సీఎం సహాయ నిధికి విరాళాల వెల్లువ | Donations Rising To CMRF In Telanagana To Prevent Coronavirus | Sakshi
Sakshi News home page

సీఎం సహాయ నిధికి విరాళాల వెల్లువ

Published Fri, Mar 27 2020 2:25 AM | Last Updated on Fri, Mar 27 2020 8:41 AM

Donations Rising To CMRF In Telanagana To Prevent Coronavirus - Sakshi

మేఘా సంస్థ తరఫున సీఎం కేసీఆర్‌కు విరాళం అందజేస్తున్న కృష్ణారెడ్డి

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను పలువురు ప్రముఖులు అభినందించారు. ప్రభుత్వ ప్రయత్నాలకు తమ వంతు సాయంగా పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటించారు. మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ సంస్థ సీఎంఆర్‌ఎఫ్‌కు రూ.5 కోట్ల విరాళాన్ని గురువారం ప్రకటించింది. దీనికి సంబంధించిన చెక్కును సంస్థ ఎండీ పీవీ కృష్ణారెడ్డి ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు అందించారు. శాంతా బయోటెక్నిక్స్‌ అధినేత కేఐ వరప్రసాద్‌ రెడ్డి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావును కలుసుకుని ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందించారు. సీఎం సహాయ నిధికి వ్యక్తిగత సాయంగా ఒక కోటీ 116 రూపాయల చెక్కును ముఖ్యమంత్రికి వరప్రసాదర్‌ రెడ్డి అందించారు. కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ అధినేత కామిడి నర్సింహారెడ్డి తమ కంపెనీ తరఫున రూ.కోటి చెక్కును సీఎంఆర్‌ఎఫ్‌కు అందించారు.

లారస్‌ ల్యాబ్స్‌ సీఈఓ డాక్టర్‌ సత్యనారాయణ, ఇ.డి. చంద్రకాంత్‌ చేరెడ్డి ముఖ్యమంత్రిని కలిసి తమ ల్యాబ్‌ తరఫున ఒక లక్ష హైడ్రాక్సి క్లోరోక్విన్‌ ట్యాబ్లెట్లను ఉచితంగా అందిస్తామని ప్రకటించారు. సీఎంఆర్‌ఎఫ్‌కు రూ.50 లక్షల చెక్కును సీఎంకు అందించారు. కరోనా వ్యాప్తి జరగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మద్దతు పలకడంతో పాటు, భారీగా విరాళాలు ఇచ్చిన దాతలకు సీఎం కేసీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. దాతలు అందించిన ఆర్థిక సహాయం ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు ఉపయోగపడడంతో పాటు, వారు చూపించిన స్ఫూర్తి అధికార యంత్రాంగానికి మరింత ఉత్సాహం ఇస్తుందని అన్నారు.

మరికొందరు ఇలా...
హైదరాబాద్‌కు చెందిన మీనాక్షి గ్రూప్‌ సీఎం సహాయనిధికి రూ.కోటి విరాళం అందివ్వడానికి ముందుకు వచ్చింది.  ఈ చెక్కును ప్రగతి భవ న్‌లో మంత్రి కేటీఆర్‌కు సంస్థ చైర్మన్‌ కె.ఎస్‌.రావు, ఎండీ సి.శివాజీ అందించారు.
తెలంగాణ ప్రభుత్వ వైద్యులకు ఉపయోగపడే నాలుగు వేల ఎన్‌–95 మాస్కులను జీపీకే ఎక్స్‌పోర్ట్‌ అండ్‌ ఇంపోర్ట్స్‌ యజమానులు ఫణికుమార్, కర్నాల శైలజారెడ్డి ఐటీ, మున్సిపల్‌ , పరిశ్రమల శాఖ మంత్రి  కేటీఆర్‌కు ప్రగతి భవన్‌లో అందజేశారు .
రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌ ‘క్రెడాయ్‌’ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.కోటి విరాళం అందించారు.ఈ చెక్కును ప్రగతి భవ¯ŒŒ లో మంత్రి కేటీఆర్‌కు సంస్థ ప్రతినిధులు అందించారు.
హైదరాబాద్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ సహ యజమాని విజయ్‌ మద్దూరి రూ.25 లక్షలు, రాష్ట్ర డెయిరీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ పక్షాన చైర్మన్‌ లోక భూమారెడ్డి రూ.5 లక్షలు చొప్పున విరాళాన్ని మంత్రి కేటీఆర్‌కు అందజేశారు.   

టీఆర్‌ఎస్‌ ‘స్థానిక’ ప్రజా ప్రతినిధుల విరాళం రూ.9.51 కోట్లు 
హైదరాబాద్‌ : టీఆర్‌ఎస్‌కు చెందిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు తమ ఒక నెల గౌరవ వేతనం మొత్తం రూ.9,51,17,500ను ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఇవ్వాలని నిర్ణయించారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన మున్సిపల్‌ కార్పొరేషన్ల మేయర్లు, కార్పొరేటర్లు, మున్సిపల్‌ చైర్‌పర్సన్లు, కౌన్సిలర్లు, జెడ్పీ చైర్‌పర్సన్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు తమ అంగీకారాన్ని సీఎం కేసీఆర్‌కు తెలిపారు. టీఆర్‌ఎస్‌కు  చెందిన 18,190 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తమ ఒక నెల గౌరవ వేతనం మొత్తం రూ.9,51,17,500ను సీఎం సహాయ నిధికి జమ చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం తీసుకునే చర్యల కోసం తమ ఒక నెల గౌరవ వేతనం డబ్బు లు ఉపయోగించుకోవాలని వారు కోరారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఆపద సమయంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు చూపిన ఔదార్యం ఎంతో స్ఫూర్తిదాయకమైందని సీఎం అభినందించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement