cmrf
-
సీఎం సహాయనిధికి రిలయన్స్ ఫౌండేషన్ భారీ విరాళం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వరద బాధితుల సహాయార్థం రిలయన్స్ ఫౌండేషన్ భారీ విరాళం ప్రకటించింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.20 కోట్లు అందజేసింది. ఈమేరకు రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధులు చైర్పర్సన్ నీతా అంబానీ తరపున జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి చెక్‌ను అందజేశారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వానికి అండగా నిలిచినందుకు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రిలయన్స్ ఫౌండేషన్‌ను అభినందించారు. సీఎంని కలిసినవారిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, బోర్డు సభ్యుడు పీఎంఎస్ ప్రసాద్, రిలయన్స్ గ్రూప్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మెంటార్ పీవీఎల్ మాధవరావు ఉన్నారు. -
సీఎం సహాయనిధికి విరాళాల వెల్లువ
సాక్షి, హైదరాబాద్: వరద సహాయక చర్యల నిమిత్తం పలు సంస్థల నుంచి ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు వెల్లువలా వస్తున్నా యి. జీఎంఆర్ గ్రూప్ సంస్థల నుంచి రూ.2.5 కోట్లు విరాళంగా ప్రకటించారు. కెమిలాయిడ్స్ కంపెనీ చైర్మన్ రంగరాజు రూ.కోటి విరాళం ఇవ్వగా, శ్రీచైతన్య విద్యాసంస్థలు రూ.కోటి, విర్కో ఫార్మా రూ.కోటి, అపోలో హాస్పిటల్స్ జేఎండీ సంగీతారెడ్డి రూ.కోటి విరాళంగా అందజేసినట్లు శుక్రవారం సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.అలాగే భువనగిరి ఎంపీ చామల కిరణ్‌రెడ్డి వరద బాధితులకు తన వంతుగా నెల వేతనాన్ని విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం సచివాలయంలో ము ఖ్యమంత్రి ప్రత్యేక అధికారి (ఓఎస్డీ) వేముల శ్రీనివాసులును కలిసి రూ.1.85 లక్షల చెక్కు ను అందజేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, వాణిజ్య సంఘాలు, కార్పొరేట్ సంస్థలు తమ వంతు విరాళాలు ఇచ్చి వరద బాధితుల పక్షాన నిలవాలని కోరారు. -
తెలంగాణలో CMRF భారీ స్కామ్.. సాక్షి చేతిలో FIR కాపీ
-
సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు ఇకపై ఆన్లైన్లోనే
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) దరఖాస్తులను ఇక నుంచి ఆన్లైన్లో స్వీకరించనున్నారు. సీఎంఆర్ఎఫ్ నిధులు పక్కదారి పట్టకుండా పారదర్శకతతో వ్యవహరించాలంటూ సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో రూపొందించిన వెబ్‌సైట్‌ను సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం సాయంత్రం సచివాలయంలో ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలో సీఎంఆర్ఎఫ్ నిధులు పక్కదారి పట్టాయనే ఆరోపణల నేపథ్యంలో ఈ విధానాన్ని రూపొందించారు. సీఎంఆర్ఎఫ్ కోసం తమ వద్దకు వచ్చే వారి వివరాలకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు తమ సిఫారసు లేఖ జత చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ లో సంబంధిత దరఖాస్తుదారుల బ్యాంక్ ఖాతా నంబర్ తప్పనిసరిగా ఇవ్వాలి. అప్లోడ్ చేసిన తర్వాత సీఎంఆర్ఎఫ్కు సంబంధించిన ఒక కోడ్ ఇస్తారు. ఆ కోడ్ ఆధారంగా ఒరిజినల్ మెడికల్ బిల్లులను సచివాలయంలో అందజేయాల్సి ఉంటుంది. సంబంధిత ఆస్పత్రులకు ఆన్లైన్లోనే పంపించి నిర్ధారించుకున్న తర్వాత అన్ని వివరాలు సరిగ్గా ఉంటే దరఖాస్తును ఆమోదించి చెక్‌ను సిద్ధం చేస్తారు. చెక్‌పై తప్పనిసరిగా దరఖాస్తుదారుడి బ్యాంకు ఖాతా నంబర్ ముద్రిస్తారు. (దీనివల్ల చెక్ పక్కదారి పట్టే అవకాశం ఉండదు) ఆ తర్వాత ప్రజాప్రతినిధులు చెక్‌లను స్వయంగా దరఖాస్తుదారులకు అందజేస్తారు. ఈ నెల 15వ తేదీ తర్వాత సీఎంఆర్ఎఫ్ ధరఖాస్తులను ఆన్లైన్ ద్వారా మాత్రమే స్వీకరిస్తారు. https//cmrf.telangana.gov.in/ సైట్లో దరఖాస్తు అందుబాటులో ఉంటుంది. -
సీఎంఆర్ఎఫ్ చెక్కుల గోల్మాల్...
బంజారాహిల్స్ (హైదరాబాద్): పేదల వైద్య ఖర్చుల నిమి త్తం ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) కింద మంజూరైన చెక్కుల గోల్మాల్ అంశం వెలుగులోకి వ చ్చింది. లబ్ధిదారులకు అందాల్సిన చెక్కులను కొల్లగొట్టి సొమ్ము చేసుకున్న ముఠాను హైదరాబాద్‌లోని జూబ్లీహి ల్స్ పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం వారిని కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించారు. అయితే ఈ వ్యవ హారంలో సూత్రధారిగా వ్యవహరించిన నరేశ్‌కుమార్ అనే వ్యక్తి గతంలో మాజీ మంత్రి హరీశ్‌రావు కార్యాలయంలో పనిచేయడంతో.. హరీశ్‌రావు పీఏ సీఎంఆర్ఎఫ్ చెక్కుల అక్రమాలకు పాల్పడ్డాడంటూ ప్రచారం జరిగింది. హరీశ్ రావు కార్యాలయం దీనిని ఖండిస్తూ ప్రకటన చేసింది. ఆఫీసు మూసివేశాక అక్రమానికి తెగబడి.. గత ప్రభుత్వంలో హరీశ్‌రావు మంత్రి కావడంతో ఆయన నియోజకవర్గంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఇతర ప్రాంతాల వారు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఆయన ద్వారా దరఖాస్తు చేసుకునేవారు. వారికి మంజూరైన చెక్కులు హరీశ్‌రావు క్యాంపు ఆఫీసు ద్వారా పంపిణీ చేసేవారు. హైదరాబాద్ లోని కోకాపేటలో ఉన్న ఈ క్యాంప్ ఆఫీస్‌లో మెట్టుగూడ కు చెందిన జోగుల నరేశ్‌కుమార్ (40) కంప్యూటర్ ఆప రేటర్‌గా పనిచేశాడు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో.. డిసెంబర్ 6వ తేదీన హరీశ్‌రావు తన క్యాంపు కార్యాలయాన్ని మూసేశారు. వివిధ ప్రాంతాల లబ్ధిదారులకు చెందిన 240 సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఆఫీసులో మిగిలిపోవడంతో.. వాటిని తిరిగి సచివాలయంలోని సీఎంఆర్ఎఫ్ కార్యాలయంలో అప్పగించాల్సిందిగా నరేశ్‌కుమార్‌కు సూచించారు. ఇక్కడే నరేశ్ తన తెలివితేటలు ప్రదర్శించాడు. మరో ముగ్గురిని కలుపుకొని.. సీఎంఆర్ఎఫ్ చెక్కుల సొమ్మును కొల్లగొట్టాలని భావించిన నరేశ్‌కుమార్.. అసెంబ్లీలో అటెండర్‌గా పనిచేస్తున్న బాలగోని వెంకటేశ్ (35), ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం బీఆర్ఎస్ నేత కొర్లపాటి వంశీ (24), గోదావరిఖనికి చెందిన పులిపాక ఓంకార్(34)తో కలసి పథకం వేశాడు. ఓంకార్ ఈ చెక్కులపై ఉన్న పేర్లను పోలిన పేర్లున్న ఇతర వ్యక్తులను గుర్తించి.. వారి ఖాతాల్లో చెక్కులను డిపాజిట్ చేయించాడు. వారి నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించుకుని.. నలుగురూ పంచుకుంటూ వచ్చారు. చెక్కులు మాయమైన విషయం తెలుసుకున్న హరీశ్‌రావు.. గత ఏడాది డిసెంబర్ 17వ తేదీనే నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు కూడా. ఓ లబ్ధిదారు ఫిర్యాదుతో వెలుగులోకి.. తనకు సీఎంఆర్ఎఫ్ సాయం మంజూరైనా, చెక్కు రాకపోవడంతో మెదక్ జిల్లా పీర్ల తండాకు చెందిన రైతు రవినాయక్ ఆరా తీశారు. అయితే ఆయన పేరుపై సీఎంఆర్ఎఫ్ చెక్కు వచ్చిందని, సొమ్ము కూడా డ్రా అయిందని తేలింది. దీనిపై ఆయన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా.. నరేశ్, వంశీ, వెంకటేశ్, ఓంకార్‌ల నిర్వాకం వెలుగులోకి వచ్చింది. వారు కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్టు తేలింది. గడువు తీరడంతో కొన్ని చెక్కులను దహనం చేశామని వంశీ పోలీసులకు చెప్పినట్టు తెలిసింది. చెక్కుల గోల్మాల్ విషయం తెలిసిన లబ్ధిదారులు ఠాణాకు క్యూకట్టారు. ఇప్పటికే 24 మంది ఫిర్యాదు చేసినట్టు సమాచారం. పోలీసులు నిందితులపై ఐపీసీ సెక్షన్లు 417, 419, 420, 120 (డి), 66 (సి) ఐపీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు . నరేశ్‌తో సంబంధం లేదు.. చెక్కులపై గతంలోనే ఫిర్యాదు.. హరీశ్‌రావు కార్యాలయం ప్రకటన సాక్షి, హైదరాబాద్: సీఎంఆర్ఎఫ్ చెక్కుల వ్యవహారం బయటపడటంతో.. వాటిని మాజీ మంత్రి హరీశ్‌రావు పీఏ కాజేశాడంటూ బుధవారం సోషల్ మీడి యాలో, బయటా ప్రచారం జరిగింది. దానిని ఖండిస్తూ హరీశ్‌రావు కార్యాలయం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘నరేశ్ అనే వ్యక్తి మాజీ మంత్రి హరీశ్‌రావు పీఏ కాదు. అతను కంప్యూటర్ ఆపరేటర్, తాత్కాలిక ఉద్యోగి. మంత్రిగా హరీశ్‌రావు పదవీకాలం పూర్తయిన నేపథ్యంలో.. ప్రభుత్వ ఆదేశాల మేరకు 2023 డిసెంబర్ 6న క్యాంపు కార్యాలయాన్ని మూసివేసి, సిబ్బందిని పంపించి వేశాం. ఆ రోజు నుంచి నరేశ్ అనే వ్యక్తితో హరీశ్‌రావు కార్యాలయానికి ఎలాంటి సంబంధం లేదు. అయితే ఆఫీసు మూసివేసే క్రమంలో ఎలాంటి సమాచారం లేకుండా నరేశ్ కొన్ని సీఎంఆర్ఎఫ్ చెక్కులను తన వెంట తీసుకువెళ్లినట్టు మా దృష్టికి వచ్చింది. దీనిపై డిసెంబర్ 17వ తేదీనే నార్సింగి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాం. ఈ వాస్తవాలను గుర్తించకుండా మాజీ మంత్రి పీఏ చెక్కులు కాజేశాడంటూ తప్పుడు ప్రచారం జరుగుతోంది. ఒక వ్యక్తి చేసిన తప్పును మొత్తం కార్యాలయానికి వర్తింపచేయడం బాధాకరం. వాస్త వాలను గుర్తించాలి’’ అని ప్రకటనలో పేర్కొంది. -
Ap: రూ.15 లక్షల ఇంజెక్షన్.. ఉచితంగా అందించిన ప్రభుత్వం
సాక్షి,తూర్పుగోదావరి: పేదలను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ముందుంటుందని మరోసారి రుజువైంది. రాజమండ్రిలో హీమోఫిలియా వ్యాధితో బాధపడుతున్న ఓ బాలుడికి ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్ఎఫ్) నుంచి ప్రభుత్వం భారీ సాయం అందజేసింది. సీఎంఆర్ఎఫ్ ద్వారా 15 లక్షల రూపాయల విలువైన అరుదైన ఇంజెక్షన్‌ను స్విట్జర్లాండ్ నుంచి తెప్పించి మరీ బాలుడికి చికిత్స అందించారు. కార్డియాలజిస్ట్ పీవీ సత్యనారాయణ ఆధ్వర్యంలో రాజమండ్రి ఆస్పత్రిలో బాలుడికి ఇంజెక్షన్ చేశారు. ఇదీచదవండి.. ఏపీ అసెంబ్లీ అప్డేట్స్ -
వడ్డెర కుటుంబానికి సీఎం అండ
ధవళేశ్వరం: రోడ్డు ప్రమాదంలో కుమారుడిని పొగొట్టుకుని పుట్టెడు దు:ఖంలో ఉన్న ఓ కుటుంబానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అండగా నిలిచారు. వారి ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్ఎఫ్) ద్వారా ఆర్థిక సాయం మంజూరు చేశారు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో వడ్డెర సామాజిక వర్గానికి చెందిన గుంజే బోయేసు..పెద్దింటు దంపతులు మట్టి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఈ దంపతుల ఏకైక కుమారుడు గుంజే ఈశ్వర దుర్గ (7) ఇటీవల బస్సు ఢీకొనడంతో చనిపోయాడు. ఒక్కగానొక్క కుమారుడు దూరం కావడంతో తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఈ విషయం తెలిసి ఎంపీ ఎం.భరత్‌రామ్ బాలుడి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులను ఓదార్చారు. వారి విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన సీఎం.. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.10 లక్షలు మంజూరు చేశారు. ఇందుకు సంబంధించిన చెక్కును ఎంపీ భరత్‌రామ్ బాలుడి తల్లిదండ్రులకు అందజేశారు. ఈ సందర్భంగా బాలుడి తల్లిదండ్రులు మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదంలో కుమారుడిని పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో తమకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్ద కొడుకులా అండగా నిలబడ్డారని పేర్కొన్నారు. సీఎం చేసిన సాయాన్ని జీవితంలో మర్చిపోలేమంటూ కృతజ్ఞతలు తెలియజేశారు. -
అసోం వరదలు.. రూ.25 కోట్ల సాయం ప్రకటించిన రియలన్స్ ఫౌండేషన్
వరదల కారణంగా అతలాకుతలమైన అసోంకు బాసటగా నిలిచేందుకు రిలయన్స్ ఫౌండేషన్ ముందుకు వచ్చింది. వరద సాయం కోసం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.25 కోట్ల సాయం అందిస్తున్నట్టు రియలన్స్ ఫౌండేన్ ప్రకటిచింది. రిలయన్స్ సాయం పట్ల అసోం ముఖ్యమంత్రి హేమంత బిశ్వశర్మ హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అసోంలో వరదలు ముంచెత్తాయి. వేలాది గ్రామాల్లో లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. గత నెలరోజులుగా అసోంతో పాటు కేంద్ర ప్రభుత్వాలకు సహాకారం అందిస్తూ క్షేత్రస్థాయిలో తన వంతు సేవా కార్యక్రమాలను రిలయన్స్ ఫౌండేషన్ కొనసాగిస్తూ వస్తోంది. ముఖ్యంగా వరదల కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న కచర్, సిల్చర్, కలైన్, బర్కోలా జిల్లాలో బాధితుగలకు అండగా రిలయన్స్ ఫౌండేషన్ అనేక కార్యక్రమాలు చేపడుతోంది. చదవండి: 'ట్రెండ్స్' ఫెస్టివల్ సేల్,దుస్తులపై భారీ డిస్కౌంట్! -
శ్రీలక్ష్మి కుటుంబానికి రూ.10 లక్షలు అందజేత
గుంటూరు వెస్ట్: గుంటూరు జిల్లా తుమ్మపూడి గ్రామానికి చెందిన వివాహిత శ్రీలక్ష్మి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన మేరకు సాయాన్ని అందించింది. ఈ ఏడాది ఏప్రిల్ 27న శ్రీలక్ష్మి హత్యకు గురైంది. ఆమె కుటుంబానికి ఆసరాగా ఉంటామని రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో ప్రకటించింది. ఆ మేరకు సోమవారం సీఎం సహాయ నిధి నుంచి వచ్చి న మొత్తం రూ.10 లక్షలను కలెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.. శ్రీలక్ష్మి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ నగదును చిన్నారులు ఇద్దరికీ చెరో రూ.5 లక్షల చొప్పున డిపాజిట్ చేసి, సోమవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో డిపాజిట్ పత్రాలను వారికి అందజేశారు. దీంతోపాటు ఇంటి స్థలం పట్టా, ఇల్లు మంజూరు చేసిన పత్రాలనూ అందజేశారు. జేసీ రాజకుమారి, డీఆర్వో చంద్రశేఖరరావు పాల్గొన్నారు. -
టీడీపీ నేత కుమారుడికి ప్రభుత్వం పునర్జన్మ
ముమ్మిడివరం: క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ టీడీపీ నేత కుమారుడికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. మానవతా దృక్పథంతో ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్ఎఫ్) ద్వారా ఆదుకుంది. సకాలంలో డబ్బులు అందజేసి యువకుడిని కాపాడింది. వివరాలు.. తూర్పు గోదావరి జిల్లా టి.కొత్తపల్లికి చెందిన టీడీపీ నేత నక్కా రామకృష్ణ కుమారుడు దిలీప్ సదన్య(18) బోన్ కేన్సర్‌తో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. కుమారుడి వైద్య ఖర్చుల కోసం రామకృష్ణ తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్‌కు తెలిసింది. ఆయన వెంటనే స్పందించి.. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ.7.50 లక్షలు మంజూరు చేయించారు. ఈ సొమ్ముతో నెల రోజుల కిందట హైదరాబాద్‌లోని సిటిజన్ హాస్పిటల్లో దిలీప్‌కు వైద్యం చేయించారు. అతడు ప్రస్తుతం పూర్తిగా కోలుకుని ఇంటికి క్షేమంగా చేరుకున్నాడు. ఈ నేపథ్యంలో నక్కా రామకృష్ణ కుటుంబసభ్యులు సోమవారం ఎమ్మెల్యే పొన్నాడను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రభుత్వం చేసిన ఈ సాయానికి ఎప్పటికీ రుణపడి ఉంటామన్నారు. -
నిమ్స్‌లో తొలిసారిగా ఊపిరితిత్తుల మార్పిడి చికిత్స
హైదరాబాద్: అంతర్జాతీయ స్థాయి వైద్య ప్రమాణాలను కలిగిన నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్)లో తొలిసారిగా ఊపిరితిత్తుల మార్పిడి శస్త్ర చికిత్స జరిగింది. ప్రభుత్వాస్పత్రుల్లోనే మొట్టమొదటి సారిగా నిమ్స్ సిటీ సర్జన్ డాక్టర్ ఎం.అమరేష్ రావు వైద్య బృందం విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించింది. ఏపీలోని కర్నూలుకి చెందిన డి.శేఖర్ కుమార్తె కళ్యాణి (17)కి కొంతకాలంగా ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారింది. బాత్రూమ్కు కూడా ఆక్సిజన్ లేకపోతే వెళ్లలేని పరిస్థితి. ఆమె ఊపిరితిత్తులు పూర్తిగా క్షీణదశకు చేరుకోవడంతో సెప్టెంబర్11న నిమ్స్‌లో చేరింది. ఊపిరితిత్తుల మార్పిడి చేయాలని వైద్యులు నిర్థారించారు. ఇందుకు ఏపీ ప్రభుత్వం కూడా సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆపరేషన్‌కు అయ్యే ఖర్చును భరించేందుకు ముందుకు వచ్చింది. కళ్యాణికి ఆరోగ్య శ్రీ ద్వారా ఆపరేషన్ చేసేందుకు నిమ్స్ వైద్యులు సమాయత్తమై ఊపిరితిత్తుల దాత కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో సికింద్రాబాద్ తాడ్‌బన్‌కు చెందిన సుశీల(47) గత నెల 27న బోయినపల్లిలో రోడ్ క్రాస్ చేస్తుండగా బైక్ వచ్చి ఢీ కొట్టింది. మెరుగైన చికిత్స కోసం ఆమెను మాదాపూర్‌లోని మెడికవర్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోవడంతో వైద్యులు బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించారు. జీవన్‌దాన్ కార్యక్రమంలో ఆమె అవయవాలను దానం చేసేందుకు బంధువులు ముందుకు వచ్చారు. ఈ విషయం తెలిసి జీవన్‌దాన్ కో–ఆర్డినేటర్ సుశీల అవయవాలను సేకరించారు. ఆమె ఊపిరితిత్తులను నిమ్స్ ఆస్పత్రికి గ్రీన్ చానల్ ద్వారా తరలించారు. హైదరాబాద్ పోలీసుల సహకారంతో ఊపిరితిత్తులను మాదాపూర్ నుంచి పంజగుట్ట నిమ్స్ ఆస్పత్రికి 11 నిమిషాల్లోనే అంబులెన్స్‌లో చేర్చారు. బుధవారం ఉదయం 7.51 నిమిషాలకు అంబులెన్స్ నిమ్స్ మిలీనియం బ్లాక్‌కు చేరుకుంది. అక్కడ కళ్యాణికి ఊపిరితిత్తుల మార్పిడి చేయడానికి నిమ్స్ వైద్యులు సిద్ధంగా ఉన్నారు. వెంటనే ఊపిరితిత్తుల మార్పిడిని మొదలుపెట్టి 8 గంటల పాటు శ్రమించి ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం కళ్యాణి అబ్జర్వేషన్లో ఉన్నట్లు డాక్టర్ అమరేష్‌రావు తెలిపారు. -
ఏపీ వరదలు: బాధితుల కోసం చిరంజీవి, మహేశ్, తారక్‌ల భారీ విరాళాలు
ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఏపీలోని పలు జిల్లాలు వరదలకు గురైన సంగతి తెలిసిందే. ఈ వరదల్లో చిక్కుకుని కొంతమంది ప్రాణాలు కోల్పోగా.. మరికొందరూ ఆర్థికంగా నష్టపోయారు. ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పడు తక్షణ చర్యలు చేపడుతూ ప్రజలకు అండగా నిలుస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వానికి అండగా సినీ ప్రముఖులు తరలి వస్తున్నారు. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు 25 లక్షల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం అందించారు. In light of the devastating floods in Andhra Pradesh, I would like to contribute 25 lakhs towards the CMRF. Request everyone to come forward and help AP during this hour of crisis. 🙏@ysjagan @AndhraPradeshCM — Mahesh Babu (@urstrulyMahesh) December 1, 2021 ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్ వేదికగా వెల్లడించారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల కురిసిన వర్షాలకు భయంకరమైన విపత్తు వచ్చింది. దీని కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాంటి వారికి చేయూతగా ముఖ్యమంత్రి సహాయ నిధికి నా వంతు సాయంగా రూ. 25 లక్షలు విరాళం అందిస్తున్నాను. ఈ సంక్షోభ సమయంలో అందరూ ముందుకు వచ్చి ఏపీకి సహాయం చేయాలని అభ్యర్థిస్తున్నాను’ అంటూ చేతులు జోడించిన ఏమోజీని జత చేశారు. Pained by the wide spread devastation & havoc caused by floods & torrential Rains in Andhra Pradesh. Making a humble contribution of Rs.25 lacs towards Chief Minister Relief Fund to help aid relief works. @ysjagan @AndhraPradeshCM pic.twitter.com/cn0VImFYGJ — Chiranjeevi Konidela (@KChiruTweets) December 1, 2021 అలాగే మెగాస్టార్ చిరంజీవి సైతం ముందుకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్ వరదల విపత్తు బాధిత కుటుంబాలకు నా వంతూ సాయంగా ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 25 లక్షలు విరాళం ప్రకటిస్తున్నాను’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా తన వంతు సాయంగా బాధితుల కోసం రూ. 25 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. ఈ మేరకు ఎన్టీఆర్ ట్వీట్ చేస్తూ.. ‘ఏపీ వరద విపత్తుకు నేను చేసే సాయం చిన్నదైనా బాధితులకు ఇది ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. Moved by the plight of people affected by the recent floods in Andhra Pradesh, I am contributing 25 lakhs as a small step to aid in their recovery. — Jr NTR (@tarak9999) December 1, 2021 -
టీడీపీ ప్రభుత్వ హయాంలో CMRF నిధుల గోల్మాల్
-
నా పుట్టినరోజు వేడుకలు చేయకండి
సాక్షి, ముంబై: రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని తన పుట్టినరోజు వేడుకలు నిర్వహించవద్దని పార్టీ పదాధికారులు, కార్యకర్తలు, అభిమానులకు శివసేన అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే విజ్ఞప్తి చేశారు. ప్రతీ ఏడాది ఉద్ధవ్ ఠాక్రే పుట్టిన రోజు అయిన జూలై 27వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఎంతో ఉత్సాహంగా కేక్ కట్ చేసి సÜంబరాలు చేసుకుంటారు. కానీ, గత కొంతకాలంగా రాష్ట్రాన్ని కరోనా మహమ్మారి పట్టి పీడిస్తోంది. కరోనా రెండో వేవ్ ఇంకా పూర్తిగా సద్దుమణుగక ముందే మూడో వేవ్ వచ్చే ప్రమాదమూ ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా కబంధ హస్తాల నుంచి ఇంకా బయటపడక ముందే ప్రకృతి కన్నెర్ర చేసింది. రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అనేక జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. ముఖ్యంగా ఆరు జిల్లాల్లో వరదలు వచ్చి పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. భారీ వర్షాలకు వందలాది గ్రామాలు వరద ముంపునకు గురయ్యాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. చాలాచోట్ల విద్యుత్, తాగు నీటి సరఫరా నిలిచిపోయింది. బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. కొండచరియలు విరిగిపడి అనేక మంది మృతిచెందారు. ఇలాంటి విపత్కర సమయంలో తాను సంతోషంగా ఎలా ఉండగలనని, పుట్టిన రోజు వేడుకలు ఎలా చేసుకుంటానని ఉద్ధవ్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను వేడుకలు చేసుకోవడం లేదని, కార్యకర్తలు, అభిమానులు కూడా వేడుకలు నిర్వహించకూడదని కోరారు. అంతేగాక, తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి ఎవరూ ముంబైకి రావద్దని ఉద్ధవ్ విజ్ఞప్తి చేశారు. ముంబై, ఇతర నగరాలతో పాటు జిల్లాల్లో, గ్రామాల్లో రహదారులపై, ప్రధాన కూడళ్ల వద్ద పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసే పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు, ప్రవేశ ద్వారాలు, కటౌట్లు ఏర్పాటు చేయవద్దని సూచించారు. కేవలం ఈ–మెయిల్, ఇతర సోషల్ మీడియా ద్వారా పంపించే శుభాకాంక్షలు మాత్రమే స్వీకరిస్తానని ఉద్ధవ్ తెలిపారు. ప్రభుత్వం అమలుచేస్తున్న లాక్డౌన్ నిబంధనలను పాటిస్తూ అందరూ ఇళ్లలోనే ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఎలాంటి బహిరంగ కార్యక్రమాలు ఏర్పాటు చేయవద్దని సూచించారు. అనవసరంగా వేడుకల కోసం డబ్బులు వృథా చేయకుండా, వరద బాధితుల కోసం నిధులు పోగుచేసి ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్)కి పంపించాలని కోరారు. ఇదే తన పుట్టిన రోజుకు కార్యకర్తలు, అభిమానులు ఇచ్చే కానుక అని ఉద్ధవ్ ఉద్ఘాటించారు. -
గొల్లపల్లి వద్ద రోడ్డుప్రమాద మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా
సాక్షి, కృష్ణాజిల్లా: మార్చిలో గొల్లపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వారికి రాష్ట్రప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా మంజూరు చేసింది. బాధిత గిరిజన కుటుంబాలకు ఆర్థిక సహాయం ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యే మెకాప్రతాప్ అప్పారావు ప్రభుత్వాన్ని కోరారు. ఎమ్మెల్యే అభ్యర్ధన మేరకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మృతులు 7 గురికి ఒక్కొక్కరికి రూ.5లక్షలు, తీవ్రంగా గాయపడిన 7గురికి ఒక్కొక్కరికి రూ.1లక్ష చొప్పున మొత్తం 42 లక్షల ఏక్సిగ్రేషియోను ప్రభుత్వం మంజూరు చేస్తూ జి.ఓ.జారీ చేసింది. కాగా నూజివీడు మండలం గొల్లపల్లి వద్ద మార్చి 14 న జరిగిన రోడ్డు ప్రమాదంలో సిద్దార్ధనగర్ గిరిజన కుటుంబాల సభ్యులు మృతి చెందగా, కొందరు తీవ్రంగా గాయపడ్డారు. -
‘సీఎం వైఎస్ జగన్‌కు సదా కృతజ్ఞుడినై ఉంటా’
గుంటూరు: సీఎం సహాయనిధి ఆ ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపింది. పరిపూర్ణ ఆరోగ్యవంతులను చేసింది. ఎన్నోఏళ్ల నుంచి గూనితో బాధపడుతున్న వారికి విముక్తి కల్పించింది. గుంటూరు కొత్తపేట నారాయణ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిలో ఈనెల 13, 14 తేదీల్లో న్యూరోమానిటరింగ్ సిస్టమ్ ద్వారా శస్త్రచికిత్సలు చేయించుకున్న కాంతారావు, వినోద్‌కుమార్ ఆనందంగా ఇళ్లకు వెళ్లారు. ఈ విషయాన్ని ఆస్పత్రి స్పయిన్ సర్జన్ డాక్టర్ దుంపా శ్రీకాంత్‌రెడ్డి బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఒక్కొక్కరికి రూ.ఏడు లక్షల ఖరీదైన ఆపరేషన్‌ను ఉచితంగా చేసినట్టు వివరించారు. శస్త్రచికిత్సకు 8 గంటల సమయం పట్టిందని, గూనిని ప్రాథమిక దశలోనే గుర్తిస్తే ఫిజియోథెరపీతోనే నయం చేయొచ్చని వెల్లడించారు. సమావేశంలో కార్డియాలజిస్ట్ డాక్టర్ గుండం శివశ్రీనివాసరెడ్డి, సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ హర్ష, క్రిటికల్‌కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ సింధు పాల్గొన్నారు. కాంతారావు కష్టాలకు ఇక చెల్లు ఈచిత్రంలో ఉన్న వ్యక్తిపేరు బి.కాంతారావు. వయసు 40 ఏళ్లు. ఊరు ఊటుకూరు. గూని వల్ల వెన్నుపూస పూర్తిగా ఒంగిపోయింది. రోజువారీ కూలీపనులు చేసుకునే ఇతను చాలా కష్టపడేవాడు. కొన్నిసార్లు కాలు జాలువారేది. ఊపిరి తీసుకోవడమూ కష్టమయ్యేది. ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్న ఇతనికి సీఎం సహాయనిధి వరమైంది. ఎట్టకేలకు శస్త్రచికిత్స చేయించుకుని ఆరోగ్యవంతుడయ్యాడు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి సదా కృతజ్ఞుడినై ఉంటానని చెబుతున్నాడు. జీవితమంతా ‘వినోద్’మే ఈ చిత్రంలో ఉన్న వ్యక్తి పేరు వినోద్‌కుమార్. వయసు 17ఏళ్లు. ఊరు అమలాపురం. ఇంటర్ చదువుతున్నాడు. పుట్టుకతోనే గూని ఉంది. చిన్ననాటి నుంచి ఎంతో కష్టపడేవాడు. ఇటీవల నడుంనొప్పి, కాళ్ల తిమ్మిర్లు, సూదులు గుచ్చినట్టు ఉండడంతో తీరని వేదన అనుభవించాడు. వైద్యులను సంప్రదిస్తే ఆపరేషన్ చేయాలనడంతో ఆర్థిక స్తోమత లేక మిన్నకుండిపోయాడు. ఎట్టకేలకు సీఎం సహాయనిధి ఆయన జీవితంలో వెలుగులు నింపింది. ఆపరేషన్ చేయించింది. -
మూడోదశకు.. రూ.వంద కోట్లు
సాక్షి ప్రతినిధి, చెన్నై: కరోనా మహమ్మారి కట్టడికి మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కరోనా థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మరో రూ.100 కోట్లు కేటాయిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ద్రవ ఆక్సిజన్ కొనుగోలుకు, కరోనా థర్డ్‌వేవ్‌కు సంబంధించి ముందుజాగ్రత్త చర్యలు చేపట్టేందుకు ఈ నిధులను వినియోగించాలని స్పష్టం చేశారు. కరోనా కట్టడికి ప్రజలు ఇప్పటి వరకు అందించిన సహకారంతోపాటూ ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.353 కోట్లు ఖర్చుచేసినట్లు ఆయన వెల్లడించారు. సీఎం రిలీఫ్ ఫండ్‌కు దాతలు అందజేసిన విరాళాలను కరోనా నివారణకే ఖర్చుచేస్తామని పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చినప్పుటి నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ద్రవ ఆక్సిజన్, రెమ్‌డెసివర్ ఇంజెక్షన్ కొనుగోలుకు, రైళ్లద్వారా దిగుమతి చేసుకునేందుకు కంటైనర్ల కొనుగోలుకు మొదటగా రూ.50 కోట్లు వినియోగించామన్నారు. అలాగే కరోనా సెకెండ్ వేవ్ కట్టడికై రోజుకు 1.60 లక్షల ఆర్టీపీసీఆర్ పరీక్షలకు కిట్లు సరఫరా తదితర అవసరాల కోసం మరో రూ.50 కోట్లు వెచ్చించినట్లు పేర్కొన్నారు. ఇదే కాకుండా సిప్కాట్ పారిశ్రామికవాడ ద్వారా సింగపూర్ తదితర దేశాల నుంచి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కొనుగోలుకు రూ.25 కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కేటాయించినట్లు వెల్లడించారు. తాజాగా థర్డ్ వేవ్ కోసం మరో రూ.100 కోట్లు విడుదల చేసిన ట్లు చెప్పారు. త్వరలో డెల్టాప్లస్ పరిశోధనా కేంద్రం: మంత్రి సుబ్రమణియన్ ఎంజీఆర్ వైద్య విశ్వవిద్యాలయంలో డెల్టా ప్లస్ పరిశోధనా కేంద్రాన్ని నెలకొల్పుతున్నట్లు ప్రజా సంక్షేమశాఖ మంత్రి ఎం. సుబ్రమణియన్ తెలిపారు. ఈ పరిశోధనా కేంద్రం త్వరలో అందుబాటులోకి రానుందన్నారు. చెన్నై గిండీలోని ఎంజీఆర్ వర్సిటీని మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, రూపు మార్చుకుంటున్న కరోనా గుర్తించేందుకు ఇక్కడ పరిశోధనలు చేస్తారన్నారు. ఇక తమిళనాడుకు కొత్తగా మంజూరైన 11 వైద్యకళాశాలల నిర్మాణం పనులు చురుకుగా సాగుతున్నాయన్నారు. వీటిని వచ్చే విద్యాసంవత్సరంలోగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాని, సిద్ధవైద్య యూనివర్సిటీ స్థాపనకు ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. డెల్టాప్లస్ సోకిందన్న అనుమానంతో 1000 మంది నుంచి రక్త నమూనాలు సేకరించి బెంగళూరు లాబ్‌కు పంపించినట్లు పేర్కొన్నారు. వీరిలో 10 మందికి డెల్టాప్లస్ నిర్ధారణ అయ్యిందన్నారు. కరోనా థర్డ్‌వేవ్ వస్తుందా..? రాదా..? అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గురు నాగరాజన్ నీట్ ప్రవేశపరీక్షను అడ్డుపెట్టుకుని రాజకీయలబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. న్యాయమూర్తి ఏకే రాజన్ నేతృత్వంలోని నీట్ ప్రవేశపరీక్ష సాదకబాధకాలపై ఏర్పాటు చేసిన కమిటీకి ప్రజల నుంచి ఇప్పటి వరకు 86,342 విజ్ఞప్తులు వచ్చాయన్నారు. ప్రజాభిప్రాయం ప్రకారం ఈ కమి టీ ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుందన్నారు. బీజేపీ దాని మిత్రపక్షాలు నీట్ ప్రవేశపరీక్షపై స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. మద్రాసు హైకోర్టులో విచారణలో ఉన్న నీట్ కేసు జులై 5వ తేదీకి వాయిదా పడిందని తెలిపారు. చదవండి: థర్డ్ వేవ్ ప్రిపరేషన్: కేంద్రం కీలక నిర్ణయం -
సీఎంఆర్ఎఫ్లో భాగస్వాములుకండి: మంత్రి గౌతమ్‌రెడ్డి
సాక్షి, అమరావతి : కరోనా విపత్తను ఎదుర్కోవడానికి సీఎంఆర్ఎఫ్లో భాగస్వాములు కావాలని మంత్రి గౌతమ్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలకు పరిశ్రమలు అండగా ఉంటాయని, ఆక్సిజన్ పాలసీ, ఆక్సిజన్ తయారీ పాలసీ తీసుకొస్తామని చెప్పారు. సీఎంఆర్ఎఫ్కు తన సొంత సంస్థ కేఎంసీ నుంచి రూ.కోటిన్నర ప్రకటించారు. మంత్రి పిలుపు మేరకు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా, భారీ పరిశ్రమలు ముందుకొచ్చాయి. అమరరాజ బ్యాటరీ సంస్థ సీఎంఆర్ఎఫ్కు రూ.కోటి విరాళం ప్రకటించింది. చిత్తూరు జిల్లాలో 500 బెడ్ల ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపింది. హిందుస్థాన్ యూనిలివర్ సంస్థ తూ.గో.జిల్లాకు 50 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ఇస్తామని ప్రకటించింది. సీసీఎల్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ సీఎంఆర్ఎఫ్కు రూ.కోటి 11 లక్షలు.. డిక్సస్ కంపెనీ రూ.75 లక్షలు విరాళం ప్రకటించాయి. -
ప్రవాసాంధ్రుల్లారా ఆపత్కాలంలో ఏపీకి అండగా నిలవండి
సాక్షి, అమరావతి: ప్రస్తుతం కరోనా కష్టకాలంలో ప్రవాసాంధ్రులు ఆంధ్రప్రదేశ్‌కు అండగా నిలవాలని ఏపీ స్పెషల్ రిప్రజంటేటివ్ రత్నాకర్ పిలుపునిచ్చారు. ప్రభుత్వానికి సాధ్యమైనంత సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. సీఎం సహాయ నిధికి చేసే సహాయంతో ఏపీలో మరిన్ని మెరుగైన వసతులు ఏర్పాటు చేసుకోవచ్చు అని గుర్తుచేశౠరు. మరింత వేగంగా ఎక్కువ మందికి వాక్సినేషన్ ఇవ్వొచ్చు అని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఓ వీడియో సందేశం విడుదల చేశారు. మీరు చేసే సహాయం మరిన్ని ఆస్పత్రులకు ఆక్సిజన్, వెంటిలేటర్, ఎక్మో సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావచ్చు అని రత్నాకర్ చెప్పారు. ప్రవాసాంధ్రులు ముందుకు వస్తే ఏపీలో ఆరోగ్య సౌకర్యాల కల్పన వేగంగా జరుగుతుందని పేర్కొన్నారు. సీఎం జగన్మోహన్రెడ్డి శక్తికి మించి ప్రజలకు కరోనా నుంచి సేవలు చేస్తున్నారని గుర్తుచేశారు. మనం బాధ్యతగా ఏపీవాసులకు అండగా నిలుద్దామని ప్రవాసాంధ్రులకు ఏపీ స్పెషల్ రిప్రజంటేటివ్ రత్నాకర్ చెప్పారు. చదవండి: రాబోయే 3, 4 వారాలు చాలా కీలకం.. మరింత జాగ్రత్త చదవండి: లాక్డౌన్ పెట్టాలా లేదా అన్నది సీఎం నిర్ణయం -
‘జగనన్న విద్యా దీవెన పేద విద్యార్థులకు వరం’
-
‘సీఎం జగన్ మీది ఏ పార్టీ.. ఏ మతం అని చూడడు’
సాక్షి, విజయవాడ: నగరంలోని సెంట్రల్ నియోజకవర్గంలోని 50 మందికి లబ్ధిదారులకు ఎమ్మెల్యే మల్లాది విష్ణు 29,75,000 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు శిరీష, సునీత, అనిత, లక్ష్మీ పతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. పార్టీ చూడం మతం చూడం అనే నినాదంతో ముందుకు వెళ్తున్నారు. చంద్రబాబు సీఎంఆర్ఎఫ్పై పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో 5 కోట్ల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించాం’’ అని తెలిపారు. ‘‘సీఎం జగన్ రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నారు. చంద్రబాబు నీచ రాజకీయాలను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. రాష్ట్ర ప్రజలందరికి ఆరోగ్యశ్రీ అందుబాటులోకి తెచ్చాం. ఆస్పత్రి ఖర్చు1000 రూపాయలు దాటిన వారికి ఉచితంగా వైద్యం అందిస్తున్నాం. ఆరోగ్యశ్రీకి సంబంధించిన హాస్పిటల్స్‌లో బకాయిలు లేకుండా చూస్తున్నాం. నాడు-నేడు కార్యక్రమం ద్వారా ఆస్పత్రుల్లో అభివృద్ధి పనులు చేస్తున్నాం’’ అని మల్లాది విష్ణు తెలిపారు. -
మంచి మనిషి;16 ఏళ్లుగా రైతులకు సాయం
సాక్షి, అమరావతి బ్యూరో: కరువు సీమలో కరెంటు బిల్లులు చెల్లించడానికే కటకటలాడే రైతు పరిస్థితిని ప్రత్యక్షంగా చూశారు. ‘ఎలాగోలా కడతాం.. కరెంట్ తీసేయకండి బాబూ’ అంటూ ప్రాధేయపడే వారి గోడునూ విన్నారు. అన్నదాత ఆవేదన ఆయనను కదిలించింది. వారికి తన వంతుగా ఏదైనా చేయాలి.. అన్న ఆలోచన వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన ఉచిత విద్యుత్ పథకంతో కార్యరూపం దాల్చింది. అప్పట్నుంచి రైతుకు మేలు చేసే ఆ పథకంలో తానూ పాలుపంచుకుంటున్నారు. నెలనెలా తన జీతం నుంచి కొంత మొత్తాన్ని ఆ పథకం కోసం వెచ్చిస్తున్నారు. రైతుల కష్టాలు చూసి.. ప్రకాశం జిల్లా వేటపాలెంకు చెందిన ఊటుకూరి గోపాలకృష్ణమూర్తి.. ప్రస్తుతం విజయవాడ కేంద్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్)లో ఫైనాన్స్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. విద్యుత్ శాఖలో తొలుత అనంతపురం జిల్లా ధర్మవరంలో జూనియర్ అకౌంట్స్ అధికారి (జేఏవో)గా 1986లో చేరారు. విధి నిర్వహణలో భాగంగా రైతుల వ్యవసాయ విద్యుత్ బిల్లుల వసూళ్లకు వెళ్లేవారు. అప్పట్లో 5హెచ్‌పీ మోటారుకు నెలకు వచ్చే రూ.37 బిల్లును కూడా నాగసముద్రంగేటు, రామగిరి, వంటి వెనకబడ్డ ప్రాంతాల్లో కొంతమంది రైతులు చెల్లించలేక పోయేవారు. ఆ తర్వాత నెల్లూరు జిల్లా నాయుడుపేట ఏఏవోగా బదిలీ అయిన ఆయనకు ఓజిలి, పెళ్లకూరుల్లోనూ దాదాపు అలాంటి పరిస్థితులే కనిపించాయి. ఇలాంటి రైతులకు తనవంతు సహాయం అందించాలనే తపన అప్పట్నుంచీ ప్రారంభమయ్యింది. ప్రజా ప్రస్థానం పాదయాత్ర సందర్భంగా రైతుల కష్టాలు కళ్లారా చూసిన వైఎస్ రాజశేఖరరెడ్డి, 2004లో అధికారంలోకి రాగానే.. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు రైతులకు ఉచిత విద్యుత్ పథకం ఫైలుపై ముఖ్యమంత్రిగా తొలి సంతకం చేశారు. ఆ పథకంతో గోపాలకృష్ణమూర్తికి ఒక మార్గం దొరికింది. నెలనెలా ఇలా.. ఒక రైతుకు సుమారుగా ఏడాదికయ్యే విద్యుత్ బిల్లును ప్రభుత్వం ద్వారా తాను చెల్లించాలని మూర్తి నిర్ణయించుకున్నారు. అలా 2004 మే నుంచి మొదలుకుని నెల నెలా తన జీతం నుంచి తొలుత రూ.500 చొప్పున ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్)కి చెల్లించడం మొదలు పెట్టారు. ఏటా మార్చిలో ఆ మొత్తాన్ని పెంచుతూ వచ్చారు. అలా ఇప్పుడు నెలకు రూ.6,500 చెల్లిస్తున్నారు. ప్రతి నెలా తన జీతం నుంచే ఆ సొమ్ము సీఎంఆర్ఎఫ్కు వెళ్లేలా ఏర్పాటు చేశారు. ఇలా 16 ఏళ్లుగా చెల్లింపులను నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. మూర్తి స్ఫూర్తితో మరికొందరు.. గోపాలకృష్ణమూర్తిని సాటి ఉద్యోగులూ ఆదర్శంగా తీసుకున్నారు. అప్పట్లో విద్యుత్‌శాఖ ‘పవర్‌లైన్’ పేరిట నడిపే మ్యాగజైన్లో మూర్తి గురించి ప్రచురించారు. దీంతో స్ఫూర్తి పొందిన మరికొందరు విద్యుత్ శాఖ ఉద్యోగులు తమకు తోచినంత సీఎంఆర్ఎఫ్కు నెలనెలా పంపించడం మొదలుపెట్టారు. తుదిశ్వాస వరకు ఇస్తా.. రైతులకు సాయపడే విషయంలో నా ఆనందం మాటల్లో చెప్పలేను. మరో ఏడాదిన్నరలో పదవీ విరమణ చేస్తున్నాను. అయినా ఇది ఆపను. నాకొచ్చే పెన్షన్ సొమ్ములోనూ కొంత కేటాయిస్తా. ఏటా పెంచకపోయినా, ఇప్పుడు చెల్లిస్తున్న మొత్తాన్ని మాత్రం తగ్గించను. ఇలా నా ప్రాణం ఉన్నంత వరకు కొనసాగిస్తా. నన్ను నా కుటుంబసభ్యులూ ప్రోత్సహిస్తున్నారు. తండ్రి పేరిట రూ.కోటిన్నర విలువైన భూమి ప్రభుత్వానికి అప్పగింత తాళ్లరేవు (ముమ్మిడివరం): పుట్టిన ఊరి కోసం ఆ తండ్రి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడితే.. ఆయన వారసులు ఆ తండ్రి పేరిట భారీ భూదానం చేశారు. వివరాల్లోకి వెళితే.. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని ఇంజరం గ్రామానికి చెందిన దివంగత నృసింహదేవర సత్యనారాయణ మూర్తి (దత్తుడు) పలుమార్లు సర్పంచ్‌గా పనిచేసి గ్రామాభివృద్ధిలో కీలక భూమిక పోషించారు. నిరుపేదలకు గృహ నిర్మాణాల నుంచి పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలతోపాటు ఆరోగ్య ఉప కేంద్రాన్ని తీసుకువచ్చి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ప్రభుత్వ కార్యాలయాలను నిర్మించేందుకు ప్రభుత్వ స్థలం లేని పరిస్థితుల్లో ఆయన తన సొంత భూమిని ఆయా భవనాలకు కేటాయించి అందరి మన్ననలు పొందారు. ప్రస్తుతం దేశానికే తలమానికంగా మారిన గ్రామ సచివాలయ వ్యవస్థలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌ల నిర్మాణానికి ఆయన కుమారులు రూ.కోటిన్నరకు పైగా విలువైన భూమిని దానం చేశారు. దత్తుడు మరణానంతరం కూడా ఆయన సేవా వారసత్వాన్ని కుమారులు కొనసాగిస్తూ ఊరి అవసరాల కోసం ప్రభుత్వానికి భూమిని అందించారు. -
సీఎంఆర్ఎఫ్ చెక్కుల స్కామ్‌లో అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్లు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్)నుంచి రూ.117 కోట్లు కొట్టేసేందుకు చేసిన ప్రయత్నంలో పలు రాష్ట్రాలకు చెందిన సైబర్ నేరగాళ్ల పాత్ర ఉన్నట్టు స్పష్టమవుతోంది. ఈ స్కామ్ సూత్రధారులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టిన సీఐడీ బృందాలు.. ప్రధాన సూత్రధారి బీహార్‌కు చెందిన సింగ్‌ను పట్టుకుని విచారించగా.. అతను కీలక విషయాలు వెల్లడించినట్టు సమాచారం. బీహారే కాకుండా కర్ణాటక, ఒడిశా, జార్ఖండ్, పశ్చిమబెంగాల్ లింకులు వెలుగుచూసినట్లు తెలుస్తోంది. సింగ్‌తో పాటు మరికొందరిని కూడా అదుపులోకి తీసుకున్న సీఐడీ మొత్తం 30 మంది అనుమానితుల జాబితా సిద్ధం చేసింది. మిగతావారి కోసం సీఐడీ ప్రత్యేక బృందాలు ఆయా రాష్ట్రాల్లో గాలింపు ముమ్మరం చేశాయి. రూ.117 కోట్లు కొట్టేసేందుకు యత్నం గత సెప్టెంబర్‌లో పశ్చిమబెంగాల్, కర్ణాటకలోని బ్యాంకుల్లో మూడు చెక్కులతో మొత్తం రూ.117 కోట్లు డ్రా చేసేందుకు అగంతకులు ప్రయత్నించారు. ఆ చెక్కులు ఏపీ సీఎంఆర్ఎఫ్కు చెందినవి కావడంతో అనుమానం వచ్చిన ఆయా బ్యాంకుల ప్రతినిధులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెలగపూడి బ్రాంచి అధికారులను సంప్రదించారు. అవి ట్యాంపరింగ్ చేసిన నకిలీ చెక్కులుగా నిర్ధారించిన ఎస్బీఐ అధికారులు వాటి చెల్లింపులు నిలిపివేశారు. ఆ తర్వాత కడపలోనూ ఫోర్జరీ చెక్కుతో సీఎంఆర్ఎఫ్ నిధులు రూ.9.95 లక్షలు డ్రా చేసే ప్రయత్నాన్ని బ్యాంకు అధికారులు నిలువరించారు. దీనిపై సీఐడీ దర్యాప్తు చేపట్టింది. చెక్కుల విషయమై క్షేత్రస్థాయిలో పరిశీలించి చిన్న మొత్తాలతో కూడిన చెక్కులను పెద్ద మొత్తాలుగా ట్యాంపర్ చేసినట్లు తేల్చారు. అనంతరం ఆయా రాష్ట్రాల్లో దర్యాప్తు ప్రారంభించారు. 22 మందిని విచారించిన సీఐడీ! తొలుత కర్ణాటకలోని మంగళూరులోను, పశ్చిమబెంగాల్లోని కొల్కతా బ్యాంకుల్లో రికార్డులను సీఐడీ అధికారులు తనిఖీ చేశారు. ఫోర్జరీ చెక్కులు మార్చేందుకు ప్రయత్నించిన రోజుల్లో ఆయా బ్యాంకుల్లోని సీసీ కెమెరాల వీడియో ఫుటేజీలను పరిశీలించారు. ఈ క్రమంలోనే బీహార్‌కు చెందిన సింగ్‌ను పట్టుకున్నారు. అతను ఇచ్చిన కీలక సమాచారంతో మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విధంగా ఇప్పటివరకు పలు రాష్ట్రాలకు చెందిన 22 మందిని పట్టుకుని విచారించినట్లు సమాచారం. వారిచ్చిన సమాచారం ఆధారంగా ఆయా రాష్ట్రాల్లో నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. కాగా నిందితులకు ఏపీకి చెందిన కొందరు కూడా సహకరించినట్లు తెలుస్తోంది. -
సచివాలయ అధికారుల పాత్ర
సాక్షి, అమరావతి: నకిలీ చెక్కులతో ముఖ్యమంత్రి సహాయనిధి(సీఎం ఆర్ఎఫ్) నుంచి రూ.117.15 కోట్లు కాజేసే కుట్ర వెనుక రాష్ట్ర సచివాలయంలోని కొందరు అధికారుల పాత్ర ఉన్నట్టుగా ప్రభుత్వం గుర్తించింది. ఆ అధికారుల సహకారంతోనే నకిలీ ఎస్బీఐ చెక్కులతో స్వాహా చేసేందుకు పథకం వేసినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారుల పాత్ర ఉండటంతో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)తోనే ఈ కేసు దర్యాప్తు చేయించాలని తాజాగా నిర్ణయించారు. కేసు దర్యాప్తులో సీఐడీ విభాగం ఏసీబీకి సహకరించనుంది. ► ఈ కేసు విచారణ చేపట్టాల్సిందిగా ఏసీబీని కోరుతూ రెవెన్యూ శాఖ ఇటీవల లేఖ రాసింది. కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ కేంద్రంగా సీఎంఆర్ఎఫ్ నిధులు కొల్లగొట్టడానికి ప్రయత్నించినట్లు వెలుగులోకి రావడంతో ఆయా రాష్ట్రాల్లో దర్యాప్తు చేసేందుకు సీఐడీ విభాగానికి అప్పగించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును సీఐడీకి బదిలీ చేశారు. ఈ క్రమంలో సీఐడీ విభాగం మూడు బృందాలను మంగుళూరు, కోల్‌కతా, ఢిల్లీకి కూడా పంపింది. ఏసీబీకి కేసు ఫైల్.. ► అయితే సచివాలయంలోని కొందరు అధికారుల పాత్ర ఉన్నట్లు గుర్తించడంతో ఈ కేసు ఏసీబీతో దర్యాప్తు చేయాలని తాజాగా నిర్ణయించారు. ఈ మేరకు ఏసీబీకి ఫైల్ పంపించారు. ► ఇతర రాష్ట్రాల్లో దర్యాప్తు జరపటంలో ఏసీబీకి సీఐడీ విభాగం సహకారం అందించనుంది. ఈ రెండు విభాగాలు సమన్వయంతో కేసును దర్యాప్తు చేయనున్నాయి. ► ఈ ఘరానా మోసంలో సూత్రధారులుగా భావిస్తున్న సచివాలయంలోని కొందరు అధికారుల పాత్రను వెలుగులోకి తెస్తామని ఏసీబీ వర్గాలు తెలిపాయి. -
‘నకిలీ చెక్కుల’పై ఏసీబీ విచారణ
సాక్షి, అమరావతి/ తాడికొండ: ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్)ని కొల్లగొట్టాలనే పెద్ద కుట్రతో నకిలీ చెక్కులు జారీచేసిన ముఠాతోపాటు దాని వెనుక ఉన్న అదృశ్య శక్తుల నిగ్గుతేల్చాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. ఈ బాగోతాన్ని ఆయన తీవ్రంగా పరిగణించి ముఠా గుట్టురట్టు చేయాలని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)ని ఆదేశించారు. ఫోర్జరీ సంతకాలు, స్టాంపులతో నకిలీ చెక్కులు జారీచేసిన ముఠా పాత్రధారులతోపాటు దీని వెనుక సూత్రధారులను కూడా పట్టుకోవాలన్నారు. (బెడిసికొట్టిన బడా మోసం) దీంతో ఈ వ్యవహారంపై లోతైన విచారణ జరిపి దోషులను పట్టుకోవాలంటూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి. ఉషారాణి ఏసీబీ డైరెక్టర్ జనరల్ పీఎస్ఆర్ ఆంజనేయులుకు ఆదివారం లేఖ రాశారు. మరోవైపు.. వెలగపూడి తాత్కాలిక సచివాలయంలోని భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్బీఐ)లోని సీఎంఆర్ఎఫ్ అకౌంట్ హ్యాక్ అయినట్లు అనుమానం ఉన్నందున దీని నుంచి చెల్లింపులను తాత్కాలికంగా నిలిపివేయాలని కూడా ఆమె బ్యాంకు మేనేజరుకు లేఖ రాశారు. అలాగే, బ్యాంకు అధికారుల అప్రమత్తతవల్ల నిధులు విడుదల కాలేదని.. కుట్ర చాలా పెద్దదైనందున విచారణ లోతుగా జరిపి దోషులను తేల్చాలని సీఎం ఆదేశించినట్లు అధికారులు పేర్కొన్నారు. మూడు రాష్ట్రాలల్లో వేర్వేరు పేర్లతో.. ఏపీకి చెందిన సీఎంఆర్ఎఫ్ నిధులను కొల్లగొట్టేందుకు ఒకేసారి న్యూఢిల్లీ, కోల్‌కత, కర్ణాటక నుంచి వేర్వేరు కంపెనీల పేరుతో నకిలీ చెక్కులు జారీ చేయడం వెనుక పెద్ద ముఠా ఉండి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. వీటిని ఈ ముఠానే ముద్రించిందా? లేక ఇందుకు బ్యాంకు, సీఎంఆర్ఎఫ్ విభాగాల్లోని వారు ఎవరైనా సహకరించారా? అనేది కూడా తేల్చనున్నారు. అద్వైతా వీకే హాలో బ్లాక్స్ అండ్ ఇంటర్‌లాక్స్, మల్లాబ్‌పూర్ పీపుల్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ, శర్మ ఫోర్జింగ్ పేర్లతో ఈ నకిలీ చెక్కులు జారీ అయ్యాయి. పక్కా స్కెచ్‌తోనే.. సీఎంఆర్ఎఫ్ నిధులను కొట్టేయాలనే భారీ కుట్రతో ఆ ముఠా పక్కా స్కెచ్‌తోనే యత్నించిందని ఉన్నతాధికారులు అంటున్నారు. వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు కంపెనీల పేరుతో కోట్ల రూపాయలు కొల్లగొట్టేందుకు చెక్కులు ఇచ్చారంటే ఆ కంపెనీలు బోర్డుకే పరిమితమైనవి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా ఏసీబీ బృందాలు మూడుచోట్లకు వెళ్లి విచారణ చేయనున్నాయి. తుళ్లూరులో కేసు నమోదు కాగా, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పేరిట భారీగా నగదు విత్‌డ్రా చేసేందుకు గుర్తుతెలియని వ్యక్తులు పన్నిన పన్నాగంపై ఆదివారం గుంటూరు జిల్లా తుళ్ళూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. సచివాలయం రెవెన్యూ విభాగం అసిస్టెంట్ సెక్రటరీ పి.మురళీకృష్ణ ఫిర్యాదు మేరకు తుళ్ళూరు–1 సీఐ ధర్మేంద్రబాబు కేసు నమోదు చేశారు. కాగా, ప్రభుత్వ రికార్డుల ప్రకారం రూ.16 వేలు, రూ.45 వేలు, రూ.45 వేలు చొప్పున ముగ్గురు వ్యక్తులకు జారీచేసిన చెక్కుల స్థానంలో రూ.117.15 కోట్లు విత్‌డ్రా చేసుకునేందుకు కొందరు వ్యక్తులు నకిలీ చెక్కులు సృష్టించి ఈ ఘరానా మోసానికి యత్నించారు. -
బెడిసికొట్టిన బడా మోసం
-
బెడిసికొట్టిన బడా మోసం
సాక్షి, అమరావతి: నకిలీ బ్యాంకు చెక్కులతో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నుంచి మూడు బ్యాంకుల ద్వారా ఏకంగా రూ.117.15 కోట్లు కొల్లగొట్టాలన్న కొందరి ఘరానా మోసం బెడిసికొట్టింది. చివరి నిమిషంలో ఆయా బ్యాంకు అధికారులు అప్రమత్తం కావడంతో భారీ మోసానికి అడ్డుకట్ట పడింది. ఒకేసారి మూడు రాష్ట్రాల నుంచి సీఎంఆర్ఎఫ్ నిధులను కొల్లగొట్టడానికి పకడ్బందీ పన్నాగం పన్నారంటే దీని వెనుక ఓ ముఠాతోపాటు కొందరు అధికారుల పాత్ర కూడా ఉండి ఉంటుందని భావిస్తున్నారు. అటు ఎస్బీఐ ఉన్నతాధికారులను ఇటు సీఎంఆర్ఎఫ్ అధికారులను విస్మయానికి గురిచేసిన ఈ పన్నాగం వివరాలిలా ఉన్నాయి.. మూడు చెక్‌లు.. రూ.117.15 కోట్లు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్)కి వెలగపూడిలోని ఎస్బీఐ బ్రాంచిలో బ్యాంకు ఖాతా ఉంది. సీఎంఆర్ఎఫ్ విభాగం జారీచేసిన రూ.52,65,00,000 విలువైన ఎస్బీఐ చెక్‌ను కర్ణాటకలోని మంగుళూరు బ్రాంచిలో డ్రా చేసేందుకు శుక్రవారం ఓ వ్యక్తి సమర్పించాడు. అంత పెద్ద మొత్తం కావడంతో ఆ చెక్‌ను పాస్ చేస్తున్న మిగతా బ్యాంకు అధికారికి చివరి నిమిషంలో సందేహం వచ్చింది. దాంతో ఆయన వెంటనే వెలగపూడిలోని ఎస్బీఐ బ్రాంచ్ అధికారులను.. వారు సీఎంఆర్ఎఫ్ విభాగం అధికారులను వాకబు చేశారు. అంత మొత్తంతో తాము ఎవరికీ చెక్ ఇవ్వలేదని సీఎంఆర్ఎఫ్ విభాగం అధికారులు చెప్పడంతో అసలు విషయం బయటపడింది. వెంటనే ఆ చెక్‌ను పాస్ చేయొద్దని మంగుళూరులోని బ్రాంచి అధికారులను ఆదేశించారు. దాంతో ఎస్బీఐ అధికారులు తమ ప్రధాన కార్యాలయంతోపాటు ప్రాంతీయ కార్యాలయాలనూ అప్రమత్తం చేశారు. ఇదే తరహాలో ఢిల్లీలోని ఎస్బీఐ సీసీపీసీ–1 బ్రాంచ్‌లో శనివారం రూ.39,85,95,540 విలువైన సీఎంఆర్ఎఫ్ ఖాతా నుంచి ఎస్బీఐ చెక్‌ను డ్రా చేసేందుకు సమర్పించారు. ఆ బ్యాంకు అధికారులు కూడా ఆ చెక్‌ను నిర్ధారించుకునేందుకు వెలగపూడి ఎస్బీఐ శాఖను వాకబు చేశారు. ఆ చెక్ కూడా తాము జారీచేయలేదని సీఎంఆర్ఎఫ్ విభాగం అధికారులు చెప్పారు. దాంతో ఆ చెక్‌ను కూడా పాస్ చేయకుండా బ్యాంకు అధికారులు నిలుపుదల చేశారు. ఇక కోల్‌కతలోని మోగ్రాహట్ ఎస్బీఐ బ్రాంచిలో కూడా రూ.24,65,00,000 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్‌ను డ్రా చేసేందుకు శనివారం సమర్పించారు. దానిపై ఆరా తీయగా అది కూడా నకిలీ చెక్ అనే నిర్ధారణ అయ్యింది. దాంతో మూడు వేర్వేరు చెక్‌ల ద్వారా రూ.117 కోట్లు కొల్లగొట్టేందుకు కొందరు వేసిన పన్నాగాన్ని బ్యాంకు అధికారులు సమర్థంగా నిలువరించగలిగారు. ప్రొఫెషనల్ ముఠా పనే? కేవలం రెండ్రోజుల్లో మూడు వేర్వురు రాష్ట్రాల నుంచి మూడు నకిలీ చెక్‌లతో ఏకంగా రూ.117కోట్లు కొల్లగొట్టేందుకు కొందరు యత్నించడం ఎస్బీఐ, సీఎంఆర్ఎఫ్ విభాగం అధికారులను కలవరపరుస్తోంది. ఇంత పకడ్బందీగా పన్నాగం పన్నారంటే దీని వెనుక ఓ ప్రొఫెషనల్ ముఠానే ఉండి ఉంటుందని భావిస్తున్నారు. ఇక ఆ చెక్‌లు వారికి ఎలా వచ్చాయన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఎవరైనా ఉద్యోగులు ఇందుకు సహకరించి ఉంటారా అనే సందేహాలు కూడా తలెత్తుతున్నాయి. దీనిపై పూర్తిస్థాయిలో విచారిస్తే ఈ ఘరానా మోసం గుట్టు వీడుతుంది. అందుకే ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎస్బీఐ ఉన్నతాధికారులు నిర్ణయించారు. పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేస్తారని తెలుస్తోంది. -
22ఏళ్లు జెండా మోస్తే.. పార్టీ ముఖం చాటేసింది
అతనో టీడీపీ వీరాభిమాని.. దాదాపు 22 ఏళ్లుగా ఆ పార్టీ జెండా మోశాడు. తెలుగుదేశం విజయం కోసం రక్తం ధారపోశాడు. తీరా కష్టం వచ్చేసరికి దన్నుగా నిలవాల్సిన సొంత పార్టీ ముఖం చాటేసింది. శత్రువుగా భావించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అక్కున చేర్చుకొని ప్రాణదానం చేసింది. సాక్షి, కాకినాడ: కాకినాడ జగన్నాథపురం గొల్లపేటకు చెందిన పుట్టా ఆదిబాబు (ఆదినారాయణ) రెండు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీని వెన్నంటి ఉన్నాడు. మాజీ మంత్రి యనమల రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుతో పయనిస్తూ పార్టీ పట్ల అంకితభావంతో పనిచేస్తూ వచ్చాడు. జిల్లా టీడీపీ కార్యదర్శిగా, మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా, తెలుగుయువత కార్యదర్శిగా టీడీపీలో అనేక పదవులు చేశాడు. ఇలా పార్టీ కోసం పాటుపడుతూ.. అకస్మాత్తుగా దాదాపు రెండున్నరేళ్ల క్రితం సొంత పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. వైద్యులను సంప్రదిస్తే రెండు కిడ్నీలూ పాడయ్యాయని, ఎంతోకాలం బతకడం కష్టం అన్నారు. ముఖం చాటేసిన టీడీపీ రెండు దశాబ్దాలకు పైగా పడ్డ కష్టానికి తనను తెలుగుదేశం పార్టీ తనను ఆదుకొంటుందని ఆశపడ్డ పుట్టి ఆదిబాబుకు నిరాశే ఎదురైంది. నమ్ముకొన్న నేతల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. సదరు నేతలు ముఖం చాటేసి నిర్లక్ష్యం చేయడంతో జీవితంపై ఆదిబాబు ఆశలు వదులుకొన్నారు. ఎమ్మెల్యే ద్వారంపూడి దృష్టికి రాగానే.. ఆదిబాబు అనారోగ్య సమస్యను కుటుంబ సభ్యులు సుమారు ఏడాది క్రితం ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆరోగ్య సమస్యను తీసుకొచ్చారు. గడచిన ప్రతి ఎన్నికలోనూ 20 ఏళ్లుగా తన ఓటమి కోసం పనిచేసిన ఆదిబాబు విషయంలో ఎమ్మెల్యే మాత్రం సానుకూలంగా స్పందించారు. అతడి ఇంటికి వెళ్లి యోగక్షేమాలు తెలుసుకొన్నారు. కార్పొరేటర్ ఎంజీకే కిశోర్‌కు అతడి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే బాధ్యత అప్పగించారు. మూడు నెలలకు బతికే అవకాశం లేదన్న వైద్యుల సూచన నేపథ్యంలో వెంటనే కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స కోసం విశాఖ పంపించారు. దాతలతో కూడా ఎమ్మెల్యే సంప్రదించి ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో ఆదిబాబు పూర్తిగా కోలుకొనే వరకు నిరంతరం పర్యవేక్షిస్తూ వచ్చారు. (ఉన్నతంగా మారుద్దాం) సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.6.75 లక్షలు ఆదిబాబు ఆర్థిక, ఆరోగ్య సమస్యను ఎమ్మెల్యే ద్వారంపూడి ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆదిబాబుకు రూ.6.75 లక్షలు విడుదల చేశారు. ప్రభుత్వం నుంచి విడుదలైన ఆ చెక్కును ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి బాధితుడు పుట్టా ఆదిబాబుకు తన నివాసం వద్ద అందజేశారు. మానవీయతకు దర్పణం అతను తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి అయినా.. ఆరోగ్యం కుదుటపడేవరకు పర్యవేక్షించడంతో పాటు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నిధులు విడుదల చేయించిన తీరుపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం పారదర్శతకు నిదర్శనం ఎన్నికల తరువాత పారీ్టలకతీతంగా.. అర్హతే ప్రాతిపదికగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాగిస్తున్న పారదర్శక పాలనకు ఈ సంఘటన నిదర్శనం. ఇదే తరహాలో ఇళ్ల స్థలాలు, పింఛన్లు సహా ప్రతి పథకాన్ని అర్హులకు అందజేయాలని సీఎం స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ముఖ్యంగా ఆదిబాబు విషయంలో సీఎం ఎంతో సానుకూలంగా వ్యవహరించి నిధులు విడుదల చేయడం ఆనందదాయకం. – ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ఆజన్మాంతం రుణపడి ఉంటా.. ప్రాణభిక్ష పెట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిలకు జన్మజన్మలకు రుణపడి ఉంటా. నమ్ముకొన్న తెలుగుదేశం పార్టీ పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. నేను పనిచేసిన పార్టీని చూడకుండా నా ఆరోగ్య సమస్యను మాత్రమే దృష్టిలో ఉంచుకొని ప్రాణదానం చేసిన ఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. – పుట్టి ఆదిబాబు, బాధితుడు -
సీఎంఆర్ఎఫ్కు భారీగా విరాళాలు
సాక్షి, హైదరాబాద్/నందిగామ: కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం చేస్తున్న కృషికి సంఘీభావంగా పలువురు ప్రముఖులు, సంస్థలు మంగళవారం సీఎంఆర్ఎఫ్కు విరాళాలు అందించారు. ► తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ తరఫున రూ.10 కోట్లను సీఎంఆర్ఎఫ్ కు విరాళం అందించారు. దీనికి సంబంధించిన చెక్కును చైర్మన్ ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి, వైస్ చైర్మన్ ఆర్.లింబాద్రి, వైస్ చైర్మన్ వి.వెంకటరమణ, సెక్రటరి ఎన్. శ్రీనివాసరావు, మెంబర్ ఒ.ఎన్. రెడ్డి సీఎం కేసీఆర్‌కు చెక్కును అందించారు. ఈ ఐదుగురు వ్యక్తిగతంగా మరో రూ.2.50 లక్షలు విరాళం అందించారు. ► గ్రీన్ కో గ్రూప్ రూ.5 కోట్ల విలువైన లక్ష పీపీఈ కిట్లు అందించడానికి ముందుకొచ్చింది. దీనికి సంబంధించిన కాన్సెంట్ లెటర్‌ను గ్రీన్ కో గ్రూప్ ఎం.డి అనిల్ చలమలశెట్టి సీఎం కేసీఆర్‌కు అందించారు. ► మైత్రా ఎనర్జీ గ్రూప్ రూ.2.50 కోట్ల విలువైన పీపీఈ కిట్లు, ఎన్ 95 మాస్కులు అందించడానికి ముందుకొచ్చింది. దీనికి సంబంధించిన కాన్సెంట్ లెటర్‌ను ఎం.డి.విక్రమ్ కైలాస్, డైరెక్టర్ వివేక్ కైలాస్ సీఎం కేసీఆర్‌కు అందించారు. ► తెలంగాణ స్టేట్ ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ రూ.2 కోట్ల విలువైన వైద్య పరికరాలను అందించేందుకు ముందుకు వచ్చింది. దీనికి సంబంధించిన కాన్సెంట్ లెటర్‌ను ప్రెసిడెంట్ లక్ష్మీనరసింహారావు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు అందించారు. ► శ్రీ రామచంద్ర మిషన్ రూ.1.50 కోట్లను ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం ప్రకటించింది. దీనికి సంబంధించిన చెక్కును జాయింట్ సెక్రటరి వంశీ చలగుల్ల, డా.శరత్ కుమార్ ముఖ్యమంత్రికి అందించారు. ► ఆంధ్రప్రదేశ్ గ్యాస్ పవర్ కార్పొరేషన్ రూ.1 కోటి సీఎంఆర్ఎఫ్కు విరాళం అందించిం ది. దీనికి సంబంధించిన చెక్కును ఎం.డి.వెంకటేశ్వర రెడ్డి సీఎం కేసీఆర్‌కు అందించారు. ► కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సీఎంఆర్ఎఫ్కు రూ.7.41లక్షలు విరాళం అందించారు. దీనికి సంబంధించిన చెక్కును ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ సీఎం కేసీఆర్‌కు అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ► రంగారెడ్డి జిల్లా నందిగామ మండల పరిధిలోని కన్హా శాంతి వనం నిర్వాహకులు సీఎం ఆర్‌ఎఫ్‌కు రూ.1.50 కోట్ల విరాళాన్ని అందజేశారు. కన్హా శాంతి వనం జాయింట్ సెక్రటరీ వంశీ, డా.శరత్ మంగళవారం హైదరాబాద్‌లోని సీఎం కేసీఆర్‌కు చెక్కు అందజేశారు. ► సీఎంఆర్ఎఫ్కు మంగళవారం 13 మంది దాతలు రూ.1.15 కోట్ల విరాళాలు అందజేశారు. విరాళాలకు సంబంధించిన చెక్కులను మంత్రి కేటీఆర్‌కు అందజేశారు. ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ రూ.30లక్షలు, పీపుల్ టెక్ ఐటీ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్, చిరిపాల్ పాలీ ఫిల్మ్ రూ.25లక్షలు చొప్పున విరాళం ఇచ్చాయి. -
విత్తన పరిశ్రమ విరాళం రూ.9 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్–19 నేపథ్యంలో ఫెడరేషన్ ఆఫ్ సీడ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఐఐ) సభ్య కంపెనీలు రూ.9 కోట్ల విరాళం ప్రకటించాయి. ఈ మొత్తంలో పీఎం కేర్స్ ఫండ్‌కు రూ.1.97 కోట్లు అందించాయి. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్స్‌కు రూ.2.44 కోట్లు విరాళం ఇచ్చాయి. పీపీఈ, ఆహార పంపిణీ, అవగాహన కార్యక్రమాలకు మిగిలిన మొత్తాన్ని వెచ్చిస్తున్నాయి. సభ్య కంపెనీలైన మహీకో, రాశి, సింజెంటా, క్రిస్టల్, కోర్టెవా కంపెనీలు ఒక్కొక్కటి రూ.1 కోటి ఖర్చు చేస్తున్నాయి. బీఏఎస్ఎఫ్, బేయర్, బయోసీడ్, ఎంజా జేడెన్, హెచ్ఎం క్లాస్, ఐఅండ్‌బీ, జేకే, కలాశ్, నిర్మల్, నోబుల్, ర్యాలీస్, రిజ్వాన్, సీడ్‌వర్క్స్, సవాన్నా, టకీ, టకీట కూడా సాయానికి ముందుకు వచ్చాయి. కాగా, మొత్తంగా బేయర్ ఇండియా రూ.7.2 కోట్లు, డీసీఎం శ్రీరామ్ రూ.10 కోట్లు, జేకే గ్రూప్ రూ.10 కోట్లు వెచ్చిస్తున్నాయి. -
సీఎంఆర్ఎఫ్కు భారీగా విరాళాలు
కరోనా వైరస్ నియంత్రణ కోసం తమ వంతు సాయంగా పలువురు సీఎం సహాయ నిధికి విరాళాలు ఇస్తున్నారు. గంగవరం పోర్టు తరఫున చైర్మన్ డీవీఎస్ రాజు, పోర్టు సీఈవో, మాజీ డీజీపీ ఎన్.సాంబశివరావు రూ.3 కోట్ల విరాళం అందజేశారు. అలాగే డీవీఎస్ రాజు గంగవరం పోర్టులో షేర్ హోల్డర్‌గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రూ.16.25 కోట్ల ఇంటర్మ్ డివిడెండ్ చెక్‌ను కూడా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలసి అందజేశారు. ఇతర విరాళాల వివరాలు.. ► దివీస్ లాబొరేటరీస్ రూ.5 కోట్లు. ► మిత్రా ఎనర్జీ ఎండీ విక్రమ్ కైలాష్ రూ.2 కోట్లు. ► హువెయ్ కంపెనీ వారు ఛారిటీస్ ఎయిడ్ ఫౌండేషన్ ద్వారా రూ.1 కోటి ► చీమకుర్తి రాసన్ గ్రానైట్స్ అధినేత కె.రవీంద్రారెడ్డి రూ.10 లక్షలు. ► కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని సిజిటిన్ కో–ఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ కోటేశ్వరరావు రూ.5 లక్షలు ► చిత్తూరు జిల్లా ఐరాల మండలం పలువురు వైఎస్సార్సీపీ నాయకులు సీఎం సహాయనిధికి రూ.3.50 లక్షలు విరాళంగా ఇచ్చారు. ► చిత్తూరు జిల్లా కుప్పంలోని బీసీఎన్ విద్యా సంస్థల చైర్మన్ బీసీ నాగరాజ్ రూ.2 లక్షలు ► తిరుపతికి చెందిన సీన్ హైటెక్ మోటర్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం, సిబ్బంది తరఫున రూ.2 లక్షలు ► రాష్ట్ర ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ చైర్మన్, జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ వంగాల ఈశ్వరయ్య తన వంతుగా రూ.1.54 లక్షలు ► కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని కార్డియాలజిస్ట్ రాసంశెట్టి చంద్రశేఖర్ రూ.లక్ష, పిల్లల వైద్య నిపుణులు చీకటి ఉదయభాస్కరరావు రూ.లక్ష. ► విజయవాడలోని గరిమెళ్ళ లక్ష్మీ సమీర ఈస్ట్ లయన్స్ కంటి ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ బి.హనుమయ్య రూ.లక్ష. ► కృష్ణా జిల్లా కైకలూరు మండలం భుజ బలపట్నం గ్రామానికి చెందిన ఆక్వా రైతు ముదునూరి సీతారామరాజు రూ.లక్ష. ► కరోనా నివారణ చర్యల కోసం ఏపీ సీఎం సహాయ నిధికి హువెయ్ కంపెనీ వారు ఛారిటీస్ ఎయిడ్ ఫౌండేషన్ ద్వారా రూ. కోటి విరాళం ప్రకటించారు. అందుకు సంబంధిన లేఖ శుక్రవారం సీఎం సహాయ నిధి విభాగానికి పంపారు. -
ఏపీ: ‘మేఘా’ భారీ విరాళం
సాక్షి, అమరావతి: ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడానికి ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న చర్యలను పలువురు ప్రముఖులు ప్రశంసించారు. ప్రభుత్వ ప్రయత్నాలకు తమ వంతు సాయంగా పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తున్నారు. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ శుక్రవారం ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.5 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. దీనికి సంబంధించిన చెక్కును సంస్థ ఎండీ పీవీ కృష్ణారెడ్డి సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి స్వయంగా అందజేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ఏపీ ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఈ సందర్భంగా కృష్ణారెడ్డి ప్రశంసించారు. యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలో ప్రభుత్వం యంత్రాంగం సమర్థవంతంగా పనిచేసి కరోనా మహమ్మారిని కట్టడి చేస్తోందన్నారు. మొదటి కరోనా పాజిటివ్ కేసు నమోదైన వెంటనే అప్రమత్తం కావడంతో పాటు లాక్డౌన్ ప్రకటించడంతో వైరస్ తీవ్రత తగ్గిందని వివరించారు. ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు తమ వంతు సాయం అందించాలన్న ఉద్దేశంతో విరాళం అందజేసినట్లు తెలిపారు. కాగా, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి కూడా రూ.5 కోట్ల విరాళాన్ని ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. సిద్దార్థ విద్యా సంస్థల ఔదార్యం సిద్దార్థ విద్యా సంస్థల యాజమాన్యం, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ రూ. 1.30 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. దీనికి సంబంధించిన చెక్కును సీఎం ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, దేవినేని అవినాష్ సమక్షంలో సిద్దార్థ విద్యాసంస్థల కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు, కోశాధికారి సూరెడ్డి వెంకటేశ్వరరావు శుక్రవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ రూ. 20 లక్షల విరాళం కరోనా వ్యతిరేక పోరాటానికి మద్దతుగా సినీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ రూ. 20 లక్షల విరాళం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు రూ. 10 లక్షల చొప్పున విరాళం అందించాలని నిర్ణయించినట్టు వెల్లడించింది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలకు అండగా నిలిచేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చింది. (సీఎం సహాయ నిధికి విరాళాల వెల్లువ) -
సీఎం సహాయ నిధికి విరాళాల వెల్లువ
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను పలువురు ప్రముఖులు అభినందించారు. ప్రభుత్వ ప్రయత్నాలకు తమ వంతు సాయంగా పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటించారు. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ సీఎంఆర్ఎఫ్కు రూ.5 కోట్ల విరాళాన్ని గురువారం ప్రకటించింది. దీనికి సంబంధించిన చెక్కును సంస్థ ఎండీ పీవీ కృష్ణారెడ్డి ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు అందించారు. శాంతా బయోటెక్నిక్స్ అధినేత కేఐ వరప్రసాద్ రెడ్డి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలుసుకుని ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందించారు. సీఎం సహాయ నిధికి వ్యక్తిగత సాయంగా ఒక కోటీ 116 రూపాయల చెక్కును ముఖ్యమంత్రికి వరప్రసాదర్ రెడ్డి అందించారు. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ అధినేత కామిడి నర్సింహారెడ్డి తమ కంపెనీ తరఫున రూ.కోటి చెక్కును సీఎంఆర్ఎఫ్కు అందించారు. లారస్ ల్యాబ్స్ సీఈఓ డాక్టర్ సత్యనారాయణ, ఇ.డి. చంద్రకాంత్ చేరెడ్డి ముఖ్యమంత్రిని కలిసి తమ ల్యాబ్ తరఫున ఒక లక్ష హైడ్రాక్సి క్లోరోక్విన్ ట్యాబ్లెట్లను ఉచితంగా అందిస్తామని ప్రకటించారు. సీఎంఆర్ఎఫ్కు రూ.50 లక్షల చెక్కును సీఎంకు అందించారు. కరోనా వ్యాప్తి జరగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మద్దతు పలకడంతో పాటు, భారీగా విరాళాలు ఇచ్చిన దాతలకు సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. దాతలు అందించిన ఆర్థిక సహాయం ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు ఉపయోగపడడంతో పాటు, వారు చూపించిన స్ఫూర్తి అధికార యంత్రాంగానికి మరింత ఉత్సాహం ఇస్తుందని అన్నారు. మరికొందరు ఇలా... ♦ హైదరాబాద్‌కు చెందిన మీనాక్షి గ్రూప్ సీఎం సహాయనిధికి రూ.కోటి విరాళం అందివ్వడానికి ముందుకు వచ్చింది. ఈ చెక్కును ప్రగతి భవ న్లో మంత్రి కేటీఆర్‌కు సంస్థ చైర్మన్ కె.ఎస్.రావు, ఎండీ సి.శివాజీ అందించారు. ♦ తెలంగాణ ప్రభుత్వ వైద్యులకు ఉపయోగపడే నాలుగు వేల ఎన్–95 మాస్కులను జీపీకే ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ యజమానులు ఫణికుమార్, కర్నాల శైలజారెడ్డి ఐటీ, మున్సిపల్ , పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు ప్రగతి భవన్లో అందజేశారు . ♦ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ‘క్రెడాయ్’ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.కోటి విరాళం అందించారు.ఈ చెక్కును ప్రగతి భవ¯ŒŒ లో మంత్రి కేటీఆర్‌కు సంస్థ ప్రతినిధులు అందించారు. ♦ హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ సహ యజమాని విజయ్ మద్దూరి రూ.25 లక్షలు, రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ పక్షాన చైర్మన్ లోక భూమారెడ్డి రూ.5 లక్షలు చొప్పున విరాళాన్ని మంత్రి కేటీఆర్‌కు అందజేశారు. టీఆర్ఎస్ ‘స్థానిక’ ప్రజా ప్రతినిధుల విరాళం రూ.9.51 కోట్లు హైదరాబాద్ : టీఆర్ఎస్కు చెందిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు తమ ఒక నెల గౌరవ వేతనం మొత్తం రూ.9,51,17,500ను ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఇవ్వాలని నిర్ణయించారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు, కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్పర్సన్లు, కౌన్సిలర్లు, జెడ్పీ చైర్పర్సన్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు తమ అంగీకారాన్ని సీఎం కేసీఆర్‌కు తెలిపారు. టీఆర్ఎస్కు చెందిన 18,190 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తమ ఒక నెల గౌరవ వేతనం మొత్తం రూ.9,51,17,500ను సీఎం సహాయ నిధికి జమ చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం తీసుకునే చర్యల కోసం తమ ఒక నెల గౌరవ వేతనం డబ్బు లు ఉపయోగించుకోవాలని వారు కోరారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఆపద సమయంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు చూపిన ఔదార్యం ఎంతో స్ఫూర్తిదాయకమైందని సీఎం అభినందించారు. -
సీఎంఆర్ఎఫ్కు భారీగా ప్రముఖుల విరాళాలు
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో పేదలకు నిత్యావసరాల సర ఫరా కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలకు పలువురు ప్రముఖులు విరాళం ప్రకటించారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల సతీమణి అనుపమ వేణుగోపాల్ నాదెళ్ల సీఎం సహాయ నిధికి రూ.2 కోట్ల విరాళం ప్రకటించారు. ఈ చెక్కును అనుపమ తండ్రి, మాజీ ఐఏఎస్ కేఆర్ వేణుగోపాల్ మంగళవారం ప్రగతిభవన్‌లో సీఎంను కలిసి అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ ఒకరోజు వేతనం అంటే రూ.48 కోట్లను సీఎంఆర్ఎఫ్కు విరాళంగా ప్రకటించారు. ఈ చెక్కును ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు కారం రవీందర్‌రెడ్డి, మమత సీఎంకు అందజేశారు. సినీ హీరో నితిన్ రూ.10 లక్షలు విరాళంగా ఇచ్చారు. పంచాయతీ రాజ్ టీచర్స్ యూనియన్–టీఎస్ సభ్యులు రూ.16 కోట్ల విరాళం ప్రకటించారు. తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి తన ఒక నెల వేతనం రూ. 2.50 లక్షలను ముఖ్యమంత్రి సహాయనిధి కోసం చెక్కు రూపంలో సీఎంకు అందించారు. -
కరోనా కట్టడికి నితిన్ విరాళం
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి తనవంతు భాగస్వామ్యం అందించాలని హీరో నితిన్ నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి పది లక్షల చొప్పున మొత్తం 20లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించారు నితిన్. మార్చి 31వ తేదీ వరకు తెలుగు రాష్ట్రప్రభుత్వాలు ప్రకటించిన లాక్‌డౌన్‌కు ప్రజలు సహకరించాలనీ, అందరూ తమ తమ ఇళ్లల్లోనే ఉండి కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడంలో భాగస్వామ్యులు కావాలని నితిన్ విజ్ఞప్తి చేశారు. హిందీకి ‘భీష్మ’ సౌత్ కథలెప్పుడూ బాలీవుడ్‌కి కలిసొస్తూనే ఉంటాయి. పోకిరి, మర్యాద రామన్న, అర్జున్ రెడ్డి వంటి తెలుగు చిత్రాలు హిందీలో రీమేక్ అయి, ఘనవిజయం సాధించాయి. ప్రస్తుతం‘జెర్సీ, ఆర్ఎక్స్ 100’ సినిమాలు రీమేక్ అవుతున్నాయి. తాజాగా మరో సౌత్ సినిమా ‘భీష్మ’ కూడా ఈ లిస్ట్‌లో చేరనుందని సమాచారం. వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘భీష్మ’. ఫిబ్రవరిలో విడుదలైన ఈ చిత్రం నితిన్ కెరీర్లో భారీ వసూళ్లను సాధించి, పెద్ద హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయడానికి ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ సన్నాహాలు చేస్తోందట. ఈ రీమేక్‌లో హీరోగా రణ్‌బీర్ కపూర్‌ను యాక్ట్ చేయించాలని చూస్తున్నారట. రణ్‌బీర్ కపూర్ -
కుబ్రాకు అండగా ఏపీ సర్కారు
సాక్షి, అమరావతి: హైదరాబాద్‌లోని బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్ పైనుంచి కారు దూసుకొచ్చిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న కుబ్రా బేగంకు అండగా నిలవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పెయింటర్‌గా పనిచేస్తున్న అబ్దుల్ అజీమ్ తన కుమార్తె ఆపరేషన్‌కు అయ్యే ఖర్చులు చెల్లించే స్తోమత లేక కేర్ ఆస్పత్రి ఆవరణలో దీనంగా ఉండటంపై ‘రూపాయి లేదు.. వైద్యమెలా’ శీర్షికన ‘సాక్షి’ సోమవారం సంచికలో వార్త ప్రచురితమైంది. దీనిపై స్పందించిన సీఎం వైఎస్ జగన్.. కుబ్రా పూర్తిగా కోలుకునేంత వరకు చికిత్స చేయించాలని అధికారులను ఆదేశించారు. అందుకయ్యే ఖర్చులను పూర్తిగా ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్ఎఫ్) నుంచి భరించాలని సూచించారు. సీఎం ఆదేశాలతో ప్రభుత్వ అధికారులు కేర్ ఆస్పత్రి వైద్యులతో మాట్లాడారు. దీంతో కుబ్రాకు సోమవారం ఉదయం నుంచే పూర్తిస్థాయి వైద్యసేవలు అందటంతో ఆమె తండ్రి అబ్దుల్ అజీమ్, కుటుంబ సభ్యులు సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారని ఆంధ్రప్రదేశ్ చీఫ్ డిజిటల్ డైరెక్టర్ జి.దేవేంద్రరెడ్డి తెలిపారు. ఆస్పత్రికి వెళ్లి కుబ్రా ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నామని చెప్పారు. -
బాలుడికి ముఖ్యమంత్రి ఆపన్నహస్తం
అజిత్‌సింగ్‌నగర్ (విజయవాడ సెంట్రల్): డెంగీ వ్యాధితో బాధపడుతున్న నాలుగేళ్ల బాలుడు శశిధర్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసానిచ్చారు. విజయవాడ కస్తూరిభాయిపేటకు చెందిన ఎం.శశిధర్(4)కు కొన్ని రోజుల క్రితం జ్వరం రావడంతో తల్లిదండ్రులు హాస్పటల్లో చేర్పించగా అది డెంగీ అని, మెదడుకు వ్యాపించడంతో వెంటనే ఆపరేషన్ చేయించాలన్నారు. సుమారు రూ.3 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. కూలిపనులు చేసుకునే బాలుడి తల్లిదండ్రులు తమ కొడుకును బతికించుకునేందుకు డబ్బుల కోసం అన్ని ప్రయత్నాలు చేశారు. ఈ విషయంపై సోమవారం పలు పత్రికల్లో కథనాలు రావడంతో వీటిని చదివిన ముఖ్యమంత్రి స్పందించారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వెంటనే బాలుడికి సహాయం చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం కార్యాలయం నుంచి అధికారులు బాలుడి తల్లిదండ్రులకు ఫోన్ చేసి శశిధర్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా సాయం అందిస్తామని, వైద్యానికి సంబంధించిన అన్ని కాగితాలను తీసుకొని రావాలని సూచించారు. తమ బాలుడి పరిస్థితిని తెలుసుకొని ముఖ్యమంత్రి నేరుగా స్పందించడంపై తల్లిదండ్రులు, విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయులంతా హర్షం వ్యక్తం చేశారు. -
ఇది అఖండ విజయం
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు తమ పార్టీకి అసాధారణ, అఖండ, చారిత్రక విజయం అందించారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వానికి, టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు మరోసారి సంపూర్ణ మద్దతు తెలిపారని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కంటే ఎక్కువ విజయాన్ని కట్టబెట్టారన్నారు. పరిషత్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఏకపక్ష విజయం సాధించిన నేపథ్యంలో కేటీఆర్ మంగళవా రం తెలంగాణభవన్‌లో మాట్లాడారు. మూడు జిల్లా ల్లోని మూడు స్థానిక కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజ యం సాధించిన పట్నం మహేందర్‌రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తేరా చిన్నపరెడ్డికి ఆయన అభినందనలు తెలిపారు. వరంగల్‌లో పోలైన ఓట్లలో ఏకంగా 96 శాతం ఓట్లు సాధించి పోచంపల్లి దేశంలోనే రికార్డు సాధించారన్నారు. దీనికి కొనసాగింపుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అసాధారణ విజయం దక్కిందని ఆనందం వ్యక్తం చేశారు. ఇదొక చారిత్రక, అసాధారణ, అఖండ విజయమని, ఈ విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. 5 సార్లు ఎదుర్కొన్నాం.. ‘దేశ స్థానిక ఎన్నికల చరిత్రలో ఇంతటి తీర్పు లేదేమో. ఎన్నిక ఏదైనా తెలంగాణ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరు కుంటున్నారనేందుకు తాజా ఫలితాలు నిదర్శనం. రాష్ట్రంలోని 32 జిల్లా పరిషత్‌లను ఎవరి మద్దతు లేకుండా టీఆర్ఎస్ గెలుచుకుంటుంది. 90 శాతానికిపైగా మం డల పరిషత్ పదవుల విషయంలోనూ తీర్పు ఇలాగే ఉంది. 2001లో టీఆర్ఎస్ తొలినాళ్లలోనే స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొని నిజామాబాద్, కరీంనగర్ జిల్లా పరిషత్ పీఠాలను కైవసం చేసుకుంది. అప్పటి నుంచి చూస్తే ఇప్పటికి ఐదు సార్లు స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొన్నాం. ఇప్పటి గెలుపు టీఆర్ఎస్ చరిత్రలోనే ఇది అతిపెద్ద విజయం. వంద శాతం జెడ్పీ స్థానాల ను కైవసం చేసుకోవడం ఆనందంగా ఉంది. ఇంతటి విజయాన్ని కట్టబెట్టిన లక్షలాది మంది టీఆర్ఎస్ కార్యకర్తలకు, ఓట్లు వేసి గెలి పించిన ప్రజలకు హదయపూర్వక ధన్యవాదాలు. వరంగల్‌రూరల్, వరంగల్ అర్బన్, కరీంనగర్, మహబూబ్‌నగర్, జనగామ, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అన్ని జెడ్పీటీసీ స్థానాల్లో టీఆర్ఎస్ గెలిచింది. సిద్దిపేట, ఆసిపాబాద్, వనపర్తి, సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో ఒక్కో స్థానం మాత్రమే కోల్పోయాం. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ సొంత నియోజకవర్గంలో ఏడు జెడ్పీటీసీ స్థానాలుంటే ఐదు స్థానాల్లో టీఆర్ఎస్ గెలిచింది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నియోజకవర్గం మధిరలోని ఐదు జెడ్పీటీసీ స్థానాల్లో నాలుగు చోట్ల టీఆర్ఎస్ విజయం సాధించింది. గత 18 ఏళ్లలో టీఆర్ఎస్ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది. ఒకానొక దశలో పార్టీ కనుమరుగైపోతుందేమోనన్న స్థితి ఏర్పడింది. గెలిచినా, ఓడినా టీఆర్ఎస్ ఎప్పుడూ ఒకేలా ఉం టుంది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పినట్లు ఇది విజయం కాదు. ప్రజలు మాపై పెట్టిన బాధ్యత. పార్లమెంట్ ఎన్నికలకు, ఈ ఎన్నికలకు ఓటింగ్‌లో తేడా కనిపించింది. నరేంద్ర మోదీ ప్రధాని కావాలనే భావనలో ఆ ఎన్నికలు జరిగాయి. జగిత్యాల జిల్లాలోని ఒక్క స్థానం మినహా అన్ని జెడ్పీటీసీ స్థానాల్లో టీఆర్ఎస్ గెలిచింది. లోక్‌సభ ఎన్నికల్లో అక్కడ బీజేపీకి ఆధిక్యత వచ్చింది. సిరిసిల్ల జిల్లాలోనూ ఒకే స్థానం కోల్పోయాం. కరీంనగర్ లోక్‌సభ సీటును బీజేపీ గెలిచింది. 4 ఎంపీ సీట్లు గెలవగానే బీజేపీ నేత లు ఏదేదో మాట్లాడుతున్నారు. అది మంచి పద్ధతి కాదు. ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలు. అనేక జిల్లాల్లో ప్రతిపక్ష పార్టీలు ఖాతాలు తెరవలేదు. మేం విజయం వస్తే పొంగిపోం. ఓటమితో కుంగిపోం. కార్యకర్తలు విజయాన్ని ఆస్వాదిస్తూనే బాధ్యతగా ఉండాలి. ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ల ఎన్నిక అయ్యే దాకా ఈ ఎన్నికల టీఆర్ఎస్ ఇన్చార్జీలు జిల్లాల్లోనే ఉండాలి. 90 శాతానికిపైగా ఎంపీపీలు టీఆర్ఎస్ గెలుచుకునేలా ఫలితాలు ఉన్నాయి’ అని కేటీఆర్ అన్నారు. సీఎంఆర్ఎఫ్కు విరాళం.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఎన్నికైన కూర్మయ్యగారి నవీన్‌కుమార్ మిత్రబృందం ముఖ్యమంత్రి సహాయనిధికి భారీ విరాళం ఇచ్చారు. నవీన్ కుమార్ ఎమ్మెల్సీగా విజయం సాధించిన శుభ సందర్భంగా ఆయన మిత్రబృందం ఈ నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్సీ నవీన్‌కుమార్ సూచన మేరకు రూ.1,40,50,000 చెక్కును సీఎంఆర్ఎఫ్కు అందజేశారు. ఈ మేరకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు చెక్కును మంగళవారం అందజేశారు. -
ఆపదలోనూ పచ్చపాతమే!
అనంతపురం అర్బన్: ఐదేళ్ల టీడీపీ పాలన ఓటు బ్యాంకు రాజకీయం చుట్టూనే సాగింది. పేదల సంక్షేమంపై ‘పచ్చ’పాతం చూపిన తీరు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తోంది. ఏ పథకం వర్తించాలన్నా.. టీడీపీ నేతల గడప తొక్కాల్సిందే. జన్మభూమి కమిటీల మితిమీరిన పెత్తనంతో అర్హులకు తీరని అన్యాయం జరిగింది. చివరకు ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్ఎఫ్) విషయంలోనూ పూర్తి నిర్దయగా వ్యవహరించిన తీరు విమర్శలకు తావిస్తోంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల సిఫారసులకు మాత్రమే ప్రాధాన్యతనిచ్చి.. జిల్లా అత్యున్నత అధికారి కలెక్టర్ పంపిన ప్రతిపాదనలను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకపోవడం చూస్తే టీడీపీ ప్రభుత్వం ఏ స్థాయిలో వివక్ష చూపిందో అర్థమవుతోంది. ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన 2014 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కలెక్టర్ పంపిన ప్రతిపాదనలు అన్నీ బుట్టదాఖలయ్యాయి. సీఎంఆర్ఎఫ్ ద్వారా ఈ ఐదేళ్ల వ్యవధిలో 282 మంది బాధితులకు ఆర్థిక సహాయం కోసం కలెక్టర్ ద్వారా వెళ్లి ప్రతిపాదనలను ప్రభుత్వం కనీసం పట్టించుకోకపోవడం గమనార్హం. ప్రతిపాదనలు కచ్చితమైనవే అయినా.. బాధితులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం అందించాలని సిఫారసు చేస్తూ ప్రభుత్వానికి కలెక్టర్ పంపించే ప్రతిపాదనలు వంద శాతం కచ్చితమైనవే ఉంటాయి. ఆర్థిక సహాయం కోసం బాధితుడు తహసీల్దారుకు దరఖాస్తు చేసుకుంటారు. ఆయన క్షేత్రస్థాయికి వెళ్లి విచారణ చేసి నివేదిక పంపుతారు. దానిని ఆర్డీఓ మరోసారి పరిశీలించి సహేతుకమైనదైతే అదే విషయాన్ని పొందపరుస్తూ కలెక్టర్‌కు నివేదిస్తారు. ఆ తర్వాత కలెక్టర్ పరిశీలించి సంబంధిత బాధితులు సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయానికి అర్హులంటూ ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపుతారు. వాస్తవంగా కలెక్టర్ పంపే ప్రతిపాదనల్లో వందశాతం కచ్చితత్వం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం కలెక్టర్ ప్రతిపాదనలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. అయితే తెలుగుదేశం ప్రభుత్వం తన ఐదేళ్ల పాలనలో కలెక్టర్ పంపిన సిఫారసులను పరిగణనలోకి తీసుకోలేదనేందుకు ఏ ఒక్కరికీ ఆర్థిక సహాయం మంజూరు చేయకపోవడమే నిదర్శనంగా నిలుస్తోంది. ప్రజాప్రతినిధుల సిఫార్సులకే మొగ్గు సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం మంజూరులో ప్రభుత్వం అధికార పార్టీ ప్రజాప్రతనిధుల సిఫారసులకే మొగ్గు చూపింది. కలెక్టర్ సిఫారసులను పక్కనపెట్టిన ప్రభుత్వం ప్రజాప్రతినిధులు సిఫారసు చేసిన వారికి మాత్రమే సీఎంఆర్ఎఫ్ కింద ఆర్థిక సహాయం మంజూరు చేస్తూ వచ్చింది. వాస్తవానికి కొందరు ప్రజాప్రతినిధుల సిఫారసుల్లో అధిక శాతం బోగస్ ఉన్నట్లు తెలిసింది. అధికారపార్టీకి చెందిన కార్యకర్తలకు, నాయకులు సూచించిన వారికి సిఫారసు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కొందరు ప్రజాప్రతినిధుల వద్ద పీఏలుగా పనిచేసిన వారు సీఎంఆర్ఎఫ్ని తమకు అనుకూలంగా మలుచుకొని లబ్ధిపొందినట్లు తెలిసింది. తప్పుడు బిల్లులను సృష్టించి వాటిని ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖకు జతజేసి సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం మంజూరు చేయించుకున్నట్లు చర్చ జరుగుతోంది. ఇందులో కొందరు నాయకులు, ప్రజాప్రతినిధుల పీఏలు బాధితుల నుంచి కమీషన్ వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏదేమైనా ప్రజలందరినీ సమానంగా చూడాల్సిన ప్రభుత్వం వ్యవహరించిన తీరు విమర్శల పాలవుతోంది. -
సీఎం సహాయ నిధిలో..సొమ్ముల్లేవు!
అమరావతి: వైద్యం చేయించుకోలేక అవస్థలు పడుతున్న నిరుపేదలను ఆదుకోవాల్సిన ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్)కి నిధుల కొరత ఏర్పడింది. డబ్బులు లేవంటూ బ్యాంకు అధికారులు తిరకాసు పెడుతుండడంతో లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదుకోవాల్సిన ముఖ్యమంత్రే ఇలా చేస్తే ఎవరికి చెప్పుకోవాలంటూ బోరుమంటున్నారు. ఒక్క గుంటూరు జిల్లా అమరావతి మండలంలోనే ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 15 సీఎంఆర్ఎఫ్ చెక్కులు బౌన్స్ అయ్యాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. సాధారణంగా ఖాతాలో డబ్బుల్లేకుండా చెక్కులిస్తే చెక్కు బౌన్స్ కేసు పెట్టి జైలుకు పంపుతారు. అలాంటిది సాక్షాత్తు ముఖ్యమంత్రి పేరుతో వచ్చే చెక్కులే బౌన్స్ అయితే ఎవరిపై చర్యలు తీసుకోవాలనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. రాష్ట్రవ్యాప్తంగా కూడా ఇలాగే పలు ప్రాంతాల్లో సీఎంఆర్ఎఫ్ చెక్కులు బౌన్స్ అవుతున్నట్లు సమాచారం. వివరాలివీ.. అమరావతి మండల కేంద్రంలోని మద్దూరు రోడ్డులో నివాసం ఉంటున్న చౌటా నాగేశ్వరరావు కుమారుడు చౌతా వెంకట నాగసాయి లోకేష్‌కు రెండు నెలల క్రితం ఇరవై నాలుగు గంటల కడుపునొప్పి రావటంతో శస్త్ర చికిత్స చేయాలని నిర్ణయించారు. నాగేశ్వరరావుకి స్థోమత లేకపోవడంతో ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నాడు. దీంతో ప్రభుత్వం సీఎంఅర్ఎఫ్ నుంచి రూ.20,910లు మంజూరు చేసి చెక్కును మార్చి 8న వెలగపూడి సచివాలయం నుండి పంపించింది. సీఎంఆర్ఎఫ్ విడుదల చేసే చెక్కులు తహశీల్దారు నుంచి నేరుగా లబ్ధిదారులకు అందాల్సి ఉండగా, అమరావతి మండలంలో మాత్రం అవి స్థానిక అధికార పార్టీ నేతల చేతికి చేరాయి. అలా మండలంలో వచ్చిన చెక్కులన్నింటినీ సుమారు నెలరోజులపాటు తమ వద్ద పెట్టుకున్న టీడీపీ నేతలు.. సరిగ్గా ఎన్నికలకు రెండ్రోజుల ముందు బాధితుడు నాగేశ్వరరావు చేతికిచ్చారు. అనంతరం నగదు కోసం బ్యాంకులో చెక్కును డిపాజిట్ చేయగా పది రోజుల తర్వాత బ్యాంకు ఖాతాలో నగదులేదని అధికారులు చెప్పి చెక్కును నాగేశ్వరరావుకు ఇచ్చేశారు. ఇదిలా ఉంటే.. టీడీపీ నేతలు బాధితునికి సాయం అందించే విషయంలోనూ రాజకీయంగా ఆలోచించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు.. అమరావతి మండలంలో ఇలాగే సుమారు పదిహేను మందికి ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావడంతో బాధితులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. -
చిన్న వయసులో పెద్ద మనసు
సాక్షి, హైదరాబాద్: చిన్నపిల్లలకు ఏవి సంబరంగా ఉంటాయి? మంచి బొమ్మలు కొనుక్కోవడం, వాటితో ఆడుకోవడం అంటే ఇష్టం. అదే స్నేహితులందరిని పిలిచి బర్త్‌డే పార్టీ జరిపితే మరీ ఇష్టం. అయితే పదేళ్ల వరుణిక మాత్రం వేడుకలా జరిపే తన బర్త్‌డే పార్టీకయ్యే డబ్బును పది మందికి ఉపయోగపడేలా చేద్దామనుకుంది. తన తండ్రి రవీందర్‌రెడ్డి బర్త్‌డే పార్టీకి ఖర్చు చేయాలనుకున్న లక్ష రూపాయలను మంత్రి కేటీఆర్‌కు అందించాలని కోరింది. కేటీఆర్ చేస్తున్న మంచి పనులను మీడియాలో వచ్చే వార్తలను రెగ్యులర్‌గా చూస్తూ తాను కూడా చేతనైన సహాయం చేయాలనుకుంది. చిన్నవయసులోనే తన కూతురు పెద్ద మనసు అర్థం చేసుకున్న రవీందర్‌రెడ్డి, వరుణికను మనస్ఫూర్తిగా అభినందించారు. బుధవారం బేగంపేట క్యాంపు కార్యాలయంలో వరుణిక, రవీందర్‌రెడ్డి కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా వరుణిక లక్ష రూపాయల చెక్కును సీఎం రిలీఫ్ ఫండ్(సీఎంఆర్ఎఫ్)కు అందించింది. ఇక నుంచి తన ప్రతీ పుట్టినరోజు నాడు పదిమందికి ఉపయోగపడే పనులు చేస్తానని కేటీఆర్‌కు చెప్పింది. చిన్న వయసులోనే వరుణిక అలవరుచుకున్న సామాజిక స్పృహను కేటీఆర్ ప్రశంసించి, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడంతోపాటు ఒక చిన్న మొక్కను తనకు బహుమతిగా అందించారు. -
నా అవార్డు నగరానికి సాయపడాలి: అర్జున్‌రెడ్డి
అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ బ్రాండ్ అమాంతం పెరిగిపోయింది. యూత్‌లో విజయ్‌కి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. శనివారం రాత్రి జరిగిన 65వ సౌత్ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల కార్యక్రమంలో అర్జున్ రెడ్డి చిత్రానికి విజయ్ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. అయితే ఈ అవార్డుపై విజయ్ ట్విటర్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ అవార్డును తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు(సీఎంఆర్ఎఫ్) ఇవ్వనున్నట్టు విజయ్ ట్వీట్ చేశారు. విజయ్ నిర్ణయం పట్ల మంత్రి కేటీఆర్ కూడా ఆనందం వ్యక్తం చేశారు. విజయ్ ట్వీట్ల సారాంశం : ‘నేను ఈ అవార్డు గెలిచాను. నేను ఏదైతే చేయాలో అది చేసినప్పుడు, హీరోగా గుర్తింపు తెచ్చుకున్నప్పుడు, ఇండస్ట్రీ నుంచి గౌరవంతో పాటు డబ్బులు పొందినప్పుడు గెలిచినట్టు అనిపించింది. అమ్మ నాన్నకు సొంతిల్లు కొనిచ్చినప్పుడు, అందరు నాపై ప్రేమ కురిపించినప్పుడు గెలిచినట్టు అనిపించింది. నాకు ఈ అవార్డు ఒక బోనస్ లాంటింది. దీన్ని ప్రభుత్వం అంగీకరిస్తే సీఎంఆర్ఎఫ్కు సోమవారం వెళ్లి ఇచ్చేస్తా.. నా ఇంట్లో ఉండటం కంటే నేను పుట్టిన నగరానికి ఇది ఉపయోగపడటం కావాలి. రోజు ట్విటర్లో చూస్తుంటా కేటీఆర్ అన్న సాయం అడిగిన ఎంతో మందికి సీఎంఆర్ఎఫ్ నుంచి సాయం చేస్తూ ఉంటారు. నా అవార్డును వేలం వేయడం ద్వారా వచ్చే డబ్బులు వారు వాడుకోవచ్చు. దీంతో నా తొలి అవార్డుకు గుర్తింపు దక్కుతుంది. ఇది ఎలా జరుగుతుందో కూడా నాకు తెలియదు. కానీ నాకు అనిపించింది కమిట్ అయ్యా. దీన్ని సాకారం చేయడానికి కృషి చేస్తాను’ అని విజయ్ పేర్కొన్నారు. దీనిపై కేటీఆర్ ఆదివారం సాయంత్రం ట్విటర్లో స్పందించారు. ‘విజయ్ నువ్వు ఫిలింపేర్ అవార్డు అందుకున్నందుకు శుభాకాంక్షలు. సీఎంఆర్ఎఫ్కు సాయం చేయడానికి నువ్వు తీసుకున్న నిర్ణయం నాకు చాలా ఆనందం కల్గించింది’అని ట్వీట్ చేశారు. -
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
దేవరకొండ : సీఎం సహాయనిధి కింద మంజూ రైన చెక్కులను మంగళవారం ఎమ్మెల్యే స్థానికంగా బాధితులకు అందించారు. చందంపేట మండలం గాగిళ్లాపురానికి చెందిన లక్ష్మికి రూ. 10వేలు, కంబాలపల్లికి చెందిన సతీష్‌కు రూ. 22,500 చెక్కులను బాధితులకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం సహాయనిధి కింద అందించే సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఆపద సమయాల్లో వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయనిది ఆపద్భందులా ఆదుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ఆలంపల్లి నర్సింహ, మార్కెట్‌కమిటీ వైస్ చైర్మన్ ముచ్చర్ల ఏడుకొండలు, జాన్‌యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, శిరందాసు కృష్ణయ్య, బుయ్య మహేశ్, వడ్త్య దేవేందర్, చీదెళ్ల గోపి, బొడ్డుపల్లి కృష్ణ, వడ్త్య బాలు, బషీర్, సురేష్, నర్సింహ తదితరులు పాల్గొన్నారు. -
పిల్లోడి పెద్ద మనసు
సాక్షి, హైదరాబాద్: టెన్త్ విద్యార్థి దగ్గర రూ.50 వేలు ఉంటే ఏం చేస్తాడు? ఒక మంచి ఫోన్ కొంటాడు.. లేదా ఈ వేసవిలో టూర్ వెళ్లి ఎంజాయ్ చేస్తాడు. కానీ విశ్రుత్ అనే విద్యార్థి ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్)కి విరాళం ఇచ్చి పది మంది మెచ్చుకునేలా చేశాడు. ‘‘గత 46 నెలల్లో సీఎంఆర్ఎఫ్ ద్వారా లక్షా 20 వేల కుటుంబాలు లబ్ధిపొందాయి. సుమారు రూ.800 కోట్లను ఖర్చు చేశాం. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారి అవసరాలు తీరుస్తున్న సీఎంఆర్ఎఫ్కు విరాళాలు ఇవ్వాలనుకునే వాళ్లు ‘చీఫ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్, తెలంగాణ స్టేట్’పేరు మీద చెక్కులను పంపండి’’ అని ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు ఇటీవల ట్వీట్ చేశారు. ఈ విజ్ఞప్తి విశ్రుత్‌ను కదిలించింది. ఫోన్ కొనుక్కునేందుకు దాచుకున్న రూ.50 వేలను సీఎంఆర్ఎఫ్కు విరాళంగా ఇచ్చేలా చేసింది. ఫోన్ తర్వాతైనా కొనుక్కుంటా: తల్లి ఇచ్చిన పాకెట్ మనీని జాగ్రత్తగా దాచుకున్న విశ్రుత్, అలా జమ చేసుకున్న రూ.50 వేలతో మంచి ఫోన్ కొనుక్కోవాలనుకున్నాడు. అయితే కొన్ని లక్షల కుటుంబాలకు ఆసరాగా ఉన్న సీఎం రిలీఫ్ ఫండ్‌కు సహాయం చేయడానికి తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ‘రామ్(కేటీఆర్) అంకుల్ ప్రజలకు చేస్తున్న సహాయం చూశాక ఫోన్ తర్వాతైనా కొనుక్కోవచ్చనుకున్నాను. నా దగ్గర ఉన్న డబ్బుల్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇస్తున్నాను. అనారోగ్యంతో బాధపడుతున్న ఏ ఒక్కరైనా ఆ డబ్బులతో చికిత్స పొందుతా రని భావిస్తున్నా’నని విశ్రుత్ అన్నాడు. ఈ సందర్భంగా విశ్రుత్‌ను కేటీఆర్ అభినందించారు. విశ్రుత్ చేసిన పని మరికొందరికి ప్రేరణలా నిలుస్తుందని, సీఎంఆర్ఎఫ్కు భారీగా విరాళాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. -
సీఎంఆర్ఎఫ్ కేటాయింపులలో వివక్ష
సీఎం కేసీఆర్‌పై ఎమ్మెల్యే కోమటిరెడ్డి ఆరోపణ సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి సహాయనిధి(సీఎంఆర్ఎఫ్) కేటాయింపుల విషయంలో సీఎం కేసీఆర్ వివక్ష చూపుతు న్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపిం చారు. వివిధ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌ను కోమటిరెడ్డి బుధవారం కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సచివాలయానికి సీఎం రారని, ప్రగతిభవన్‌కు వెళ్తే అపాయింట్మెంట్ దొరకదని విమర్శించారు. పేదలు వైద్యం చేసుకుంటే అన్ని ప్రభుత్వాలు ఉదారంగా వ్యవహరించాయని, ఇప్పుడు సీఎం కేసీఆర్ సీఎంఆర్ఎఫ్ మంజూరీలోనూ వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. గొర్రెల పంపిణీ పెద్ద స్కామ్ అని కోమటిరెడ్డి ఆరోపించారు. -
సీఎంఆర్ఎఫ్ లేఖ ఫోర్జరీ
వరంగల్ జిల్లాలో బయటపడ్డ మోసం సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నుంచి సీఎం సంతకంతో జారీ చేసే సహాయ మంజూరు పత్రం ఫోర్జరీకి గురైన ఉదంతం బయటపడింది. వరంగల్ జిల్లాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నట్లుగా అందిన దరఖాస్తుకు సీఎంఆర్ఎఫ్ నుంచి ఇటీవల రూ. లక్ష ఆర్థికసాయం మంజూరవగా దరఖాస్తుదారు దాన్ని రూ.4 లక్షలుగా మార్చి ఆస్పత్రికి సమర్పిం చాడు. ఆ లేఖ ఆధారంగా ఆస్పత్రి యాజమాన్యం కొద్ది రోజుల తర్వాత సీఎం ఆర్‌ఎఫ్‌ను సంప్రదించగా అధికారులు అది ఫోర్జరీకి గురైనట్లు గుర్తించారు. దీనిపై సీఎం కార్యాలయం ఫిర్యాదుతో పోలీసులు విచారణ ప్రారంభించారు. మరోవైపు ఈ తరహా మోసం జరగటం ఇదే మొదటిసారా లేక ఇప్పటికే మరిన్ని నిధులు పక్కదారి పట్టాయా? అనే దానిపై సీఎంవో అధికారులు ఆరా తీస్తున్నారు. బోగస్ బిల్లులు, తప్పుడు క్లెయిమ్‌లతో జరిగిన అక్రమాలపై ఇప్పటికే సీఎం కార్యాలయం సీఐడీతో దర్యాప్తు చేయించగా 2014 జూన్ 2 నుంచి సీఎంఆర్ఎఫ్కు వచ్చిన 9,200 దరఖాస్తుల్లో 68 కేసుల్లో బోగస్ బిల్లులున్నట్లు తేలింది. దాదాపు రూ. 36 లక్షలకుపైగా నిధులు పక్కదారి పట్టినట్లు గుర్తించింది. అప్పట్నుంచీ సీఎంఆర్ఎఫ్ చెల్లింపులపై సర్కారు మరింత అప్రమత్తమైంది. -
సీఎంఆర్ఎఫ్ కోసం ఎదురుచూపులు
- పెండింగ్‌లో 4 వేల పాత దరఖాస్తులు - మళ్లీ అర్జీ పెట్టుకోవాలంటూ తిరస్కరణ సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్)కి దరఖాస్తు చేసుకున్న నిరుపేదలు తల్లడిల్లుతున్నారు. రాష్ర్టం విడిపోవడానికి ముందు అర్జీ పెట్టుకున్న వారందరూ తమకు సాయమెప్పుడందుతుందా.. అని ఏడాదిగా సచివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సీఎంఆర్ఎఫ్ కోసం అర్జీ పెట్టుకున్న వారందరిదీ అదే దీనస్థితి. తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తర్వాత పది వేలకు పైగా దరఖాస్తులను పరిశీలించి సాయం అందించిన సర్కారు... పాత అర్జీల విషయాన్ని మాత్రం పక్కన పెట్టింది. దాదాపు 4 వేల దరఖాస్తులను మూలకు పడేసింది. అసలు వీటికి సాయం అందించాలా.. వద్దా అనే మీమాంసతోనే కాలయాపన చేస్తోంది. అర్జీదారులు పలుమార్లు సచివాలయంలో సంబంధిత సెక్షన్ అధికారులను కలిసినా ప్రయోజనం లేకపోయింది. ఇదిలాఉండగా, పాత దరఖాస్తులన్నింటినీ వెనక్కి పంపించాలని ప్రభుత్వం ఇటీవలే కొత్త నిర్ణయం తీసుకుంది. అప్పటి అర్జీ దారులందరూ మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని.. తమ శాసనసభ్యుడు సిఫారసు లేఖలతో మళ్లీ అర్జీ పెట్టుకోవాలని వీటిని వెనక్కి పంపించే పని పెట్టుకుంది. దరఖాస్తు చేసుకొని ఏడాది దాటిపోయిందని.. అప్పుడున్న ఎమ్మెల్యేల సిఫారసుతోనే బిల్లులన్నీ జత చేసి సీఎం సాయం కోరుతూ అర్జీ పెట్టుకున్నామని... ఇప్పుడు మళ్లీ ఎమ్మెల్యే లేఖలతో దరఖాస్తు చేయమనటంతో దిక్కుతోచడం లేదని బాధ పడుతున్నారు. ఇప్పటికే ఏడాదికిపైగా సీఎంఆర్ఎఫ్ అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. సీఎంఆర్ఎఫ్ నిధుల దుర్వినియోగమైన ఆరోపణలతో చాలా ఫైళ్లు పక్కన పెట్టారు. కొత్తగా వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు క్లియర్ చేసిన అధికారులు పాత వాటి జోలికెళ్లలేదు. రాష్ట్ర విభజన సమయానికి తెలంగాణలోని పది జిల్లాలకు చెందిన తొమ్మిది వేల ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయి. అయిదు వేల ఫైళ్లకు సీఎం ఆమోదం లభించడంతో పాటు చెక్కులు కూడా సిద్ధమయ్యాయి. చెక్కులు సిద్ధమైన మేరకు ఫైళ్లు క్లియర్ చేసిన తెలంగాణ సర్కారు.. అప్పుడు పరిశీలనకు నోచుకోని నాలుగు వేల ఫైళ్లను మాత్రం పెండింగ్‌లో పెట్టింది. ఇప్పుడిప్పుడే సెక్షన్ అధికారులు వాటిని దుమ్ము దులిపే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న అర్జీలను తిరస్కరించి.. కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని సెలవివ్వటంతో బాధితులు గొల్లుమంటున్నారు. -
సీఐడీ గుప్పిట్లో 'సీఎంఆర్ఎఫ్' అక్రమాలు!
హైదరాబాద్: ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెల్లింపుల్లో జరిగిన అవకతవకలపై సీఐడీ నిగ్గు తేల్చింది. ఆస్పత్రులకు ప్రభుత్వం చెల్లించాల్సిన పెండింగ్ బిల్లుల్లో వాస్తవికత ఎంత? అన్న అంశంపై సీఐడీ చేపట్టిన దర్యాప్తు దాదాపు చివరి దశకు చేరుకుంది. ఈ పెండింగ్ బిల్లులకు సంబంధించిన.. దరఖాస్తుదారులకు వైద్య సేవలు అసలు అందాయా..? ఆయా దరఖాస్తుదారులకు అందిన వైద్య సేవలకు తగ్గట్లు వైద్య బిల్లులున్నాయా..? జరిగిన వైద్యానికి మించి అడ్డగోలుగా వైద్య ఖర్చులు చూపి బిల్లులు పెంచేశారా..? వైద్యం జరగకపోయినా నిధులను స్వాహా చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారా..? తదితర అంశాలను సీఐడీ ఆరా తీసింది. సచివాలయంలోని సీఎంఆర్ఎఫ్ కార్యాలయం నుంచి స్వాధీనం చేసుకున్న దరఖాస్తులు, ఇతర రికార్డుల్లోని వివరాలతో క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను విచారణ అధికారులు పోల్చి చూశారు. ఈ క్రమంలో సీఐడీ బృందాలు సంబంధిత ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులతోపాటు దరఖాస్తుదారుల నుంచి కావాల్సిన వివరాలను రాబట్టాయి. ఈ కుంభకోణంలోని మధ్యవర్తులు, సహకరిస్తున్న ఆస్పత్రులు, ప్రభుత్వ ఉద్యోగుల పాత్రపై ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. పెండింగ్ బిల్లులపై దర్యాప్తు పూర్తై నేపథ్యంలో..సీఎంఆర్ఎఫ్లో చోటుచేసుకున్న పలు అక్రమాలకు సంబంధించిన రహస్యాలు ప్రస్తుతం సీఐడీ గుప్పిట్లో ఉన్నాయి. ఈ దర్యాప్తులో తేలిన అంశాలపై సీఐడీ అదనపు డీజీ సత్యనారాయణ్ మరో రెండు రోజుల్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు సమగ్ర నివేదికను సమర్పించనున్నారు. ఈ విషయాన్ని సీఐడీ అధికార వర్గాలు ధ్రువీకరించాయి. ఈ నివేదిక అందాకే ప్రభుత్వం ఆస్పత్రులకు వాస్తవంగా చెల్లించిన బకాయిలను నిర్ధారించుకుని విడుదల చేయనుంది. అక్రమాలకు పాల్పడిన దరఖాస్తుదారులు, అందుకు సహకరించిన ఆస్పత్రులు, సీఎంఆర్ఎఫ్ కార్యాలయ వర్గాలపై ప్రభుత్వ ఆదేశాల మేరకు సీఐడీ కేసులు నమోదు చేసే అవకాశముంది. బిల్లుల చెల్లింపులపై తదుపరి దర్యాప్తు... సీఎంఆర్ఎఫ్ చెల్లింపుల్లో అక్రమాలపై కేసీఆర్ నెల కింద ఇచ్చిన ఆదేశాల మేరకు సీఐడీ విభాగం.... తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 జూన్ 2 నుంచి సీఎంఆర్ఎఫ్ కింద సహాయం కోసం వచ్చిన 9200కుపైగా దరఖాస్తులపై దర్యాప్తు చేపట్టింది. అందులో దాదాపు 95 శాతం దరఖాస్తులకు చెల్లింపులు పూర్తికాగా, ఇంకా 1,251 దరఖాస్తుదారులకు సంబంధించిన బిల్లులను ప్రభుత్వం ఆస్పత్రులకు విడుదల చేయాల్సి ఉంది. దర్యాప్తు ప్రభావంతో బకాయిల చెల్లింపు నిలిచిపోకుండా తొలుత పెండింగ్ బిల్లులపైనే సీఐడీ దర్యాప్తు పూర్తి చేసింది. తదుపరి దర్యాప్తులో భాగంగా ఇప్పటికే చెల్లింపులు జరిగిన 7,200 దరఖాస్తులపై దృష్టిసారించనున్నారు. సీఐడీలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉన్నా ఈ వ్యవహారంపై దర్యాప్తు కోసం సీఐడీ ఏకంగా ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. -
అమరుల కుటుంబాలకు చేయూత
* సీఎంఆర్ఎఫ్ నుంచి ఒక్కో కుటుంబానికి రూ.10లక్షలు * ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం * త్వరలో కుటుంబ సభ్యులకు అందజేత సాక్షి, రంగారెడ్డి జిల్లా: తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన అమరుల కుటుంబాలకు ఆర్థికసాయానికి సంబంధించిన ఫైలుపై ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. రాష్ట్రవ్యాప్తంగా 459 మంది ఆత్మబలిదానం చేసుకోగా.. ఒక్కో కుటుంబానికి రూ.10లక్షల చొప్పున ఆర్థిక సాయం ఇవ్వాల్సిందిగా కేసీఆర్ గత నెలలో నిర్ణయం తీసుకున్నారు. ఆ మొత్తాన్ని సీఎంఆర్ఎఫ్ (ముఖ్యమంత్రి సహాయనిధి) నుంచి ఇచ్చేందుకు నిర్ణయించారు. సోమవారం ప్రభుత్వ ప్రిన్స్‌పల్ కార్యదర్శి బీఆర్ మీనా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు సంబంధించి చెక్కులను త్వరలో అమరుల కుటుంబ సభ్యులకు అందజేయనున్నట్లు ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. -
విరాళాల సొమ్ములు ఏటైపోనాయి బావూ?
ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని హుదూద్ తుఫాను అతలాకుతలం చేసింది. భారీ వృక్షాలు కూడా కూకటివేళ్లతో కూలిపోయాయి. ఎన్ని ఇళ్లు కుప్పకూలాయో లెక్కలేదు. కరెంటు స్తంభాలు విరిగిపోయాయి. జనజీవనం అల్లకల్లోలంగా మారిపోయింది. ఇలాంటి సమయంలో తుఫాను బాధితులను ఆదుకోడానికి పెద్ద హృదయంతో చాలామంది ముందుకు వచ్చారు. భారీ విరాళాలు ప్రకటించారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి లక్షల్లో ఇస్తామంటూ గట్టిగానే చెప్పారు. అయితే.. వీటిలో ముఖ్యమంత్రి సహాయనిధి కార్యాలయానికి వచ్చినవి మాత్రం ఒకటి.. అర మాత్రమేనట. అవును.. విరాళాలను ఆర్భాటంగా ప్రకటిస్తున్నవాళ్లలో ఎంతమంది నిజంగా ఇస్తున్నారు, ఎంతమంది కేవలం పేరుకు మాత్రమే చదివిస్తున్నారన్న విషయం తెలియడంలేదు. విశాఖలో సహాయ కార్యకలాపాలు చేపట్టడానికి డబ్బుకోసం చూసుకుంటే.. సీఎంఆర్ఎఫ్ ఖాళీగా కనిపిస్తోంది. సినిమా నటులు, పారిశ్రామికవేత్తలు.. ఇలా చాలామంది పెద్దమొత్తంలో విరాళాలు ప్రకటించినా, వాటిలో చేతికి అందినవి కొన్నిమాత్రమే. కొంతమంది నేరుగా సీఎంఆర్ఎఫ్ కార్యాలయానికి చెక్కులు పంపారు. హీరో కృష్ణ, పవన్ కల్యాణ్, బాలకృష్ణ లాంటివాళ్లు నేరుగా చంద్రబాబును కలిసి ఆయనకే చెక్కులు అందించారు. మిగిలినవాళ్లు మాత్రం ఇంకా చెక్కులుగానీ, డీడీలు గానీ ఏ రూపంలోనూ విరాళాలు అందించలేదు. ఆ విషయం చెప్పడానికి సీఎంఆర్ఎఫ్ కార్యాలయ అధికారులు మొహమాటపడుతున్నారు. బహుశా ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చిన తర్వాత ఆయనకు చెక్కులు అందిస్తూ ఫొటోలు తీయించుకోడానికి ఇలా ఆలస్యం చేస్తున్నారేమోనన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. పేరుగొప్ప.. ఊరుదిబ్బ అన్నట్లు ఘనంగా విరాళాలు ప్రకటించి, తర్వాత ఊరుకున్నారేమోనని కూడా అంటున్నారు.