![IPL 2025: Gujarat Titans Get New Owners Majority Shares To Be Sold To](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/gt.jpg.webp?itok=GUu9A3F9)
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (PC: IPL/BCCI)
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) ఫ్రాంఛైజీ గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) యాజమాన్యంలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. భారత్‌కు చెందిన టొరంట్ గ్రూపు(Torrent Group) ఈ ఫ్రాంఛైజీలో అరవై ఏడు శాతం వాటా కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. కాగా అంతర్జాతీయ ఈక్విటీ సంస్థ సీవీసీ క్యాపిటల్ (ఐరిలియా కంపెనీ లిమిటెడ్) 2021లో ఐపీఎల్‌లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే.
నాడు రూ. 5,625 కోట్లతో
భారీ స్థాయిలో ఏకంగా రూ. 5,625 కోట్లతో గుజరాత్ ఫ్రాంఛైజీని సొంతం చేసుకుంది. అయితే, తమ వాటలో మెజారిటీ మొత్తాన్ని అమ్మేందుకు సీవీసీ క్యాపిటల్ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ విషయం గురించి సంస్థ సన్నిహిత వర్గాలు వార్తా సంస్థ పీటీఐకి వెల్లడించాయి.
‘‘టొరంట్ గ్రూపుతో చర్చలు కొలిక్కివచ్చినట్లే. మూడింట రెండు వంతుల వాటాను అమ్మేందుకు నిర్ణయం జరిగింది. యజమానులుగా సీవీసీ గ్రూప్ లాక్- ఇన్ పీరియడ్ ఫిబ్రవరి 2025తో ముగుస్తుంది. కాబట్టి అప్పుడు వారు తమ వాటాలను అమ్ముకునేందుకు స్వేచ్ఛ లభిస్తుంది.
బీసీసీఐ అనుమతి తప్పనిసరి
టొరంట్ గ్రూపు భారత ఫార్మాసుటికల్ రంగంలో కీలకమైనది. బీసీసీఐ 2021లో రెండు కొత్త ఫ్రాంఛైజీల నిర్వహణకు బిడ్లను ఆహ్వానించినపుడు ఈ గ్రూపు ఆసక్తి కనబరిచింది. ఈసారి తన ఆకాంక్షను నెరవేర్చుకోనుంది. అయితే, ఐపీఎల్ ఫ్రాంఛైజీ యాజమాన్య మార్పు జరగాలంటే బీసీసీఐ నుంచి అనుమతి తప్పనిసరి. త్వరలోనే ఇది జరుగుతుంది’’ అని పేర్కొన్నాయి.
కాగా ఐపీఎల్ పాలక మండలి నుంచి అనుమతి లభించిన తర్వాత గుజరాత్ టైటాన్స్ పగ్గాలు చేతులు మారనున్నాయి. ఐపీఎల్-2025 సీజన్ నుంచే యాజమాన్యంలో మార్పులు అమలులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇక 2021లో క్యాష్ రిచ్ లీగ్‌లో ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్.. తమ అరంగేట్ర ఎడిషన్‌లోనే చాంపియన్‌గా నిలిచింది.
హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో చాంపియన్‌గా
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో టైటిల్ గెలిచింది. ఆ మరుసటి ఏడాది పాండ్యా సారథ్యంలోనే ఫైనల్‌కు చేరింది. అయితే, ఐపీఎల్-2024 ఆరంభానికి ముందే హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్‌ను వీడి.. తన సొంతగూటికి చేరాడు. అతడు ముంబై ఇండియన్స్ సారథిగా బాధ్యతలు చేపట్టగా.. మరో టీమిండియా స్టార్, భవిష్య కెప్టెన్ శుబ్‌మన్ గిల్ టైటాన్స్ పగ్గాలు చేపట్టాడు.
గిల్ సారథ్యంలో ఇలా
అయితే, గిల్ సారథ్యంలో గతేడాది టైటాన్స్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. పద్నాలుగు మ్యాచ్‌లకు గానూ కేవలం ఐదే గెలిచి పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఇదిలా ఉంటే.. టొరంట్ గ్రూపు విలువ దాదాపుగా 41 వేల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా.
ఇక టొరంట్ స్పోర్ట్స్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా 2021లో అహ్మదాబాద్ కోసం రూ. 4653 కోట్లు, లక్నో ఫ్రాంఛైజీ కోసం రూ. 4356 కోట్లతో బిడ్ వేసింది. ఆ తర్వాత వుమెన్స్ ప్రీమియర్ లీగ్ బరిలోకి వచ్చిన టొరంట్ గ్రూప్ ఫ్రాంఛైజీ కొనుగోలు విషయంలో సఫలం కాలేకపోయింది. ఇప్పుడు ఏకంగా ఐపీఎల్‌లో విజయవంతమైన జట్టుగా మార్కులు కొట్టేసిన టైటాన్స్‌కు యజమానిగా మారనుంది.
కాగా ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్, రాజస్తాన్ రాయల్స్ పేరిట మొత్తం పదిజట్లు ఉన్నాయి.
చదవండి: తప్పు చేస్తున్నావ్ గంభీర్.. అతడిని బలి చేయడం అన్యాయం: మాజీ క్రికెటర్ ఫైర్
Comments
Please login to add a commentAdd a comment