
సాక్షి, హైదరాబాద్: ఆరేళ్ల కిందట ఇంటి నుంచి వెళ్లిపోయిన ఓ బాలుడి ఆచూకీ కనిపెట్టిన సీఐడీ అధికారులు అతన్ని వారి తల్లిదండ్రులకు అప్పగించారు. సీఐడీ పోలీసులు వివరాలిలా ఉన్నాయి. కల్లెం ఎల్లమ్మ, మానయ్య దంపతులు కూలీలు. వీరు జహీరాబాద్‌లోని శ్రీరామ్‌నగర్ కాలనీలో నివసిస్తున్నారు. వీరి కుమారుడు కల్లెం విజయ్ 2012లో ఓసారి ఇంటి నుంచి ఎవరికీ చెప్పకుండా పారిపోయాడు. ఏడాదికాలం తర్వాత మళ్లీ తిరిగొచ్చి.. కొంతకాలానికే 2013లో మరోసారి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కొడుకు తిరిగి వస్తాడనుకున్న ఎల్లమ్మ రెండేళ్లపాటు ఎదురుచూసింది. కానీ కుమారుడు రెండేళ్లయినా తిరిగి రాకపోవడంతో ఎల్లమ్మ 2015లో జూలై 13న జహీరాబాద్ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది.
పోలీసులు ఈ కేసును సీఐడీకి బదిలీ చేశారు. దర్యాప్తులో భాగంగా గతంలో విజయ్ పారిపోయి కేటరింగ్ పనిచేసినట్లు చెప్పాడని తల్లి పోలీసులకు చెప్పింది. ఈ క్లూ ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా పలువురు కేటరింగ్ నిర్వాహకుల వద్ద గాలించిన సీఐడీ పోలీసులు ఎట్టకేలకు జాన్సన్‌గా పేరుమార్చుకుని కేటరింగ్ పని చేస్తున్న విజయ్‌ని గుర్తించగలిగారు. ఈ కేసు లో విజయ్ ఆచూకీ కనిపెట్టడంలో కృషి చేసిన సీఐ జేమ్స్‌బాబు, ఎస్‌ఐ హరీశ్‌లను సీఐడీ అడిషనల్ డీజీ గోవింద్ సింగ్ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment