సీఎం కేసీఆర్‌కు చెక్కు అందజేస్తున్న ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి తదితరులు
సాక్షి, హైదరాబాద్/నందిగామ: కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం చేస్తున్న కృషికి సంఘీభావంగా పలువురు ప్రముఖులు, సంస్థలు మంగళవారం సీఎంఆర్‌ఎఫ్‌కు విరాళాలు అందించారు.
► తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ తరఫున రూ.10 కోట్లను సీఎంఆర్‌ఎఫ్ కు విరాళం అందించారు. దీనికి సంబంధించిన చెక్కును చైర్మన్ ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి, వైస్ చైర్మన్ ఆర్.లింబాద్రి, వైస్ చైర్మన్ వి.వెంకటరమణ, సెక్రటరి ఎన్. శ్రీనివాసరావు, మెంబర్ ఒ.ఎన్. రెడ్డి సీఎం కేసీఆర్‌కు చెక్కును అందించారు. ఈ ఐదుగురు వ్యక్తిగతంగా మరో రూ.2.50 లక్షలు విరాళం అందించారు.
► గ్రీన్ కో గ్రూప్ రూ.5 కోట్ల విలువైన లక్ష పీపీఈ కిట్లు అందించడానికి ముందుకొచ్చింది. దీనికి సంబంధించిన కాన్సెంట్ లెటర్‌ను గ్రీన్ కో గ్రూప్ ఎం.డి అనిల్ చలమలశెట్టి సీఎం కేసీఆర్‌కు అందించారు.
► మైత్రా ఎనర్జీ గ్రూప్ రూ.2.50 కోట్ల విలువైన పీపీఈ కిట్లు, ఎన్ 95 మాస్కులు అందించడానికి ముందుకొచ్చింది. దీనికి సంబంధించిన కాన్సెంట్ లెటర్‌ను ఎం.డి.విక్రమ్ కైలాస్, డైరెక్టర్ వివేక్ కైలాస్ సీఎం కేసీఆర్‌కు అందించారు.
► తెలంగాణ స్టేట్ ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజ్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ రూ.2 కోట్ల విలువైన వైద్య పరికరాలను అందించేందుకు ముందుకు వచ్చింది. దీనికి సంబంధించిన కాన్సెంట్ లెటర్‌ను ప్రెసిడెంట్ లక్ష్మీనరసింహారావు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు అందించారు.
► శ్రీ రామచంద్ర మిషన్ రూ.1.50 కోట్లను ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం ప్రకటించింది. దీనికి సంబంధించిన చెక్కును జాయింట్ సెక్రటరి వంశీ చలగుల్ల, డా.శరత్ కుమార్ ముఖ్యమంత్రికి అందించారు.
► ఆంధ్రప్రదేశ్ గ్యాస్ పవర్ కార్పొరేషన్ రూ.1 కోటి సీఎంఆర్‌ఎఫ్‌కు విరాళం అందించిం ది. దీనికి సంబంధించిన చెక్కును ఎం.డి.వెంకటేశ్వర రెడ్డి సీఎం కేసీఆర్‌కు అందించారు.
► కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలు, టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు సీఎంఆర్‌ఎఫ్‌కు రూ.7.41లక్షలు విరాళం అందించారు. దీనికి సంబంధించిన చెక్కును ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ సీఎం కేసీఆర్‌కు అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు.
► రంగారెడ్డి జిల్లా నందిగామ మండల పరిధిలోని కన్హా శాంతి వనం నిర్వాహకులు సీఎం ఆర్‌ఎఫ్‌కు రూ.1.50 కోట్ల విరాళాన్ని అందజేశారు. కన్హా శాంతి వనం జాయింట్ సెక్రటరీ వంశీ, డా.శరత్ మంగళవారం హైదరాబాద్‌లోని సీఎం కేసీఆర్‌కు చెక్కు అందజేశారు.
► సీఎంఆర్‌ఎఫ్‌కు మంగళవారం 13 మంది దాతలు రూ.1.15 కోట్ల విరాళాలు అందజేశారు. విరాళాలకు సంబంధించిన చెక్కులను మంత్రి కేటీఆర్‌కు అందజేశారు. ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ రూ.30లక్షలు, పీపుల్ టెక్ ఐటీ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్, చిరిపాల్ పాలీ ఫిల్మ్ రూ.25లక్షలు చొప్పున విరాళం ఇచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment