సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల స్కామ్‌లో అంతర్రాష్ట్ర సైబర్‌ నేరగాళ్లు | Interstate Cyber Criminals in CMRF Check Scam | Sakshi
Sakshi News home page

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల స్కామ్‌లో అంతర్రాష్ట్ర సైబర్‌ నేరగాళ్లు

Published Mon, Nov 16 2020 2:40 AM | Last Updated on Mon, Nov 16 2020 2:40 AM

Interstate Cyber Criminals in CMRF Check Scam - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌)నుంచి రూ.117 కోట్లు కొట్టేసేందుకు చేసిన ప్రయత్నంలో పలు రాష్ట్రాలకు చెందిన సైబర్‌ నేరగాళ్ల పాత్ర ఉన్నట్టు స్పష్టమవుతోంది. ఈ స్కామ్‌ సూత్రధారులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టిన సీఐడీ బృందాలు.. ప్రధాన సూత్రధారి బీహార్‌కు చెందిన సింగ్‌ను పట్టుకుని విచారించగా.. అతను కీలక విషయాలు వెల్లడించినట్టు సమాచారం. బీహారే కాకుండా కర్ణాటక, ఒడిశా, జార్ఖండ్, పశ్చిమబెంగాల్‌ లింకులు వెలుగుచూసినట్లు తెలుస్తోంది. సింగ్‌తో పాటు మరికొందరిని కూడా అదుపులోకి తీసుకున్న సీఐడీ మొత్తం 30 మంది అనుమానితుల జాబితా సిద్ధం చేసింది. మిగతావారి కోసం సీఐడీ ప్రత్యేక బృందాలు ఆయా రాష్ట్రాల్లో గాలింపు ముమ్మరం చేశాయి.

రూ.117 కోట్లు కొట్టేసేందుకు యత్నం
గత సెప్టెంబర్‌లో పశ్చిమబెంగాల్, కర్ణాటకలోని బ్యాంకుల్లో మూడు చెక్కులతో మొత్తం రూ.117 కోట్లు డ్రా చేసేందుకు అగంతకులు ప్రయత్నించారు. ఆ చెక్కులు ఏపీ సీఎంఆర్‌ఎఫ్‌కు చెందినవి కావడంతో అనుమానం వచ్చిన ఆయా బ్యాంకుల ప్రతినిధులు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వెలగపూడి బ్రాంచి అధికారులను సంప్రదించారు. అవి ట్యాంపరింగ్‌ చేసిన నకిలీ చెక్కులుగా నిర్ధారించిన ఎస్‌బీఐ అధికారులు వాటి చెల్లింపులు నిలిపివేశారు. ఆ తర్వాత కడపలోనూ ఫోర్జరీ చెక్కుతో సీఎంఆర్‌ఎఫ్‌ నిధులు రూ.9.95 లక్షలు డ్రా చేసే ప్రయత్నాన్ని బ్యాంకు అధికారులు నిలువరించారు. దీనిపై సీఐడీ దర్యాప్తు చేపట్టింది. చెక్కుల విషయమై క్షేత్రస్థాయిలో పరిశీలించి చిన్న మొత్తాలతో కూడిన చెక్కులను పెద్ద మొత్తాలుగా ట్యాంపర్‌ చేసినట్లు తేల్చారు. అనంతరం ఆయా రాష్ట్రాల్లో దర్యాప్తు ప్రారంభించారు.

22 మందిని విచారించిన సీఐడీ!
తొలుత కర్ణాటకలోని మంగళూరులోను, పశ్చిమబెంగాల్‌లోని కొల్‌కతా బ్యాంకుల్లో రికార్డులను సీఐడీ అధికారులు తనిఖీ చేశారు. ఫోర్జరీ చెక్కులు మార్చేందుకు ప్రయత్నించిన రోజుల్లో ఆయా బ్యాంకుల్లోని సీసీ కెమెరాల వీడియో ఫుటేజీలను పరిశీలించారు. ఈ క్రమంలోనే బీహార్‌కు చెందిన సింగ్‌ను పట్టుకున్నారు. అతను ఇచ్చిన కీలక సమాచారంతో మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విధంగా ఇప్పటివరకు పలు రాష్ట్రాలకు చెందిన 22 మందిని పట్టుకుని విచారించినట్లు సమాచారం. వారిచ్చిన సమాచారం ఆధారంగా ఆయా రాష్ట్రాల్లో నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. కాగా నిందితులకు ఏపీకి చెందిన కొందరు కూడా సహకరించినట్లు తెలుస్తోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement