T20 WC 2022: Semi Finals Prediction - Sakshi
Sakshi News home page

T20 WC 2022: గండాలు దాటి.. నేరుగా టీమిండియా!

Published Sat, Nov 5 2022 8:25 PM | Last Updated on Tue, Nov 8 2022 8:23 AM

T20 WC 2022: Semi Finals Prediction - Sakshi

అప్‌డేట్‌: సూపర్‌-12లో నెదర్లాండ్స్‌.. సౌతాఫ్రికాను ఓడించడంతో టీమిండియా నేరుగా సెమీస్‌కు చేరుకుంది. మరో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించి పాకిస్తాన్‌ కూడా భారత్‌తో పాటు గ్రూప్‌-2 నుంచి సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది.

టీ20 వరల్డ్‌కప్‌-2022లో గ్రూప్‌-1 సెమీస్‌ బెర్తులు ఖరారయ్యాయి. ఈ గ్రూప్‌ నుంచి న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌ జట్లు సెమీస్‌కు చేరుకున్నాయి. ఇక మిగిలింది గ్రూప్‌-2 బెర్త్‌లు. ఈ గ్రూప్‌ నుంచే ముందుగా సెమీస్‌ బెర్త్‌లు ఖరారవుతాయనుకుంటే, బంగ్లాదేశ్‌, జింబాబ్వే జట్లు అనూహ్య విజయాలు సాధించి సెమీస్‌ రేసును రసవత్తరంగా మార్చాయి. రేపు (నవంబర్‌ 6) జరుగబోయే మ్యాచ్‌లతో ఈ గ్రూప్‌ సెమీస్‌ బెర్తులపై క్లారిటీ రానుంది. 

ప్రస్తుత సమీకరణలు, ఆయా జట్ల ప్రస్తుత ఫామ్‌ను బట్టి చూస్తే.. రేపు జరుగబోయే మ్యాచ్‌ల్లో సౌతాఫ్రికా.. నెదర్లాండ్స్‌ను, భారత్‌.. జింబాబ్వేను, పాకి​స్తాన్‌.. బంగ్లాదేశ్‌పై విజయాలు సాధించే అవకాశాలు అధికంగా ఉన్నాయి. మొదటి రెండు మ్యాచ్‌ల్లో సౌతాఫ్రికా, టీమిండియా విజయాలు సాధిస్తే, ఆఖరి మ్యాచ్‌లో పాకిస్తాన్‌.. బంగ్లాదేశ్‌పై గెలిచినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. గ్రూప్‌-2 నుంచి అగ్రస్థానంలో భారత్‌, రెండో స్థానంతో సౌతాఫ్రికా సెమీస్‌కు చేరతాయి. పాకిస్తాన్‌ ఇంటిబాట పడుతుంది. రేపటి మ్యాచ్‌ల్లో నెదర్లాండ్స్‌, జింబాబ్వే జట్లతో ఏదో ఒకటి సంచలన విజయం సాధిస్తే తప్పా.. పై సమీకరణల్లో ఎలాంటి మార్పు ఉండదు.

కాగా, ఫైనల్‌ ఫోర్‌ జట్లపై ఓ అంచనాకు రావడంతో సెమీస్‌లో ఏయే జట్లు తలపడబోతున్నాయన్న అంశంపై ప్రస్తుతం అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా టీమిండియా సెమీస్‌ చేరితే ఏ జట్టుతో తలపడాల్సి వస్తుందో అన్న టెన్షన్‌ ఫ్యాన్స్‌లో ఇప్పటినుంచే మొదలైంది. గ్రూప్‌-1 బెర్తులు ఎలాగూ ఖరారయ్యాయి కాబట్టి భారత్‌.. న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌లలో ఏదో ఒక జట్టుతో తలపడాల్సి ఉంటుంది. రేపటి మ్యాచ్‌లో టీమిండియా.. జింబాబ్వేపై గెలిస్తే ఇంగ్లండ్‌తో, ఒకవేళ వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ రద్దైతే న్యూజిలాండ్‌ను ఢీకొట్టాల్సి ఉంటుంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement