకోణంలో హెరిటేజ్ ఫుడ్స్ డైరెక్టర్‌గా వ్యవహరించిన నారా లోకేశ్‌ను ఏ–14గా, లింగమనేని రమేశ్ తదితరులను కూడా నిందితులుగా పేర్కొంది. వారిపై ఐపీసీ 120(బి), 409, 420, 34, 35, 37.. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(2), రెడ్‌విత్ 13(1)(సి),(డి)ల ప్రకారం వారిపై కేసు నమోదు చేసినట్టు ఆ చార్జ్‌షీట్‌లో వెల్లడించింది. తద్వారా ఈ భారీ భూ కుంభకోణంపై న్యాయ విచారణ ప్రక్రియకు రంగం సిద్ధమైంది. కాగితాల మీదే ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో ఇష్టానుసారం మార్పులు చేసి, వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టిన చంద్రబాబు ముఠా అవినీతి బాగోతం విభ్రాంతి పరుస్తోంది. టీడీపీ ప్రభుత్వంలో సీఆర్డీఏ చైర్మన్‌గా అప్పటి సీఎం చంద్రబాబు, వైస్ చైర్మన్‌గా అప్పటి మంత్రి పొంగూరు నారాయణ బరితెగించి ఇలా అవినీతికి పాల్పడ్డారు. ఇందుకోసం లింగమనేని రమేశ్‌తో క్విడ్ ప్రో కో కు తెరలేపారు. ఈ తతంగంలో నారా లోకేష్ కూడా ప్రధాన పాత్ర పోషించారు. చంద్రబాబు బినామీ, సన్నిహితుడు లింగమనేని భూముల మార్కెట్ విలువ రూ.177.50 కోట్ల నుంచి రూ.877.50 కోట్లకు.. రాజధాని నిర్మాణం అనంతరం ఏకంగా రూ.2,130 కోట్లకు చేరేలా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్‌ను ఖరారు చేయడం భారీ దోపిడీకి నిదర్శనం. ఈ అవినీతి పాపంలో చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కల్యాణ్‌కు కూడా వాటా ఇవ్వడం గమనార్హం. సింగపూర్ కన్సల్టెన్సీ ముసుగు సింగపూర్‌కు చెందిన సుర్బాన జ్యురాంగ్ కన్సల్టెన్సీ ముసుగులో చంద్రబాబు ముఠా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ పేరిట భూ దోపిడీకి పాల్పడింది. సీఆర్డీయే ఏకంగా సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నట్టుగా టీడీపీ ప్రభుత్వం భ్రమింపజేసింది. కానీ ఆ పేరుతో సింగపూర్‌లోని ప్రైవేట్ కన్సల్టెన్సీ సుర్బాన జ్యురాంగ్ కన్సల్టెన్సీని తీసుకువచ్చి పక్కాగా అవినీతి కథ నడిపించింది. అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్ కోసం సీఆర్డీయే అధికారులు 94 కిలోమీటర్ల పొడవుతో అలైన్మెంట్ రూపొందించారు. ఆ ప్రకారం అమరావతిలోని చంద్రబాబు, లింగమనేని, నారాయణ కుటుంబాలకు చెందిన భూములకు 3 కిలోమీటర్ల దూరం నుంచి పెద్దమరిమి, నిడమర్రు, చిన వడ్లపూడి, పెద వడ్లపూడి మీదుగా ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మించాలి. దాంతో తమ భూముల విలువ పెరగదని గ్రహించిన చంద్రబాబు, నారాయణ.. సీఆర్డీయే అధికారులపై మండిపడ్డారు. వారిద్దరి ఆదేశాలతో సీఆర్డీయే అధికారులు ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో మార్పులు చేశారు. అలైన్‌మెంట్‌ను 3 కిలోమీటర్లు దక్షిణానికి జరిపి.. తాడికొండ, కంతేరు, కాజాలలోని చంద్రబాబు, లింగమనేని కుటుంబాలకు చెందిన 355 ఎకరాలు, హెరిటేజ్ ఫుడ్స్‌కు చెందిన 13 ఎకరాలను ఆనుకుని నిర్మించేలా ఖరారు చేశారు. ఆ విషయాన్ని గోప్యంగా ఉంచి.. చంద్రబాబు, నారాయణ తమ కుటుంబ సంస్థలు హెరిటేజ్, రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్‌లతోపాటు తమ బినామీ లింగమనేని రమేష్ సంస్థల పేరిట ఇన్నర్ రింగ్ రోడ్డుకు అటూ ఇటూ భారీగా భూములు కొన్నారు. అనంతరం సింగపూర్‌కు చెందిన సుర్బాన జ్యురాంగ్ కన్సల్టెన్సీని రంగంలోకి తెచ్చారు. అప్పటికే ఖరారు చేసిన ఇన్నర్ రింగ్ రోడ్ డిజైన్‌ను అమరావతి మాస్టర్ ప్లాన్‌లో చేర్చారు. అనంతరం ఎస్టీయూపీ అనే కన్సల్టెన్సీని నియమించారు. కానీ మాస్టర్ ప్లాన్‌లో పొందు పరిచిన అలైన్‌మెంట్‌కు అనుగుణంగానే ఉండాలని షరతు విధించారు. అంటే అప్పటికే సీఆర్డీయే అధికారుల ద్వారా తాము ఖరారు చేసిన అలైన్‌మెంట్‌నే ఎస్టీయూపీ కన్సల్టెన్సీ ద్వారా ఆమోదించేలా చేశారు. ఇదిగో అడ్డగోలు దోపిడీ ఇలా.. ► ఐఆర్ఆర్ అలైన్మెంట్ కుంభకోణం ద్వారా చంద్రబాబు ముఠా లింగమనేని కుటుంబంతో క్విడ్ ప్రో కోకు పాల్పడింది. లింగమనేని కుటుంబానికి కల్పించిన ప్రయోజనానికి ప్రతిగా చంద్రబాబు తమ హెరిటేజ్ ఫుడ్స్‌కు భూములు పొందారు. ఈ ప్రక్రియలో అప్పటి హెరిటేజ్ ఫుడ్స్ డైరెక్టర్ హోదాలో లోకేశ్ కీలక భూమిక పోషించారు. ఐఆర్ఆర్ అలైన్‌మెంట్‌ను ఆనుకుని ఉన్న కంతేరు గ్రామంలో హెరిటేజ్ ఫుడ్స్‌కు 10.4 ఎకరాలు పొందారు. ► 2014 జూన్ – సెప్టెంబర్ మధ్య ఈ భూములను హెరిటేజ్ ఫుడ్స్ కొనుగోలు చేసినట్టు చూపించారు. అంతే కాకుండా లింగమనేని కుటుంబం నుంచి మరో 4.55 ఎకరాలు కొనుగోలు పేరిట హెరిటేజ్ ఫుడ్స్ దక్కించుకుంది. కానీ అప్పటికే ఈ కుంభకోణం గురించి బయటకు పొక్కడంతో ఆ సేల్ డీడ్‌ను రద్దు చేసుకున్నారు. ఐఆర్ఆర్ అలైన్‌మెంట్‌ను ఆనుకుని లింగమనేని కుటుంబానికి చెందిన 355 ఎకరాలతోపాటు హెరిటేజ్ ఫుడ్స్ భూములు ఉండటం గమనార్హం. ► క్విడ్ ప్రో కో లో భాగంగా లింగమనేని రమేశ్ కృష్ణా నది కరకట్ట మీద ఉన్న తమ బంగ్లాను చంద్రబాబుకు ఇచ్చారు. దీనిపై కేసు నమోదు కావడంతో ఈ వ్యవహారానికి మసి పూసేందుకు చేసిన యత్నాలు బెడిసికొట్టాయి. ఆ బంగ్లాను అద్దెకు ఇచ్చానని లింగమనేని రమేశ్ చెప్పారు. కానీ ఆయన అద్దె వసూలు చేసినట్టుగానీ, చంద్రబాబు చెల్లించినట్టుగానీ ఆదాయ పన్ను వివరాల్లో లేవు. ► తర్వాత ఆ ఇంటిని ప్రభుత్వానికి ఉచితంగా ఇచ్చానని చెప్పారు. మరి అప్పటి ప్రభుత్వం నుంచి చంద్రబాబు హెచ్ఆర్ఏ ఎందుకు పొందారని ప్రశ్నించేసరికి ఆయన వద్ద నుంచి జవాబే లేదు. దాంతో ఆ బంగ్లాను చంద్రబాబుకు వ్యక్తిగతంగా క్విడ్ ప్రో కో కింద ఇచ్చారన్నది స్పష్టమైంది. మ్యాప్‌ను చుట్టూ తిప్పేశారు.. ► లింగమనేని కుటుంబంతో క్విడ్ ప్రో కో ద్వారా పొంగూరు నారాయణ.. తమ బంధువులు, బినామీల పేరిట 58 ఎకరాలు పొందారు. చంద్రబాబు, నారాయణ కుటుంబాలు అక్రమంగా దక్కించుకున్న భూముల సమీపంలోనే ప్రభుత్వ నిధులతో సీడ్ క్యాపిటల్ ఏరియా, స్టార్టప్ ఏరియాను అభివృద్ధి చేయాలని టీడీపీ ప్రభుత్వం ప్రణాళికను ఆమోదించింది. అందుకోసం ఏకంగా ప్రభుత్వ నిధులు రూ.5,500 కోట్లు వెచ్చించాలని నిర్ణయించింది. తద్వారా తమ భూముల ధరలు అమాంతం పెరిగేలా చేసేందుకు కుట్ర పన్నింది. ► సీఆర్డీఏ అధికారులు మొదట రూపొందించిన అలైన్మెంట్ ప్రకారం గుంటూరు జిల్లాలోని నూతక్కి – కృష్ణా జిల్లా పెద్దపులిపర్రు మధ్య కృష్ణా నదిపై వంతెన నిర్మించాలి. అక్కడి నుంచి తాడిగడప – ఎనికేపాడు మీదుగా నున్న వరకు ఇన్నర్ రింగ్ రోడ్డు కొనసాగుతుంది. అలా నిర్మిస్తే ఆ ప్రాంతంలోని నారాయణ విద్యా సంస్థల భవనాలను భూ సేకరణ కింద తొలగించాల్సి వస్తుంది. దాంతో నారాయణ ఆదేశాలతో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను 3 కి.మీ. తూర్పు దిశగా మార్చారు. ► ఆ ప్రకారం గుంటూరు జిల్లాలో రామచంద్రాపురం – కృష్ణా జిల్లా చోడవరం మధ్య వంతెన నిర్మించాలని నిర్ణయించారు. అక్కడి నుంచి పెనమలూరు మీదుగా నిడమానూరు నుంచి నున్న వరకు ఇన్నర్ రింగ్ రోడ్డును నిర్మిస్తారు. దాంతో నారాయణ కుటుంబానికి చెందిన 9 విద్యా సంస్థల భవనాలను ఆనుకుని ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను ఖరారు చేశారు. పవన్ కల్యాణ్‌కూ 2.40 ఎకరాల ప్యాకేజీ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కూడా ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు అవినీతి పాపంలో పిడికెడు వాటా ఇచ్చారు. ఈ రోడ్డు అలైన్‌మెంట్‌కు సమీపంలోనే ఆయనకు 2.4 ఎకరాల భూమి ఉంది. లింగమనేని కుటుంబం నుంచి ఆ భూములను ప్రభుత్వ ధర ప్రకారం ఎకరా రూ.8 లక్షలు చొప్పున కొనుగోలు చేసినట్టు చూపించారు. ల్యాండ్ పూలింగ్ నుంచి మినహాయింపు కల్పించిన భూమినే పవన్ కల్యాణ్‌కు ఇవ్వడం గమనార్హం. రూ.177.50 కోట్ల నుంచి రూ.877.50 కోట్లకు.. ► ఎత్తుగడల వల్ల చంద్రబాబు, లింగమనేని రమేశ్ కుటుంబాలకు చెందిన భూముల విలువ భారీగా పెరిగింది. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఖరారుకు ముందు ఆ ప్రాంతంలో ఎకరా భూమి మార్కెట్ ధర ప్రకారం ఎకరా రూ.50 లక్షలు ఉండేది. అంటే ఆ భూముల మార్కెట్ విలువ రూ.177.50 కోట్లుగా ఉండేది. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ తర్వాత మార్కెట్ ధర ప్రకారం ఎకరా రూ.2.50 కోట్లు పలికింది. అంటే 355 ఎకరాల విలువ మార్కెట్ ధర ప్రకారం అమాంతం రూ.887.50 కోట్లకు పెరిగినట్టే. ► ఇక రాజధాని అమరావతి నిర్మాణం పూర్తయితే ఎకరా విలువ సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో రూ.4 కోట్లకు చేరుతుందని ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు అప్పట్లోనే ప్రకటించారు. ఇన్నర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న భూముల విలువ ఎకరా రూ.6 కోట్లకు చేరుతుందని అంచనా వేశారు. అంటే అమరావతి నిర్మాణం పూర్తయితే ఆ 355 ఎకరాల విలువ ఏకంగా రూ.2,130 కోట్లకు చేరుతుందని అంచనా. మార్కెట్ ధర ప్రకారం హెరిటేజ్ ఫుడ్స్ 9 ఎకరాల విలువ రూ.4.50 కోట్ల నుంచి రూ.22.50 కోట్లకు పెరిగింది. అమరావతి రాజధాని నిర్మాణం పూర్తయితే అది రూ.54 కోట్లకు చేరుతుందని లెక్క తేలింది. హెరిటేజ్ ఫుడ్స్ ఒప్పందం చేసుకున్న మరో 4 ఎకరాల విలువ కూడా రూ.24 కోట్లకు చేరుతుంది. ► క్విడ్ ప్రో కో కింద చంద్రబాబు పొందిన కరకట్ట నివాసాన్ని, నారాయణ కుటుంబ సభ్యులు సీడ్ క్యాపిటల్‌లో పొందిన 75,888 చదరపు గజాల ప్లాట్లు, కౌలు మొత్తంగా పొందిన రూ.1.92 కోట్లను అటాచ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు న్యాయ స్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. లోకేశ్ అరెస్ట్‌కు ప్రతిబంధకం కాదు ఐఆర్ఆర్ కేసులో సీఐడీ చార్జ్‌షీట్ దాఖలు ఇప్పటికే విచారణలో ఉన్న ‘రెడ్‌బుక్’ కేసును ప్రభావితం చేయదని నిపుణులు చెబుతున్నారు. రెడ్‌బుక్ కేసులో లోకేశ్‌ను అరెస్ట్ చేసేందుకు ఈ చార్జ్‌సీట్ ప్రతిబంధకం కాదు. ఐఆర్ఆర్ కేసులో అధికారులు, సాక్షులను బెదిరిస్తూ కేసు విచారణను ప్రభావితం చేసే రీతిలో రెడ్‌బుక్ పేరిట ఆయన బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో గతంలో ఇచ్చిన నోటీసులకు విరుద్ధంగా వ్యవహరించిన లోకేశ్‌ను అరెస్ట్ చేసేందుకు అనుమతించాలని కోరుతూ సీఐడీ విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ ఈ నెల 13కు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఐఆర్ఆర్ కుంభకోణం కేసు, రెడ్‌బుక్ బెదిరింపులు వేర్వేరు కేసులు. కాబట్టి ఐఆర్ఆర్ కేసులో చార్జ్‌షీట్ దాఖలు చేసినప్పటికీ రెడ్‌బుక్ పేరిట బెదిరింపు కేసులో లోకేశ్‌ను అరెస్ట్ చేసేందుకు ఎలాంటి అడ్డంకి ఉండదని నిపుణులు స్పష్టం చేశారు. -
ఇసుక బకాసురుడు బాబు 'తవ్వుకో.. తినుకో'!
సాక్షి, అమరావతి: ఇసుక నుంచి తైలం పిండటంలో నిజమెంత ఉందో తెలియదుగానీ ఇసుక నుంచి వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టవచ్చని చంద్రబాబు నిరూపించారు. అది కూడా ఇసుక ఉచితం అని బురిడీ కొట్టించి దోపిడీకి పాల్పడటం ఆయనకే సాధ్యమైంది. తాను అక్రమంగా నివాసం ఉంటున్న కరకట్ట ఇంటి వెనుకే వేల కొద్దీ లారీల్లో ఇసుక తరలిపోతున్నా గుడ్లప్పగించి చూశారు. టీడీపీ హయాంలో ‘ఉచిత ఇసుక విధానం’ ముసుగులో పచ్చ ముఠా సాగించిన దోపిడీని సీఐడీ పూర్తి ఆధారాలతో సహా బట్టబయలు చేసింది. కేంద్ర చట్టాలు, గ్రీన్ ట్రిబ్యునల్ విధివిధానాలను ఉల్లంఘించి కేబినెట్ ఆమోదం కూడా లేకుండా ‘ప్రత్యేక మెమో’ ద్వారా చంద్రబాబు చేసిన లూటీ ఆధారాలతో బహిర్గతమైంది. 2016 నుంచి 2019 వరకు ప్రభుత్వ ఖజానాకు రూ.వెయ్యి కోట్ల ఆదాయానికి గండి కొట్టడమే కాకుండా చంద్రబాబు ముఠా ఏకంగా రూ.10 వేల కోట్ల విలువైన ఇసుక దోపిడీకి పాల్పడిందన్నది నిగ్గు తేలింది. అంతులేని ధన దాహం 2014లో టీడీపీ అధికారంలోకి రాగానే చంద్రబాబు కన్ను ఇసుక రీచ్‌లపై పడింది. అక్రమంగా ఇసుక తవ్వకాలకు పాల్పడినా ఆయన సంతృప్తి చెందలేదు. దీంతో ఇసుక విధానాన్ని పునఃసమీక్షించాలని కేబినెట్ సబ్ కమిటీని నియమించారు. కొత్త ఇసుక విధానాన్ని నిర్ణయిస్తూ 2016 జనవరి 15న రెండు జీవోలు (జీవో నంబర్లు 19, 20) జారీ చేశారు. అయినప్పటికీ చంద్రబాబు ఇసుక దాహం తీరలేదు. బరితెగించి ఇసుక దోపిడీకి పాల్పడేందుకు మరో విధానాన్ని తీసుకురావాలని భావించారు. ‘ఇసుకను ప్రభుత్వం అమ్మదు.. ఇసుక తవ్వకాలకు ఎలాంటి అనుమతులు అవసరం లేదు.. ఎవరికి వారు ఇసుక రీచ్‌లకు వెళ్లి ఇసుక తవ్వుకోవచ్చు.. అమ్ముకోవచ్చు.. ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు, ఆంక్షలు విధించదు’ అని చెబుతూ 2016 మార్చి 4న ఉచిత ఇసుక విధానాన్ని తెచ్చి దొరికిన చోట దొరికినట్లు దోచుకున్నారు. ఇసుక రీచ్‌లు అన్నింటినీ చంద్రబాబు తన చేతిలోకి, మంత్రివర్గ సభ్యులు, టీడీపీ ఎమ్మెల్యేల ఆధీనంలోకి తీసుకొచ్చారు. మూడు మార్గాలు బేఖాతర్.. భారీ ఇసుక దోపిడీ కోసం చంద్రబాబు అన్ని నిబంధనలను ఉల్లంఘించారు. ఒక ‘మెమో’తో ఇసుక దోపిడీకి పన్నాగం పన్నారు. కేంద్ర ప్రభుత్వ చట్టానికి లోబడే ఇసుక తవ్వకాల కోసం విధానాలు రూపొందించాలి. అందుకు నిర్దేశించిన మూడు ప్రత్యామ్నాయ మార్గాల్లో ఒకటి ఎంపిక చేసుకోవాలి. ఇసుక తవ్వకాల కోసం జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ రూపొందించిన బిజినెస్ రూల్స్ (మార్గదర్శకాలు) అనుసరించాలి. అంతకంటే మెరుగైన విధానం రూపొందించామని రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తే ఆమేరకు ఆరి్థక శాఖ ఆమోదం పొందాలి. ఓ విధానాన్ని రూపొందించి అందుకు కేబినెట్ ఆమోదం పొందాలి. చంద్రబాబు ప్రభుత్వం కుట్రపూరితంగా తెచ్చిన ‘ఉచిత ఇసుక విధానం’ కోసం ఈ మూడింటిలో ఏ ఒక్కటీ పాటించలేదు. మెమో 3066తో కనికట్టు ‘ఉచిత ఇసుక విధానం’ విధానాన్ని తెస్తూ టీడీపీ ప్రభుత్వం 2016 మార్చి 4న ప్రత్యేకంగా ‘మెమో 3066’ జారీ చేసింది. దీని ద్వారా రాష్ట్రంలోని ఇసుక రీచ్‌లన్నీ చంద్రబాబు, ఆయన మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు హస్తగతం చేసుకున్నారు. సహజ వనరులు, రాష్ట్ర ఖజానాకు కీలకమైన ఆరి్థక వనరుకు సంబంధించి కేబినెట్ ఆమోదం లేకుండానే అడ్డగోలుగా కేవలం ఒక మెమోను సాకుగా చూపి రంగంలోకి దిగారు. ఈ మెమో ద్వారా 2016 నుంచి 2019 వరకు అడ్డూ అదుపు లేకుండా ఇసుకను కొల్లగొట్టారు. రేట్లపై, తవ్వకాలపై నియంత్రణ లేదు. జిల్లాల వారీగా ఇసుక రీచ్‌లలో ఎవరెవరు తవ్వుకోవాలో చంద్రబాబు స్వయంగా తన బినామీలు, సన్నిహితులు, టీడీపీ ఎమ్మెల్యేలకు అప్పగించారు. ఒక్కసారిగా భారీ యంత్రాలను ఇసుక తవ్వకాల కోసం తెచ్చారు. ఇతరులు ఎవరూ ఆ ఇసుక రీచ్‌ల వైపు కన్నెత్తి కూడా చూడకుండా కట్టడి చేశారు. చంద్రబాబు ముఠా రోజూ వేల లారీల్లో లక్షల టన్నుల ఇసుకను తవ్వేసి అమ్ముకుంది. రాష్ట్రంలో నదుల్లో అందుబాటులో ఉన్న ఇసుక ఎంత..? రోజుకు ఎంత తవ్వుతున్నారు? ఎంతకు అమ్ముతున్నారు? ఎన్ని వేల లారీల ఇసుక రోజూ రాష్ట్రం దాటుతోంది? అనేదానికి అంతూపొంతూ లేకుండా పోయింది. ఆ ఆదాయం ఏమైంది? గ్రీన్ ట్రిబ్యునల్ మార్గదర్శకాల ప్రకారం ఇసుక తవ్వకాల ద్వారా ఖజానాకు నాలుగు రకాల ఆదాయం రావాలి. సీనరేజీ, కన్సిడరేషన్ చార్జీలు, డి్రస్టిక్ట్ మైన్స్ ఫండ్, మెరిట్ ఫీజు చెల్లించాలి. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రీన్ ట్రిబ్యునల్ మార్గదర్శకాలను పాటిస్తూ కొత్త ఇసుక విధానాన్ని తెచ్చింది. దూరాన్ని బట్టి ఏ రీచ్ నుంచి ఎంత చార్జీ అనే అంశాన్ని నిర్ణయించి పారదర్శకంగా ప్రకటిస్తోంది. దీంతో రాష్ట్ర ఖజానాకు రూ.766 కోట్ల ఆదాయం వచ్చింది. ఆ ప్రకారం టీడీపీ హయాంలో 2016 నుంచి 2019 వరకు కనీసం రూ.వెయ్యి కోట్ల ఆదాయం రాష్ట్ర ఖజానాకు రావాల్సి ఉంటుందని గనుల శాఖ అంచనా వేసింది. చంద్రబాబు ‘ఉచిత ఇసుక’ అనే మోసపూరిత విధానంతో ప్రభుత్వ ఖజానాకు రూ.వెయ్యి కోట్ల గండిపడింది. ఇక రాష్ట్రంలో యథేచ్ఛగా తవ్విన ఇసుక ఎంతనే అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. 2016 నుంచి 2019 వరకు చంద్రబాబు ముఠా రాష్ట్రంలో దాదాపు రూ.10 వేల కోట్ల విలువైన ఇసుకను తవ్వి అమ్మేసుకుందన్నది విస్మయం కలిగిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో పక్కా ఆధారాలతో సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో సీఐడీ తదుపరి చర్యలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అడ్డుకున్న మహిళా అధికారి వనజాక్షిపై దాడి.. ఇసుక దోపిడీ కుట్రకు చంద్రబాబు సూత్రధారి కాగా అప్పటి గనుల శాఖ మంత్రి పీతల సుజాత, నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌తోపాటు మరికొందరు ప్రధాన పాత్రధారులుగా వ్యవహరించారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అంతటా యథేచ్ఛగా ఇసుక దోపిడీకి పాల్పడ్డారు. అక్రమ ఇసుక తవ్వకాలను ప్రశ్నించినందుకు తహసీల్దార్ వనజాక్షిని అప్పటి టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జుత్తు పట్టుకుని మరీ దాడికి పాల్పడ్డారు. తహసీల్దార్‌పై దాడికి పాల్పడిన చింతమనేని ప్రభాకర్‌ను నాటి సీఎం చంద్రబాబు సమర్ధించడం విస్మయ పరిచింది. తమ ఇసుక దోపిడీకి అడ్డు వస్తే ఎవరికైనా అదే గతి పడుతుందని సందేశం ఇచ్చేందుకే చంద్రబాబు అలా వ్యవహరించారు. -
బాబు ముందస్తు బెయిల్‌పై ముగిసిన వాదనలు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలకు నేరస్వభావాన్ని ఆపాదించడానికి వీల్లేదని చంద్రబాబు తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ అగర్వాల్ హైకోర్టుకు నివేదించారు. ఉచిత ఇసుక విధానంలో తప్పులు జరిగి ఉంటే కేసు నమోదుకు మూడేళ్లు ఎందుకు ఆగారని ప్రశ్నించారు. ఇన్నేళ్ల తరువాత కేసు ఎందుకు నమోదు చేశారన్న దానికి కారణాలు చెప్పడం లేదన్నారు. ఇసుక విధానం ద్వారా చంద్రబాబుకు లబ్ధిచేకూరినట్లు సీఐడీ ఎలాంటి ఆధారాలను చూపలేదని చెప్పారు. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. అందువల్ల అవినీతి నిరోధక చట్టం కింద చంద్రబాబును ప్రాసిక్యూట్ చేయాలంటే సెక్షన్ 17(ఏ) కింద గవర్నర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. పిటిషనర్ చంద్రబాబు వయసు, అనారోగ్య సమస్యలను పరిగణనలోకి తీసుకుని ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఇరుపక్షాల వాదనలను పూర్తిచేయడంతో హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. ఉచిత ఇసుక పథకం పేరుతో కోట్ల రూపాయల మేర ఖజానాకు నష్టం కలిగించినందుకు సీఐడీ పలువురిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై బుధవారం జస్టిస్ మల్లికార్జునరావు మరోసారి విచారించారు. -
ఉత్తరం.. ఉత్తదే చంద్ర'లేఖ'లో ఇంద్రజాలం!
సాక్షి, అమరావతి: ‘స్కిల్’ స్కామ్‌లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్టు చేసి, ఏసీబీ కోర్టు రిమాండ్‌పై జైలుకు పంపి నెలన్నర అవుతోంది. ఆయన నుంచి రూ.వందల కోట్ల ఫీజులు తీసుకుంటున్న లాయర్లు మాత్రం చంద్రబాబు తప్పు చేయలేదని అప్పటి నుంచి ఇప్పటిదాకా న్యాయస్థానాల్లో వాదించలేదు. కేవలం సీఆర్పీసీ సెక్షన్–17(ఏ) ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకోకుండా చంద్రబాబును అరెస్టు చేశారంటూ సాంకేతిక అంశాల సాకుతో కేసును కొట్టి వేయాలని మాత్రమే వాదిస్తున్నారు. ఈ కేసులోనూ తనకు అలవాటైన రీతిలోనే న్యాయ పరీక్షను ఎదుర్కోకుండా సాంకేతిక అంశాలను అడ్డుపెట్టుకుని తప్పించుకోవడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఒకవైపు తప్పించుకునే మార్గాలను అన్వేషిస్తూ మరోవైపు న్యాయం ఆలస్యం కావచ్చుగానీ అంతిమంగా గెలుస్తుందంటూ ఆదివారం ఓ బహిరంగ లేఖలో చంద్రబాబు అడ్డగోలుగా దబాయించారు. అయితే జైలు నుంచి అలాంటి లేఖ ఏదీ తాము జారీ చేయలేదని రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం పర్యవేక్షణ అధికారి ఎస్.రాహుల్ స్పష్టం చేశారు. అంటే.. ఆ లేఖే నకిలీదని తేటతెల్లమవుతోంది. జైలు నుంచి ప్రజలకు తన తండ్రి రాశారని పేరుతో లోకేష్ బహిరంగ లేఖను విడుదల చేసి నాటకమాడినట్లు స్పష్టమవుతోంది. ఇక ఆ లేఖలో రాసినవన్ని పచ్చి అబద్ధాలే. అంతా కల్పితాలతో దాని విడుల చేశారు. శ్రేణుల నుంచి కనీస స్పందన లేకపోవడంతో.. స్కిల్ డెవలప్మెంట్ ముసుగులో ప్రభుత్వ ఖజానా నుంచి అడ్డంగా దోచేసి దొరికిపోయిన కేసులో చంద్రబాబును ఏసీబీ కోర్టు రిమాండ్‌పై జైలుకు పంపింది. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తమ అధినేతను అరెస్టు చేశారంటూ టీడీపీ నేతలు ఎంతగా దుష్ఫ్రచారం చేస్తున్నా ప్రజల నుంచి సానుభూతి కాదు కదా కనీస స్పందన కూడా లభించడం లేదు. చివరకు టీడీపీ కార్యకర్తలు కూడా మొహం చాటేయడంతో దాన్ని కప్పిపుచ్చుకునేందుకు శనివారం ములాఖత్‌లో చంద్రబాబు సూచనల మేరకు పండుగ పూట పచ్చి అసత్యాలు వల్లె వేస్తూ బహిరంగ లేఖను లోకేష్ విడుదల చేసి డ్రామా ఆడినట్లు స్పష్టమవుతోంది. తన సామాజిక వర్గంలో కొందరు మినహా ఎవరూ స్పందించకపోయినా ఉవ్వెతున్న ప్రజా చైతన్యం ఎగిసిపడుతున్నట్లు ఆ లేఖలో చిత్రీకరించడం గమనార్హం. అభివృద్ధి ఎక్కడ.. అంతా విధ్వంసమే..: తాను జైల్లో ఉన్నా అభివృద్ధి రూపంలో ప్రతి చోటా ఉంటానని, సంక్షేమం పేరు వినిపించిన ప్రతి సారీ తానే గుర్తొస్తానని చంద్రబాబు లేఖలో అతిశయోక్తులు వల్లె వేశారు. విభజిత రాష్ట్రంలో చంద్రబాబు దోపిడీ మినహా సంక్షేమం ఎక్కడా కానరాదు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దిక్సూచిలా నిలిచే పోలవరం ప్రాజెక్టును కమీషన్ల కోసం చంద్రబాబు ఏటీఎంలా మార్చుకుని విధ్వంసం సృష్టించారని సాక్షాత్తూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. అమరావతి భూకుంభకోణం నుంచి స్కిల్ స్కామ్ వరకూ అనేక అక్రమాలకు పాల్పడిన చంద్రబాబు ఖజానాను కొల్లగొట్టి పేదల నోట్లో మట్టి కొట్టారన్నది యధార్థం. అందుకే రిమాండ్‌పై చంద్రబాబు జైల్లో ఉన్నా ఎవరూ పట్టించుకున్న దాఖలాలు లేవని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దొరికిపోయిన దొంగ.. దేశ భక్తుడిలా సూక్తులా? తన రాజకీయ అరంగేట్రం నుంచే చంద్రబాబు అక్రమాలకు తెరతీశారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి 1995లో అధికారాన్ని చేజిక్కించుకున్నాక అవి పరాకాష్టకు చేరాయి. 1995 నుంచి 2004 వరకూ చంద్రబాబు పాల్పడ్డ అక్రమాలు, ఆయన అక్రమాస్తులపై విచారణ జరిపించాలంటూ ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతితోపాటు ప్రస్తుతం టీడీపీ పంచన చేరిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ వరకూ కోర్టుల్లో 17 కేసులు వేశారు. ఆ కేసుల్లో విచారణ ఎదుర్కొంటే దొరికిపోతాననే భయంతో స్టేలు తెచ్చుకుని చంద్రబాబు బతుకుతున్నారు. చివరకు స్కిల్ స్కామ్‌లో అడ్డంగా దొరికిపోయారు. అలాంటి వ్యక్తి దేశభక్తుడిలా అంతిమంగా గెలిచేది న్యాయమేనంటూ నమ్మబలకటాన్ని రాజకీయ పరిశీలకులు ఎద్దేవా చేస్తున్నారు. అనారోగ్య కారణాలతో మరణిస్తే పరామర్శా? రాష్ట్రంలో అనారోగ్య కారణాలతో మరణించిన వారిని సైతం వదిలిపెట్టకుండా తన అక్రమ అరెస్టుతో తల్లడిల్లి మృతి చెందినట్లుగా చంద్రబాబు చిత్రీకరించుకోవటాన్ని సామాజికవేత్తలు తప్పుబడుతున్నారు. ఆ కుటుంబాలను పరామర్శించేందుకు, అరాచక పాలనను ఎండగట్టడానికి ‘నిజం గెలవాలి’ అంటూ తన భార్య భువనేశ్వరి ప్రజల ముందుకు వస్తోందని చంద్రబాబు పేరుతో విడుదలైన లేఖలో పేర్కొన్నారు. తాను జైల్లో ఉంటున్నా ప్రజలు, పార్టీ శ్రేణుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో దాన్ని కప్పిపుచ్చుకోవడానికే చంద్రబాబు ఈ డ్రామాకు తెరతీశారన్నది విశదమవుతోంది. -
తత్తరపాటు.. బిత్తర చూపులు!
‘ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ గురించి నాకేం తెలీదు.. అసలు ఇన్నర్ రింగ్ రోడ్డును ఆనుకుని భూములను హెరిటేజ్ ఫుడ్స్ కొనడం గురించి నాకేం తెలియదు’ – నారా లోకేశ్ ‘భూముల కొనుగోలుకు తీర్మానిస్తూ హెరిటేజ్ ఫుడ్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్‌లో చేసిన తీర్మానం ఇదిగో. ఆ మీటింగ్‌లో మీరూ పాల్గొన్నారు. మినిట్స్ రికార్డుల్లో సంతకం కూడా చేశారు. అయినా కూడా మీకు భూముల కొనుగోలు గురించి తెలీదంటారా?’ – సీఐడీ అధికారుల సూటి ప్రశ్న సాక్షి, అమరావతి: సీఐడీ సంధించిన సూటి ప్రశ్నలకు తత్తరపాటుకు గురై బిత్తరపోవడం లోకేశ్ వంతైంది. మాజీ సీఎం చంద్రబాబు తరహాలోనే ఆయన తనయుడు నారా లోకేశ్ కూడా సీఐడీ దర్యాప్తునకు సహకరించకుండా మొండికేసేందుకు శతవిధాలుగా ప్రయత్నించారు. అయితే సీఐడీ అధికారులు పూర్తి ఆధారాలతో ప్రశ్నించేసరికి తడబాటుకు గురై అసహనం ప్రదర్శించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కుంభకోణం కేసులో ఏ–14గా ఉన్న నారా లోకేశ్ సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణకు మంగళవారం హాజరయ్యారు. తాడేపల్లిలోని సిట్ కార్యాలయంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆయన్ను సిట్ అధికారులు విచారించారు. న్యాయస్థానం ఆదేశాలను పాటిస్తూ లోకేశ్‌కు సమీపంలో న్యాయవాది ఉండేందుకు అవకాశం కల్పించి మరీ విచారించారు. ముందుగా సిద్ధం చేసుకున్న ప్రశ్నావళిని బట్టి సీఐడీ అధికారులు ఒక్కో ప్రశ్న అడుగుతూ విచారణ కొనసాగించారు. సుహృద్భావ వాతావరణంలో విచారణ ప్రక్రియ కొనసాగించేందుకు ప్రాధాన్యమిచ్చారు. లోకేశ్ సహకరించడం లేదని స్పష్టమవుతున్నా ఓపిగ్గా ప్రశ్నలు సంధిస్తూ ఆరు గంటల పాటు విచారించారు. ఈ కేసులో మరింత సమాచారాన్ని రాబట్టేందుకు బుధవారం మరోసారి విచారణకు హాజరు కావాలని లోకేశ్‌కు నోటీసులిచ్చారు. ఇవిగో ఆధారాలు.. మరేమంటారు? విచారణకు సహకరించకుండా కేసు దర్యాప్తును తప్పుదారి పట్టించేందుకు లోకేశ్ యత్నిస్తుండటంతో ఒక దశలో సీఐడీ అధికారులు ఇక లాభం లేదని గేర్ మార్చారు. అంతవరకు ఏ ప్రశ్న అడిగినా తనకు తెలియదని చెబుతూ వచ్చిన వాటికి సంబంధించి ఆధారాలను ఒక్కొక్కటిగా చూపుతూ ఆరా తీయడంతో లోకేశ్ కంగుతిన్నారు. హెరిటేజ్ ఫుడ్స్ భూములను కొనుగోలు చేసిన విషయం తనకు తెలియదని లోకేశ్ మొదట బుకాయించారు. అయి తే ఆయన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల మీటింగులో పాల్గొన్నట్టు నిరూపించే రికార్డులను చూపించడంతో పాటు భూముల కొనుగోలుకు ఆమోదించిన తీర్మా నం కాపీని అధికారులు ప్రదర్శించడంతో తత్తరపాటుకు గురయ్యారు. వాటిపై సీఐడీ అధికారులు సూటిగా ప్రశ్నించడంతో తన న్యాయవాదితో మా ట్లాడి చెబుతానన్నారు. అందుకు సీఐడీ అధికారులు అనుమతించడంతో సమీపంలోనే ఉన్న న్యాయవాదితో మంతనాలు జరిపారు. అనంతరం తిరిగి వచ్చి ఆ సమావేశంలో చాలా అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారని, అయితే అవేవీ తనకు గుర్తు లేదని సమాధానమిచ్చారు. రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పుల విషయంపై తనకు తెలియదని బుకాయించేందుకు లోకేశ్ చేసిన యత్నాలు బెడిసికొట్టాయి. ఎందుకంటే ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను ఆనుకుని ఉన్న భూములనే కొనుగోలు చేయాలని హెరిటేజ్ ఫుడ్స్ నిర్ణయించింది. అక్కడ భూములను కొనుగోలు చేయడం వ్యాపార విస్తరణకు ఉపయోగపడుతుందని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో పేర్కొన్నారు. రాజధాని కోసం భూసమీకరణకు ప్రభుత్వం భూములను తీసుకుంటున్న ప్రాంతంలో భూములు కొనుగోలు చేయడం వ్యాపార విస్తరణకు ఎలా దోహదపడుతుందని భావించారని సీఐడీ అధికారులు సూటిగా ప్రశ్నించారు. అంటే ఆ ప్రాంతంలోని భూములు భూసమీకరణకు కిందకు రావని మీకు ముందే తెలుసా? అని సూటిగా నిలదీసేసరికి లోకేశ్ నీళ్లు నమిలారు. హెరిటేజ్ ఫుడ్స్ కొనుగోలు చేయాలని నిర్ణయించిన భూములను ఆనుకునే లింగమనేని కుటుంబానికి చెందిన భూములున్న విషయం మీకు తెలుసా అని సీఐడీ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. మీ తండ్రి చంద్రబాబుతో కలసి మీరు నివసిస్తున్న కరకట్ట బంగ్లా లింగమనేని కుటుంబం ఇచ్చిందనే విషయంపై మీకు అవగాహన ఉందా? అని ప్రశ్నించగా ఆయన చాలాసేపు మౌనం వహించారు. క్విడ్‌ప్రోకో కిందే ఆ కరకట్ట నివాసం మీకు వచ్చిందన్న అభియోగంపై మీ అభిప్రాయం ఏమిటని ప్రశ్నించినా సరే లోకేశ్ సూటిగా సమాధానం చెప్పకపోవడం గమనార్హం. వెళ్లండి... రేపు రండి లోకేశ్ నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు ఆయన్ను మరోసారి విచారించాలని సీఐడీ అధి కారులు నిర్ణయించారు. ఈమేరకు బుధవారం విచారణకు హాజరు కావాలంటూ సెక్షన్ 41 ఏ కింద లోకేష్‌కు నోటీసులు ఇచ్చారు. గూగుల్‌లో వెతికితే చాలు: లోకేశ్ తన గురించి గూగుల్‌లో వెతికినా లభించే సాధారణ సమాచారాన్నే సీఐడీ అధికారులు విచారణలో ప్రశ్నించారని విచారణ అనంతరం లోకేశ్ వ్యాఖ్యానించారు. ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈ కేసుకు సంబంధించి సీఐడీ వద్ద ఎలాంటి ఆధారాలు లేవన్నారు. కక్ష సాధింపు కోసమే తమపై కేసు నమోదు చేశారని ఆరోపించారు. అన్నిటా బాబు బాటలోనే.. అవినీతికి పాల్పడటంలోనే కాదు సీఐడీ దర్యాప్తునకు సహకరించకుండా మొండికేయడంలో తండ్రి చంద్రబాబు బాటనే లోకేశ్ అనుసరించారు. విచారణను తప్పించుకునేందుకు చేసిన యత్నాలు బెడిసికొట్టడంతో అనివార్యంగా లోకేశ్ సీఐడీ ఎదుట హాజరయ్యారు. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌కు సంబంధించి సీఐడీ అధికారులు ఏ ప్రశ్న అడిగినా తనకు తెలీదనే చెబుతూ వచ్చారు. అలైన్‌మెంట్‌ను మూడు సార్లు మార్చిన విషయంపై ప్రశ్నిస్తే అసలు తనకు ఆ విషయమే తెలియదని చెప్పుకొచ్చారు. హెరిటేజ్ ఫుడ్స్ భూముల కొనుగోలుకు సంబంధించిన ప్రశ్నలకు తనకు తెలీయదని..గుర్తు లేదని చెప్పడం గమనార్హం. హెరిటేజ్ ఫుడ్స్‌లో డైరెక్టర్ హోదాలో మీరు ఎలాంటి విధులు నిర్వహించారు..? ఎలాంటి నిర్ణయాల్లో భాగస్వామి అయ్యారనే ప్రశ్నలకు సమాధానాలను దాటవేశారు. సీఐడీ అధికారులు విచారణ నియమావళి ప్రకారం అడిగిన ప్రశ్నలకు సమాధానాలు గూగుల్‌లో సెర్చ్ చేసినా దొరుకుతాయని లోకేశ్ వ్యాఖ్యానించడం గమనార్హం. -
చంద్రబాబును మరో 5 రోజులు మా కస్టడీకి ఇవ్వండి
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుని మరో 5 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలంటూ సోమవారం విజయవాడ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. కోర్టు ఇచ్చిన 2 రోజుల కస్టడీలో తమ విచారణకు చంద్రబాబు ఏ మాత్రం సహకరించలేదని సీఐడీ వివరించింది. కోర్టు ఇచ్చిన కస్టడీ ఉత్తర్వులను చదివే పేరుతో గంటల కొద్దీ సమయాన్ని వృథా చేశారని తెలిపింది. 2 రోజుల కస్టడీకి మాత్రమే ఇవ్వడంతో ఆ గడువును ఆయన అడ్డంపెట్టుకుని ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేశారంది. ఆయన నుంచి పలు అంశాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని రాబట్టాల్సి ఉందని, అందువల్ల ఆయనను తమ కస్టడీకి అప్పగించడం అత్యావశ్యకమని తమ పిటిషన్లో కోర్టుకు నివేదించింది. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరుపుతామని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులను ఆదేశించింది. మధ్యాహ్నం వరకు కోర్టు ఉత్తర్వులను చదువుతూనే ఉన్నారు ‘చంద్రబాబును 5 రోజుల కస్టడీకి అప్పగించాలంటూ మొదట ఈ నెల 11న పిటిషన్ దాఖలు చేశాం. దీనిపై విచారణ జరిపిన ఏసీబీ కోర్టు పలు షరతులతో కేవలం 2 రోజుల కస్టడీకే అప్పగిస్తూ ఈ నెల 22న ఉత్తర్వులు ఇచ్చింది. కోర్టు విధించిన షరతులకు లోబడి చంద్రబాబును విచారించాం. విచారణ సందర్భంగా ఆయన నుంచి పలు వివరాలు రాబట్టేందుకు ఈ కేసుకు సంబంధించిన విషయాలతో ప్రశ్నలను సిద్ధం చేశాం. మా ప్రశ్నల తీరు మొత్తాన్ని వీడియో రికార్డింగ్ చేశాం. మొదటి రోజు విచారణలో చంద్రబాబు మేం అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా కాలయాపన చేశారు. కోర్టు ఇచ్చిన పోలీసు కస్టడీ ఉత్తర్వులను ప్రశ్నించారు. పోలీసు కస్టడీ ఉత్తర్వుల కాపీని తనకు అందచేస్తే తప్ప, దర్యాప్తు అధికారి అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చేది లేదని కరాఖండిగా చెప్పారు. తనకు ఎలాంటి ఆధారాలు ఇవ్వకుండానే పోలీసు కస్టడీకి ఇచ్చారని, న్యాయవాదిని కలుసుకునే అవకాశం కూడా ఇవ్వలేదని చంద్రబాబు చెప్పారు. కోర్టు ఇరుపక్షాల వాదనలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న తరువాతనే మిమ్మల్ని పోలీసు కస్టడీకి ఇవ్వడం జరిగిందని దర్యాప్తు అధికారి ఆయనకు చెప్పారు. ఒకవేళ పోలీసు కస్టడీ ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే, న్యాయవాది ద్వారా ఆ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లాలని కూడా చంద్రబాబుకు దర్యాప్తు అధికారి స్పష్టం చేశారు. మిమ్మల్ని విచారించేందుకు కోర్టు మాకు అనుమతినిచ్చిందని, మా ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని ఆయనకు దర్యాప్తు అధికారి తేల్చి చెప్పారు. కస్టడీ ఉత్తర్వులను తీసుకున్న చంద్రబాబు వాటిని మధ్యాహ్నం 1 గంట వరకు చదివారు. దర్యాప్తు అధికారి గంట పాటు భోజన విరామ సమయం ఇచ్చారు. భోజన విరామం తరువాత వచ్చి కూడా 2 గంటల వరకు కోర్టు ఉత్తర్వులను చదువుతూనే ఉన్నారు. 2.20 గంటల సమయంలో మాకు కోర్టు కేవలం రెండు రోజుల కస్టడీ మాత్రమే ఇచ్చిందని చంద్రబాబుకు దర్యాప్తు అధికారి స్పష్టంగా చెప్పారు. చదవడం ఆపి, తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఆయనను దర్యాప్తు అధికారి కోరారు. అయితే దీనిని చంద్రబాబు పట్టించుకోలేదు. అలా మరికొద్దిసేపు కోర్టు ఉత్తర్వులను చదువుతూనే ఉన్నారు.’ అని సీఐడీ తన పిటిషన్లో పేర్కొంది. 15 రోజుల తరువాత విచారణకు ఆస్కారం లేదనే.. ‘మేం ఏ సరళిలో ప్రశ్నలు అడగాలనుకున్నామో మమ్మల్ని అలా చంద్రబాబు అడగనివ్వలేదు. అంతేకాక ఆయన చెప్పే విషయాలను రాసుకోవాలని దర్యాప్తు అధికారికి చెప్పారు. తనకు తెలిసిన విషయాలకు సంబంధించి కూడా ఆయన నోరు మెదపలేదు. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దాటవేశారు. చాలా సందర్భాల్లో దర్యాప్తు అధికారిని మాటలతో వంచించే వైఖరిని అవలంభించారు. తాను విచారణ సందర్భంగా ఇలానే వ్యవహరించాలని చంద్రబాబు ముందే ఓ నిర్ణయానికి రావడంతో, ఈ కేసులో కీలక నిందితులైన వికాస్ ఖన్వీల్కర్, షెల్ కంపెనీల డైరెక్టర్లు, ఇతర కుట్రదారులైన గంటా సుబ్బారావు (ఏ1), లక్ష్మీనారాయణ (ఏ2)ల వాంగ్మూలాలను ఆయన ముందుంచి వివరాలు రాబట్టే అవకాశం లేకుండా పోయింది. అలాగే కీలక సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా చంద్రబాబు నుంచి తగిన వివరాలు తెలుసుకోలేకపోయాం. ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తూ, కావాల్సిన సమాచారాన్ని రాబట్టనివ్వకుండా దర్యాప్తు సంస్థను నిరోధిస్తూ వచ్చారు. విచారణ సందర్భంగా తీసిన వీడియోను పరిశీలిస్తే చంద్రబాబు వేసిన కాలయాపన ఎత్తులు సులభంగా అర్థమవుతాయి. అరెస్ట్ చేసిన నాటి నుంచి 15 రోజుల తరువాత ఎలాంటి జ్యుడీషియల్ ఇంటరాగేషన్ ఉండదన్న ఉద్దేశంతోనే చంద్రబాబు కావాలనే దర్యాప్తు అధికారి కోరిన సమాచారాన్ని ఇవ్వలేదు.’ అని సీఐడీ వివరించింది. హైకోర్టు ఉత్తర్వుల వల్ల 5 రోజుల పాటు కస్టడీలోకి తీసుకోలేకపోయాం... ‘కోట్లాది రూపాయల డబ్బు 2018–20 సంవత్సరాల మధ్య తెలుగుదేశం పార్టీ బ్యాంకు ఖాతాల్లో జమ అయినట్లు దర్యాప్తులో గుర్తించాం. ఆ బ్యాంకు ఖాతాలకు తానే అథరైజ్డ్ సిగ్నేటరీ అన్న విషయాన్ని చంద్రబాబు కూడా అంగీకరించారు. భారీ స్థాయిలో వచ్చిన నగదు డిపాజిట్ల వివరాలను చంద్రబాబు ముందు ఉంచి, వాటి గురించి ఆయన్ను ప్రశ్నించాల్సి ఉంది. టీడీపీ బ్యాంకు ఖాతాలకు సంబంధించిన అన్ని వివరాలు అందించాలని హైదరాబాద్‌లోని బ్యాంక్ ఆఫ్ బరోడా జోనల్ మేనేజర్‌ను కోరాం. ఆ వివరాలు రావాల్సి ఉంది. వచ్చిన తరువాత వాటిని విశ్లేషించి చంద్రబాబును విచారిస్తాం. తనపై మేం నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై ఈ నెల 13న విచారణ జరిపిన హైకోర్టు, 18వ తేదీ వరకు మా పోలీసు కస్టడీ పిటిషన్లో కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబును ఒత్తిడి చేయవద్దని ఉత్తర్వులిచ్చింది. ఈ ఆరు రోజులను మొదటి 15 రోజుల గడువు నుంచి మినహాయించాల్సిన అవసరం ఉంది. హైకోర్టు ఆదేశాల వల్ల మా కస్టడీ పిటిషన్‌పై ఈ ఏసీబీ కోర్టు విచారణ జరిపే పరిస్థితి లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో తగినంత గడువు లేకపోవడంతో మేం కోరుకున్న విధంగా చంద్రబాబును 5 రోజుల పోలీసు కస్టడీకి తీసుకోలేకపోయాం’ అని సీఐడీ తన పిటిషన్లో తెలిపింది. చంద్రబాబు సహాయ నిరాకరణ వల్ల అది సాధ్యం కాలేదు... ‘ఈ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో లోతైన కుట్ర దాగి ఉంది. ఈ కుట్ర వెనుక వాస్తవాలను వెలికితీసేందుకు చంద్రబాబును విచారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అధికార దుర్వినియోగం, ప్రైవేటు వ్యక్తులకు చేకూర్చిన లబ్ధి గురించి ప్రశ్నించాల్సి ఉంది. సాక్షులు చెప్పిన వివరాలను ఆయన ముందుంచి వాటి ఆధారంగా వాస్తవాలను రాబట్టాల్సిన బాధ్యత దర్యాప్తు సంస్థగా మాపై ఉంది. చంద్రబాబు సహాయ నిరాకరణ వల్ల పలు వివరాలను రాబట్టలేకపోయాం. కీలక ఫైళ్లు గల్లంతయ్యాయి. ఈ ఫైళ్ల గల్లంతు వ్యవహారంలో చంద్రబాబు, అచ్చెన్నాయుడు, గంటా సుబ్బారావు, డాక్టర్ లక్ష్మీనారాయణ ప్రధాన లబ్ధిదారులుగా అనుమానిస్తున్నాం. గల్లంతైన ఫైళ్ల ఆచూకీ తెలుసుకునేందుకు చంద్రబాబు కస్టోడియల్ విచారణ అత్యావశ్యకం’ అని సీఐడీ తన పిటిషన్లో పేర్కొంది. ప్రధాన సూత్రధారి చంద్రబాబేనని దర్యాప్తులో తేలింది... ‘ఈ స్కిల్ కుంభకోణం డబ్బు మొత్తం చివరకు నగదు రూపంలో చేరింది వికాస్ ఖన్వీల్కర్, షెల్ కంపెనీలకు. ఇందుకు ప్రధాన సూత్రధారి చంద్రబాబు అని దర్యాప్తులో తేలింది. షెల్ కంపెనీల ద్వారా డబ్బు మొత్తం తిరిగి ఆయనకే చేరింది. సుమన్ బోస్, వికాస్ ఖన్వీల్కర్, లక్ష్మీనారాయణ, గంటా సుబ్బారావు, సంజయ్ దాగాలు చెప్పిన వివరాల ఆధారంగా చంద్రబాబును ప్రశ్నించాల్సి ఉంది. ఈ కుంభకోణం అంతిమ లబ్ధిదారులు చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ అని మా దర్యాప్తులో తేలింది. నిధుల మళ్లింపులో ఎవరెవరి పాత్ర ఏమిటన్న విషయాలు చంద్రబాబుకు పూర్తిగా తెలుసు. కుట్ర పన్నిన తీరు, ఇతర నిందితుల పాత్ర, ఇతర కీలక వివరాలన్నీ చంద్రబాబుకు తెలుసు. ఈ వివరాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని చంద్రబాబును 5 రోజుల పాటు మా కస్టడీకి ఇవ్వాలని అభ్యర్థిస్తున్నాం’ అని సీఐడీ తన పిటిషన్లో తెలిపింది. -
సీఐడీ ప్రశ్నలకు ఏదడిగినా అదే సమాధానం..
-
చంద్రబాబును ప్రశ్నిస్తున్న సీఐడీ అధికారులు
-
చంద్రబాబు ‘స్కిల్’ స్కాం.. విచారణలో బయటపడ్డ వాస్తవాలు
నిరుద్యోగులైన యువతీయువకులకు ఆశలు చూపించి దోపిడీ పర్వానికి చంద్రబాబు తెరలేపారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఎలా వెలుగులోకి వచ్చింది.? ఇందులో బాబు పాత్ర ఏంటీ.? తీగలాగితే.. డొంక ఎలా కదిలింది.. కేసు విచారణలో బయటపడ్డ వాస్తవాలను పరిశీలిస్తే.. ♦జీవో నెంబర్-47లోని పారాగ్రాఫ్ నెంబర్-35లో అప్పటి ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఏర్పాటుపై తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా క్యాబినెట్ అనుమతి లేకుండా ఎలాంటి కార్పోరేషన్ ఏర్పాటు చేయకూడదని అభ్యంతరం వ్యక్తం చేశారు. ♦జీవో నెంబర్-2452లోని పారాగ్రాఫ్ నెంబర్-153లో పైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ చాలా స్పష్టంగా నిధుల విడుదలకు సంబంధించి అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇందులో అప్పటి చీఫ్ సెక్రెటరీ ఐవైఆర్ కృష్ణారావు పారాగ్రాఫ్ నెంబర్-27లో నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద జరిగిన సమావేశంలో నిర్ణయించినట్లు ♦తెలిపారు. ♦ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు నిధులు విడుదల చేయాల్సినందిగా చీఫ్ సెక్రెటరీ ఐవైఆర్ కృష్ణారావు చెప్పినట్లు అప్పటి ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ స్పష్టంగా నోట్‌ఫైల్ రాశారు. ఈ ప్రాజెక్టులో నిధుల విడుదలపై మరోసారి పరిశీలించాల్సిందిగా జీవోనెంబర్-2452లో పారాగ్రాఫ్ నెంబర్-160లో అప్పటి ఆర్ధిక శాఖ కార్యదర్శి శ్రీమతి సునీత చాలా స్పష్టంగా అప్పటి ఆర్ధిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరికీ నివేదించింది. ♦దీనిపై మరోసారి ఆలోచించిన ఆర్ధికశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ పారాగ్రాఫ్ నెంబర్-161, 162లో చీఫ్ సెక్రెటరీగా ఉన్న ఐవైఆర్ కృష్ణారావు వెంటనే నిధులు విడుదల చేయాల్సిందిగా తనతో మాట్లాడినట్లు నోట్ ఫైల్లో రాశారు. సుబ్బారావు తనతో కలిసి నిధులు వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్లు జీవోలోని 46వ పేజీ ,పారాగ్రాఫ్-31లో ఉన్నట్లు అప్పటి సీఎస్ ఐవైఆర్ చెప్పడం వల్ల దానిన అమలు చేసినట్లు ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి పివిరమేష్ స్పష్టంగా రాశారు. ♦2015లో వివిధ దఫాలుగా రూ.371 కోట్ల రూపాయల బడ్జెట్ ఆర్డర్లు రిలీజ్ అయ్యాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన యంత్రాలపై అప్పటి ఆర్ధికశాఖ సెక్రెటరీ సునీత అభ్యంతరాలు చెప్పినప్పటికీ చంద్రబాబు ఆదేశాలతో నిధులు విడుదల చేశారు. ఈ స్కాంకు సంబంధించి 14.05.2018లో తొలిసారిగా పూనేలోని జీఎస్టీ కార్యాలయానికి ఫిర్యాదు అందింది. ♦దీనికి సంబంధించి జీఎస్టీ అధికారులు ఏపీ అవినీతి నిరోధక శాఖకు ఈ ఫిర్యాదును బదిలీ చేశారు. డిజైన్‌టెక్ సంస్థ ఫేక్ ఇన్వాయిస్లతో సర్వీస్ టాక్స్ ఎగ్గొట్టిందని ఫిర్యాదు సారాంశం. దీనికి సంబందించి చంద్రబాబుతో సహా అందరికి సమాచారం ఉన్నా ఎవరూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. డిజైన్ టెక్ వ్యవహారం బయటకు రావడంతో చంద్రబాబు అండ్ కో సాక్ష్యాధారాలను మాయం చేసింది. ఏకంగా 30.06.2016న విడుదలైన జీవో నెంబర్-4కు సంబంధించిన ఒరిజినల్ నోట్ ఫైల్.. సుబ్బారావు ఓఎస్డీ ఎన్వీకే ప్రసాద్(ఏ-5) ద్వారా మాయం చేశారు. చదవండి: ఏమో.. తెలియదు.. గుర్తు లేదు.. సీఐడీ ప్రశ్నలకు చంద్రబాబు సమాధానాలు -
ఏమో.. తెలియదు.. గుర్తు లేదు.. సీఐడీ ప్రశ్నలకు చంద్రబాబు సమాధానాలు
సాక్షి, విజయవాడ: సీఐడీ విచారణలో చంద్రబాబు హఠాత్తుగా రూటు మార్చారు. విచారణకు ఏమాత్రం సహకరించకుండా మాట దాటవేస్తున్నట్టు తెలిసింది. తాము సేకరించిన ఆధారాలను చంద్రబాబుకు చూపించి ప్రశ్నలడిగిన అధికారులకు సమాధానం చెప్పకుండా కూర్చున్నట్టు సమాచారం. స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించి వివిధ సాక్ష్యాల ఆధారంగా 20 ప్రశ్నలను చంద్రబాబును అడిగారు అధికారులు. తనకు రాజకీయాల్లో 40 ఏళ్ల కంటే ఎక్కువ అనుభవం ఉందని, పోలీసులను ఏం చేయాలో తనకు తెలుసంటూ ఎదురుదాడికి దిగేందుకు చంద్రబాబు ప్రయత్నించినట్టు తెలిసింది. మధ్యమధ్యలో మీరెవరు నన్ను అడగడానికి అంటూ ఎదురు తిరిగినట్టు సమాచారం. సీఐడీ రూపొందించిన ప్రశ్నల్లో ఎక్కువ భాగం హవాలా లావాదేవీలతో పాటు ఏ రకంగా ప్రభుత్వ నిధులను పక్కదారి పట్టించారనే అంశాలపై ఉన్నాయి. 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాసిన ముఖ్యమైన నోట్‌ఫైల్స్‌ను సిఐడి అధికారులు చూపించినట్టు తెలిసింది. ఇవి చూడగానే చంద్రబాబు ముఖం ఒక్కసారిగా వాడిపోయింది. నోట్‌ఫైల్‌లో ఏముందంటే.. 2014 నుంచి 2019 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు పని చేశారు. సెప్టెంబర్ 8, 2015న ఒక ఫైల్ సీఎంవో నుంచి ఆర్ధికశాఖకు వచ్చింది. ఆ ఫైల్ వచ్చిన వెంటనే చీఫ్ సెక్రటరీ నుంచి ఆర్థికశాఖ సెక్షన్ ఆఫీసర్‌కు పిలుపొచ్చింది. సెప్టెంబర్ 5, 2015న నాటి ముఖ్యమంత్రి చంద్రబాబుతో తనకు సమావేశం జరిగిందని చీఫ్ సెక్రటరీ తనకు వెల్లడించినట్టు ఆర్థికశాఖ నోట్‌ఫైల్‌లో ఉంది. ఆ సమావేశానికి సంబంధించి మినిట్స్ కూడా పేర్కొన్నారు. స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించి సీమెన్స్ కంపెనీతో ఆగస్టు 21, 2015న ఒప్పందం చేసుకున్నట్టు ముఖ్యమంత్రి వెల్లడించినట్టు చీఫ్ సెక్రటరీ తనకు తెలిపారని ఆర్థికశాఖ కార్యదర్శి అందులో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన నిధులను (రూ.371కోట్లను) తక్షణం విడుదల చేయాలని, ఇది ముఖ్యమంత్రి తనకు ఇచ్చిన ఆదేశమని చీఫ్ సెక్రటరీ పేర్కొన్నట్టు నోట్‌ఫైల్‌లో ఉంది. వీలైనంత త్వరగా MOU (మెమొరాండం ఆఫ్ అండర్స్టాండింగ్) కుదుర్చుకోవాలని సీఎం చెప్పినట్టు ఆర్థికశాఖ వ్యవహారాల్లో పేర్కొన్నారు. ఆగస్టు 5, 2015న ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పంపిన నోట్‌పై అప్పటి చీఫ్ సెక్రటరీ స్వయంగా కొన్ని కామెంట్లు రాశారు. దాంట్లో ఏముందంటే.. "పారా నెంబర్ 27 ప్రకారం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కంపెనీ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశం, చర్చల మేరకు తక్షణం BRO (Budget Release Order - బడ్జెట్ నుంచి నిధులు విడుదల చేసేందుకు అవసరమైన పత్రాలు)ను విడుదల చేయాలి" దీంతో పాటు ఆగస్టు 27న రూ.270 కోట్ల నిధులకు సంబంధించిన బడ్జెట్ రిలీజ్ ఆర్డర్‌ను విడుదల చేసే ప్రతిపాదన తయారయింది. ఈ ప్రతిపాదనకు ఆఘమేఘాల మీద ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. సీమెన్స్ కంపెనీకి నిధులను వెంటనే విడుదల చేసేలా ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో పాటు చంద్రబాబుకు, ఆయన పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌తో జరిగిన వాట్సాప్ చాట్లకు సంబంధించిన స్క్రీన్ షాట్లను చంద్రబాబుకు చూపించగా.. తనకేం తెలియదని, అసలు గుర్తు లేదంటూ పొంతన లేని సమాధానాలిచ్చినట్టు సమాచారం. ఈ ఆధారాలను ఇవ్వాళ్టి విచారణలో సీఐడీ అధికారులు చంద్రబాబుకు చూపించగానే నీళ్లు నమిలినట్టు తెలిసింది. అందుకే అధికారులు అడిగిన ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు ఇవ్వకుండా చంద్రబాబు దాటవేత ధోరణి ప్రదర్శించినట్టు తెలిసింది. ఈ స్కాంలో చంద్రబాబు ప్రమేయాన్ని స్పష్టంగా నిరూపిస్తున్నాయి. -
‘మార్గదర్శి’.. మరో ‘అగ్రిగోల్డ్’..!
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఒక మేడి పండు అన్న నిజం వెలుగు చూసింది. పొట్ట విప్పి చూస్తే ఆర్థిక అక్రమాలు గుట్టలు గుట్టలుగా బయటపడ్డాయి. ఫోర్జరీ సంతకాలతో మోసాలు.., చందాదారులకు తెలియకుండానే చిట్టీ పాటలు.., మేనేజ్మెంట్ టికెట్లు పేరిట బురిడీలు.., ఏజెంట్ల ద్వారా కనికట్టు.., బ్రాంచిల నుంచి ప్రధాన కార్యాలయానికి అక్రమంగా నిధులు మళ్లింపు.., నిధుల్లేక ఖాళీగా ఉన్న బ్యాంకు ఖాతాలు.. ఇలా మార్గదర్శి చిట్‌ఫండ్స్ లోగుట్టు ఆధారాలతో సహా వెలుగు చూసింది. చందాదారుల సొమ్ముతో రామోజీరావు అక్రమ వ్యాపార సామ్రాజ్యం విస్తరణకు మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఇం‘ధనం’గా ఉపయోగపడుతోందన్నది రూఢీ అయ్యింది. అదే సమయంలో మార్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థ సొంత ఆర్థిక పరిస్థితి దినదిన గండంగా ఉందన్న అసలు వాస్తవం వెల్లడైంది. చందాదారుల సొమ్ముకు ఏమాత్రం భద్రత లేదన్న విషయం ఆధారాలతో సహా బయటపడింది. ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే మార్గదర్శి చిట్‌ఫండ్స్ మరో అగ్రిగోల్డ్ కానున్నదన్నది విస్పష్టమైంది. వేలాదిమంది మార్గదర్శి చిట్‌ఫండ్స్ చందాదారులు నిండా మునిగిపోయే ప్రమాదం ఉందన్న విషయం రూఢీ అయింది. రాష్ట్రంలో ఉన్న మార్గదర్శి చిట్‌ఫండ్స్ 37 శాఖల్లో స్టాంపులు – రిజిస్ట్రేషన్ల శాఖ, సీఐడీ అధికారులు గురువారం సోదాలు చేశారు. ప్రత్యేక బృందాలతో ఏకకాలంలో చేపట్టిన ఈ ఆకస్మిక సోదాల్లో సంస్థ ఆర్థిక అక్రమాలు భారీగా వెలుగులోకి వచ్చాయి. కేంద్ర చిట్‌ఫండ్స్ చట్టం, ఆర్బీఐ నిబంధనలే కాదు.. ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) కింద కూడా పలు నేరాలకు సంస్థ యాజమాన్యం పాల్పడినట్టు వెల్లడైంది. మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఆర్థిక అక్రమాలపై ఆ సంస్థ చైర్మన్ రామోజీరావు ఏ–1గా, మేనేజింగ్ డైరెక్టర్ శైలజ కిరణ్ ఏ–2గా, బ్రాంచి మేనేజర్లు (ఫోర్‌మెన్) ఏ–3గా సీఐడీ కేసు నమోదు చేసి, చార్జిషీటు కూడా దాఖలు చేసింది. ఈ కేసు దర్యాçప్తులో భాగంగా స్టాంపులు – రిజిస్ట్రేషన్ల శాఖ, సీఐడీ అధికారుల బృందాలు చేపట్టిన సోదాలు గురువారం అర్ధరాత్రి కూడా కొనసాగుతున్నాయి. ఈ సోదాలు మరో రెండు రోజులు కొనసాగే అవకాశాలున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే బోర్డు తిప్పేయడమే విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం.. మార్గదర్శి చిట్‌ఫండ్స్ కార్యాలయాల్లో జరిగిన సోదాల్లో పలు విస్మయకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. రామోజీరావు ఘనంగా చెప్పుకొనే ఈ సంస్థ ఆర్థికంగా కుదేలవుతుందనేందుకు స్పష్టమైన ఆధారాలు బయటపడ్డాయి. సంస్థ ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. అధికారులు సోదాలు చేస్తున్న 37 శాఖల బ్యాంకు ఖాతాల్లో వాటి చందాదారుల నిధులు లేవని వెల్లడైంది. అంటే చందాదారులు చెల్లించిన డబ్బును అక్రమంగా ప్రధాన కార్యాలయానికి తరలించేశారు. ఆ నిధులు ప్రధాన కార్యాలయం బ్యాంకు ఖాతాలో ఉన్నాయా అంటే అక్కడా లేవు. వాటిని గుట్టుచప్పుడు కాకుండా రామోజీరావు సొంత వ్యాపార సంస్థల్లో, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులుగా మళ్లించేశారు. వెరసి రాష్ట్రంలోని 37 మార్గదర్శి శాఖల ఆర్థిక పరిస్థితి కుదేలైంది. ఆ శాఖల చందాదారులు చిట్టీ పాటలు పాడిన సొమ్ము (ప్రైజ్ మనీ)ని చెల్లించే స్థితిలో సంస్థ లేదన్న విషయం సోదాల్లో తేలింది. ఇది ఎన్నో ఏళ్లుగా ఉన్న పరిస్థితే అని కూడా స్పష్టమైంది. కొత్తగా చిట్టీ వేసే చందాదారులు చెల్లించే చందా మొత్తంతో పాత చిట్టీల చందాదారులు పాడిన ప్రైజ్‌మనీని చెల్లిస్తూ ఇన్నాళ్లూ సంస్థ కనికట్టు చేస్తోంది. కానీ కేంద్ర చిట్‌ఫండ్ చట్టం–1982ను కచ్చితంగా పాటించాలని రాష్ట్ర చిట్ రిజిస్ట్రార్ స్పష్టం చేయడంతో మార్గదర్శి చిట్‌ఫండ్స్ గత ఏడాది డిసెంబర్ నుంచి కొత్త చిట్టీ గ్రూపులు వేయడంలేదు. అంటే 9 నెలలుగా వ్యాపార కార్యకలాపాలు నిలిచిపోయాయి. కొత్త చిట్టీలు, కొత్త చందాదారులు, కొత్తగా చందా మొత్తాలు రాక డిసెంబర్ ముందు మొదలు పెట్టిన వేలాది చందాదారులకు చిట్టీపాట ప్రైజ్‌మనీ చెల్లించడం మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు తలకుమించిన భారంగా పరిణమించింది. మరో వైపు చందాదారులకు చిట్టీపాట మొత్తం చెల్లించకుండా వాటిని అక్రమ డిపాజిట్లుగా మళ్లిస్తోంది. కాలపరిమితి తీరిన డిపా జిట్లు చందాదారులకు తిరిగి చెల్లించాలి. అందుకు కూడా మార్గదర్శి చిట్‌ఫండ్స్ వద్ద నిధులు లేవు. ఈ పరిణామాల నేపథ్యంలో మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రైజ్‌మనీ, డిపాజిట్ల చెల్లింపు సందేహాస్పదంగా మారింది. ఒక్క మాటలో చెప్పాలంటే మూసివేతకు ముందు అగ్రిగోల్డ్ సంస్థ ఏ దుస్థితిలో ఉందో.. ప్రస్తుతం మార్గదర్శి చిట్‌ఫండ్స్ అదే ఆర్థిక దుస్థితిని ఎదుర్కొంటోందన్నది ఆధారాలతో సహా బయటపడినట్టు సమాచారం. మార్గదర్శి భవిష్యత్‌లో కూడా కోలుకునే అవకాశాలు కనిపించడంలేదు. దాంతో మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఏ క్షణంలోనైనా బోర్డు తిప్పేస్తే చందాదారులు, డిపాజిట్‌దారులు నిండా మునిగిపోయే ప్ర మాదం ఉందన్నది స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ, సీఐడీ సోదాల్లో బయటపడినట్టు తెలుస్తోంది. చందాదారులు, డిపాజిట్‌దారుల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అనివార్యత కనిపిస్తోంది. అన్నీ అక్రమాలే.. ఇక చిట్టీ గ్రూపుల్లో మేనేజ్మెంట్ టికెట్ల చందాను మార్గదర్శి చిట్‌ఫండ్స్ వాస్తవంగా చెల్లించడమే లేదన్నది కూడా ఆధారాలతో వెల్లడైంది. ఏదైనా చిట్టీ గ్రూపులో కొన్ని టికెట్లు (సభ్యులు) ఖాళీగా ఉండిపోతే వాటిని మేనేజ్మెంట్ పేరిట నమోదు చేస్తారు. ఆ టికెట్ల చందా మొత్తాన్ని సంస్థ యాజమాన్యం చెల్లించాలి. కానీ మార్గదర్శి చిట్‌ఫండ్స్ 37 బ్రాంచిల్లోనూ సంస్థ పేరిట ఉన్న టికెట్ల చందాను చెల్లించడమే లేదు. అందుకు సంబంధించిన బ్యాంకు లావాదేవీలు ఏవీ రికార్డుల్లో నమోదు కానేలేదు. కానీ మేనేజ్మెంట్ టికెట్లకు చెల్లించాల్సిన డివిడెండ్లు, టికెట్ల పేరిట చిట్టీ పాట పాడి ప్రైజ్‌మనీని మాత్రం తీసుకుంటోంది. అంటే రామోజీరావు, ఆయన కుటుంబ సభ్యులు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే.. అక్రమ డిపాజిట్లు వసూలు చేస్తున్నట్టుగా కూడా వెల్లడైంది. మార్గదర్శి సహాయ నిరాకరణ స్టాంపులు – రిజిస్ట్రేషన్ల శాఖ, సీఐడీ సోదాలకు మార్గదర్శి చిట్‌ఫండ్స్ అడుగడుగునా ఆటంకాలు సృష్టించేందుకు యత్నించింది. అధికార బృందాలు లోపలికి రాకుండా సిబ్బంది వాగ్వాదానికి దిగారు. సోదాల సందర్భంగా కీలక రికార్డులు చూపించేందుకు సిబ్బంది నిరాకరించారు. అధికారుల బృందాలకు సహకరించవద్దని మార్గదర్శి ప్రధాన కార్యాలయం శాఖలకు ఫ్యాక్స్ ద్వారా ఆదేశించడం గమనార్హం. ఈనాడు పాత్రికేయులను మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఉద్యోగుల పేరిట కార్యాలయాల్లోపల మోహరించారు. వారు సోదాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఈనాడు ప్రధాన కార్యాలయానికి చేరవేశారు. వారిచ్చిన సమాచారాన్ని వక్రీకరిస్తూ మీడియాలో వార్తలు ప్రసారం చేయడం ద్వారా అధికారుల బృందాలను బ్లాక్ మెయిల్ చేసేందుకు పన్నాగం పన్నారు. ఈ విధంగా సోదాలను అడ్డుకునేందుకు ఎంతగానో ప్రయత్నించారు. అయినప్పటికీ అధికారుల బృందాలు నిబంధనలను పాటిస్తూ సోదాలు కొనసాగిస్తున్నాయి. ఫోర్జరీ సంతకాలతో యథేచ్ఛగా అక్రమాలు మార్గదర్శి చిట్‌ఫండ్స్ దశాబ్దాలుగా యథేచ్ఛగా ఆర్థిక అక్రమాలకు పాల్పడుతోందన్నది పూర్తి ఆధారాలతో ఈ సోదాల్లో వెల్లడైంది. ఆ సంస్థ కేవలం చిట్‌ఫండ్స్ చట్టం, ఆర్బీఐ నిబంధనలే కాదు.. ఐపీసీ చట్టాలను కూడా ఉల్లంఘిస్తూ ఆర్థిక అక్రమాలు, మోసాలకు పాల్పడుతోంది. ప్రధానంగా చందాదారుల సంతకాలను ఫోర్జరీ చేసి మరీ అక్రమాలకు పాల్పడుతున్నట్టుగా అధికారులు గుర్తించినట్టు సమాచారం. చిట్టీ గ్రూపుల పాటలు నిర్వహిస్తే కనీసం ఇద్దరు సభ్యుల కోరం ఉండాలి. కానీ ఆ కోరం కూడా లేకుండానే చిట్టీ పాటలు నిర్వహిస్తోంది. అందుకోసం చందాదారులు వచ్చినట్టుగా వారి సంతకాలను మినిట్స్ బుక్‌లో ఫోర్జరీ చేస్తోంది. అంతేకాదు కొందరు చందాదారులు వారు రాలేనందున వారి తరపున చిట్టీ పాటలో పాల్గొనేందుకు మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఏజెంట్లకు అనుమతి (ఆథరైజేషన్) ఇచ్చినట్టుగా పత్రాలు కనిపించాయి. ఈ రెండు సందర్భాల్లోనూ చందాదారుల సంతకాలు ఫోర్జరీ చేసినట్టుగా అధికార బృందాలు గుర్తించాయి. ఆ సంతకాలు ఉన్న చందాదారులను అధికారులు సంప్రదించడంతో అసలు విషయం బయటపడింది. అసలు తాము ఎవరికీ ఆథరైజేషన్ ఇవ్వనేలేదని, తాము రాకున్నా వచ్చినట్టు మినిట్స్ బుక్‌లో నమోదు చేయడం ఏమిటని ఆ చందాదారులు తిరిగి ప్రశ్నించారు. అవి తమ సంతకాలు కావని, ఫోర్జరీవి అని స్పష్టం చేశారు. ఆ చందాదారుల అసలు సంతకాలను మార్గదర్శి చిట్‌ఫండ్స్ రికార్డుల్లో ఉన్న సంతకాలతో పోల్చి చూడగా అవి ఫోర్జరీ అనే విషయం స్పష్టమైంది. ఆ విధంగా ఏకంగా 70 శాతం చందాదారుల సంతకాలు ఫోర్జరీయేనని అధికారులు గుర్తించారు. ఫోర్జరీ సంతకాలతో మార్గదర్శి చిట్‌ఫండ్స్ దశాబ్దాలుగా అక్రమాలకు పాల్పడుతున్నట్టు వెల్లడైంది. కీలక పత్రాలు స్వాదీనం మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఆర్థిక అక్రమాలకు సంబంధించిన కీలక ఆధారాలను స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ, సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు ఖాతాలు, చిట్టీ గ్రూపుల చందాల వివరాలు, నిధుల మళ్లింపునకు సంబంధించిన పత్రాలు, ఫోర్జరీ సంతకాలు చేసిన రికార్డులు, హార్డ్ డిస్‌్కలను జప్తు చేసి పంచనామా నిర్వహించారు. తమ సంతకాలను ఫోర్జరీ చేసినట్టుగా చందాదారుల వాంగ్మూలాలను నమోదు చేశారు. దాంతో మార్గదర్శి చిట్‌ఫండ్స్ కేసులో సీఐడీ అధికారులు కీలక పురోగతి సాధించినట్టైంది. ఈ సోదాలు శుక్ర, శనివారాలు కూడా కొనసాగే అవకాశాలున్నాయి. దాంతో మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఆర్థిక అక్రమాలు మరిన్ని వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. -
‘మార్గదర్శి’ కేసులో ఏ–2 శైలజ విచారణ నేడు
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమ వ్యవహారాల కేసులో ఏ–2గా ఉన్న ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ చెరుకూరి శైలజ కిరణ్‌ను సీఐడీ అధికారులు గురువారం విచారించనున్నారు. కేంద్ర చిట్‌ఫండ్ చట్టం–1982కు విరుద్ధంగా చందాదారుల సొమ్మును మ్యూచువల్ఫండ్స్, షేర్ మార్కెట్లో పెట్టుబడిగా పెట్టడం, రిజర్వ్ బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా అక్రమ డిపాజిట్ల సేకరణపై సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో ఏ–3గా ఉన్న కొందరు మార్గదర్శి చిట్‌ఫండ్స్ బ్రాంచి మేనేజర్లను సీఐడీ విభాగం అరెస్ట్ చేసింది. కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడు, ఏ–1గా ఉన్న చెరుకూరి రామోజీరావును సీఐడీ అధికారులు సోమవారం విచారించారు. నిధుల మళ్లింపు వాస్తవమేనని ఆయన అంగీకరించడం ప్రాధాన్యం సంతరించుకుంది. పైగా అది తమ సంస్థ ఇష్టమని.. అసలు విచారించడానికి సీఐడీకి ఏం అధికారం ఉందన్న రీతిలో రామోజీరావు ప్రవర్తించడం అందర్నీ విస్మయపరచింది. కానీ సీఐడీ అధికారులు నిబంధనల మేరకు ఆయనను విచారించి కీలక విషయాలు రాబట్టారు. ఏ–1గా ఉన్న రామోజీరావే నిధుల మళ్లింపు నిజమేనని దాదాపుగా అంగీకరించడంతో ఈ కేసులో సీఐడీ కీలక పురోగతి సాధించినట్లయింది. ఈ నేపథ్యంలోనే ఈ కేసులో ఏ–2గా ఉన్న చెరుకూరి శైలజ కిరణ్‌ను గురువారం విచారించనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. శైలజను హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసంలోనే విచారించనున్నారు. రామోజీరావు, శైలజ స్టేట్మెంట్లను విశ్లేషించిన అనంతరం ఈ కేసులో తదుపరి చర్యలకు ఉపక్రమించాలని సీఐడీ భావిస్తోంది. వారిద్దరినీ ఆంధ్రప్రదేశ్‌కు పిలిపించి మరీ విచారించేందుకు సీఐడీ సంసిద్ధమవుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. -
'రామోజీరావు స్టేట్మెంట్ను వీడియో రికార్డు చేశాం.. శైలజను 6న విచారిస్తాం'
సాక్షి, హైదరాబాద్: మార్గదర్శి చిట్‌ఫండ్ కేసులో రామోజీరావును 8 గంటలపాటు విచారించారు సీఐడీ అధికారులు. అనంతరం సీఐడీ ఎస్పీ అమిత్ బర్ధార్ మీడియాతో మాట్లాడుతూ ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. మార్గదర్శిపై ఇప్పటివరకు 7 కేసులు నమోదుచేసినట్లు పేర్కొన్నారు. 'ఒక కేసుకు సంబంధించి రామోజీరావును విచారించాం. ఆయన స్టేట్మెంట్ను వీడియో రికార్డు చేశాం. తన కోడలు శైలజా కిరణ్ ఇంటికి వచ్చి విచారించాలని రామోజీరావు కోరారు. అందుకే ఇక్కడే విచారణ జరిపాం. ఈ కేసులో కొత్త సాక్ష్యాధారాల ఆధారంగా రామోజీరావును మళ్లీ విచారిస్తాం. రామోజీ స్టేట్మెంట్ను అనలైజ్ చేయాల్సి ఉంది. ట్రాన్స్ఫరెన్స్ దర్యాప్తులో బాగంగా విచారణ జరిపాం. ఐవోతో సహా టెక్నికల్ స్టాఫ్ విచారణలో పాల్గొన్నారు. రామోజీరావు కోడలు శైలజాకిరణ్‌ను ఈనెల 6న విచారిస్తాం. ఆమెకు కూడా 160 సీఆర్పీసీ నోటీసులు ఇచ్చాం.' అని సీఐడీ ఎస్పీ తెలిపారు. చదవండి: రామోజీరావు, శైలజా కిరణ్‌ల సీఐడీ విచారణ.. కీలక ఆధారాలు లభ్యం? -
రామోజీ, శైలజకు సీఐడీ నోటీసులు
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అక్రమ వ్యవహారాలకు సంబంధించిన కేసులో విచారించేందుకు సంస్థ చైర్మన్ చెరుకూరి రామోజీరావు, ఎండీ చెరుకూరి శైలజకు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. దర్యాప్తులో భాగంగా రామోజీరావు, శైలజను విచారించాల్సిన అవసరం ఉందని నిర్ధారించిన సీఐడీ వారిద్దరిని ఈ నెల 29న గానీ 31న గానీ లేదా ఏప్రిల్ 3న గానీ 6న గానీ విచారించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ముందుగా సమాచారం అందజేస్తూ వారికి అనువైన తేదీని తెలియచేయాలని సూచించింది. రామోజీరావు, శైలజ వారి నివాసంలోగానీ కార్యాలయంలోగానీ విచారణకు హాజరు కావాలని సీఐడీ నోటీసుల్లో పేర్కొంది. చిట్‌ఫండ్ చట్టం నిబంధనలను ఉల్లంఘించి నిధులు మళ్లించడంపై ఏ–1గా రామోజీరావు, ఏ–2గా శైలజతోపాటు మార్గదర్శి చిట్‌ఫండ్స్ మేనేజర్లపై సీఐడీ అధికారులు ఇప్పటికే కేసులు నమోదుచేసిన విషయం తెలిసిందే. మార్గదర్శి చిట్‌ఫండ్స్ కార్యాలయాల్లో సీఐడీ అధికారులు విస్తృతంగా నిర్వహించిన తనిఖీల్లో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. చిట్‌ఫండ్ చట్టానికి విరుద్ధంగా చందాదారుల సొమ్మును మ్యూచువల్ ఫండ్స్, షేర్ మార్కెట్లలో పెట్టుబడులుగా పెట్టడం, ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరిస్తున్నట్లు ఆధారాలతో సహా వెల్లడైంది. ఈ నేపథ్యంలో ఐపీసీ సెక్షన్లు 420, 409, 120 బి, 477 రెడ్‌విత్ 34, కేంద్ర చిట్‌ఫండ్స్ చట్టం–1982, ఆర్థిక సంస్థల రాష్ట్ర డిపాజిట్‌దారుల హక్కుల పరిరక్షణ చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసులో సీఐడీ అధికారులు నలుగురు మార్గదర్శి చిట్‌ఫండ్స్ మేనేజర్లను అరెస్టు చేశారు. అదో ఆర్థిక నేర సామ్రాజ్యం... మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో చందాదారుల సొమ్మును చట్ట విరుద్ధంగా మళ్లించడం ద్వారా రామోజీరావు యథేచ్ఛగా ఆర్థిక నేరాలకు పాల్పడ్డారు. కేంద్ర ప్రభుత్వ చిట్‌ఫండ్స్ చట్టం–1982, రిజర్వ్‌బ్యాంకు చట్టం, ఏపీ ఆర్థిక సంస్థల డిపాజిట్‌దారుల హక్కుల పరిరక్షణ చట్టాలను ఉల్లంఘించారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థ బ్రాంచి కార్యాలయాల్లో స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ గత ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో, హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో డిసెంబరులో నిర్వహించిన సోదాలతో ఈ అక్రమాల బాగోతం బట్టబయలైంది. సొమ్ములు రాష్ట్రంలోని చందాదారులవి కాగా ఆర్థిక ప్రయోజనాలు మాత్రం పొరుగు రాష్ట్రంలో మకాం వేసిన రామోజీరావువని వెల్లడైంది. రాష్ట్ర చందాదారుల కష్టార్జితానికి రక్షణ లేదని గుర్తించిన స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ దీనిపై సీఐడీకి ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో విశాఖపట్నం, రాజమహేంద్రవరం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, అనంతపురంలోని మార్గదర్శి చిట్ ఫండ్స్ కార్యాలయాల్లో సీఐడీ నిర్వహించిన సోదాల్లో మరిన్ని అక్రమాలు బయటపడ్డాయి. మరోవైపు స్టాంపులు– రిజిస్ట్రేషన్ల శాఖ ప్రత్యేకంగా ఓ చార్టెడ్ అకౌంటెంట్ ద్వారా మార్గదర్శి చిట్ ఫండ్స్ ఆర్థిక నివేదిక (ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్)లను పరిశీలించగా పలు అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఎంతోమంది చందాదారులు తాము మోసపోయినట్లు సీఐడీకి ఫిర్యాదులు చేస్తున్నారు. మనీలాండరింగ్‌కు పాల్పడి¯] ట్లు తేలడంతో ఈ అంశంపై దర్యాప్తు చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కు సీఐడీ నివేదించింది. మార్గదర్శిలో గుర్తించిన అక్రమాలు ఇవీ.. అక్రమ డిపాజిట్లు.. రిజర్వ్ బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమ డిపాజిట్లను సేకరిస్తోంది. చందాదారులు పాడిన చిట్ మొత్తాన్ని వారికి వెంటనే చెల్లించడం లేదు. ఆ మొత్తంపై 4 శాతం నుంచి 5 శాతం వరకు చందాదారుడికి వడ్డీ చెల్లిస్తామని చెబుతూ ఓ రశీదు ఇస్తున్నారు. అంటే మార్గదర్శి సంస్థ ఆ చిట్ మొత్తాన్ని డిపాజిట్‌గా స్వీకరిస్తున్నట్టే. చిట్‌ఫండ్ కంపెనీలు డిపాజిట్లు స్వీకరించడాన్ని చట్టం నిషేధించింది. అయినప్పటికీ మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా ‘ ప్రత్యేక రశీదు’ ముసుగులో డిపాజిట్లు సేకరించింది. గతంలో కూడా మార్గదర్శి ఫైనాన్షియర్స్ పేరిట రూ.15 వేల కోట్ల అక్రమ డిపాజిట్లు సేకరించిన చరిత్ర రామోజీరావుది. అదే తరహాలో ప్రస్తుతం మార్గదర్శి చిట్‌ఫండ్స్ ముసుగులో అక్రమ డిపాజిట్లు సేకరిస్తున్నారు. నిధుల మళ్లింపు.. అక్రమ పెట్టుబడులు చిట్‌ఫండ్ చట్టానికి విరుద్ధంగా రామోజీరావు చందాదారుల సొమ్మును అక్రమ పెట్టుబడులకు మళ్లించారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ కార్యాలయాల నుంచి భారీగా నిధులను మార్గదర్శి ప్రధాన కార్యాలయానికి బదిలీ చేశారు. ఆ నిధులను మార్గదర్శి యాజమాన్యం మార్కెట్ రిస్క్ అత్యధికంగా ఉండే మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడిగా పెట్టింది. మార్గదర్శి చిట్స్ ప్రైవేట్ లిమిటెడ్–చెన్నై, మార్గదర్శి చిట్స్ (కర్ణాటక) ప్రైవేట్ లిమిటెడ్–బెంగళూరు, ఉషాకిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్– హైదరాబాద్‌లను అనుబంధ కంపెనీలుగా చూపిస్తూ నిధులను అక్రమంగా మళ్లించారు. ఆ మూడు అనుబంధ కంపెనీల్లో రూ.1,05,80,000 పెట్టుబడి పెట్టినట్టు బ్యాలెన్స్ షీట్లో చూపించారు. అయితే ఆ కంపెనీల షేర్ హోల్డర్స్ జాబితా పరిశీలించగా ఒక్క ఉషా కిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్‌లోనే 88.5 శాతం వాటాతో రూ.2 కోట్లు పెయిడ్ అప్ క్యాపిటల్‌గా పెట్టుబడి పెట్టినట్లు నిర్ధారణ అయ్యింది. బ్యాలన్స్ షీట్లో నోట్ నంబర్ 7 కింద రూ.459.98 కోట్లు చూపించారు. అయితే ఆ మొత్తాన్ని నిబంధనలకు విరుద్ధంగా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టినట్టు పరిశీలనలో వెల్లడైంది. అందుబాటులో ఉన్న కొన్ని బ్యాంకు ఖాతాలను పరిశీలించగా ఐసీఐసీఐ ప్రుడెని్షయల్ మ్యూచువల్ ఫండ్స్‌లో మూడుసార్లు రూ.29 కోట్లు, రూ.10 కోట్లు, రూ.8 కోట్లు చొప్పున, ఎడెల్‌వైసీస్ ఆర్బిట్రేడ్ ఫండ్స్‌లో రూ.10 కోట్లు చొప్పున నిబంధనలకు విరుద్ధంగా పెట్టుబడులు పెట్టినట్లు వెల్లడైంది. పూర్తి బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తే ఇంకా ఎన్ని పెట్టుబడులు పెట్టారో తెలుస్తుంది. పోంజీ తరహా మోసం.. రామోజీరావు పోంజీ (గొలుసుకట్టు) తరహా మోసాలకు పాల్పడుతున్నారు. మార్గదర్శి సంస్థ చిట్టీలలో 30 శాతం నుంచి 40 శాతం టికెట్లు (సభ్యత్వాలు) యాజమాన్యం పేరిట ఉంచు తోంది. ఆ టికెట్లకు చెల్లించాల్సిన చందాలను చెల్లించడం లేదు. ఇతర చందాదారులు చెల్లించిన చందాలను తాము చెల్లించినట్లు రికార్డుల్లో చూపిస్తోంది. వాటిపై మళ్లీ 5 శాతం కమీషన్ తీసుకుంటోంది. చందాదారుల సొమ్మును వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకుంటోంది. చందాదారుల హక్కులకు విఘాతం రాష్ట్రంలో మార్గదర్శి చిట్‌ఫండ్స్ తమ బ్రాంచిల్లో చందాదారులు చెల్లించిన మొత్తాలను నిబంధనలకు విరుద్ధంగా పక్క రాష్ట్రానికి తరలించింది. మార్గదర్శి చిట్ ఫండ్స్ మేనేజర్లకు (ఫోర్మేన్) చట్టప్రకారం ఉండాల్సిన చెక్ పవర్‌తో సహా ఎలాంటి అధికారాలు లేవు. బ్యాంకు వ్యవహారాలు, చెక్ పవర్ అంతా హైదరాబాద్‌లోని మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎండీ శైలజతోపాటు ఆ సంస్థ ప్రధాన కార్యాలయంలోని 11 మందికే ఉంది. రాష్ట్రంలో చందాదారులు చెల్లించిన మొత్తానికి బాధ్యులెవరని ప్రశ్నిస్తే సమాధానమే లేదు. -
ఈడీ దృష్టికి మార్గదర్శి అక్రమాలు!
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎంసీఎఫ్ఎల్) అక్రమాలపై దర్యాప్తు జరుపుతున్న సీఐడీ విభాగం కీలక నిర్ణయం తీసుకుంది. నిధులను దారి మళ్లించి చందాదారుల ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్న మార్గదర్శిపై కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలతోపాటు ఇతర రాష్ట్రాల సీఐడీ, రిజిస్ట్రేషన్ల శాఖలు కూడా విచారణ జరపాలని నివేదించింది. ఈమేరకు కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఆదాయపన్ను శాఖ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ పరిధిలోని ‘తీవ్రమైన ఆర్థిక నేరాల పరిశోధన విభాగం’(ఎస్ఎఫ్ఐవో)తోపాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకల సీఐడీ, స్టాంపులు–రిజిస్ట్రేషన్ల విభాగాలకు ఫిర్యాదు చేసింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్ పలు రాష్ట్రాల్లో వ్యాపారం నిర్వహిస్తూ యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతుండటంతో చందాదారుల ప్రయోజనాల పరిరక్షణ కోసం సీఐడీ విభాగం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మార్గదర్శి చిట్‌ఫండ్స్ కార్యాలయాల్లో నిర్వహించిన సోదాల్లో తాము గుర్తించిన అక్రమాలు, అవకతవకలను వివరిస్తూ రూపొందించిన నివేదికను సీఐడీ అధికారులు జత చేశారు. కేవలం పోలీసు శాఖ మాత్రమే కాకుండా ఈడీ, ఆదాయపన్ను, కార్పొరేట్ వ్యవహారాల శాఖలు, ఇతర రాష్ట్రాల సీఐడీ విభాగాలు దర్యాప్తు జరపాల్సినంత తీవ్రమైన నేరాలకు మార్గదర్శి చిట్‌ఫండ్స్ పాల్పడిందని అందులో స్పష్టం చేశారు. సీఐడీ నివేదికలో ముఖ్యాంశాలు ఇవీ.. ♦ మార్గదర్శి చిట్స్ నిధులను అక్రమంగా బదిలీ చేస్తూ మనీలాండరింగ్‌కు పాల్పడుతోంది. ♦ చందాదారులకు చెల్లించాల్సిన డబ్బులను మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఇవ్వకుండా రూ.కోట్లలో బకాయిలు పెడుతోంది. ♦ చిట్‌ఫండ్స్ చట్టం ప్రకారం బ్యాంకు ఖాతాలు, ఇతర రికార్డుల నిర్వహణలో నిబంధనలను ఉల్లంఘిస్తోంది. ♦ చందాదారులకు చిట్ మొత్తం చెల్లించకుండా అక్రమ డిపాజిట్లు సేకరిస్తోంది. ఇది రిజర్వ్ బ్యాంకు నిబంధనలకు విరుద్ధం. ♦ చందాదారుల సొమ్మును అక్రమంగా బదిలీ చేస్తూ ఇతర సంస్థల్లో పెట్టుబడులు పెడుతోంది. ♦ ఆదాయపన్ను చట్టాలను ఉల్లంఘిస్తూ చందాదారుల నుంచి పరిమితికి మించి భారీ మొత్తంలో నగదు వసూళ్లకు పాల్పడుతోంది. ♦ చెల్లింపులపై టీడీఎస్ చెల్లించడం లేదు. -
మార్గదర్శి అక్రమాలపై ఈడీకి సీఐడీ ఫిర్యాదు!
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్ ఫండ్ అక్రమాలపై సీఐడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు సీఐడీ ఫిర్యాదు చేసింది. విచారణలో సీఐడీ గుర్తించిన అక్రమాలపై కీలక వివరాలు వెల్లడించింది. మార్గదర్శి అక్రమాల కేసులో ఏపీ సీఐడీ విచారణ చేపట్టింది. కాగా, విచారణలో మార్గదర్శి అక్రమాలు బయటపడ్డాయి. మార్గదర్శిలో నిధుల మళ్లింపు, చట్ట వ్యతిరేక స్కీముల నిర్వహణ. సబ్స్క్రిప్షన్ నిధులు చెల్లించకపోవడాన్ని సీఐడీ గుర్తించింది. వడ్డీలిస్తామని డిపాజిట్లు సేకరించడం, అక్రమంగా నిధుల మళ్లింపులను బయట్టపెట్టింది. దీంతో, మార్గదర్శి అక్రమాలపై ఈడీకి సీఐడీ లేఖ రాసింది. ఈ మేరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి ఏపీ సీఐడీ సమాచారం పంపించింది. దీంతో, అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కోరింది. సీఐడీ గుర్తించినవి ఇవే.. - మార్గదర్శిలో చట్ట వ్యతిరేక ఆర్థిక లావాదేవీలను గుర్తించారు. - ఖాతాదారులకు రూ.కోట్లలో బకాయిలు - బ్యాంకు అకౌంట్ల నిర్వహణలో అక్రమాలు జరిగినట్టు గుర్తించారు. - చిట్ ఫండ్ ఖాతాదారుల నుంచి అక్రమ డిపాజిట్లు - ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్‌కు విరుద్దంగా నగదు లావాదేవీలు. -
‘మార్గదర్శి’ అక్రమాలు: ఇదో పోంజీ తరహా స్కామ్.. చందాదారుల సొమ్ముతో దందా!
సాక్షి, అమరావతి: మార్గదర్శి యాజమాన్యం చందాదారుల డబ్బులను నిబంధనలకు విరుద్ధంగా మళ్లించినట్లు తమ తనిఖీల్లో వెల్లడైందని సీఐడీ అదనపు డీజీ సంజయ్, స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ వి.రామకృష్ణ వెల్లడించారు. చట్ట ప్రకారం చిట్‌ఫండ్ సంస్థల వ్యవహారాలను పర్యవేక్షించే చిట్స్ రిజిస్ట్రార్‌కు మార్గదర్శి యాజమాన్యం సహకరించడం లేదని తెలిపారు. చందాదారుల ప్రయోజనాలను పరిరక్షించడం తమ బాధ్యతని, ఇదే ధోరణి కొనసాగితే మార్గదర్శి చిట్‌ఫండ్స్‌పై కఠిన చర్యలకు సైతం వెనుకాడబోమన్నారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో నిధుల దుర్వినియోగం, మోసం, చట్ట ఉల్లంఘనలకు సంబంధించి తాము నమోదు చేసిన కేసులో ప్రాథమిక ఆధారాలున్నట్లు న్యాయస్థానం కూడా రిమాండ్‌కు అనుమతిస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొందని గుర్తు చేశారు. “మన రాష్ట్రంలో చందాదారుల సొమ్మును ఇతర రాష్ట్రాలకు అక్రమంగా బదిలీ చేస్తున్నారు. అందుకు ఇక్కడ బాధ్యులు ఉండరు. ఇతర రాష్ట్రాల్లో అడిగితే మీకు సంబంధం లేదంటున్నారు. అంటే చందాదారులు చెల్లిస్తున్న సొమ్ముకు ఎలాంటి భద్రతా లేదు’ అని పేర్కొన్నారు. సోమవారం వెలగపూడిలోని సచివాలయంలో వారు సంయుక్తంగా విలేకరులతో మాట్లాడుతూ మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాలను వివరించారు. చిట్‌ఫండ్ చట్టం సామాజిక, ఆర్థికపరమైన చట్టమని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టం చేసింది. చందాదారుల హక్కుల పరిరక్షణ, చిట్‌ఫండ్ కంపెనీల్లో ఆర్థిక క్రమశిక్షణ కోసమే ఈ చట్టం చేశారని పేర్కొంది. చిట్‌ఫండ్స్ చట్టం–1982 ప్రకారం చిట్‌ఫండ్ కంపెనీ బ్రాంచిలోని మేనేజర్ (ఫోర్మేన్) చందాదారులు చెల్లించే సొమ్ముకు పరిరక్షకుడు. చిట్స్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ పర్యవేక్షకుడు. బ్యాంక్ లావాదేవీల నిర్వహణ, నిధుల చెల్లింపులన్నీ ఫోర్మేన్ నిర్వహించాలి. రాష్ట్రంలో మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు ఉన్న 37 బ్రాంచీల్లో ఏడు బ్రాంచిల్లో తనిఖీలు చేశాం. చందాదారులు చెల్లించిన మొత్తం అక్కడి బ్యాంకుల్లో లేదన్న విషయం అందులో వెల్లడైంది. ఆ సొమ్మంతా నిబంధనలకు విరుద్ధంగా పక్క రాష్ట్రానికి తరలించేశారు. మార్గదర్శి ఫోర్‌మేన్‌కు చట్ట ప్రకారం ఉండాల్సిన చెక్ పవర్‌తోసహా ఎలాంటి అధికారాలు లేవు. బ్యాంకు వ్యవహారాలు, చెక్ పవర్ అంతా హైదరాబాద్‌లోని మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎండీ శైలజతోపాటు ఆ సంస్థ ప్రధాన కార్యాలయంలోని 11 మందికే ఉంది. ఇక్కడున్న చందాదారుల సొమ్ముల భద్రత గురించి అడిగితే తనకు తెలియదని ఫోర్‌మెన్ చెబుతున్నారు. హైదరాబాద్ వెళ్లి అడిగితే తెలంగాణలో ఉన్న ప్రధాన కార్యాలయం ఏపీ అధికారుల పరిధిలోది కాదంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చందాదారులు చెల్లిస్తున్న డబ్బులకు బాధ్యులెవరని ప్రశ్నిస్తే సమాధానమే లేదు. సొమ్ము రాష్ట్ర ప్రజలది...పెత్తనం పక్క రాష్ట్రంలో వారిది. మార్గదర్శి చిట్‌ఫండ్స్ చందాదారులకు చెందిన సొమ్ములను నిబంధనలకు విరుద్ధంగా మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్, తమ అనుబంధ కంపెనీల్లో పెట్టుబడులుగా పెట్టారు. ఆ సంస్థ బ్యాలన్స్ షీట్, కొన్ని బ్యాంకు ఖాతాలను చారెŠట్‌డ్ అకౌంటెంట్ ద్వారా పరిశీలిస్తే ఈ విషయాలు బయటపడ్డాయి. అందుబాటులో ఉన్న కొన్ని బ్యాంకు ఖాతాలను పరిశీలించగా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్స్‌లో మూడుసార్లు రూ.29 కోట్లు, రూ.10 కోట్లు, రూ.8 కోట్లు చొప్పున, ఎడెల్‌వైసీస్ ఆర్బిట్రేడ్ ఫండ్స్‌లో రూ.10 కోట్లు చొప్పున నిబంధనలకు విరుద్ధంగా పెట్టుబడులు పెట్టినట్లు వెల్లడైంది. పూర్తి బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తే ఇంకా ఎన్ని పెట్టుబడులు పెట్టారో తెలుస్తుంది. విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరులో మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఫోర్మెన్లను అరెస్టు చేసి న్యాయస్థానంలో ప్రవేశపెట్టాం. గుంటూరు మినహా మిగతా మూడు చోట్లా న్యాయస్థానాలు నిందితులకు రిమాండ్ విధించాయి. నిందితులపై సీఐడీ మోపిన అభియోగాలకు సంబంధించి ప్రాథమిక ఆధారాలున్నాయని రిమాండ్‌కు అనుమతిస్తూ న్యాయస్థానాలు స్పష్టం చేశాయి. సీఐడీ కేసు డైరీలో పేర్కొన్న అంశాలతో తాము సంతృప్తి చెందినట్లు, వారిని అరెస్టు చేయడం సరైనదేనని పేర్కొన్నాయి. మార్గదర్శి యాజమాన్యం నిధులను అక్రమంగా బదిలీ చేస్తూ, చిట్స్ రిజిస్ట్రార్‌కు సహాయ నిరాకరణ కొనసాగిస్తే చందాదారుల ప్రయోజనాల పరిరక్షణ కోసం తీవ్రమైన చర్యలు తీసుకుంటాం. ఇతర రాష్ట్రాల్లో ఏం చేస్తున్నారన్న అంశంతో మాకు నిమిత్తం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు, చందాదారుల సొమ్ముకు భద్రత కల్పించడమే మా విధి. ఈ కేసులో విచారణ కొనసాగిస్తాం. కేసు దర్యాప్తులో పురోగతికి అనుగుణంగా ఏ–1 చెరుకూరి రామోజీరావు, ఏ–2 చెరుకూరి శైలజను కూడా విచారించడంతోపాటు ఇతర చర్యలను తగిన సమయంలో తీసుకుంటాం. ఇదో.. పోంజీ తరహా స్కామ్ మార్గదర్శి చిట్‌ఫండ్స్ యాజమాన్యం పోంజీ స్కామ్ తరహా అక్రమాలకు పాల్పడుతోంది. చిట్టీలలో 30 శాతం నుంచి 40 శాతం టికెట్లు (సభ్యత్వాలు) యాజమాన్యం పేరిట ఉంచుతోంది. ఆ టికెట్లకు చెల్లించాల్సిన చందాలను చెల్లించడం లేదు. ఇతర చందాదారులు చెల్లించిన చందాలను తాము చెల్లించినట్లు రికార్డుల్లో చూపిస్తోంది. వాటిపై మళ్లీ 5 శాతం కమీషన్ తీసుకుంటోంది. చందాదారుల సొమ్మును వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకుంటోంది. రూ.15 వేల కోట్ల అక్రమ డిపాజిట్ల సేకరణ మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమ డిపాజిట్లు సేకరిస్తోంది. చిట్‌ఫండ్ కంపెనీలు డిపాజిట్లు సేకరించడం చట్ట విరుద్ధం. మార్గదర్శి ఫైనాన్సియర్స్ పేరిట అక్రమ డిపాజిట్లు సేకరించిన చరిత్ర మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు ఉంది. గతంలో అక్రమంగా సేకరించిన రూ.15 వేల కోట్ల డిపాజిట్లపై ఆదాయపన్ను చెల్లించాలని ఐటీ శాఖ నోటీసులు కూడా ఇచ్చింది. చదవండి: ఆడియో మార్చి అభాండాలా..? చందాదారుల నుంచి ఫిర్యాదులు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటిస్తూ చిట్‌ఫండ్ చట్టం, ఇతర చట్టాలను అనుసరించి మార్గదర్శిపై స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ ఫిర్యాదుతో సీఐడీ కేసు నమోదు చేసింది. ఒక్క చిట్‌ఫండ్ చట్టమే కాకుండా ఇతర చట్టాలను కూడా ఉల్లంఘించారు. సీఐడీ కేసు నమోదు చేయగానే పలువురు చందాదారులు తాము మోసపోయామని, తమకు డబ్బులు ఇవ్వడం లేదని ఫిర్యాదులు చేసేందుకు ముందుకొస్తున్నారు. ఈ రెండు రోజుల్లోనే 8 మంది చందాదారులు ఫిర్యాదు చేశారు. ఓ చందాదారుడు తనకు ఇవ్వాల్సిన రూ.10 లక్షలను ఆర్నెల్లుగా ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశారు. -
మార్గదర్శి ఛైర్మన్ రామోజీరావుపై సీఐడీ కేసు నమోదు
సాక్షి, విజయవాడ: మార్గదర్శి ఛైర్మన్ చెరుకూరి రామోజీరావుపై సీఐడీ కేసు నమోదు చేసింది. మార్గదర్శి ఎండీ చెరుకూరి శైలజ, సంబంధిత బ్రాంచ్ మేనేజర్లపై కూడా సీఐడీ కేసు నమోదు చేసింది. సెక్షన్ 120బి, 409, 420,477(ఏ) రెడ్ విత్ 34 ఆఫ్ ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదైంది. సెక్షన్ 5, ఏపీ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్ ఇన్ ఫైనాన్షియర్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం కింద కేసు నమోదు చేసింది. ఏ1 నిందితుడిగా చెరుకూరి రామోజీరావు, ఏ2గా చెరుకూరి శైలజ, ఏ3గా సంబంధిత బ్రాంచ్ మేనేజర్లను సీఐడీ పేర్కొంది. 1982 చిట్‌ఫండ్ చట్టం ప్రకారం కేసు నమోదైంది. విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, విజయవాడ, గుంటూరు, పల్నాడు, కర్నూలు, అనంతపురం చిట్స్ అసిస్టెంట్ రిజిస్ట్రార్లు సీఐడీకి ఫిర్యాదు చేశారు. అసిస్టెంట్ రిజిస్ట్రార్ల ఫిర్యాదు మేరకు సీఐడీ కేసు నమోదు చేసింది. నరసరావుపేట, ఏలూరు, అనంతపురం బ్రాంచ్‌ల మార్గదర్శి ఫోర్మెన్లు పరారీలో ఉన్నారు. విశాఖ, రాజమండ్రి, ఏలూరు, గుంటూరులో సీఐడీ సోదాలు నిర్వహించింది. ఫోర్మెన్లను విచారించిన సీఐడీ.. వారి వాంగ్మూలం నమోదు చేసింది. చిట్ ఫండ్ నిధులు, మ్యూచువల్ ఫండ్‌ను స్పెక్యులేటివ్ మార్కెట్‌కి మార్గదర్శి మళ్లించింది. మార్గదర్శిలో పెద్ద ఎత్తున అక్రమాలను ఆడిటింగ్‌లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ గుర్తించింది. చదవండి: నల్లధనం చేర్చింది ఆ నలుగురే.. సింగపూర్ రూటులో ‘స్కిల్’ లూటీ! -
ఏపీ: మార్గదర్శి మేనేజర్లు, అధికారుల ఇళ్లలో సీఐడీ సోదాలు
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్ కంపెనీ నిధుల మళ్లింపు వ్యవహారంలో ఏపీ వ్యాప్తంగా సీఐడీ తనిఖీలు చేపట్టింది. మార్గదర్శి మేనేజర్లు, కీలక అధికారుల ఇళ్లలోనూ సీఐడీ సోదాలు జరిపింది. కాగా, చిట్‌ఫండ్ చట్టాన్ని ఉల్లంఘించి ఖాతాదారుల సొమ్ము మళ్లింపు, నిబంధనల ఉల్లంఘనలపై ఆరోపణల నేపథ్యంలో సీఐడీ అధికారులు శనివారం ఉదయం నుంచి తనిఖీలు నిర్వహించారు. విజయవాడ మార్గదర్శి మెయిన్ బ్రాంచ్‌లో మేనేజర్ శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని సీఐడీ అధికారులు విచారించారు. ఇక, గతంలోనూ సీఐడీ, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు తనిఖీలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే, నిధుల మళ్లింపుపై సీఐడీకి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో సీఐడీకి అందిన ఫిర్యాదు మేరకు అధికారులు రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేశారు. -
గంటా సుబ్బారావుకు షరతులతో బెయిల్
సాక్షి, అమరావతి: ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) నిధుల కుంభకోణం కేసులో అరెస్టయిన ఆ సంస్థ మాజీ ఎండీ గంటా సుబ్బారావుకు హైకోర్టు సోమవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.2 లక్షల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలంది. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుంచి 1 గంట లోపు సీఐడీ అధికారుల ముందు హాజరు కావాలని సుబ్బారావును ఆదేశించింది. ప్రశ్నించాలనుకుంటే ఆయనకు 24 గంటల ముందు నోటీసు ఇవ్వాలని సీఐడీకి సూచించింది. ఏపీఎస్ఎస్డీసీ తరఫున సీమెన్స్–డిజైన్ టెక్‌తో ఒప్పందం కుదుర్చుకున్న అధికారులను ఎందుకు ప్రశ్నించలేదని ప్రశ్నించింది. ఆ అధికారులను ఎందుకు నిందితులుగా చేర్చలేదో, వారి పాత్ర గురించి ప్రాథమిక దర్యాప్తు ఎందుకు చేయలేదో తెలియజేస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి 3కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ దొనడి రమేశ్ ఉత్తర్వులు జారీ చేశారు. డిజైన్ టెక్ ఓ షెల్ కంపెనీ.. ఏపీఎస్ఎస్డీసీలో జరిగిన రూ.241 కోట్ల కుంభకోణంలో ప్రధాన నిందితుడైన గంటా సుబ్బారావు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ దొనడి రమేశ్ సోమవారం మరోసారి విచారణ జరిపారు. ఈ సందర్భంగా సీఐడీ తరఫు న్యాయవాది టీఎంకే చైతన్య వాదనలు వినిపిస్తూ.. ఈ కుంభకోణంపై రెండు నెలల పాటు ప్రాథమిక దర్యాప్తు చేశామని చెప్పారు. ఏపీఎస్ఎస్డీసీ తరఫున సీమెన్స్–డిజైన్ టెక్‌తో ఒప్పందం, ప్రాజెక్టు ప్రతిపాదనలు సిద్ధం చేసింది గంటా సుబ్బారావేనని తెలిపారు. డిజైన్ టెక్ ఓ షెల్ కంపెనీ అని, నిధుల మళ్లింపునకు ఈ కంపెనీని వాడుకున్నారని వివరించారు. ఎండీగా సుబ్బారావును తప్పించి ఆయన స్థానంలో ప్రేమచంద్రారెడ్డిని తెచ్చారన్నారు. ఆయన ద్వారా ఆ కంపెనీలకు చెల్లింపులు చేయించి, ఆ పని పూర్తి కాగానే తిరిగి సుబ్బారావును ఎండీగా నియమించారని తెలిపారు. ఇదంతా ముందస్తు కుట్రలో భాగంగానే జరిగిందన్నారు. ప్రేమచంద్రారెడ్డికి సీఆర్పీసీ సెక్షన్ 160 కింద నోటీసు ఇచ్చామన్నారు. ఈ సమయంలో న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ జోక్యం చేసుకుంటూ.. ఈ మొత్తం ప్రాజెక్టులో పలువురు ఐఏఎస్ అధికారులు కూడా పాలుపంచుకున్నారని, వారందరినీ ఎందుకు ప్రశ్నించలేదన్నారు. ఇది కుంభకోణం కాదని తాము చెప్పడం లేదన్నారు. ప్రస్తుతానికి మిగిలిన అధికారుల పాత్రపై ఎలాంటి ఆధారాలు లభించలేదని, ఆధారాలు లభించినప్పుడు వారిపై తప్పకుండా చర్యలు ఉంటాయని చైతన్య చెప్పారు. సుబ్బారావు తరఫు సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ.. ఎండీ, చైర్మన్‌గా ప్రతిపాదనలు సిద్ధం చేశారన్న ఆరోపణలు తప్ప సుబ్బారావుపై ఎలాంటి ఆరోపణలు లేవన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. సుబ్బారావుకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చారు. -
‘స్కిల్’గా కొల్లగొట్టారు
సాక్షి, అమరావతి: ‘రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణంలో వ్యవహారమంతా గంటా సుబ్బారావే నడిపారు. ఒకేసారి మూడు కీలక స్థానాల్లో ఆయనే ఉన్నారు. షెల్ కంపెనీల ముసుగులో కొల్లగొట్టిన రూ.241 కోట్లు ఏ పెద్దలకు చేరాయో ఆయనకే తెలుసు. ఆ పెద్దలను కాపాడేందుకే ఏకంగా ఆ కాంట్రాక్ట్ నోట్ ఫైళ్లనే మాయం చేశారు’ అని సీఐడీ స్పష్టం చేసింది. ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణంలో ప్రధాన నిందితుడు గంటా సుబ్బారావుకు సంబంధించి కొత్త విషయాలను వెల్లడించింది. ఆయన పాత్రపై న్యాయస్థానానికి సమర్పించిన అఫిడవిట్లో సీఐడీ ఏం చెప్పిందంటే.. నిధులు కొల్లగొట్టేందుకే ఆ ప్రాజెక్ట్ ప్రజాధనాన్ని షెల్ కంపెనీల ముసుగులో కొల్లగొట్టేందుకు లోపభూయిష్టంగా ఏపీఎస్ఎస్డీసీ కాంట్రాక్ట్‌ను గంటా సుబ్బారావు రూపొందించారు. రూ.3,556 కోట్లు అని పేర్కొన్న ఆ ప్రాజెక్ట్ వ్యయాన్ని మదింపు చేసేందుకు ఎలాంటి శాస్త్రీయ విధానాలను పాటించలేదు. కేవలం సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలు ఇచ్చిన ఓ ‘పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ (పీపీటీ) ఆధారంగా ఏకంగా రూ.3,556 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్ట్‌ను కుట్రపూరితంగా ఆమోదించారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోకు విరుద్ధంగా ఆ రెండు సంస్థలతో ఆయన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఉద్దేశపూర్వకంగానే సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థల వాటాను ఎలా నిర్ధారించిందనే విషయాన్ని ఆయన పేర్కొనకుండా దాటవేశారు. ప్రభుత్వం నుంచి అనుమతి పత్రం లేకుండానే ఒప్పందం కుదుర్చుకున్నారు. బ్యాంక్ గ్యారెంటీ లేకుండానే రూ.371 కోట్లు చెల్లింపు సంబంధిత ప్రాజెక్టు పూర్తి కాకుండానే ఆ రెండు సంస్థలకు ప్రభుత్వం పన్నులతో సహా చెల్లించాల్సిన రూ.371 కోట్లను గంటా సుబ్బారావు చెల్లించేశారు. కనీసం దానికి ముందు ఆ రెండు సంస్థలు వెచ్చించాల్సిన 90 శాతం నిధులకు సంబంధించి బ్యాంక్ గ్యారెంటీ కూడా ఉద్దేశపూర్వకంగానే తీసుకోలేదు. బ్యాంక్ గ్యారంటీ తీసుకుని ఉంటే ఆ సంస్థలు ప్రాజెక్ట్ పూర్తిచేయకపోతే ఆ మేరకు నిధులను ప్రభుత్వం రికవరీ చేసే అవకాశం ఉండేది. ఆ రెండు కంపెనీల నుంచి లిఖితపూర్వకంగా కూడా ఎలాంటి హామీ తీసుకోకుండా షెల్ కంపెనీలకు ఆయన అడ్డదారిలో ప్రయోజనం కలిగించారు. ఈ ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చిందనేది టెక్నాలజీ పార్టనర్స్ నుంచి వివరాలు తెలుసుకోలేదు కూడా. పరస్పర విరుద్ధ ప్రయోజనాలు ఏపీఎస్ఎస్డీసీ నిధులు కొల్లగొట్టేందుకు అప్పటి టీడీపీ ప్రభుత్వ పెద్దలు మరో అడ్డగోలు నిర్ణయం తీసుకున్నారు. ఏపీఎస్ఎస్డీసీ డిప్యూటీ సీఈవోగా ఐఏఎస్ అధికారి ఉపాధ్యాయుల అపర్ణను నియమించారు. ఏపీఎస్ఎస్డీసీతో కాంట్రాక్ట్ కుదుర్చుకున్న సీమెన్స్ సంస్థ కమిటీలో సభ్యుడైన జీవీఎస్ భాస్కర్ సతీమణి ఆమె. ఆ విషయాన్ని వెల్లడించకుండా ఆమెను డిప్యూటీ సీఈవోగా నియమించడం అఖిల భారత సర్వీసు నిబంధనలకు విరుద్ధం. తద్వారా షెల్ కంపెనీలకు పరస్పర విరుద్ధ ప్రయోజనాలు కల్పించారు. ఫైళ్లూ మాయం కేంద్ర జీఎస్టీ అధికారులు ఏపీఎస్ఎస్డీసీలో కుంభకోణం గురించి 2018లో సమాచారం ఇవ్వగానే సంబంధిత నోట్ ఫైళ్లు మాయమయ్యాయి. ఏపీఎస్ఎస్డీసీ సీఈవోతోపాటు స్పెషల్ సెక్రటరీగా కూడా ఉన్న గంటా సుబ్బారావే జీవో నంబర్ 4, సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలతో ఒప్పందం కోసం జీవో నంబర్ 5, రెండు కమిటీల ఏర్పాటు కోసం జీవో నంబర్ 8కు సంబంధించి నోట్ ఫైళ్లను రూపొందించారు. దీనిపై ఓఎస్డీ నిమ్మగడ్డ వెంకట కృష్ణప్రసాద్‌కు ఆయన ఓ లేఖ రాశారు. ఆ జీవోల నోట్ ఫైళ్లు, గంటా సుబ్బారావు రాసిన లేఖలు గల్లంతు కావడం వెనుక ఆయన హస్తం ఉంది. అంతేకాదు షెల్ కంపెనీలు ఇచ్చిన నకిలీ ఇన్వాయిస్ల ఆధారంగా రూ.371 కోట్లు చెల్లించేశారు. ఆ నిధులు ఎవరికి వెళ్లాయన్నది గంటా సుబ్బారావుకే పూర్తిగా తెలుసు. కాబట్టి ఏపీఎస్ఎస్డీసీ నిధులు దారి మళ్లించిన కేసులో గంటా సుబ్బారావు పాత్ర అత్యంత కీలకం. -
'టెరాసాఫ్ట్' మమ్మల్నీ మోసగించింది
సాక్షి, అమరావతి: ‘ఫైబర్ గ్రిడ్ల టెండర్లలో టెరాసాఫ్ట్ కంపెనీ ప్రభుత్వాన్నే కాదు కన్సార్టియం ఒప్పందాన్ని ఉల్లంఘించి మా కంపెనీని కూడా మోసం చేసింది’ అని హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ అనిల్ కె.జైన్ పేర్కొన్నారు. ‘సాక్షి’తో ఆయన మాట్లాడుతూ.. టెండర్లు దక్కించుకోవడం కోసం తమను కన్సార్టియంలో భాగస్వామిని చేసుకుని అనంతరం మోసం చేశారని ఆయన చెప్పారు. ఫైబర్ నెట్ టెండర్ల కుంభకోణంపై సీఐడీ అధికారులు టెరాసాఫ్ట్ కంపెనీతోపాటు ఆ కంపెనీ కన్సార్టియంలో భాగస్వామి అయిన హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ కంపెనీతోపాటు అందుకు సహకరించిన అప్పటి టీడీపీ ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు, అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా.. టెరాసాఫ్ట్ కంపెనీ తమ కంపెనీని ఎలా మోసం చేసిందనేది అనిల్ కె.జైన్ మాటల్లోనే.. టెండర్ల కోసమే కన్సార్టియంలో భాగస్వామ్యం కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫైబర్ గ్రిడ్ టెండర్లలో పాల్గొనాలంటే కనీసం మూడు కంపెనీలు కన్సార్టియంగా ఏర్పడాలి. వాటిలో ఫైబర్‌గ్రిడ్ ప్రాజెక్టు కోసం ఆప్టికల్ ఫైబర్లు సరఫరా చేసే కంపెనీ కూడా ఉండాలి. ఆ రంగంలో టెరాసాఫ్ట్ కు అనుభవం లేదు. కాబట్టి మమ్మల్ని సంప్రదించి కన్సార్టియంలో భాగస్వామిగా చేర్చుకుని, టెరాసాఫ్ట్ ఒప్పందం కుదుర్చుకుంది. ఫైబర్ గ్రిడ్ మొదటి దశ పనుల కోసం పిలిచిన రూ.330 కోట్ల టెండర్లలో మా కంపెనీ రూ.134 కోట్ల విలువైన పనులు చేస్తుందని ఒప్పందంలో ఉంది. కానీ.. కేవలం బిడ్ దాఖలు చేయడానికి అర్హత సాధించేందుకే మాకు అవకాశం కల్పించారని ఆ తరువాత మేం గుర్తించాం. 20 శాతం పనులే ఇచ్చారు టెండర్లు దక్కిన తరువాత మమ్మల్ని పక్కనపెట్టేశారు. కన్సార్టియం ఒప్పందం ప్రకారం మేం రూ.134 కోట్ల విలువైన ఆప్టికల్ కేబుల్స్ వేయాల్సి ఉంది. కానీ మాతో కేవలం రూ.27 కోట్ల విలువైన పనులే చేయించారు. ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ రంగంలో మా కంపెనీకి మంచి పేరుంది. మేం నాణ్యమైన పరికరాలు సరఫరా చేస్తాం. కేంద్ర టెలికాం శాఖ ప్రమాణాల మేరకు ఉండే మా పరికరాల ధర కూడా కాస్త ఎక్కువే. టెండర్ల కోసం వేసిన బిడ్‌లో మా కంపెనీ సరఫరా చేసే పరికరాలనే వేస్తామని చెప్పిన టెరాసాఫ్ట్ కంపెనీ ఆ తరువాత ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. చిన్నచిన్న కంపెనీలు ఉత్పత్తి చేసే నాసిరకం కేబుళ్లు, ఇతర పరికరాలతో పనులు చేశారు. ఆ పరికరాలు చాలా తక్కువ ధరకు మార్కెట్లో లభిస్తాయి. అడ్డదారిలో లాభాలు ఆర్జించడానికే టెరాసాఫ్ట్ కంపెనీ ఇలా చేసింది. అందుకే మమ్మల్ని తప్పించింది. టెరాసాఫ్ట్ కంపెనీ సరఫరా చేసిన నాసిరకం పరికరాలతో మా కంపెనీకి ఎలాంటి సంబంధం లేదు. కన్సార్టియం ఒప్పందం ప్రకారం సరఫరా చేస్తామన్న పరికరాలకు మేం బాధ్యత వహిస్తాం. కానీ ఆ పరికరాలు కాకుండా టెరాసాఫ్ట్ కంపెనీ ఇతర కంపెనీల నుంచి నాసిరకం పరికరాలు కొనుగోలు చేసి పనులు చేసింది. వాటితో మాకెలాంటి సంబంధం లేదు. అప్పటి ప్రభుత్వ పెద్దలకు భయపడే మౌనంగా ఉన్నాం కన్సార్టియం ఒప్పందం మేరకు మా వాటా పని మాకు ఇవ్వాలని ఎన్నిసార్లు అడిగినా టెరాసాఫ్ట్ కంపెనీ యాజమాన్యం పట్టించుకోలేదు. అందుకోసం మేం పంపిన ఈ–మెయిల్స్ మా వద్ద ఉన్నాయి. కన్సార్టియం ఏర్పాటు చేసిన స్ఫూర్తికి విరుద్ధంగా టెరాసాఫ్ట్ కంపెనీ వ్యవహరించింది. దీనిపై అప్పట్లోనే గట్టిగా నిలదీయాలని భావించాం. కానీ.. అప్పటి ప్రభుత్వ పెద్దల అండదండలు టెరాసాఫ్ట్ కంపెనీకి ఉన్నాయని మాకు తెలుసు. టీడీపీ ప్రభుత్వంలో మంత్రులు, ఉన్నతాధికారులు అంతా ఆ కంపెనీకి అనుకూలంగా వ్యవహరించారన్నది బహిరంగ రహస్యం. అందుకే భయపడి ఏమీ చేయలేక మాకు అన్యాయం జరిగినా మౌనంగా ఉండిపోయాం. ఫైబర్ నెట్ టెండర్ల కుంభకోణంపై సీఐడీ కేసు పెట్టడాన్ని మేం స్వాగతిస్తున్నాం. ఇప్పటికైనా వాస్తవాలు బయటకు రావాలి. -
ఫేక్ సర్టిఫికెట్ కోసం బెదిరించడం నిజమే
సాక్షి, అమరావతి: ఫైబర్ నెట్ టెండర్ల కుంభకోణంపై విచారణలో సీఐడీ పోలీసులు కీలక పురోగతి సాధించారు. ప్రధానంగా టీడీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు సన్నిహితులకు చెందిన టెరాసాఫ్ట్ కంపెనీకి టెండర్లను ఏకపక్షంగా కట్టబెట్టేందుకు ఫోర్జరీ పత్రాలు సమర్పించారనే విషయంలో కీలక ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది. మొత్తం రూ.2 వేల కోట్ల విలువైన టెండర్ల కుంభకోణంలో మొదటి దశలో రూ.330 కోట్ల టెండర్లలో అవినీతిపై సీఐడీ ఇప్పటికే టెరాసాఫ్ట్ కంపెనీతో సహా 19 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో భాగంగా టీడీపీ ప్రభుత్వంలో ఇన్‌క్యాప్ ఎండీగా వ్యవహరించిన కె.సాంబశివరావు, ఇ–గవర్నెన్స్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు వేమూరి హరికృష్ణ ప్రసాద్ సీఐడీ అధికారుల వద్ద మంగళవారం విచారణకు హాజరయ్యారు. విజయవాడలోని సీఐడీ కార్యాలయంలో కె.సాంబశివరావును అధికారులు మొదట విచారించారు. రెండు దఫాలుగా దాదాపు ఐదు గంటలపాటు సాగిన ఈ విచారణలో సీఐడీ అధికారులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలుస్తోంది. కాగా టెరా సాఫ్ట్ కంపెనీకి టెండర్లు కట్టబెట్టడంలో తప్పులు జరిగాయని సాంబశివరావు ఒప్పుకున్నట్లు సమాచారం. టెరాసాఫ్ట్ కంపెనీ సమర్పించిన ఫోర్జరీ ఎక్స్పీరియన్స్ పత్రాలు, వాటికి సంబంధించిన డాక్యుమెంటరీ ఆధారాలను సీఐడీ అధికారులు ఆయన ముందుంచి వాటిపై విచారించారు. దాంతో టెండర్ల ప్రక్రియలో అవకతవకలు జరిగినట్టు ఆయన అంగీకరించాల్సి వచ్చిందని తెలిసింది. ప్రశ్నల వర్షం.. టెండర్లలో పాల్గొనేందుకు అర్హత లేకపోయినప్పటికీ, సిగ్నం డిజిటల్ ప్రైవేటు లిమిటెడ్ పేరిట ఫోర్జరీ పత్రాలు సమర్పించడం కచ్చితంగా తప్పేనని సాంబశివరావు అంగీకరించారని తెలుస్తోంది. ఆ విధంగా టెరాసాఫ్ట్ కంపెనీ సమర్పించిన ఫోర్జరీ పత్రాలు సరైనవే అని చెప్పమని సిగ్నం డిజిటల్ ప్రైవేటు లిమిటెడ్ సీఈడీ గౌరీశంకర్‌ను బెదిరించడం నేరంగానే పరిగణించక తప్పదని కూడా ఆయన సమ్మతించారని సమాచారం. అదే విధంగా ఫైబర్ నెట్ టెండర్ల ప్రక్రియలో కేంద్ర మార్గదర్శకాలను పాటించక పోవడం, నాసిరకం పరికరాల సరఫరా, నిబంధనలకు విరుద్ధంగా బిల్లుల చెల్లింపులు తదితర అంశాలపై సీఐడీ అధికారులు ఆయన్ను ప్రశ్నించారని తెలుస్తోంది. టెరాసాఫ్ట్ కంపెనీ నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు కట్టబెట్టడంలో కీలక సూత్రధారిగా భావిస్తున్న వేమూరి హరి కృష్ణ ప్రసాద్‌ను కూడా సీఐడీ అధికారులు కాసేపు విచారించారు. ఆయన్ను బుధవారం కూడా పూర్తి స్థాయిలో విచారించనున్నారు. ఈ కేసు ఎఫ్ఐఆర్లో పేర్కొన్న నిందితులు అందరినీ వరుసగా విచారించేందుకు సీఐడీ అధికారులు సమాయత్తమవుతున్నారు. కాగా, సీఐడీ కార్యాలయం వద్ద వేమూరి హరి కృష్ణ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ టెరా సాఫ్ట్ కంపెనీకి, తనకు సంబంధం లేదన్నారు. సీఐడీ అధికారులకు విచారణలో సహకరిస్తానని చెప్పారు. -
ఆ సర్టిఫికెట్ కోసం.. ‘వేమూరి’ బెదిరించారు
సాక్షి, అమరావతి: ‘టీడీపీ ప్రభుత్వంలో సలహాదారుడు, ఇ–గవర్నెన్స్ అథారిటీ గవర్నెన్స్ కమిటీలో సభ్యుడు వేమూరి హరికృష్ణ ప్రసాద్ నన్ను తీవ్రంగా బెదిరించారు. దీంతో డిజిటల్ హెడ్ ఎండ్ పరికరాల సరఫరాలో టెరాసాఫ్ట్ కంపెనీకి అనుభవం ఉన్నట్లుగా తప్పుడు సర్టిఫికెట్ ఇచ్చాను’.. అని సిగ్నం డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అధిపతి గౌరీశంకర్ వివరించారు. ‘మేం చెప్పినట్లు సర్టిఫికెట్ ఇవ్వకపోతే విజయవాడలో ఎలా వ్యాపారం చేస్తావో చూస్తాం’.. అని కూడా వేమూరి హరికృష్ణ తనను తీవ్రస్థాయిలో బెదిరించడంతో భయపడి ఆ విధంగా తాను సర్టిఫికెట్ ఇచ్చానని ఆయన వెల్లడించారు. ఫైబర్‌నెట్ టెండర్ల కుంభకోణానికి పాల్పడినందుకు వేమూరి హరికృష్ణ ప్రసాద్, టెరాసాఫ్ట్ కంపెనీ యాజమాన్యంతోపాటు 19మందిపై సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. డిజిటల్ హెడ్ ఎండ్ పరికరాల సరఫరాలో టెరాసాఫ్ట్ సంస్థకు అనుభవం లేకపోయినా సరే ఉన్నట్లుగా సిగ్నం డిజిటల్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థను బెదిరించి సర్టిఫికెట్ పొందినట్లుగా సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది. ఈ నేపథ్యంలో సిగ్నం డిజిటల్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ అధినేత గౌరీశంకర్‌ను ‘సాక్షి’ సంప్రదించగా అప్పట్లో జరిగిన విషయాలను ఆయన వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. నా ప్రాజెక్టు వేమూరి తీసుకున్నారు ఇంటర్నెట్–టీవీ సేవలు కలిపి కేబుల్ సేవలు అందించేందుకు నేను 2013లోనే ఓ ప్రాజెక్టు రిపోర్ట్ తయారుచేశా. అందుకు మూడు కంపెనీల నుంచి రూ.18 లక్షలు విలువైన డిజిటల్ హెడ్ ఎండ్ పరికరాలు కొనుగోలు చేశాను. ఈ విషయం తెలిసి టెరాసాఫ్ట్ సంస్థ ప్రతినిధి వేమూరి హరికృష్ణ ప్రసాద్ నన్ను కలిశారు. ఆయనకు ప్రాజెక్టు గురించి పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ (పీపీటీ) చూపించాను. ఆ తరువాత ఎన్నికల రావడంతో ఆ ప్రాజెక్టు ముందుకు సాగలేదు. 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వేమూరి హరికృష్ణ ప్రసాద్ నన్ను హైదరాబాద్‌లో అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు వద్దకు తీసుకువెళ్లారు. నా పీపీటీనే తనదని చెబుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వమే ఫైబర్ కేబుల్ సేవలు అందిస్తుందని చెప్పారు. నన్ను టెక్నికల్ సపోర్ట్ అందించమన్నారు. ప్రభుత్వం చేస్తుంది కదా అని నేను సరేనన్నాను. డీపీఆర్ తయారుచేసి ప్రభుత్వానికి ఇచ్చాను. కానీ, ఆ తరువాత టెండర్లు పిలవడం.. టెక్నికల్ కమిటీలో వేమూరి హరికృష్ణ ప్రసాద్ సభ్యుడిగా ఉన్నట్లు తెలిసింది. చివరికి నా పీపీటీ ఆధారంగానే టెరాసాఫ్ట్ బిడ్డింగ్ వేసి టెండర్లు దక్కించుకుంది. దాంతో వేమూరి హరికృష్ణ ప్రసాద్ చేసిన మోసం చూసి ఆశ్చర్యపోయాను. సర్టిఫికెట్ కోసం బెదరించారు.. ఓ రోజు రాష్ట్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఇన్‌క్యాప్) ఎండీ సాంబశివరావు నాకు ఫోన్‌చేశారు. నా మెయిల్‌కు ఓ లెటర్ పంపించానని చెబుతూ అది చూసి కాస్త సమయం తీసుకుని రిప్లై ఇవ్వమన్నారు. ఆ వెంటనే వేమూరి హరికృష్ణ ప్రసాద్ కూడా ఫోన్‌చేసి నా మెయిల్‌కు ఓ డాక్యుమెంట్ పంపానని చెబుతూ దానిపై సంతకం చేసి ఇన్‌క్యాప్ ఎండీ మెయిల్‌కు సమాధానంగా పంపించమన్నారు. నాకేమీ అర్థంకాలేదు. తీరా ఆ మెయిళ్లు చూస్తే అసలు విషయం తెలిసింది. టెరాసాఫ్ట్ కంపెనీ మా సిగ్నం డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్‌కు డిజిటల్ హెడ్ ఎండ్ పరికరాలు సరఫరా చేసినట్లుగా నేను సర్టిఫై చేస్తున్నట్లుగా ఆ డాక్యుమెంట్ ఉంది. నిజానికి మాకు టెరాసాఫ్ట్ ఎలాంటి పరికరాలు సరఫరా చేయలేదు. దాంతో నేనెందుకు సర్టిఫికెట్ ఇవ్వాలని అనుకున్నాను. అసలు ఏం జరిగిందో అని ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది. మా కంపెనీకి డిజిటల్ హెడ్ ఎండ్ పరికరాలు సరఫరా చేసిన అనుభవం ఉందని టెరాసాఫ్ట్ కంపెనీ ఫైబర్‌నెట్ టెండర్ల అప్టికేషన్లో పేర్కొంది. దీనిపై ఆ టెండర్లలో పాల్గొన్న మరో కంపెనీ అభ్యంతరం వ్యక్తంచేసింది. ఈ విషయంపై కేంద్ర టెలీకమ్యూనికేషన్ల శాఖకు కూడా ఫిర్యాదు చేస్తే టెరాసాఫ్ట్ కంపెనీకి ఆ టెండరు దక్కదు.. కాబట్టి టెరాసాఫ్ట్ కంపెనీ మాకు పరికరాలు సరఫరా చేసినట్లుగా నేను సర్టిఫికెట్ ఇవ్వాలన్నారు. నేను అందుకు ఒప్పుకోలేదు. దాంతో వేమూరి హరికృష్ణ నాకు ఫోన్‌చేసి బెదిరించారు. సర్టిఫికెట్ ఇవ్వకపోతే విజయవాడలో వ్యాపారం ఎలా చేస్తావో చూస్తాను అని వార్నింగ్ ఇచ్చారు. నా వెనక ఎంత పెద్దలు ఉన్నారో తెలుసు కదా అని కూడా అన్నారు. కానీ, నేను సర్టిఫికెట్ ఇవ్వలేదు. దాంతో తెనాలి నుంచి ఒకర్ని మా ఆఫీసుకు పంపించారు. వేమూరి హరికృష్ణ నాతో ఫోన్లో మాట్లాడుతూ.. వెంటనే సర్టిఫికెట్ ఆయనకిచ్చి పంపించమన్నారు. లేకపోతే ఏం జరుగుతుందో చెప్పలేనని తీవ్రస్వరంతో మాట్లాడారు. దాంతో నేను భయపడి టెరాసాఫ్ట్ కంపెనీకి ఎక్స్పీరియన్స్ ఉందని సర్టిఫికెట్ ఇచ్చాను. కానీ, దీనిపై ఎప్పటికైనా సరే విచారణ జరుగుతుందని ఊహించా. అందుకే ‘మీరు నాకు చెప్పినట్లుగా టెరాసాఫ్ట్‌కు డిజిటల్ ఎండ్ పరికరాల సరఫరాలో ఎక్స్పీరియన్స్ ఉందని సర్టిఫికెట్ ఇచ్చాను’.. అని వేమూరి హరికృష్ణ ప్రసాద్‌కు ఓ మెయిల్ పంపించాను. ఆ మెయిల్‌ను భద్రపరిచాను. భవిష్యత్‌లో ఎవరైనా అడిగితే వేమూరి హరికృష్ణ ప్రసాద్ బెదిరిస్తేనే ఆ సర్టిఫికెట్ ఇచ్చినట్లుగా ఆధారం ఉండాలి కదా. ఇటీవల సీఐడీ అధికారులు నన్ను విచారించినప్పుడు అన్ని విషయాలు చెప్పాను. ఆ మెయిల్‌తోపాటు నా వద్ద ఉన్న ఇతర డాక్యుమెంటరీ ఆధారాలన్నీ కూడా సమర్పించాను. వాస్తవానికి సిగ్నం డిజిటల్ లిమిటెడ్‌కు పరికరాలు ఎవరు సరఫరా చేశారో ఆ డాక్యుమెంట్లు, బిల్లులు అన్నీ అందించాను. ఈ కేసు విచారణలో సీఐడీకి పూర్తిగా సహకరిస్తాను. -
రఘురామ తీరుపై ఏపీ సీఐడీ అభ్యంతరం
సాక్షి, అమరావతి: నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు తీరుపై ఏపీ సీఐడీ అభ్యంతరం వ్యక్తం చేసింది. రఘురామ తమకు చెప్పినదానికి, ఢిల్లీ పోలీసుల ఫిర్యాదుకు తేడా ఉందని.. దర్యాప్తు సంస్థలను పక్కదారి పట్టించేలా ఆయన వ్యవహరిస్తున్నారని సీఐడీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా.. ‘‘మొబైల్ ఫోన్ అంశంలో రఘురామ తప్పుదారి పట్టిస్తున్నారు. మే 15న రఘురామ మొబైల్ (యాపిల్ 11) స్వాధీనం చేసుకున్నాం. అందులో ఉన్నది ఫలానా నెంబర్ అని రఘురామ చెప్పారు. ఇద్దరు సాక్షుల ముందు రఘురామ స్టేట్మెంట్ నమోదు చేశాం. మొబైల్ ఫోన్ సీజ్ చేసిన అంశాన్ని సీఐడీ కోర్టుకు తెలిపాం. రఘురామ యాపిల్ ఫోన్‌ను విశ్లేషించేందుకు ఫోరెన్సిక్‌కు పంపించాం. రఘురామ ఫోన్ డాటాను మే 31న కోర్టుకు అందించాం’’ అని సీఐడీ తెలిపింది. ‘‘తన ఫోన్ సీజ్ చేసినట్టు ఢిల్లీ పోలీసులకు.. రఘురామ ఫిర్యాదు చేసినట్టు మీడియాలో గమనించాం. తన నెంబర్ అంటూ అని ఢిల్లీ పోలీసులకు వేరే ఫోన్ నంబర్ ఇచ్చారు. రఘురామ మే 15న మాకు చెప్పినదానికి, ఢిల్లీ పోలీసుల ఫిర్యాదుకు తేడా ఉంది. దర్యాప్తు సంస్థలను పక్కదారి పట్టించేలా రఘురామ ఫిర్యాదు ఉందని’’ సీఐడీ అభ్యంతరం వ్యక్తం చేసింది. చదవండి: అది కేసును ప్రభావితం చేసే కుట్రే