క్రికెట్‌ చరిత్రలో అరుదైన ఘటన | South Africa Fielding Coach Surprises Everyone By Taking The Field As A Substitute | Sakshi
Sakshi News home page

క్రికెట్‌ చరిత్రలో అరుదైన ఘటన

Published Tue, Feb 11 2025 1:30 PM | Last Updated on Tue, Feb 11 2025 2:43 PM

South Africa Fielding Coach Surprises Everyone By Taking The Field As A Substitute

అంతర్జాతీయ క్రికెట్‌లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. పాకిస్తాన్‌ ట్రై సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో నిన్న (ఫిబ్రవరి 10) జరిగిన మ్యాచ్‌లో ప్లేయర్లు లేక సౌతాఫ్రికా జట్టు ఫీల్డింగ్‌ కోచ్‌ను బరిలోకి దించింది. మెజార్టీ శాతం ఆటగాళ్లు సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఇరుక్కుపోవడంతో ఈ టోర్నీలో సౌతాఫ్రికాకు ఆటగాళ్ల కొరత ఏర్పడింది. ఈ టోర్నీ కోసం​ సౌతాఫ్రికా సెలెక్టర్లు కేవలం 12 మంది సభ్యుల జట్టును మాత్రమే ఎంపిక చేశారు. 

ఈ 12లోనూ ఇద్దరు ఆటగాళ్లు ఎమర్జెన్సీ మీద మైదానాన్ని వీడటంతో ఆ జట్టు ఫీల్డింగ్‌ కోచ్‌  వాండిలే గ్వావు తప్పనిసరి పరిస్థితుల్లో సబ్‌స్టిట్యూట్‌ ఫీల్డర్‌గా బరిలోకి దిగాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతాయి. అయితే ఇలాంటి ఘటన సౌతాఫ్రికాకు మాత్రం కొత్తేమీ కాదు. గత సీజన్‌లో అబుదాబీలో జరిగిన ఓ మ్యాచ్‌లో ఆ జట్టు ఆటగాళ్లు అస్వస్థతకు గురికావడంతో బ్యాటింగ్‌ కోచ్‌ జేమీ డుమినీ సబ్‌స్టిట్యూట్‌ ఫీల్డర్‌గా బరిలోకి దిగాడు.

ఈ విషయాన్ని పక్కన పెడితే.. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికాను న్యూజిలాండ్‌ 6 వికెట్ల తేడాతో ఓడించి, ఫైనల్‌కు చేరింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా.. అరంగట్రేం ఆటగాడు మాథ్యూ బ్రీట్జ్కీ (150) శతక్కొట్టడంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. ఈ సెంచరీతో బ్రీట్జ్కీ వన్డే అరంగేట్రంలో 150 పరుగుల మార్కును తాకిన తొలి బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. 

సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో వియాన్‌ ముల్దర్‌ (64) అర్ద సెంచరీతో.. జే స్మిత్‌ (41) ఓ మోస్తరు స్కోర్లతో రాణించారు. కెప్టెన్‌ బవుమా (20), కైల్‌ వెర్రిన్‌ (1), ముత్తుసామి (2) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో మ్యాట్‌ హెన్రీ, విలియమ్‌ ఓరూర్కీ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. బ్రేస్‌వెల్‌కు ఓ వికెట్‌ దక్కింది.

అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్‌.. కేన్‌ విలియమ్సన్‌  (133) అజేయ శతకంతో విరుచుకుపడటంతో మరో 8 బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. డెవాన్‌ కాన్వే (97) తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నప్పటికీ.. న్యూజిలాండ్‌ గెలుపుకు గట్టి పునాది వేశాడు. 

విలియమ్సన్‌.. గ్లెన్‌ ఫిలిప్స్‌తో కలిసి (28 నాటౌట్‌) న్యూజిలాండ్‌ను గెలుపు తీరాలు దాటించాడు. న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌లో విల్‌ యంగ్‌ 19, డారిల్‌ మిచెల్‌ 10, టామ్‌ లాథమ్‌ డకౌటయ్యారు.సౌతాఫ్రికా బౌలర్లలో ముత్తుసామి 2, ఈథన్‌ బాష్‌, జూనియర్‌ డాలా తలో వికెట్‌ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో సెంచరీ చేసిన విలియమ్సన్‌ వన్డేల్లో అత్యంత వేగంగా 7000 పరుగులు పూర్తి చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. 

ఈ టోర్నీలో రేపు (ఫిబ్రవరి 12) జరుగబోయే మ్యాచ్‌లో (పాకిస్తాన్‌ వర్సెస్‌ సౌతాఫ్రికా) విజేత ఫిబ్రవరి 14న జరిగే ఫైనల్లో న్యూజిలాండ్‌తో తలపడుతుంది. ఛాంపియన్స్‌ ట్రోఫీకి ముందు పాకిస్తాన్‌లో జరుగుతున్న టోర్నీ కావడంతో ఈ టోర్నీకి ప్రాధాన్యత సంతరించుకుంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement