ఫార్మాలో 4 వేల కోట్ల ఎఫ్‌డీఐలకు ఓకే | Formula 4 billion of FDI okay | Sakshi
Sakshi News home page

ఫార్మాలో 4 వేల కోట్ల ఎఫ్‌డీఐలకు ఓకే

Published Thu, Jun 18 2015 1:19 AM | Last Updated on Sun, Sep 3 2017 3:53 AM

ఫార్మాలో 4 వేల కోట్ల ఎఫ్‌డీఐలకు ఓకే

ఫార్మాలో 4 వేల కోట్ల ఎఫ్‌డీఐలకు ఓకే

 న్యూఢిల్లీ : ఫార్మా రంగంలో సుమారు రూ. 4,000 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) ప్రతిపాదనలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టొరెంట్ ఫార్మా, బయోకాన్‌కి చెందిన రీసెర్చ్ సేవల సంస్థ సింజీన్ తదితర కంపెనీల ప్రతిపాదనలు ఇందులో ఉన్నాయి. అయితే, షాసన్ ఫార్మాకి చెందిన ప్రవాసీ, దేశీ షేర్‌హోల్డర్లకు షేర్లను జారీ చేసేందుకు ఉద్దేశించిన స్ట్రైడ్స్ ఆర్కోల్యాబ్ ప్రతిపాదనను తిరస్కరించిన కేంద్రం, మరో మూడు సంస్థల ప్రతిపాదనలపై నిర్ణయాన్ని వాయిదా వేసింది. వాయిదా పడిన వాటిల్లో శాంతా బయోటెక్నిక్స్, స్పర్శ ఫార్మా ఇంటర్నేషనల్, సెలాన్ లేబొరేటరీస్ ప్రతిపాదనలు ఉన్నాయి.

 మే 28న సమావేశమైన విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్‌ఐపీబీ) చేసిన సిఫార్సుల మేరకు కేంద్రం బుధవారం ఈ నిర్ణయాలు తీసుకుంది. వీటిలో టొరెంట్ ఫార్మా అత్యధికంగా రూ. 3,000 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదన ఉంది. దీని ప్రకారం ప్రస్తుతం కంపెనీలో 13.09%గా ఉన్న వాటాలను విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐ) 35 శాతానికి పెంచుకోనున్నారు. ఇక, సింజీన్ ఇంటర్నేషనల్ రూ. 930 కోట్ల ఎఫ్‌డీఐలు సమీకరించనుంది.

ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్(ఐపీవో) కింద విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్‌ఐఐ), విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ), ప్రవాస భారతీయులకు(ఎన్‌ఆర్‌ఐ) షేర్లను జారీ చేయడం ద్వారా కంపెనీ ఈ నిధులు సమీకరిస్తుంది. దీంతో కంపెనీలో విదేశీ పెట్టుబడులు 44%కి చేరనున్నాయి. గ్రూప్ పీటర్స్ సర్జికల్ సంస్థకు 77.5% వాటాల విక్రయం ద్వారా స్టెరిక్యాట్ గట్ స్ట్రింగ్స్ రూ. 43.52 కోట్ల ఎఫ్‌డీఐలు సమీకరించనుంది. అలాగే, అల్కెమ్స్ ఫెర్టికాకు చెందిన కొన్ని ఆస్తులను ఆర్డెయిన్ హెల్త్‌కేర్ గ్లోబల్ కొనుగోలు చేసే ప్రతిపాదనకూ గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ డీల్ విలువ రూ.23.34 కోట్లు.

 రూ. 180 కోట్లతో ఫార్మా పార్కులు..
 ఫార్మాస్యూటికల్స్ తయారీని ప్రోత్సహించే దిశగా ఈ ఏడాది ఆరు ఫార్మా పార్కులు నెలకొల్పాలని కేంద్రం యోచిస్తోంది. సుమారు రూ. 180 కోట్లతో వీటిని ఏర్పాటు చేసే ప్రతిపాదనకు త్వరలో ఆమోదముద్ర వేయనున్నట్లు ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి అనంత్ కుమార్ తెలిపారు. ఈ ఏడాది ఆరు ఫార్మా పార్కులను ప్రయోగాత్మకంగా నెలకొల్పనున్నట్లు, వచ్చే ఏడాది దేశవ్యాప్తంగా వీటి ఏర్పాటు కోసం ఆర్థిక శాఖ నుంచి రూ. 1,000 కోట్లు కోరనున్నట్లు ఆయన వివరించారు.

వీటిలో ఔషధాల టెస్టింగ్‌కు, పరిశ్రమ వర్గాల శిక్షణకు తగిన మౌలిక సదుపాయాలు ఉంటాయన్నారు. ప్రభుత్వం ఒక్కో దానికి రూ. 20 కోట్లు గ్రాంటుగా సమకూర్చనుందని ఫార్మా రంగానికి సంబంధించిన క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాంను ప్రారంభించిన సందర్భంగా మంత్రి వివరించారు.
 
 స్టార్ ఇండియా ప్రతిపాదనకు ఓకే...
 ప్రసార సంస్థ స్టార్ ఇండియా తన విదేశీ భాగస్వామ్య సంస్థకు షేర్ల జారీ, బదిలీ చేయడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. అంతేకాకుండా బ్రాడ్‌కాస్టింగ్ రంగంలో ఉన్న మరో భారత కంపెనీ కొనుగోలుకు కూడా ఈ కంపెనీకి అనుమతి లభించింది. మొత్తం రూ.6,751 కోట్ల విలువైన 16 విదేశీ ప్రత్య క్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) ప్రతిపాదనలకు బుధవారం ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో స్టెరిక్యాట్ గట్ స్ట్రింగ్స్, బీఏఎస్‌ఎఫ్ కెమికల్స్ ఇండియా, ఓర్డియన్ హెల్త్‌కేర్ గ్లోబల్, ట్రిఫ్ కోచి ప్రాజెక్ట్స్, ట్రిఫ్ రియల్ ఎస్టేట్ అండ్ డెవలప్‌మెంట్, బెర్గ్యుయన్ రియల్ ఎస్టేట్స్, టుడే మ్యాగజైన్స్ లైఫ్‌స్టైల్‌ల ఎఫ్‌డీఐ ప్రతిపాదనలు ఉన్నాయి.

విదేశీ పెట్టుబడుల పరిమితిని 55 శాతానికి పెంచుకోవాలన్న కోటక్ మహీంద్రా ప్రతిపాదనపై నిర్ణయం వాయిదా పడింది. ఇలా వాయిదా పడిన ప్రతిపాదనల్లో  రిలయన్స్ గ్లోబల్‌కామ్, ఈరోస్ ఇంటర్నేషనల్, ఎన్‌టీటీ కమ్యూనికేషన్స్, హాత్‌వే కేబుల్ ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement