సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఒక మేడి పండు అన్న నిజం వెలుగు చూసింది. పొట్ట విప్పి చూస్తే ఆర్థిక అక్రమాలు గుట్టలు గుట్టలుగా బయటపడ్డాయి. ఫోర్జరీ సంతకాలతో మోసాలు.., చందాదారులకు తెలియకుండానే చిట్టీ పాటలు.., మేనేజ్‌మెంట్ టికెట్లు పేరిట బురిడీలు.., ఏజెంట్ల ద్వారా కనికట్టు.., బ్రాంచిల నుంచి ప్రధాన కార్యాలయానికి అక్రమంగా నిధులు మళ్లింపు.., నిధుల్లేక ఖాళీగా ఉన్న బ్యాంకు ఖాతాలు.. ఇలా మార్గదర్శి చిట్‌ఫండ్స్ లోగుట్టు ఆధారాలతో సహా వెలుగు చూసింది.
చందాదారుల సొమ్ముతో రామోజీరావు అక్రమ వ్యాపార సామ్రాజ్యం విస్తరణకు మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఇం‘ధనం’గా ఉపయోగపడుతోందన్నది రూఢీ అయ్యింది. అదే సమయంలో మార్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థ సొంత ఆర్థిక పరిస్థితి దినదిన గండంగా ఉందన్న అసలు వాస్తవం వెల్లడైంది. చందాదారుల సొమ్ముకు ఏమాత్రం భద్రత లేదన్న విషయం ఆధారాలతో సహా బయటపడింది. ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే మార్గదర్శి చిట్‌ఫండ్స్ మరో అగ్రిగోల్డ్ కానున్నదన్నది విస్పష్టమైంది.
వేలాదిమంది మార్గదర్శి చిట్‌ఫండ్స్ చందాదారులు నిండా మునిగిపోయే ప్రమాదం ఉందన్న విషయం రూఢీ అయింది. రాష్ట్రంలో ఉన్న మార్గదర్శి చిట్‌ఫండ్స్ 37 శాఖల్లో స్టాంపులు – రిజిస్ట్రేషన్ల శాఖ, సీఐడీ అధికారులు గురువారం సోదాలు చేశారు. ప్రత్యేక బృందాలతో ఏకకాలంలో చేపట్టిన ఈ ఆకస్మిక సోదాల్లో సంస్థ ఆర్థిక అక్రమాలు భారీగా వెలుగులోకి వచ్చాయి. కేంద్ర చిట్‌ఫండ్స్ చట్టం, ఆర్‌బీఐ నిబంధనలే కాదు.. ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) కింద కూడా పలు నేరాలకు సంస్థ యాజమాన్యం పాల్పడినట్టు వెల్లడైంది.
మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఆర్థిక అక్రమాలపై ఆ సంస్థ చైర్మన్ రామోజీరావు ఏ–1గా, మేనేజింగ్ డైరెక్టర్ శైలజ కిరణ్ ఏ–2గా, బ్రాంచి మేనేజర్లు (ఫోర్‌మెన్) ఏ–3గా సీఐడీ కేసు నమోదు చేసి, చార్జిషీటు కూడా దాఖలు చేసింది. ఈ కేసు దర్యాçప్తులో భాగంగా స్టాంపులు – రిజిస్ట్రేషన్ల శాఖ, సీఐడీ అధికారుల బృందాలు చేపట్టిన సోదాలు గురువారం అర్ధరాత్రి కూడా కొనసాగుతున్నాయి. ఈ సోదాలు మరో రెండు రోజులు కొనసాగే అవకాశాలున్నాయి.
ఇదే పరిస్థితి కొనసాగితే బోర్డు తిప్పేయడమే
విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం.. మార్గదర్శి చిట్‌ఫండ్స్ కార్యాలయాల్లో జరిగిన సోదాల్లో పలు విస్మయకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. రామోజీరావు ఘనంగా చెప్పుకొనే ఈ సంస్థ ఆర్థికంగా కుదేలవుతుందనేందుకు స్పష్టమైన ఆధారాలు బయటపడ్డాయి. సంస్థ ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. అధికారులు సోదాలు చేస్తున్న 37 శాఖల బ్యాంకు ఖాతాల్లో వాటి చందాదారుల నిధులు లేవని వెల్లడైంది. అంటే చందాదారులు చెల్లించిన డబ్బును అక్రమంగా ప్రధాన కార్యాలయానికి తరలించేశారు.
ఆ నిధులు ప్రధాన కార్యాలయం బ్యాంకు ఖాతాలో ఉన్నాయా అంటే అక్కడా లేవు. వాటిని గుట్టుచప్పుడు కాకుండా రామోజీరావు సొంత వ్యాపార సంస్థల్లో, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులుగా మళ్లించేశారు. వెరసి రాష్ట్రంలోని 37 మార్గదర్శి శాఖల ఆర్థిక పరిస్థితి కుదేలైంది. ఆ శాఖల చందాదారులు చిట్టీ పాటలు పాడిన సొమ్ము (ప్రైజ్ మనీ)ని చెల్లించే స్థితిలో సంస్థ లేదన్న విషయం సోదాల్లో తేలింది. ఇది ఎన్నో ఏళ్లుగా ఉన్న పరిస్థితే అని కూడా స్పష్టమైంది. కొత్తగా చిట్టీ వేసే చందాదారులు చెల్లించే చందా మొత్తంతో పాత చిట్టీల చందాదారులు పాడిన ప్రైజ్‌మనీని చెల్లిస్తూ ఇన్నాళ్లూ సంస్థ కనికట్టు చేస్తోంది.
కానీ కేంద్ర చిట్‌ఫండ్ చట్టం–1982ను కచ్చితంగా పాటించాలని రాష్ట్ర చిట్ రిజిస్ట్రార్ స్పష్టం చేయడంతో మార్గదర్శి చిట్‌ఫండ్స్ గత ఏడాది డిసెంబర్ నుంచి కొత్త చిట్టీ గ్రూపులు వేయడంలేదు. అంటే 9 నెలలుగా వ్యాపార కార్యకలాపాలు నిలిచిపోయాయి. కొత్త చిట్టీలు, కొత్త చందాదారులు, కొత్తగా చందా మొత్తాలు రాక డిసెంబర్ ముందు మొదలు పెట్టిన వేలాది చందాదారులకు చిట్టీపాట ప్రైజ్‌మనీ చెల్లించడం మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు తలకుమించిన భారంగా పరిణమించింది. మరో వైపు చందాదారులకు చిట్టీపాట మొత్తం చెల్లించకుండా వాటిని అక్రమ డిపాజిట్లుగా మళ్లిస్తోంది.
కాలపరిమితి తీరిన డిపా జిట్లు చందాదారులకు తిరిగి చెల్లించాలి. అందుకు కూడా మార్గదర్శి చిట్‌ఫండ్స్ వద్ద నిధులు లేవు. ఈ పరిణామాల నేపథ్యంలో మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రైజ్‌మనీ, డిపాజిట్‌ల చెల్లింపు సందేహాస్పదంగా మారింది. ఒక్క మాటలో చెప్పాలంటే మూసివేతకు ముందు అగ్రిగోల్డ్ సంస్థ ఏ దుస్థితిలో ఉందో.. ప్రస్తుతం మార్గదర్శి చిట్‌ఫండ్స్ అదే ఆర్థిక దుస్థితిని ఎదుర్కొంటోందన్నది ఆధారాలతో సహా బయటపడినట్టు సమాచారం.
మార్గదర్శి భవిష్యత్‌లో కూడా కోలుకునే అవకాశాలు కనిపించడంలేదు. దాంతో మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఏ క్షణంలోనైనా బోర్డు తిప్పేస్తే చందాదారులు, డిపాజిట్‌దారులు నిండా మునిగిపోయే ప్ర మాదం ఉందన్నది స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ, సీఐడీ సోదాల్లో బయటపడినట్టు తెలుస్తోంది. చందాదారులు, డిపాజిట్‌దారుల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అనివార్యత కనిపిస్తోంది.
అన్నీ అక్రమాలే..
ఇక చిట్టీ గ్రూపుల్లో మేనేజ్‌మెంట్ టికెట్ల చందాను మార్గదర్శి చిట్‌ఫండ్స్ వాస్తవంగా చెల్లించడమే లేదన్నది కూడా ఆధారాలతో వెల్లడైంది. ఏదైనా చిట్టీ గ్రూపులో కొన్ని టికెట్లు (సభ్యులు) ఖాళీగా ఉండిపోతే వాటిని మేనేజ్‌మెంట్ పేరిట నమోదు చేస్తారు. ఆ టికెట్ల చందా మొత్తాన్ని సంస్థ యాజమాన్యం చెల్లించాలి.
కానీ మార్గదర్శి చిట్‌ఫండ్స్ 37 బ్రాంచిల్లోనూ సంస్థ పేరిట ఉన్న టికెట్ల చందాను చెల్లించడమే లేదు. అందుకు సంబంధించిన బ్యాంకు లావాదేవీలు ఏవీ రికార్డుల్లో నమోదు కానేలేదు. కానీ మేనేజ్‌మెంట్ టికెట్లకు చెల్లించాల్సిన డివిడెండ్లు, టికెట్ల పేరిట చిట్టీ పాట పాడి ప్రైజ్‌మనీని మాత్రం తీసుకుంటోంది. అంటే రామోజీరావు, ఆయన కుటుంబ సభ్యులు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే.. అక్రమ డిపాజిట్లు వసూలు చేస్తున్నట్టుగా కూడా వెల్లడైంది.
మార్గదర్శి సహాయ నిరాకరణ
స్టాంపులు – రిజిస్ట్రేషన్ల శాఖ, సీఐడీ సోదాలకు మార్గదర్శి చిట్‌ఫండ్స్ అడుగడుగునా ఆటంకాలు సృష్టించేందుకు యత్నించింది. అధికార బృందాలు లోపలికి రాకుండా సిబ్బంది వాగ్వాదానికి దిగారు. సోదాల సందర్భంగా కీలక రికార్డులు చూపించేందుకు సిబ్బంది నిరాకరించారు. అధికారుల బృందాలకు సహకరించవద్దని మార్గదర్శి ప్రధాన కార్యాలయం శాఖలకు ఫ్యాక్స్ ద్వారా ఆదేశించడం గమనార్హం. ఈనాడు పాత్రికేయులను మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఉద్యోగుల పేరిట కార్యాలయాల్లోపల మోహరించారు.
వారు సోదాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఈనాడు ప్రధాన కార్యాలయానికి చేరవేశారు. వారిచ్చిన సమాచారాన్ని వక్రీకరిస్తూ మీడియాలో వార్తలు ప్రసారం చేయడం ద్వారా అధికారుల బృందాలను బ్లాక్ మెయిల్ చేసేందుకు పన్నాగం పన్నారు. ఈ విధంగా సోదాలను అడ్డుకునేందుకు ఎంతగానో ప్రయత్నించారు. అయినప్పటికీ అధికారుల బృందాలు నిబంధనలను పాటిస్తూ సోదాలు కొనసాగిస్తున్నాయి.
ఫోర్జరీ సంతకాలతో యథేచ్ఛగా అక్రమాలు
మార్గదర్శి చిట్‌ఫండ్స్ దశాబ్దాలుగా యథేచ్ఛగా ఆర్థిక అక్రమాలకు పాల్పడుతోందన్నది పూర్తి ఆధారాలతో ఈ సోదాల్లో వెల్లడైంది. ఆ సంస్థ కేవలం చిట్‌ఫండ్స్ చట్టం, ఆర్‌బీఐ నిబంధనలే కాదు.. ఐపీసీ చట్టాలను కూడా ఉల్లంఘిస్తూ ఆర్థిక అక్రమాలు, మోసాలకు పాల్పడుతోంది. ప్రధానంగా చందాదారుల సంతకాలను ఫోర్జరీ చేసి మరీ అక్రమాలకు పాల్పడుతున్నట్టుగా అధికారులు గుర్తించినట్టు సమాచారం.
చిట్టీ గ్రూపుల పాటలు నిర్వహిస్తే కనీసం ఇద్దరు సభ్యుల కోరం ఉండాలి. కానీ ఆ కోరం కూడా లేకుండానే చిట్టీ పాటలు నిర్వహిస్తోంది. అందుకోసం చందాదారులు వచ్చినట్టుగా వారి సంతకాలను మినిట్స్ బుక్‌లో ఫోర్జరీ చేస్తోంది. అంతేకాదు కొందరు చందాదారులు వారు రాలేనందున వారి తరపున చిట్టీ పాటలో పాల్గొనేందుకు మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఏజెంట్లకు అనుమతి (ఆథరైజేషన్) ఇచ్చినట్టుగా పత్రాలు కనిపించాయి. ఈ రెండు సందర్భాల్లోనూ చందాదారుల సంతకాలు ఫోర్జరీ చేసినట్టుగా అధికార బృందాలు గుర్తించాయి. ఆ సంతకాలు ఉన్న చందాదారులను అధికారులు సంప్రదించడంతో అసలు విషయం బయటపడింది.
అసలు తాము ఎవరికీ ఆథరైజేషన్ ఇవ్వనేలేదని, తాము రాకున్నా వచ్చినట్టు మినిట్స్ బుక్‌లో నమోదు చేయడం ఏమిటని ఆ చందాదారులు తిరిగి ప్రశ్నించారు. అవి తమ సంతకాలు కావని, ఫోర్జరీవి అని స్పష్టం చేశారు. ఆ చందాదారుల అసలు సంతకాలను మార్గదర్శి చిట్‌ఫండ్స్ రికార్డుల్లో ఉన్న సంతకాలతో పోల్చి చూడగా అవి ఫోర్జరీ అనే విషయం స్పష్టమైంది. ఆ విధంగా ఏకంగా 70 శాతం చందాదారుల సంతకాలు ఫోర్జరీయేనని అధికారులు గుర్తించారు. ఫోర్జరీ సంతకాలతో మార్గదర్శి చిట్‌ఫండ్స్ దశాబ్దాలుగా అక్రమాలకు పాల్పడుతున్నట్టు వెల్లడైంది.
కీలక పత్రాలు స్వాదీనం
మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఆర్థిక అక్రమాలకు సంబంధించిన కీలక ఆధారాలను స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ, సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు ఖాతాలు, చిట్టీ గ్రూపుల చందాల వివరాలు, నిధుల మళ్లింపునకు సంబంధించిన పత్రాలు, ఫోర్జరీ సంతకాలు చేసిన రికార్డులు, హార్డ్ డిస్‌్కలను జప్తు చేసి పంచనామా నిర్వహించారు.
తమ సంతకాలను ఫోర్జరీ చేసినట్టుగా చందాదారుల వాంగ్మూలాలను నమోదు చేశారు. దాంతో మార్గదర్శి చిట్‌ఫండ్స్ కేసులో సీఐడీ అధికారులు కీలక పురోగతి సాధించినట్టైంది. ఈ సోదాలు శుక్ర, శనివారాలు కూడా కొనసాగే అవకాశాలున్నాయి. దాంతో మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఆర్థిక అక్రమాలు మరిన్ని వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment