మీ స్ఫూర్తి.. స్వీయ నియంత్రణకు థ్యాంక్స్‌ | CM KCR Announced Telangana Lockdown Till 31st March | Sakshi
Sakshi News home page

తెలంగాణ@31 దాకా లాక్‌ డౌన్‌

Published Mon, Mar 23 2020 12:57 AM | Last Updated on Mon, Mar 23 2020 5:00 AM

CM KCR Announced Telangana Lockdown Till 31st March - Sakshi

కూరగాయలు, పాలు, కిరాణా షాపులు, ఎల్పీజీ, పెట్రోల్‌ బంకులు తెరిచే ఉంటాయి
తెల్లకార్డుదారులకు ఒక్కొక్కరికీ ఉచితంగా 12 కిలోల బియ్యం
వైన్‌ షాపులు మాత్రం మూసి ఉంటాయి
సరుకుల కోసం కుటుంబానికి రూ. 1,500 చొప్పున పంపిణీ

సాక్షి, హైదరాబాద్‌ : ‘అత్యవసర పరిస్థితుల్లో విశేష అధికారాల కోసం అమలు చేసే అంటురోగాల నియంత్రణ చట్టం–1897ను రాష్ట్రంలో ప్రయోగించాం. మార్చి 31 వరకు తెలంగాణ రాష్ట్రం లాక్‌డౌన్‌లో ఉంటది. ఎట్టి పరిస్థితుల్లో ఎవరూ ఇళ్లు దాటి బయటకు రావొద్దు. ఐదుగురికి మించి బయట గూమికూడొద్దు. ఈ నిబంధన చాలా సీరియస్‌గా ఉంటది. బయట కొచ్చిన వ్యక్తుల మధ్య కనీసం 3 అడుగుల దూరం ఉండాలి. ఇంటి కోసం కావాల్సిన మందులు, పాలు, కూరగాయలు, నిత్యావసర, అత్యవసర వస్తువుల సేకరణ కోసం కుటుంబానికి ఒక వ్యక్తిని మాత్రమే బయటకు అనుమతిస్తారు. బయటకు వెళ్లినప్పుడు వీలైనంత వరకు 2–3 రోజుల వస్తువులు తెచ్చుకోవాలి’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.


ప్రధాని పిలుపు మేరకు అత్యవసర సేవల సిబ్బందికి మద్దతు తెలుపుతూ ప్రగతి భవన్‌లో చప్పట్లు కొడుతున్న సీఎం కేసీఆర్‌

కోవిడ్‌–19 నియంత్రణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై ఆదివారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ సారథ్యంలో ఉన్నతస్థాయి నిపుణుల కమిటీ సమావేశమై చర్చించింది. అనంతరం సీఎం కేసీఆర్‌ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి సమావేశ నిర్ణయాలను వెల్లడించారు. దయచేసి ఆదివారం జనతా కర్ఫ్యూ సందర్భంగా చూపిన క్రమశిక్షణ, పట్టుదలను కచ్చితంగా మార్చి 31 వరకు చూపాలి. అప్పటివరకు ఎవరి ఇళ్లకే వారు పరిమితమై ఉంటే కరోనాను తరిమి కొట్టొచ్చు. మనం, మన కుటుంబాలు, మన పిల్లలు కరోనా బారిన పడకుండా క్షేమంగా ఉండొచ్చు. ఇవి సర్వజనుల హితం కోరి చెప్పే మాట కాబట్టి అందరూ తు.చ. తప్పకుండా పాటించాలి’అని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వారం రోజులపాటు ఎవరి ఇళ్లలో వారు ఉండి ఇళ్లలో చేసుకోవాల్సిన మొక్కలు నాటడం వంటి పనులు చక్కబెట్టుకుంటూ గడిపితే ఈ మహమ్మారి బాధ నుంచి తప్పించుకోవచ్చన్నారు. సీఎం కేసీఆర్‌ వెల్లడించిన వివరాలు ఆయన మాటల్లోనే..

అద్భుత దృశ్యం ఆవిష్కరణ..
ప్రపంచాన్ని చుట్టుముట్టి భయకంపితం చేస్తున్న కరోనా వైరస్‌ వ్యాప్తి నిర్మూలనకు ఆదివారం జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధాని మోదీతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపునకు ప్రజలు కనీవినీ ఎరుగని రీతిలో అద్భుతంగా స్పందించి ఇళ్లకే పరిమితమయ్యారు. అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించారు. ఏదైతే నేను కోరానో దాన్ని గౌరవించారు. వ్యక్తుల మధ్య దూరాన్ని పాటిస్తూ ఇళ్లకే పరిమితమై వ్యాధి వ్యాప్తి కాకుండా ప్రపంచ మానవాళికే తెలంగాణ అద్భుతమైన కంట్రిబ్యూషన్‌ చేసింది. మేమంతా ఒకటే. దేన్నైనా ఎదుర్కోగలమని సంఘీభావ సంకేతమిచ్చేందుకు సాయంత్రం 5 గంటలకు చప్పట్లు కొట్టాలన్న పిలుపునకు సైతం ప్రజలు అద్భుతంగా స్పందించారు. బాల్కనీల్లో, రోడ్లపై, ఇళ్ల ముందుకు వచ్చి ప్రజలు అద్భుతంగా ఇందులో పాల్గొన్నారు. ఇంత సంఘీభావ ప్రదర్శన, ఐక్యత, విజ్ఞతను చాటిచెప్పిన ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకు పేరు పేరునా నా తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుతున్నా. హైదరాబాద్, ముంబై నంబర్‌ వన్‌ స్థానంలో లాక్‌డౌన్‌ అయ్యాయని జాతీయ వార్తా చానళ్లు పేర్కొన్నాయి.
(చదవండి : మరో ఆరుగురికి కరోనా పాజిటివ్‌..)


జనతా కర్ఫ్యూతో ఆదివారం నిర్మానుష్యంగా మారిన అసెంబ్లీ పరిసర ప్రాంతం.. 

ప్రభుత్వ ఉద్యోగులకు...
ప్రభుత్వ ఉద్యోగులు కూడా కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదు. విద్యుత్, వైద్య వంటి కొన్ని అత్యవసర శాఖల సిబ్బంది విధిగా 100 శాతం రావాల్సి ఉంటుంది. మిగిలిన శాఖల వారు 20 శాతం రొటేషన్‌ పద్ధతిలో హాజరు కావాలి. విద్యాశాఖకు సంబంధించి అన్ని కార్యకలాపాలను మూసేస్తున్నం. పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనం కూడా ఉండదు. మార్చి 31 వరకు అన్నీ మూసివేతే. ఆ తర్వాత సమీక్షించి నిర్ణయం తీసుకుంటాం.

ఇళ్లకే పౌష్టికాహారం.. 
అంగన్‌వాడీ కేంద్రాల్లో జనం గూమికూడితే సమస్య అని మూసేస్తున్నం. మహిళలు, చిన్న పిల్లలకు పోషకాహార లోపం రావొద్దని ఇళ్ల వద్దకే సరుకులు పంపిణీ చేస్తాం. ప్రసవానికి సిద్ధంగా ఉన్న గర్భిణుల వివరాలు సిద్ధం చేస్తున్నం. వారి కోసం ప్రత్యేకంగా అమ్మ ఒడి వాహనాలు ఏర్పాటు చేస్తున్నం. ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యవసరం కాని సర్జరీలను నెల వాయిదా వేయాలి. అత్యవసర వైద్య సేవలు కొనసాగుతాయి. ప్రతిరోజూ రాష్ట్రంలో ఆరోగ్య స్థితిగతులపై ఆరోగ్యశాఖ మంత్రి బులెటిన్‌ విడుదల చేస్తరు.

బీమారీ దిగుమతి బంద్‌...
దేశీయ, అంతర్జాతీయంగా ఈ వైరస్‌ ద్వారా సంభవిస్తున్న పరిణామాలపై ఉన్నతస్థాయి నిపుణుల కమిటీ సమావేశమై చర్చించింది. విదేశాల నుంచి ప్రయాణికుల రాక బంద్‌ కావడంతో ఆదివారం నుంచి ఓ ప్రమాదం తప్పిపోతోంది. పోర్టులు, ఎయిర్‌పోర్టులు బంద్‌ అయ్యాయి. షికాగో నుంచి హైదరాబాద్‌కు రావాల్సిన ఒక విమానం ఇప్పటికే ఢిల్లీలో ల్యాండ్‌ అయింది. వస్తే ఒక ఫ్లైట్‌ శంషాబాద్‌కు వస్తది. విదేశాల నుంచి దిగుమతి అయ్యే బీమారీ అవస్థ ఈ రోజు నుంచి తప్పింది. అయితే దురదృష్టవశాత్తూ ఆదివారం కూడా ఐదు కోవిడ్‌–19 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 26కు (అప్పటివరకు ఉన్న సమాచారం మేరకు సీఎం ఆ వివరాలు చెప్పారు. అధికారికంగా 6 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా 27 మంది వైరస్‌ బారినపడ్డారు) చేరింది. వారందరూ కోలుకొని ఇళ్లకు వెళ్లాలని కోరుకుంటున్నా.


జనతా కర్ఫ్యూ ఎఫెక్ట్‌: హైదరాబాద్‌ నాగార్జున సర్కిల్‌ 

అదృష్టవశాత్తూ స్థానికవ్యాప్తి లేదు
రాష్ట్రంలో స్థానికంగా ఒకే వ్యక్తికి కరోనా సోకింది. అదృష్టవశాత్తూ రాష్ట్రంలో స్థానిక వ్యక్తులకు వ్యాధి వ్యాప్తి చెందడం లేదు. విదేశాల నుంచి వ్యక్తుల రాక నిలిచిపోయింది కాబట్టి ఇక్కడ వ్యాధి వ్యాప్తి చెందకుండా నిలపాల్సిన బాధ్యత తెలంగాణ సమాజంపై ఉంది. మనకు ఎవరో వచ్చి సాయం చేసే సమయం కాదిది. మన కోసం మనం.. జనం కోసం జనం.. అందరి కోసం అందరం పరితపించి పట్టుదలతో పని చేసుకోవాల్సిన పరిస్థితి.

పాలు, కూరగాయలు ఓకే.. 
కూరగాయలు, పాలు, కిరాణా షాపులు తెరిచి ఉంటాయి. అయితే ఇంటికో వ్యక్తి మాత్రమే బయటకు వెళ్లి అవసరమైనవి కొనుగోలు చేయాలి. పాసులేవీ ఉండవు. ఇది కర్ఫ్యూ లాంటి పరిస్థితి కాదు. మద్యం దుకాణాలు మాత్రం బంద్‌ చేస్తరు. ఐటీ ఉద్యోగులకు ఇళ్ల నుంచి పనిచేసుకోవడానికి కంపెనీలు అనుమతించాయి. ఐటీ మంత్రి కేటీఆర్‌ ఇప్పటికే ఐటీ కంపెనీలతో మాట్లాడి ఒప్పించారు.

కలెక్టర్లకు విశేష అధికారాలు..
అంటురోగాల నియంత్రణ చట్టం కింద కలెక్టర్లు, సబ్‌ డివిజనల్‌ మేజిస్ట్రేట్లకు విశేష అధికారాలు కట్టబెట్టుతున్నం. ఏ జిల్లాలో ఏ వాహనాన్ని అయినా అధికారులు స్వాధీనం చేసుకొని ప్రభుత్వ అవసరాలకు వాడుకోవచ్చు. నా కారును సైతం ఆపి అత్యవసర పరిస్థితి ఉందని తీసుకెళ్లొచ్చు.

మనకు ఇటలీ దుర్గతి రావొద్దు..
ఆదివారం నాటికి ప్రపంచవ్యాప్తంగా 3,08,047 మందికి కరోనా వచ్చింది. కొత్తగా 3,557 కేసులు బయటపడ్డాయి. ఇప్పటివరకు కరోనాతో 13,069 మంది మరణించారు. ప్రధానంగా ఇటలీ దెబ్బతింటున్నది. వారంతట వారే చెడగొట్టుకున్నరు. రోజుకు ఐదారొందల మంది చనిపోతున్నరు. ఆ దుర్గతి మనకు రావొద్దంటే స్వీయ నియంత్రణే మనకు శ్రీరామరక్ష. 

ఇళ్లలోనే ఉండండి..
విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులు జిల్లా కలెక్టర్, ఎస్పీ, డాక్టర్లు, మున్సిపల్‌ అధికారులకు స్వయంగా రిపోర్టు చేయాలి. మీకు వ్యాధి ఉంటే తక్షణమే చికిత్స ప్రారంభిస్తరు. మీకు, సమాజానికి క్షేమం. మన దగ్గర 800 మంది హోం క్వారెంటైన్‌లో ఉన్నరు. వారందరికీ స్టాంప్‌ వేసి పంపాం. వారిలో కొందరు దుర్మార్గులు బయటకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నరు. వారిని పట్టుకొని ప్రజలు రైళ్ల నుంచి దించేస్తున్నరు. ఒకాయనను ఆలేరు దగ్గర రైలులోంచి దించేశారు. రాష్ట్రమే లాక్‌డౌన్‌ అయింది.. ఎక్కడికీ వెళ్లలేరు. ఇది వినోద సమయం కాదు. దుఃఖ సమయం. దయచేసి ఆషామాషీగా తీసుకోకుండా అందరూ ఇళ్లలోనే ఉండాలి. ఒక వారం నియంత్రణ ఒక జీవిత కాలాన్ని కాపాడుతుంది. భవిష్యత్తు తరాలను, భారత దేశాన్ని కాపాడుతుంది. మనలో ఎవరు బాగున్నరో తెలియదు.


జగిత్యాల 

తల్లిదండ్రుల వల్లే కొడుక్కి రోగం 
సికింద్రాబాద్‌లో ఫస్ట్‌ లోకల్‌ ట్రాన్స్‌మిషన్‌ కేసు నమోదైంది. దుబాయ్‌ నుంచి వచ్చిన తల్లిదండ్రులు క్వారంటైన్‌లో ఉండకుండా ఇంటికి వెళ్లి కొడుక్కి తగిలించారు. ఈరోజు కొడుక్కి ఆ బీమారీ అంటించింది వారే. కనీసం కన్నబిడ్డల మీద ప్రేమ ఉండకపోతే ఎలా? మన కుటుంబాన్ని మనమే ధ్వంసం చేసుకుంటామా? విదేశాల నుంచి తిరిగి వచ్చినవారు ఇళ్లకు వెళ్లకుండా క్వారంటైన్‌కు వెళ్లండి. మిమ్మల్ని వైద్యులు పరీక్షించి స్టాంప్‌ వేసి ఇళ్లకు పంపిస్తరు. మీకోసం వందల కోట్లు ఖర్చు చేసి చికిత్స అందిస్తుంటే మీరు ఇలా చేస్తే ఎలా? విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించేందుకు 6 వేల బృందాలు పనిచేస్తున్నాయి. 

కుక్కలు జోక్‌ చేసుకుంటున్నయి...
బల్దియా సిబ్బంది సాధారణంగా కుక్కలను పట్టుకొని పోతారు. జనతా కర్ఫ్యూ రోజున రోడ్ల మీద మనుషులు కనబడలేదు. ‘మనుషులు ఏమయ్యారు. మునిసిపాలిటీవాళ్లు పట్టుకొనిపోయారా? అని కుక్కలు మాట్లాడుకుంటున్నట్టు సోషల్‌ మీడియాలో జోకులు వినిపిస్తున్నాయి. 

రవాణా బంద్‌...
ప్రజారవాణా 100 శాతం మూసివేతే. ఆర్టీసీ బస్సులు, ఆటోలు, ట్యాక్సీలు రోడ్లపైకి రావొద్దు. రైళ్లను కూడా ఇప్పటికే బంద్‌ చేశారు. ప్రజలు గూమికూడొద్దనే ఈ నిర్ణయాలు.  ఎవరి ఇళ్లకు వారు పరిమితం కావాలి.
అన్ని రాష్ట్ర సరిహద్దులు మూసివేస్తున్నాం. కూరగాయలు వంటి నిత్యావసర సరుకులు తీసుకొచ్చే రవాణా వాహనాలను అనుమతిస్తరు. అన్ని ప్రజారవాణా వాహనాలపై నిషేధం. అత్యవసర వస్తువులు తప్ప రాష్ట్రంలో చీమ,దోమను కూడా రానీయం. అన్ని అత్యవసర వైద్య సేవలు ఉంటాయి. విద్యుత్, వాటర్‌ సప్లై, సివరేజీ సేవలు, ఎల్పీజీ, పెట్రోల్‌ బంకులకు అనుమతి ఉంటది.

ఉచితంగా బియ్యం.. రూ. 1,500
కూలి పనులకు వెళ్లే నిరుపేదలు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో ఉన్నరు. సంక్షేమంలో మనం నంబర్‌ వన్‌లో ఉన్నం. బడ్జెట్‌లో సంక్షేమానికి రూ. 40 వేల కోట్లు పెట్టి ఖర్చు చేస్తున్నం. కాబట్టి నిరుపేదలు ఎట్టిపరిస్థితుల్లో ఆకలికి గురికాకూడదు. వారం రోజులకు సరిపడే సరుకులు మాత్రమే మనం ఇవ్వడం లేదు. వారంపాటు పనులు ఆగిపోతే మళ్లీ సాధారణ పరిస్థితికి రావాలంటే మరో 15 రోజులు పడుతుంది. కాబట్టి నెల రోజులకు సరిపడే రేషన్‌ బియ్యం మార్చి నెల బియ్యానికి అదనంగా ఇవ్వాలని నిర్ణయించాం. రాష్ట్రంలో కోటీ మూడు లక్షల కుటుంబాలుంటయి. 87.59 లక్షల మందికి తెల్లరేషన్‌ కార్డులున్నయి. అందులో ప్రతి వ్యక్తికి ఉచితంగా 12 కేజీల చొప్పున బియ్యం ఇస్తున్నం. తెల్ల కార్డుదారులకు ప్రతి నెలా లక్షా 50 వేల టన్నుల బియ్యం ఇస్తాం. ఇప్పుడు డబుల్‌ చేసి 12 కేజీలిస్తున్నం కాబట్టి 3 లక్షల 36 వేల టన్నులకుపైగా బియ్యాన్ని ఉచితంగా ఇస్తున్నం. దాని విలువ రూ. 1,103 కోట్లు. పప్పు, ఉప్పు, చింతపండు, నూనె వంటి సరుకులు కొనుక్కోవడానికి ప్రతి రేషన్‌కార్డుగల కుటుంబానికి రూ. 1,500 ఇస్తున్నాం. దీనికి రూ. 1,314 కోట్లు ఖర్చు అవుతున్నది. రెండింటికి కలిపి రూ. 2,417 కోట్లు విడుదల చేస్తున్నం.

ప్రైవేటు ఉద్యోగులకు వారం జీతం 
ఎపిడమిక్‌ యాక్ట్‌–1897 ప్రకారం వారం రోజులు టోటల్‌ లాక్‌డౌన్‌ చేస్తున్న సందర్భంగా నిర్మాణ కార్మికులు, ప్రైవేటు పరిశ్రమల్లో పనిచేసే వర్కర్లకు కాంట్రాక్టర్లు,  యాజమాన్యాలు ఈ కాలానికి సంబంధించిన వేతనాలను విధిగా చెల్లించాలి. ప్రభుత్వం సైతం ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు విధిగా జీతాలు చెల్లిస్తుంది. ఒక విపత్కర పరిస్థితి ఉన్నప్పుడు అందరూ బాధ్యత తీసుకోవాలి. కచ్చితంగా ప్రభుత్వ ఆదేశాలు పాటించాలి. ప్రైవేటు ఉద్యోగులకూ యాజమాన్యాలు జీతాలు చెల్లించాలి. మీ వ్యాపారానికే సహకరించే వారు కాబట్టి యాజమాన్యాలు వారిని ఆదుకోవాలి. ఈ చట్టం ప్రభుత్వానికి ఈ మేరకు అధికారం కల్పిస్తున్నది.

రాజ్‌భవన్‌లో మార్మోగిన చప్పట్లు 


ఆదివారం వైద్య, పారిశుద్ధ్య, పోలీసు సిబ్బందికి చప్పట్లతో సంఘీభావం తెలుపుతున్న గవర్నర్‌ తమిళిసై 
తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కోవిడ్‌–19 రోగులకు నిస్వార్థంగా సేవలందిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందికి సంఘీభావంగా ఆదివారం సాయంత్రం 5 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తన కుటుంబ సభ్యులు, సిబ్బందితో కలిసి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు రాజ్‌భవన్‌ పోర్టికో ముందు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోదీకు గవర్నర్‌ కృతజ్ఞతలు తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన కోవిడ్‌ అనుమానిత రోగులు ప్రజల్లో మమేకమై తిరుగుతున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమం దృష్ట్యా అందరూ ఇళ్లకే పరిమితమై ఉండాలని పిలుపునిచ్చారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement