సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్ విజయవంతంగా అమలవుతోందని, రాబోయే రోజుల్లో కూడా ఇంతే పకడ్బందీగా దీనిని అమలు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. కరోనా వైరస్ వ్యాపించకుండా నిరోధించేందుకు సోషల్ డిస్టెన్సింగ్‌కు మించిన మార్గం లేదని, ఈ నేపథ్యంలో అందరూ లాక్‌డౌన్‌ను విధిగా పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. లాక్‌డౌన్, రాత్రిపూట కర్ఫ్యూతోపాటు కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి చేస్తున్న ప్రయత్నాలపై సీఎం కేసీఆర్ బుధవారం ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. ఉదయం నుంచి రాత్రి పది గంటల వరకు తన కార్యాలయంలోనే ఉండి పరిస్థితిని సమీక్షించారు. పోలీసు, వైద్య శాఖల సీనియర్ అధికారులు, పలు జిల్లాల కలెక్టర్లతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
విదేశాల నుంచి వచ్చినవారు, వారితో సన్నిహితంగా ఉన్నవారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని.. ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిని కనిపెడుతూ ఉండాలని అధికారులకు సూచించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారు, క్వారంటైన్‌లో ఉన్నవారి విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తెలంగాణలో లాక్‌డౌన్, రాత్రి పూట కర్ఫ్యూ విజయవంతం కావడం పట్ల సంతృప్తి వ్యక్తంచేశారు. ప్రజలు ఇలాగే ప్రభుత్వానికి సహకరించి, సామాజిక దూరం పాటిస్తే ప్రమాదకరమైన వ్యాధి నుంచి రాష్ట్రాన్ని.. తద్వారా దేశాన్ని కాపాడుకోవచ్చని పేర్కొన్నారు. ఎవరికి అనుమానం కలిగినా, వ్యాధి లక్షణాలు కనిపించినా వెంటనే పరీక్షలు చేయించుకోవాలని కోరారు. రాత్రింబవళ్లు శ్రమిస్తున్న పోలీసు, వైద్యశాఖ సిబ్బందిని, సానిటరీ ఉద్యోగులను సీఎం అభినందించారు. ఈ సమీక్షలో ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, సీఎంఓ కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సీఎం సహాయనిధికి టీఆర్‌ఎస్ విరాళాలు..
కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సర్కారు చేస్తున్న యుద్ధానికి టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు సంపూర్ణ సహాయ సహకారాలు అందించడానికి ముందుకొచ్చారు. తమ వంతుగా సీఎం సహాయనిధికి దాదాపు రూ.500 కోట్ల విరాళం ఇవ్వాలని నిర్ణయించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఒక్కో ఎంపీకి ఏడాదికి రూ.5కోట్ల చొప్పున మంజూరవుతాయి. ఈ ఏడాది తమకు మంజూరయ్యే రూ.80 కోట్ల నిధులను టీఆర్‌ఎస్ ఎంపీలు 16 మంది (9 మంది లోక్‌సభ, ఏడుగురు రాజ్యసభ సభ్యులు) సీఎం సహాయనిధికి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన అంగీకార పత్రాన్ని టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు డాక్టర్ కె.కేశవరావు, ఉప నాయకుడు బండ ప్రకాశ్, లోక్‌సభలో పార్టీ నాయకుడు నామా నాగేశ్వరరావు, ఉప నాయకుడు కొత్త ప్రభాకర్‌రెడ్డి బుధవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌కు అందజేశారు.
ఇక సీఎంతోపాటు మంత్రులు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఒక నెల వేతనాన్ని సీఎం సహాయనిధికి ఇవ్వాలని నిర్ణయించారు. ఒక్కో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి ఏడాదికి రూ.3 కోట్ల చొప్పున నియోజకవర్గ అభివద్ధి నిధులు మంజూరయ్యాయి. ఆ నిధులను ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఇవ్వనున్నట్టు టీఆర్‌ఎస్ శాసనసభాపక్షం ప్రకటించింది. అలాగే టీఆర్‌ఎస్ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు తమ ఒక నెల వేతనాన్ని సీఎం సహాయనిధికి, మరో నెల వేతనాన్ని ప్రధానమంత్రి సహాయనిధికి అందజేస్తారని టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు తెలిపారు. కాగా, ముఖ్యమంత్రి సహాయనిధికి తమ నిధులు, వేతనాలను విరాళంగా ఇచ్చిన పార్టీ ప్రజాప్రతినిధులను సీఎం కేసీఆర్ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment