![Hey Its Unfair: Gambhir Lambasted Over KL Rahul Treatment Vs Eng ODIs](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/gambhir.jpg.webp?itok=tW0MsHW5)
కెప్టెన్ రోహిత్ శర్మతో గంభీర్
టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir) తీరుపై భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మిడిలార్డర్ విషయంలో గౌతీ అనుసరిస్తున్న వ్యూహాలు సరికావని విమర్శించాడు. ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్(Axar Patel)ను ప్రమోట్ చేయడం బాగానే ఉన్నా.. అందుకోసం కేఎల్ రాహుల్(KL Rahul)ను బలి చేయడం సరికాదని హితవు పలికాడు.
వరుసగా రెండింట గెలిచి.. సిరీస్ సొంతం
కాగా టీమిండియా ప్రస్తుతం స్వదేశంలో ఇంగ్లండ్‌తో వన్డేలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మూడు మ్యాచ్‌లలో ఇప్పటికే రెండు గెలిచి సిరీస్ సొంతం చేసుకుంది రోహిత్ సేన. అయితే, ఈ సిరీస్‌లో వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్‌ను కాదని సీనియర్ కేఎల్ రాహుల్‌కు పెద్దపీట వేసిన యాజమాన్యం.. బ్యాటింగ్ ఆర్డర్‌లో మాత్రం అతడిని డిమోట్ చేసింది.
అతడికి ప్రమోషన్.. రాహుల్‌కు అన్యాయం?
స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను ఐదో స్థానంలో ఆడిస్తూ.. కేఎల్ రాహుల్‌ను ఆరో నంబర్ బ్యాటర్‌గా పంపింది. ఈ క్రమంలో నాగ్‌పూర్, కటక్ వన్డేల్లో అక్షర్ వరుసగా 52, 41 నాటౌట్ పరుగులు చేయగా... రాహుల్ మాత్రం విఫలమయ్యాడు. తొలి వన్డేలో రెండు, రెండో వన్డేలో పది పరుగులకే పరిమితమయ్యాడు.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/kl.jpg)
ఇది చాలా దురదృష్టకరం
ఈ పరిణామాలపై టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ స్పందించాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘నాలుగో నంబర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఫామ్‌లో ఉండటం టీమిండియాకు సానుకూలాంశం. అయితే, కేఎల్ రాహుల్ పరిస్థితి చూసి నాకు బాధ కలుగుతోంది.
ఇది చాలా దురదృష్టకరం. అక్షర్ పటేల్ 30, 40 పరుగులు చేస్తున్నాడు. మంచిదే.. కానీ కేఎల్ రాహుల్ పట్ల మేనేజ్‌మెంట్ వ్యవహరిస్తున్న తీరు అన్యాయం. ఐదో స్థానంలో అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేయగలడు. అందుకు అతడి గణాంకాలే నిదర్శనం.
ఎల్లప్పుడూ ఇదే వ్యూహం పనికిరాదు
కాబట్టి.. హేయ్.. గంభీర్ నువ్వు చేస్తున్నది తప్పు. పరిస్థితులకు అనుగుణంగా అక్షర్‌ను ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు పంపవచ్చు. కానీ ఎల్లప్పుడూ ఇదే వ్యూహం పనికిరాదు. ఇలాంటి వాటి వల్ల దీర్ఘకాలం ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో నీకూ తెలుసు. కీలకమైన మ్యాచ్‌లో ఇలాంటి వ్యూహాలు బెడిసికొట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి.
రిషభ్ పంత్ విషయంలోనూ ఇలాగే చేస్తారా?
అక్షర్ పటేల్‌తో నాకు ఎలాంటి సమస్యా లేదు. అతడికి ఇబ్బడిముబ్బడిగా అవకాశాలు ఇస్తున్నారు. కానీ అందుకోసం రాహుల్‌ను ఆరో నంబర్‌లో ఆడిస్తారా? అలాగే చేయాలని అనుకుంటే రిషభ్ పంత్‌ను కూడా ఆరోస్థానంలోనే పంపండి. రాహుల్ ఆత్మవిశ్వాసాన్ని ఎందుకు దెబ్బతీస్తున్నారు? వరల్డ్‌క్లాస్ ప్లేయర్‌గా పేరొందిన అద్భుతమైన ఆటగాడి పట్ల ఇలా వ్యవహరించడం సరికాదు’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ గంభీర్ విధానాన్ని ఎండగట్టాడు.
చదవండి: క్రికెట్ చరిత్రలో అరుదైన ఘటన
Comments
Please login to add a commentAdd a comment