Shanta Biotechnics
-
సీఎం సహాయ నిధికి విరాళాల వెల్లువ
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను పలువురు ప్రముఖులు అభినందించారు. ప్రభుత్వ ప్రయత్నాలకు తమ వంతు సాయంగా పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటించారు. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ సీఎంఆర్ఎఫ్కు రూ.5 కోట్ల విరాళాన్ని గురువారం ప్రకటించింది. దీనికి సంబంధించిన చెక్కును సంస్థ ఎండీ పీవీ కృష్ణారెడ్డి ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు అందించారు. శాంతా బయోటెక్నిక్స్ అధినేత కేఐ వరప్రసాద్ రెడ్డి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలుసుకుని ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందించారు. సీఎం సహాయ నిధికి వ్యక్తిగత సాయంగా ఒక కోటీ 116 రూపాయల చెక్కును ముఖ్యమంత్రికి వరప్రసాదర్ రెడ్డి అందించారు. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ అధినేత కామిడి నర్సింహారెడ్డి తమ కంపెనీ తరఫున రూ.కోటి చెక్కును సీఎంఆర్ఎఫ్కు అందించారు. లారస్ ల్యాబ్స్ సీఈఓ డాక్టర్ సత్యనారాయణ, ఇ.డి. చంద్రకాంత్ చేరెడ్డి ముఖ్యమంత్రిని కలిసి తమ ల్యాబ్ తరఫున ఒక లక్ష హైడ్రాక్సి క్లోరోక్విన్ ట్యాబ్లెట్లను ఉచితంగా అందిస్తామని ప్రకటించారు. సీఎంఆర్ఎఫ్కు రూ.50 లక్షల చెక్కును సీఎంకు అందించారు. కరోనా వ్యాప్తి జరగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మద్దతు పలకడంతో పాటు, భారీగా విరాళాలు ఇచ్చిన దాతలకు సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. దాతలు అందించిన ఆర్థిక సహాయం ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు ఉపయోగపడడంతో పాటు, వారు చూపించిన స్ఫూర్తి అధికార యంత్రాంగానికి మరింత ఉత్సాహం ఇస్తుందని అన్నారు. మరికొందరు ఇలా... ♦ హైదరాబాద్‌కు చెందిన మీనాక్షి గ్రూప్ సీఎం సహాయనిధికి రూ.కోటి విరాళం అందివ్వడానికి ముందుకు వచ్చింది. ఈ చెక్కును ప్రగతి భవ న్లో మంత్రి కేటీఆర్‌కు సంస్థ చైర్మన్ కె.ఎస్.రావు, ఎండీ సి.శివాజీ అందించారు. ♦ తెలంగాణ ప్రభుత్వ వైద్యులకు ఉపయోగపడే నాలుగు వేల ఎన్–95 మాస్కులను జీపీకే ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ యజమానులు ఫణికుమార్, కర్నాల శైలజారెడ్డి ఐటీ, మున్సిపల్ , పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు ప్రగతి భవన్లో అందజేశారు . ♦ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ‘క్రెడాయ్’ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.కోటి విరాళం అందించారు.ఈ చెక్కును ప్రగతి భవ¯ŒŒ లో మంత్రి కేటీఆర్‌కు సంస్థ ప్రతినిధులు అందించారు. ♦ హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ సహ యజమాని విజయ్ మద్దూరి రూ.25 లక్షలు, రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ పక్షాన చైర్మన్ లోక భూమారెడ్డి రూ.5 లక్షలు చొప్పున విరాళాన్ని మంత్రి కేటీఆర్‌కు అందజేశారు. టీఆర్ఎస్ ‘స్థానిక’ ప్రజా ప్రతినిధుల విరాళం రూ.9.51 కోట్లు హైదరాబాద్ : టీఆర్ఎస్కు చెందిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు తమ ఒక నెల గౌరవ వేతనం మొత్తం రూ.9,51,17,500ను ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఇవ్వాలని నిర్ణయించారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు, కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్పర్సన్లు, కౌన్సిలర్లు, జెడ్పీ చైర్పర్సన్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు తమ అంగీకారాన్ని సీఎం కేసీఆర్‌కు తెలిపారు. టీఆర్ఎస్కు చెందిన 18,190 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తమ ఒక నెల గౌరవ వేతనం మొత్తం రూ.9,51,17,500ను సీఎం సహాయ నిధికి జమ చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం తీసుకునే చర్యల కోసం తమ ఒక నెల గౌరవ వేతనం డబ్బు లు ఉపయోగించుకోవాలని వారు కోరారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఆపద సమయంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు చూపిన ఔదార్యం ఎంతో స్ఫూర్తిదాయకమైందని సీఎం అభినందించారు. -
ఫార్మాలో 4 వేల కోట్ల ఎఫ్‌డీఐలకు ఓకే
న్యూఢిల్లీ : ఫార్మా రంగంలో సుమారు రూ. 4,000 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) ప్రతిపాదనలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టొరెంట్ ఫార్మా, బయోకాన్‌కి చెందిన రీసెర్చ్ సేవల సంస్థ సింజీన్ తదితర కంపెనీల ప్రతిపాదనలు ఇందులో ఉన్నాయి. అయితే, షాసన్ ఫార్మాకి చెందిన ప్రవాసీ, దేశీ షేర్హోల్డర్లకు షేర్లను జారీ చేసేందుకు ఉద్దేశించిన స్ట్రైడ్స్ ఆర్కోల్యాబ్ ప్రతిపాదనను తిరస్కరించిన కేంద్రం, మరో మూడు సంస్థల ప్రతిపాదనలపై నిర్ణయాన్ని వాయిదా వేసింది. వాయిదా పడిన వాటిల్లో శాంతా బయోటెక్నిక్స్, స్పర్శ ఫార్మా ఇంటర్నేషనల్, సెలాన్ లేబొరేటరీస్ ప్రతిపాదనలు ఉన్నాయి. మే 28న సమావేశమైన విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్ఐపీబీ) చేసిన సిఫార్సుల మేరకు కేంద్రం బుధవారం ఈ నిర్ణయాలు తీసుకుంది. వీటిలో టొరెంట్ ఫార్మా అత్యధికంగా రూ. 3,000 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదన ఉంది. దీని ప్రకారం ప్రస్తుతం కంపెనీలో 13.09%గా ఉన్న వాటాలను విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ) 35 శాతానికి పెంచుకోనున్నారు. ఇక, సింజీన్ ఇంటర్నేషనల్ రూ. 930 కోట్ల ఎఫ్‌డీఐలు సమీకరించనుంది. ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్(ఐపీవో) కింద విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐ), విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ), ప్రవాస భారతీయులకు(ఎన్ఆర్ఐ) షేర్లను జారీ చేయడం ద్వారా కంపెనీ ఈ నిధులు సమీకరిస్తుంది. దీంతో కంపెనీలో విదేశీ పెట్టుబడులు 44%కి చేరనున్నాయి. గ్రూప్ పీటర్స్ సర్జికల్ సంస్థకు 77.5% వాటాల విక్రయం ద్వారా స్టెరిక్యాట్ గట్ స్ట్రింగ్స్ రూ. 43.52 కోట్ల ఎఫ్‌డీఐలు సమీకరించనుంది. అలాగే, అల్కెమ్స్ ఫెర్టికాకు చెందిన కొన్ని ఆస్తులను ఆర్డెయిన్ హెల్త్‌కేర్ గ్లోబల్ కొనుగోలు చేసే ప్రతిపాదనకూ గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ డీల్ విలువ రూ.23.34 కోట్లు. రూ. 180 కోట్లతో ఫార్మా పార్కులు.. ఫార్మాస్యూటికల్స్ తయారీని ప్రోత్సహించే దిశగా ఈ ఏడాది ఆరు ఫార్మా పార్కులు నెలకొల్పాలని కేంద్రం యోచిస్తోంది. సుమారు రూ. 180 కోట్లతో వీటిని ఏర్పాటు చేసే ప్రతిపాదనకు త్వరలో ఆమోదముద్ర వేయనున్నట్లు ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి అనంత్ కుమార్ తెలిపారు. ఈ ఏడాది ఆరు ఫార్మా పార్కులను ప్రయోగాత్మకంగా నెలకొల్పనున్నట్లు, వచ్చే ఏడాది దేశవ్యాప్తంగా వీటి ఏర్పాటు కోసం ఆర్థిక శాఖ నుంచి రూ. 1,000 కోట్లు కోరనున్నట్లు ఆయన వివరించారు. వీటిలో ఔషధాల టెస్టింగ్‌కు, పరిశ్రమ వర్గాల శిక్షణకు తగిన మౌలిక సదుపాయాలు ఉంటాయన్నారు. ప్రభుత్వం ఒక్కో దానికి రూ. 20 కోట్లు గ్రాంటుగా సమకూర్చనుందని ఫార్మా రంగానికి సంబంధించిన క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంను ప్రారంభించిన సందర్భంగా మంత్రి వివరించారు. స్టార్ ఇండియా ప్రతిపాదనకు ఓకే... ప్రసార సంస్థ స్టార్ ఇండియా తన విదేశీ భాగస్వామ్య సంస్థకు షేర్ల జారీ, బదిలీ చేయడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. అంతేకాకుండా బ్రాడ్‌కాస్టింగ్ రంగంలో ఉన్న మరో భారత కంపెనీ కొనుగోలుకు కూడా ఈ కంపెనీకి అనుమతి లభించింది. మొత్తం రూ.6,751 కోట్ల విలువైన 16 విదేశీ ప్రత్య క్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) ప్రతిపాదనలకు బుధవారం ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో స్టెరిక్యాట్ గట్ స్ట్రింగ్స్, బీఏఎస్ఎఫ్ కెమికల్స్ ఇండియా, ఓర్డియన్ హెల్త్‌కేర్ గ్లోబల్, ట్రిఫ్ కోచి ప్రాజెక్ట్స్, ట్రిఫ్ రియల్ ఎస్టేట్ అండ్ డెవలప్మెంట్, బెర్గ్యుయన్ రియల్ ఎస్టేట్స్, టుడే మ్యాగజైన్స్ లైఫ్స్టైల్ల ఎఫ్‌డీఐ ప్రతిపాదనలు ఉన్నాయి. విదేశీ పెట్టుబడుల పరిమితిని 55 శాతానికి పెంచుకోవాలన్న కోటక్ మహీంద్రా ప్రతిపాదనపై నిర్ణయం వాయిదా పడింది. ఇలా వాయిదా పడిన ప్రతిపాదనల్లో రిలయన్స్ గ్లోబల్‌కామ్, ఈరోస్ ఇంటర్నేషనల్, ఎన్టీటీ కమ్యూనికేషన్స్, హాత్వే కేబుల్ ఉన్నాయి.