దండం పెడుతున్నా.. బయటకు రావొద్దు | CM KCR Press Meet About People Must Follow Lockdown In Telangana | Sakshi
Sakshi News home page

దండం పెడుతున్నా.. బయటకు రావొద్దు

Published Wed, Mar 25 2020 1:02 AM | Last Updated on Wed, Mar 25 2020 2:20 AM

CM KCR Press Meet About People Must Follow Lockdown In Telangana - Sakshi

మంగళవారం ప్రగతి భవన్‌లో మీడియాతో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా జబ్బు పెద్ద మహమ్మారి. యావత్‌ ప్రపంచాన్నే గడగడలాడిస్తోంది. ఇది పరిమిత సమస్య కాదు. మనందరం అప్రమత్తంగా ఉండాలి. ప్రజాస్వామ్యం కాబట్టి మంచిగా చెప్పి ప్రభుత్వపరంగా ముందుపోవడానికి ప్రయత్నాలు చేస్తం. ప్రజలు వంద శాతం సహకరించాలి. లేకుంటే చర్యలు ఆగవు. అమెరికా లాంటి దేశాల్లో ప్రజలను పోలీసులు నియంత్రించలేకపోవడంతో సైన్యాన్ని రంగంలో దింపారు. మన దగ్గర కూడా ప్రజలు సహకరించకపోతే ఆటోమెటిగ్గా 24 గంటల కర్ఫ్యూ పెట్టాల్సి వస్తుంది. షూట్‌ ఎట్‌ సైట్‌ ఆర్డర్స్‌ ఇవ్వాల్సి వస్తుంది. అప్పటికీ కంట్రోల్‌ కాకపోతే ఆర్మీని రంగంలో దింపాల్సి వస్తుంది. ఈ పరిస్థితి తెచ్చుకుందామా? అంత దుస్థితి తెచ్చుకోవాలా?’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రాష్ట్ర ప్రజలను ప్రశ్నించారు. (కరోనా: ఎంత చెప్పినా మీకు అర్థం కాదా!?)

‘ఒక వ్యక్తితో వెయ్యి మందికి సోకే ప్రమాదముంది. మొత్తం సమాజానికి ప్రమాదం. కాబట్టి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో చర్యలు ఆపదు. 24 గంటల కర్ఫ్యూ, షూట్‌ ఎట్‌ సైట్‌ ఆర్డర్స్, ఆర్మీని పిలిచే దుస్థితి తెచ్చుకోవద్దు’ అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. స్టేట్‌ లాక్‌ డౌన్‌ నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించేందుకు మంగళవారం వైద్యారోగ్య, వ్యవసాయ, పౌర సరఫరాలు, ఆర్థిక, పోలీసు, రెవెన్యూ శాఖల కార్యదర్శులతో ప్రగతి భవన్‌లో అత్యున్నత, అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి పలు కీలక సూచనలు చేశారు. అనంతరం ప్రగతి భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం తెలిపిన వివరాలు ఆయన మాటల్లోనే..

ఉల్లంఘిస్తే పాస్‌పోర్టులు రద్దు..
రాష్ట్రంలో కరోనా అధికంగా ప్రబలకపోవచ్చని అనుకుంటున్నం. అయినా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది. ప్రపంచవ్యాప్తంగా 195 దేశాలకు ఈ వ్యాధి పాకింది. ఇది సోకని దేశమంటూ లేదని వార్తలొస్తున్నాయి. మన దగ్గర విదేశాల నుంచి వచ్చిన వారికి, వారు తిరిగిన చోట ఇతరులకు వ్యాధి సంక్రమించి ఉండొచ్చని అనుమానాలుండటంతో మొత్తం 19,313 మందిని హోం ఐసోలేషన్‌లో పెట్టి నిఘా ఉంచాం. వీళ్లలో కొంత మంది తప్పించుకుపోతున్నారు. ఒక వ్యక్తి నిర్మల్‌లో మూడుసార్లు తప్పించుకుని పోయాడు. వీళ్లను నియంత్రించేందుకు వీరి పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకోవాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశించాం. ఇంకా కూడా బుద్ధిలేని పనిచేస్తే వారి పాస్‌పోర్టును సస్పెండ్‌ చేయిస్తాం. పౌర సమాజానికి శత్రువులుగా పరిణమించిన వారు పౌర సదుపాయాలు పొందడానికి అర్హులు కారు.. సమాజ శ్రేయస్సును భంగం కలిగిస్తామంటే సమాజం నుంచి లభించే ప్రయోజనాలు పొందే అర్హత లేదు. నిర్ధాక్షిణ్యంగా ఉండాలని కలెక్టర్లు, ఎస్పీలను కోరాం.


నేడు 114 అనుమానిత కేసుల ఫలితాలు
ఇప్పటివరకు రాష్ట్రంలో కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన వారిలో ఎవరి ఆరోగ్యం విషమంగా లేదు. ఆక్సిజన్‌ పెట్టడం, వెంటిలేటర్‌ మీద ఉంచడం లేదు. ఏప్రిల్‌ 7తో వీరికి చికిత్స ముగుస్తుంది. ఆలోగా కొత్త కేసులేమీ రాకపోతే మన దగ్గర ఇన్‌పేషెంట్ల సంఖ్య జీరో అవుతుంది. మన దగ్గర 114 మందికి కోవిడ్‌ సోకి ఉండొచ్చని అనుమానాలుండడంతో వారికి వైద్య పరీక్షలు జరిపించాం. వీరిలో 82 మంది విదేశాల నుంచి వచ్చిన వారు కాగా, 32 మంది స్థానికులున్నారు. వైద్య పరీక్షల ఫలితాలు బుధవారం రానున్నాయి. వీరిలో ఎంత మందికి సోకిందో తెలుస్తుంది.

కోవిడ్‌పై కవిత్వం రాయండి..
కొంత మంది కవులు అద్భుతమైన కవిత్యాలు రాశారు. క్వారెంటైనే మన వాలెంటైన్‌.. ఒంటరిగా ఉంటూనే సమష్టిగా యుద్ధం చేయాలని ఐనంపుడి శ్రీలక్ష్మి అద్భుత కవిత్వం రాశారు. కోవిడ్‌పై రాష్ట్రంలోని కవులు మంచి కవితలు రాయండి. టీవీ వాళ్లు కూడా కవి సమ్మేళనాలు పెట్టి కోవిడ్‌ మీద పాజిటివ్‌ డైరెక్షన్‌లో ప్రజలను ఎడ్యుకేట్‌ చేయండి.

ప్రజాప్రతినిధులెక్కడ?
ఎక్కడ చూసినా పోలీసులు, జిల్లా కలెక్టర్లు, మున్సిపల్‌ సిబ్బంది మాత్రమే రోడ్లపై ప్రజలను నియంత్రిస్తూ కన్పిస్తున్నారు. ప్రజాప్రతినిధులందరూ ఎక్కడికి పోయారు. జీహెచ్‌ఎంసీలో 150 మంది కార్పొరేటర్లున్నరు.. ఏం చేస్తున్నరు? మనకు బాధ్యత లేదా? 100 శాతం మీరు రంగంలో దిగాలి. జంట నగరాల్లో హైదరాబాద్‌ సిటీ, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలోనే ఎమ్మెల్యేలందరూ యాక్షన్‌లోకి దిగాలి. చౌరస్తా వద్ద పోలీసులతో మనం కూడా నిలబడాలి. హైదరాబాద్‌లో 150 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఇలాంటి ఆపత్కాల సమయంలో ప్రజలతో ఉన్నామా లేదా అని ప్రజలు చూస్తారు. జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లు పోలీసులతో సమన్వయం చేసుకుని ప్రతి చెక్‌పోస్టు వద్ద ఉండాలి. మంత్రులందరూ తమ జిల్లా కేంద్రాలకు వెళ్లి అక్కడే ఉండండి. అందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మీ నియోజకవర్గ కేంద్రంలో ఉండి పోలీసు, మున్సిపల్, రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుని లీడ్‌ రోల్‌ తీసుకోండి.

ఒక్క పోలీసులదే బాధ్యత అంటే ఏమీ కాదు. గ్రామాల్లో ఉన్న 8,20,727 మంది పంచాయతీరాజ్‌ స్టాండింగ్‌ కమిటీ సభ్యులను క్రియాశీలం చేయాలి. ఏ ఊరి సర్పంచ్, ఎంపీటీసీ ఆ ఊరి కథానాయకుడు కావాలి. ఏ మండల జెడ్పీటీసీ, ఎంపీపీ ఆ మండలానికి, ఏ జిల్లాపరిషత్‌ చైర్మన్‌ ఆ జిల్లాకు, ఎమ్మెల్యే తన నియోజకవర్గానికి కథానాయకులు కావాలి. సింగిల్‌ విండో చైర్మన్లు, డీసీసీబీ చైర్మన్లు కూడా ప్రజలను చైతన్యపరచాలి. పోలీసులతో కలసి రౌండ్‌ ది క్లాక్‌ పనిచేయాలి. పురపాలికల్లోని 3 వేల 400పై చిలుకు వార్డుల్లో 2,04,300 మంది స్టాండింగ్‌ కమిటీ సభ్యులున్నారు. పురపాలికలు, పంచాయతీలు కలిపి స్టాండింగ్‌ కమిటీ సభ్యులు 10 లక్షల పైచిలుకు మంది ఉన్నారు. ప్రజాప్రతినిధుల నాయకత్వంలో వీరంతా ప్రజాసైన్యంగా తయారు కావాలి. ప్రజలను అప్రమత్తం చేయాలి. పోలీసులను సహకరించాలి.

పోలీసులు ఎట్ల పనిచేస్తున్నరో మనం కూడా అలా చేయాలి. ఎక్కడన్న దుర్మార్గులుంటే మనం కూడా లాఠీ పట్టుకుని నిలబడాలి. నేను చెబుతున్నది కొట్టమని కాదు. కానీ అంత చురుకుగా పనిచేస్తేనే ఈ సమస్యను మనం అధిగమించగలుగుతం. ఎట్టిపరిస్థితిల్లో మిలటరీని పిలిచే పరిస్థితి రాకుండా, కర్ఫ్యూ పెట్టే పరిస్థితి రాకుండా, షూట్‌ ఎట్‌ సైట్‌ పరిస్థితి రాకుండా సామాజాన్ని కాపాడుకోవాలనే దానిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పౌరబాధ్యత వహించాలి. చెక్‌పోస్టుల వద్ద పోలీసులతో పనిచేయాలి. కూరగాయాల దుకాణాల వద్ద బ్లాక్‌మార్కెట్‌ జరగకుండా పనిచేయాలి.

సరిహద్దుల వద్ద ఉన్న వాహనాలకు ఒక్క అవకాశం..
రాష్ట్ర సరిహద్దుల వద్ద 3400 వాహనాలు చేరుకుని ఆగి ఉన్నయి. రకరకాల వస్తువులు తీసుకుని వారొచ్చారు. మన రాష్ట్రానికి కావాల్సిన వస్తువులు కూడా అందులో ఉన్నయి. మళ్లీ వారు అక్కడ జమా కాకుండా ఈ ఒక్క రోజు టోల్‌ మినహాయింపు ఇస్తున్న. రవాణా, పోలీసు శాఖకు ఆదేశాలిచ్చినం. మంగళవారం రాత్రికి వారు ఎవరి గమ్య స్థానాలకు వారు గప్‌చుప్‌గా చేరుకోవాలి. 

పోలీసులు దండాలు అందుకుంటరు.. 
లాక్‌డౌన్‌ అమల్లో భాగంగా రోజూ సాయంత్రం 7 నుంచి ఉదయం 6 గంటల వరకు మంగళవారం నుంచి కర్ఫ్యూ విధించాం. ఒక్క మనిషి కూడా బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఏ సమస్య వచ్చినా డయల్‌ 100కి ఫోన్‌ చేయండి. పోలీసు వాహనం వచ్చి మీకు సహాయపడ్తది. లేకుంటే ఇంకా కఠిన చర్యలుంటయి. ఇక బతిమిలాడే పరిస్థితులుండవు. పోలీసులు దండం పెట్టి చెప్పిన్రు. ఇక చాలు.. ఇక దండాలు అందుకుంటరు. సాయంత్రం 6 గంటలకు దుకాణాలు మూతబడాలి. 7 గంటల వరకు ఉండొద్దు. 6 గంటల వరకు కొనుగోళ్లు చేసుకుని 7 గంటలకు ఇళ్లకు చేరుకోవాలి. 6 గంటల ఒక్క నిమిషానికి షాప్‌ తెరిచి ఉంటే ఆ షాప్‌ లైసెన్స్‌ రద్దు చేస్తం. కరోనా సమస్య ఎన్ని రోజులు కొనసాగుతుందో మనకు తెలియదు. అమెరికా లాంటి దేశమే ఈరోజు అత్యంత పీడిత దేశంగా మారింది. రోగుల సంఖ్య 47 వేలకు దాటింది. ఏమైతదో తెలియని పరిస్థితి. ఆర్మీని పిలిచి షూట్‌ ఎట్‌ సైట్‌ ఆర్డర్స్‌ ఇచ్చారు. మన దేశంలో కూడా 30 వరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను లాక్‌డౌన్‌ చేశారు. మన రాష్ట్రంలో బయటకు పోవాలంటే అవకాశం లేదు. అడుగడుగునా పోలీసు చెక్‌పోస్టు. వేరే దేశం పోదామంటే అవకాశం లేదు. దయ చేసి ప్రజలందరికీ నేను దండం పెట్టి విజ్ఞప్తి చేస్తున్న. ఆపత్కాల సమయంలో మనం కచ్చితంగా నియంత్రణ పాటించాలి. 

మీడియా పట్ల పోలీసుల దురుసుతనం వద్దు.. 
ప్రభుత్వమే మీడియాకు అనుమతించింది. వారి పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించవద్దని డీజీపీకి ఆదేశిస్తున్న. సోమవారం అక్కడక్కడ పోలీసులు, మీడియా మధ్య గొడవలు జరిగాయి. మీడియా అపార్థం చేసుకోవద్దు. ఉద్దేశపూర్వకంగా ఎవరూ అలా చేయరు. మీడియా పనిచేయకుంటే ప్రజలకు వార్తలు పోవు. నేను చెప్పే ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ కూడా పోదు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెప్పే విషయాలు ప్రజలకు వెళ్లాలంటే మీడియా ఫ్రీగా తిరగాలి. రాష్ట్రంలో పోలీసులు మీడియా విషయంలో సంయమనం పాటించాలి. మీడియాను అనవసరంగా ఆపకండి. ఎక్కడైనా చిన్న సంఘటన జరిగితే డీజీపీ చర్యలు తీసుకుంటారు. రష్యా దేశం కరోనా నుంచి అద్భుతంగా కాపాడుకుంటా ఉంది. వాళ్లు కూడా తొలుత కొంత ఇబ్బంది పడ్డారు. రష్యా అధ్యక్షుడు ఒకే మాట అన్నడు. దర్జాగా ఇంట్లో కాలు మీద కాలు వేసుకుని కూర్చోమంటే కూర్చోలేదు. ఇంట్లో ఉంటారా? ఐదేళ్లు జైళ్లో ఉంటారా అన్నడు. దెబ్బతో మొత్తం క్లోజ్‌ అయిపోయింది. మనకు మనమే నిర్బంధించుకోవాలి.  

వ్యవసాయం జరగాలి.. 
గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం జరగాలి. పాలు పితకాల్సిందే. పంటలు కోయాల్సిందే. లేకుంటే మనకు తిండి గింజలు దొరకవు. దాదాపు 50 లక్షల ఎకరాల్లో పంటలున్నాయి. కూలీలకు కొంత ఉపాధి నరేగా పనులు కూడా కొనసాగించొచ్చు. నీటిపారుదల ప్రాజెక్టుల పనులకు అనుమతించినం. చాలా గ్రామాలకు కంచెలు వేసుకున్నరు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలు నియంత్రణలో ఉన్నయి. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కొంచెం ఇబ్బంది ఉండే. మంగళవారం నియంత్రణలోకి వచ్చింది. పోర్టులు, విమానాశ్రయాలు, రైళ్లు బంద్‌ అయిపోయాయి. మంగళవారం రాత్రి నుంచి డొమెస్టిక్‌ విమానాలు బంద్‌ అయితున్నయి. వేరే చోట నుంచి జబ్బు వచ్చే పరిస్థితి లేదు. విదేశాల నుంచి వచ్చిన వారితో ఇప్పటికే వచ్చిన జబ్బు వ్యాప్తి చెందకుండా మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. 

బ్యాంకు ఖాతాల్లో రూ.1500 
లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో పేద ప్రజలు ఆకలికి గురికాకుండా తెల్ల రేషన్‌ కార్డుదారులకు ప్రకటించిన ఉచిత బియ్యం పంపిణీని గురువారం నుంచి ప్రారంభిస్తున్నం. మధ్య దళారులు లేకుండా తెల్లకార్డు కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో నేరుగా రూ.1,500 జమ చేస్తం. వారి వివరాలు సేకరిస్తున్నం. అధిక ధరతో కూరగాయలు, నిత్యావసర సరుకులు అమ్మే వారిపై పీడీ చట్టం కింద జైళ్లకు పంపిస్తం. ఈ సమయంలో ప్రజల రక్తం పిండుకుంటామంటే ఎవడైనా సరే వదలం. మన దగ్గర ఏడాదికి 30 లక్షల మెట్రిక్‌ టన్నుల కూరగాయలు ఉత్పత్తి అయితే రాష్ట్రంలో 27 లక్షల మెట్రిక్‌ టన్నులను వినియోగించుకుంటారు. 3 లక్షల మెట్రిక్‌ టన్నుల కూరగాయలు అదనంగా ఉన్నా ధరలు పెంచుతామంటే ఊరుకోం. ధరలు పెంచినవారి దుకాణాలు సీజ్‌ చేసి లైసెన్స్‌లు రద్దు చేస్తాం. తస్మాత్‌ జాగ్రత్త. మీ జీవితాలు, వ్యాపారాలు పాడుచేసుకోవద్దు. మిమ్మల్ని బ్లాక్‌ లిస్టుల పెడ్తం. తర్వాత లైసెన్సులు కూడా రావు. దేశం, ప్రపంచం అంతా అల్లకల్లోలంగా ఉంటే ప్రజల జేబులు దోచుకోవడానికి.. ఇప్పుడేనా మీకు సమయం దొరికింది.. ఇంత దుర్మార్గం ఎందుకు మీకు..  

డయల్‌ 100కు ఫోన్‌ చేయండి.. 
ఎవరికైనా అపెండిసైటిస్, గుండె జబ్బు రావొచ్చు. బంధువు చనిపోవచ్చు. తండ్రి చనిపోయి కొడుకు ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు వెళ్లాల్సి రావచ్చు. వారు వెళ్లాలి. మరణాలు, అత్యవసర వైద్య సేవల కోసం, ఇతర అత్యవసర సహాయం కోసం ప్రజలు డయల్‌ 100కి ఫోన్‌ చేయాలి. వెంటనే అధికారులు స్పందించి తగిన ఏర్పాట్లు చేస్తరు. వారికి తగిన వాహన సదుపాయం లేకుంటే వాహన సదుపాయం కూడా ఏర్పాటు చేస్తరు. 

వరి, మొక్క జొన్న రైతుల ఖాతాల్లో మద్దతు ధర
మొక్కజొన్న,. వరి పంట దిగుబడులొస్తున్నాయి. ప్రభుత్వం మొత్తం కొంటుంది. కనీస మద్దతు ధరను రైతుల బ్యాంకు అకౌంట్లకు వేస్తాం. రైతులకు ఇబ్బంది ఉండదు. పట్టణాల్లోని మార్కెట్‌ కమిటీలను బంద్‌ పెట్టినం. మీరు రావొద్దు. మీ ఊర్లలోనే మీరు అమ్ముకోవాలి. ఎవరెవరు రావాలో కూపన్లు ఇస్తున్నం. ఐకేపీ కేంద్రాలు పెచుతున్నం. సహకార సంఘాలను కూడా కొనాలని చెప్పినం. రైతు బంధు కమిటీలు కూడా ఈ కార్యక్రమంలో క్రియాశీలంగా పాల్గొనాలి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement