టీ20 వరల్డ్‌కప్-2022లో దాయాది పాకిస్తాన్‌కు ఇంకా నూకలు ఉన్నాయి. ఇవాళ (నవంబర్ 3) జరిగిన కీలక పోరులో బాబర్ సేన.. డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో దక్షిణాఫ్రికాపై 33 పరుగుల తేడాతో గెలుపొంది, సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. ఈ విజయంతో పాక్ గ్రూప్-2 పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకి టీమిండియా తర్వాతి స్థానంలో నిలిచి, సెమీస్ రేసులో నిలిచింది. పాక్ ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, 2 పరాజయాలతో 4 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతానికి రన్‌రేట్ ప్రకారం చూస్తే పాక్ (1.085).. భారత్ (0.730) కంటే మెరుగైన స్థితిలో ఉంది.
పాక్‌కు సెమీస్ అవకాశాలు ఎలా అంటే..
గ్రూప్-2 నుంచి సెమీస్ రేసులో ఉన్న భారత్ (4 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో 6 పాయింట్లు), సౌతాఫ్రికా (4 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, ఓ పరాజయం, ఓ మ్యాచ్ ఫలితం తేలకపోవడంతో 5 పాయింట్లు, 1.402), పాకిస్తాన్ జట్లు చివరిగా తలో మ్యాచ్ ఆడాల్సి ఉంది. భారత్.. జింబాబ్వేతో, పాకిస్తాన్.. బంగ్లాదేశ్‌తో, సౌతాఫ్రికా.. నెదర్లాండ్స్‌తో తలపడాల్సి ఉంది.
ఈ మ్యాచ్‌ల్లో సౌతాఫ్రికా చిన్న జట్టైన నెదర్లాండ్స్‌పై గెలిస్తే గ్రూప్-2 నుంచి తొలి సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకుంటుంది. మరో బెర్తు కోసం పోటీలో.. పాక్ తమ చివరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై భారీ తేడాతో గెలపొంది, భారత్.. తమ చివరి మ్యాచ్‌లో జింబాబ్వే చేతిలో ఓడితే, మెరుగైన రన్‌రేట్ ఆధారంగా పాకిస్తాన్ సెమీస్‌కు చేరుకుంటుంది. అయితే టీమిండియానే గడగడలాడించిన బంగ్లాపై పాక్ భారీ విజయం.. పసికూన జింబాబ్వే.. టీమిండియాపై గెలవడం అంత ఆషామాషీ విషయం కాదు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించడంతో పాక్.. డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్.. ఇఫ్తికార్ అహ్మద్ (35 బంతుల్లో 51; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), షాదాబ్ ఖాన్ (22 బంతుల్లో 52; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ధశతకాలతో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 185 పరుగుల భారీ స్కోర్ చేసింది.
లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారీ వర్షం పడటంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో మ్యాచ్‌ను 14 ఓవర్లకు కుదించి దక్షిణాఫ్రికాకు 142 పరుగుల టార్గెట్‌ను నిర్ధేశించారు. అప్పటికే సౌతాఫ్రికా 9 ఓవర్లు ఆడేసి 4 వికెట్ల నష్టానికి 69 పరుగులు మాత్రమే చేసి ఉండటంతో మిగిలిన 5 ఓవర్లలో 73 పరుగులు చేయాల్సి వచ్చింది. కష్టసాధ్యమైన ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దక్షిణాఫ్రికా 9 వికెట్లు కోల్పోయి 108 పరుగులకు మాత్రమే పరిమితమైంది.
Comments
Please login to add a commentAdd a comment