శ్రీనివాసులు ఇంటిలో స్వాధీనం చేసుకున్న బంగారు, నగదు, వెండి వస్తువులు. ఇన్‌సెట్‌లో గుజ్జల శ్రీనివాసులు
ఖాజీపేట: ఆప్కో మాజీ చైర్మన్, టీడీపీ నేత గుజ్జల శ్రీనివాసులు అలియాస్ శ్రీను స్వగృహంలో భారీగా అవినీతి సొమ్ము బయటపడింది. వైఎస్సార్ జిల్లా ఖాజీపేటలోని ఆయన ఇంట్లో ఏకంగా.. 9 కేజీల 900 గ్రాముల బంగారం, 16 కేజీల 300 గ్రాముల వెండి, రూ. 91,67,000 నగదును సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు రూ.10 లక్షల పాత వెయ్యి రూపాయిల నోట్లను, హైదరాబాద్‌లోని ఇంటిలో మరో రూ. 10 లక్షలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆప్కోలో అక్రమాలపై పూర్తి సమాచారం అందుకున్న అధికారులు కోర్టు అనుమతితో శుక్రవారం శ్రీనివాసులు ఇంటిలోనూ, ఇదే సమయంలో ఢాంఖాన్ పల్లె సొసైటీ కార్యాలయం, సొసైటీలో పనిచేస్తూ ఆర్థిక లావాదేవీలు జరిపే మరో కీలక వ్యక్తి ఇంటిలో సోదాలు జరిపారు. ఖాజీపేటలోని ఆయన ఇంటిలో సుమారు 25 మంది తనిఖీ చేయగా.. ఏకకాలంలో ప్రొద్దుటూరులోని అకౌంటెంట్లు కొండయ్య, శ్రీరాములు, కడపలోని పలు ఇళ్లలో సీఐడీ సోదాలు కొనసాగాయి.
ఆప్కోలో అవినీతి బాగోతం
► గత ఎనిమిదేళ్లుగా ఆప్కోలో జరిగిన అవినీతి సీఐడీ అధికారుల సోదాలతో బయటకు వస్తోంది.
► పలు బోగస్ సొసైటీల జాబితాను అధికారులు గుర్తించారు. సొసైటీలో నిజంగా సభ్యులు ఉన్నారా? లేదా? అనే విషయంపైనా దృష్టి సారించారు.
► వైఎస్సార్ జిల్లా ఖాజీపేట మండలంలోని గ్రామాల్లో, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, కమలాపురం ప్రాంతాల్లో సీఐడీ అధికారులు విచారణ జరుపగా.. సభ్యులు పేపర్లలోనే ఉన్నారు కానీ వాస్తవంగా లేరని సీఐడీ గుర్తించినట్లు తెలుస్తోంది.
► బోగస్ సొసైటీలుగా గుర్తించిన వాటి లావాదేవీలు ఎలా జరిగాయి? నిజంగా వీరు మగ్గం నేసి సొసైటీకి అమ్మారా? లేక పవర్‌లూమ్ నుంచి తీసుకుని వచ్చి అమ్మకాలు జరిపారా అనే దానిపై ఆరాతీస్తున్నారు.
► బోగస్ సొసైటీలకు, ఆప్కో మాజీ అధ్యక్షునికి ఉన్న లింకులపై విచారణ జరుపుతున్నారు.
► శ్రీనివాసులు బంధువులను ప్రశ్నించిన అధికారులు.. నేతన్న నేస్తం పథకం ద్వారా మీకు లబ్ధి ఎలా చేకూరింది? తెల్లకార్డులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు.
► సొసైటీ కార్యాలయంలోని కంప్యూటర్లు, రికార్డులను తమ వెంట తీసుకెళ్లారు. తనిఖీలో బయటపడిన విషయాలను కోర్టుకు సమర్పిస్తామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment