తాగునీటికోసం రోడ్డెక్కిన మహిళలు
ఖానాపూర్ (ఆదిలాబాద్) : ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలోని శ్రీరాంనగర్ కాలనీలో త్రాగునీటి ఇబ్బందులపై కాలనీకి చెందిన పలువురు మహిళలు, నాయకులు సోమవారం స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. గోదావరి సమీపంలోని ఎల్లమ్మ దేవాలయం వద్ద గల త్రాగునీటి బావిలో నీరు ఉండడంతో పాటు విద్యుత్ అంతరాయం సైతం లేదని, అయినప్పటికీ పాలకవర్గం పట్టించుకోకపోవడంతో పాటు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో తమకు త్రాగునీటి ఎద్దడి మరింత తీవ్రమవుతుందన్నారు. ఈ విషయమై గతంలో పలుమార్లు అందోళన చేసినా అదికారులు, పాలకులకు తమ సమస్యలపై కనువిప్పు కావడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.
ఉదయం స్థానిక పంచాయతీ కార్యాలయానికి మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చినప్పటికి సిబ్బంది ఆందుబాటులో లేరని, సర్పంచ్‌కు ఫోన్‌చేసినా స్పందించడం లేదని ఆరోపించారు. ఈ సందర్బంగా ఎంపీపీ ఆకుల శోభారాణి నివాసానికి వెళ్లి సమస్యను విన్నవించారు. దీంతో మాజీ సర్పంచ్ ఆకుల శ్రీనివాస్ మహిళలతో కలిసి శ్రీరాంనగర్ కాలనీలో పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం పంచాయతీ కార్యాలయానికి వెళ్లిన మహిళలు సమస్య పరిష్కరించేవరకు ఇక్కడి నుండి కదిలేది లేదంటూ అక్కడే బైఠాయించారు. దీంతో మేజర్ గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ కారింగుల సుమన్ గ్రామపంచాయతీకి చేరుకుని త్రాగునీటి సమస్య పరిష్కారానికి కృషిచేస్తానని, ఎటువంటి ఆందోళన చెందవద్దని హామీ ఇవ్వడంతో మహిళలు శాంతించారు. అనంతరం గోదావరి సమీపంలోని త్రాగునీటి బావి వద్దకు వెళ్లి పైప్‌లైన్ ఏర్పాటు పనులను ఉపసర్పంచ్ ప్రారంభించడంతో ఆందోళన సద్దుమణిగింది.