
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో పేదలకు నిత్యావసరాల సర ఫరా కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలకు పలువురు ప్రముఖులు విరాళం ప్రకటించారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల సతీమణి అనుపమ వేణుగోపాల్ నాదెళ్ల సీఎం సహాయ నిధికి రూ.2 కోట్ల విరాళం ప్రకటించారు. ఈ చెక్కును అనుపమ తండ్రి, మాజీ ఐఏఎస్ కేఆర్ వేణుగోపాల్ మంగళవారం ప్రగతిభవన్‌లో సీఎంను కలిసి అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ ఒకరోజు వేతనం అంటే రూ.48 కోట్లను సీఎంఆర్‌ఎఫ్‌కు విరాళంగా ప్రకటించారు. ఈ చెక్కును ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు కారం రవీందర్‌రెడ్డి, మమత సీఎంకు అందజేశారు. సినీ హీరో నితిన్ రూ.10 లక్షలు విరాళంగా ఇచ్చారు. పంచాయతీ రాజ్ టీచర్స్ యూనియన్–టీఎస్ సభ్యులు రూ.16 కోట్ల విరాళం ప్రకటించారు. తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి తన ఒక నెల వేతనం రూ. 2.50 లక్షలను ముఖ్యమంత్రి సహాయనిధి కోసం చెక్కు రూపంలో సీఎంకు అందించారు.