ఇది అఖండ విజయం | KTR Comments On the results of local body elections | Sakshi
Sakshi News home page

ఇది అఖండ విజయం

Published Wed, Jun 5 2019 1:52 AM | Last Updated on Wed, Jun 5 2019 1:52 AM

KTR Comments On the results of local body elections - Sakshi

తెలంగాణ భవన్‌లో మాట్లాడుతున్న కేటీఆర్‌. చిత్రంలో తలసాని, మహమూద్‌ అలీ, శ్రీనివాస్‌ గౌడ్‌

సాక్షి, హైదరాబాద్‌: స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు తమ పార్టీకి అసాధారణ, అఖండ, చారిత్రక విజయం అందించారని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వానికి, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ప్రజలు మరోసారి సంపూర్ణ మద్దతు తెలిపారని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కంటే ఎక్కువ విజయాన్ని కట్టబెట్టారన్నారు. పరిషత్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఏకపక్ష విజయం సాధించిన నేపథ్యంలో కేటీఆర్‌ మంగళవా రం తెలంగాణభవన్‌లో మాట్లాడారు. మూడు జిల్లా ల్లోని మూడు స్థానిక కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజ యం సాధించిన పట్నం మహేందర్‌రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తేరా చిన్నపరెడ్డికి ఆయన అభినందనలు తెలిపారు. వరంగల్‌లో పోలైన ఓట్లలో ఏకంగా 96 శాతం ఓట్లు సాధించి  పోచంపల్లి దేశంలోనే రికార్డు సాధించారన్నారు. దీనికి కొనసాగింపుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అసాధారణ విజయం దక్కిందని ఆనందం వ్యక్తం చేశారు. ఇదొక చారిత్రక, అసాధారణ, అఖండ విజయమని, ఈ విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. 

5 సార్లు ఎదుర్కొన్నాం.. 
‘దేశ స్థానిక ఎన్నికల చరిత్రలో ఇంతటి తీర్పు లేదేమో. ఎన్నిక ఏదైనా తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ నాయకత్వాన్ని కోరు కుంటున్నారనేందుకు తాజా ఫలితాలు నిదర్శనం. రాష్ట్రంలోని 32 జిల్లా పరిషత్‌లను ఎవరి మద్దతు లేకుండా టీఆర్‌ఎస్‌ గెలుచుకుంటుంది. 90 శాతానికిపైగా మం డల పరిషత్‌ పదవుల విషయంలోనూ తీర్పు ఇలాగే ఉంది. 2001లో టీఆర్‌ఎస్‌ తొలినాళ్లలోనే స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొని నిజామాబాద్, కరీంనగర్‌ జిల్లా పరిషత్‌ పీఠాలను కైవసం చేసుకుంది. అప్పటి నుంచి చూస్తే ఇప్పటికి ఐదు సార్లు స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొన్నాం. ఇప్పటి గెలుపు టీఆర్‌ఎస్‌ చరిత్రలోనే ఇది అతిపెద్ద విజయం. వంద శాతం జెడ్పీ స్థానాల ను కైవసం చేసుకోవడం ఆనందంగా ఉంది.

ఇంతటి విజయాన్ని కట్టబెట్టిన లక్షలాది మంది టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు, ఓట్లు వేసి గెలి పించిన ప్రజలకు హదయపూర్వక ధన్యవాదాలు. వరంగల్‌రూరల్, వరంగల్‌ అర్బన్, కరీంనగర్, మహబూబ్‌నగర్, జనగామ, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అన్ని జెడ్పీటీసీ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ గెలిచింది. సిద్దిపేట, ఆసిపాబాద్, వనపర్తి, సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో ఒక్కో స్థానం మాత్రమే కోల్పోయాం. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ సొంత నియోజకవర్గంలో ఏడు జెడ్పీటీసీ స్థానాలుంటే ఐదు స్థానాల్లో టీఆర్‌ఎస్‌ గెలిచింది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నియోజకవర్గం మధిరలోని ఐదు జెడ్పీటీసీ స్థానాల్లో నాలుగు చోట్ల టీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. గత 18 ఏళ్లలో టీఆర్‌ఎస్‌ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది. ఒకానొక దశలో పార్టీ కనుమరుగైపోతుందేమోనన్న స్థితి ఏర్పడింది. గెలిచినా, ఓడినా టీఆర్‌ఎస్‌ ఎప్పుడూ ఒకేలా ఉం టుంది. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ చెప్పినట్లు ఇది విజయం కాదు.

ప్రజలు మాపై పెట్టిన బాధ్యత. పార్లమెంట్‌ ఎన్నికలకు, ఈ ఎన్నికలకు ఓటింగ్‌లో తేడా కనిపించింది. నరేంద్ర మోదీ ప్రధాని కావాలనే భావనలో ఆ ఎన్నికలు జరిగాయి. జగిత్యాల జిల్లాలోని ఒక్క స్థానం మినహా అన్ని జెడ్పీటీసీ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ గెలిచింది. లోక్‌సభ ఎన్నికల్లో అక్కడ బీజేపీకి ఆధిక్యత వచ్చింది. సిరిసిల్ల జిల్లాలోనూ ఒకే స్థానం కోల్పోయాం. కరీంనగర్‌ లోక్‌సభ సీటును బీజేపీ గెలిచింది. 4 ఎంపీ సీట్లు గెలవగానే బీజేపీ నేత లు ఏదేదో మాట్లాడుతున్నారు. అది మంచి పద్ధతి కాదు. ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలు. అనేక జిల్లాల్లో ప్రతిపక్ష పార్టీలు ఖాతాలు తెరవలేదు. మేం విజయం వస్తే పొంగిపోం. ఓటమితో కుంగిపోం. కార్యకర్తలు విజయాన్ని ఆస్వాదిస్తూనే బాధ్యతగా ఉండాలి. ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ల ఎన్నిక అయ్యే దాకా ఈ ఎన్నికల టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జీలు జిల్లాల్లోనే ఉండాలి. 90 శాతానికిపైగా ఎంపీపీలు టీఆర్‌ఎస్‌ గెలుచుకునేలా ఫలితాలు ఉన్నాయి’ అని కేటీఆర్‌ అన్నారు.

సీఎంఆర్‌ఎఫ్‌కు విరాళం.. 
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఎన్నికైన కూర్మయ్యగారి నవీన్‌కుమార్‌ మిత్రబృందం ముఖ్యమంత్రి సహాయనిధికి భారీ విరాళం ఇచ్చారు. నవీన్‌ కుమార్‌ ఎమ్మెల్సీగా విజయం సాధించిన శుభ సందర్భంగా ఆయన మిత్రబృందం ఈ నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌ సూచన మేరకు రూ.1,40,50,000 చెక్కును సీఎంఆర్‌ఎఫ్‌కు అందజేశారు. ఈ మేరకు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు చెక్కును మంగళవారం అందజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement