తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ ముఖ్యనేతలతో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈ నెల 20 నాటికి పూర్తిచేయాలని, ఆగస్టు నెలాఖరులోగా గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్నిరకాల సంస్థాగత కమిటీలను ఏర్పాటు చేయాలని టీఆర్‌ఎస్ నిర్ణయించింది. ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు చేతుల మీదుగా టీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయ భవనాలను ప్రారంభించి, కార్యకర్తలకు సంస్థాగత శిక్షణ ఇవ్వాలని యోచిస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.తారక రామారావు అధ్యక్షతన బుధవారం తెలంగాణ భవన్‌లో పార్టీ ప్రధాన కార్యదర్శులు, పలువురు కీలక నేతలతో సమావేశం జరిగింది. ఇందులో పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీలు, పార్టీ కార్యాలయాల ప్రారంభం, కార్యకర్తలకు శిక్షణ వంటి అంశాలపై సుమారు మూడు గంటల పాటు చర్చించారు. 2021–23 సంవత్సరాలకు సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరి 12న ప్రారంభమైన సభ్యత్వ నమోదులో ఇప్పటివరకు 61 లక్షల మంది టీఆర్‌ఎస్ సభ్యత్వాన్ని స్వీకరించారని.. ఈ నెల 20 వరకు గడువు ఉండటంతో మరో 9 లక్షల మంది చేరొచ్చని ఈ సందర్భంగా అంచనా వేశారు.
దేశంలో ఏ ఇతర ప్రాంతీయ పార్టీలోనూ ఇంత భారీగా సభ్యత్వ నమోదు జరగలేదని అభిప్రాయపడ్డారు. పార్టీ నేతలంతా లక్ష్యం చేరుకునే దిశగా సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా కేటీఆర్ ఆదేశించారు. సభ్యత్వం తీసుకున్న వారి వివరాలను 20వ తేదీనాటికి డిజిటలైజేషన్ చేయాలని సూచించారు. కాగా.. పార్టీ సభ్యత్వ నమోదుకు సంబంధించి ఇప్పటివరకు రూ.18 కోట్లు పార్టీ కార్యాలయానికి చేరాయని.. మరో రూ.24 కోట్లు ఇంకా రావాల్సి ఉందని సమావేశంలో నేతలు వివరించారు. 30 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 50వేలకు పైబడి సభ్యత్వాలు నమోదయ్యాయని, 20 నియోజకవర్గాల్లో 20 వేలలోపే సభ్యత్వ నమోదు జరిగిందని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పాతబస్తీతోపాటు కొన్ని నియోజకవర్గాల్లో ఆశించిన స్థాయిలో సభ్యత్వాలు నమోదు కాలేదని పేర్కొన్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జీలతో కేటీఆర్ నేరుగా మాట్లాడారు.
వారం తర్వాత మరో భేటీ
ఏడేళ్లుగా పార్టీ కార్యకర్తలకు అమలవుతున్న ప్రమాద బీమా గడువు ఈ నెల 30న ముగియనుం డటంతో.. 20వ తేదీలోగా కార్యకర్తల వివరాలను డిజిటలైజ్ చేయాలని భేటీలో నిర్ణయించారు. ఆగస్టు నెలాఖరులోగా వార్డు, గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సంస్థాగత కమిటీల నిర్మాణం పూర్తి చేయాలని ఈ సందర్భంగా కేటీఆర్ ఆదేశించారు. 2019లో 31 జిల్లా కేంద్రాల్లో టీఆర్‌ఎస్ కార్యాలయాల నిర్మాణం ప్రారంభించగా, ఇప్పటివరకు 24 జిల్లా కేంద్రాల్లో పనులు పూర్తయ్యాయని.. సూర్యాపేట, సిరిసిల్ల సహా మరో ఏడు జిల్లాల్లో 90 శాతం పనులు అయ్యాయని తెలిపారు. జిల్లా కార్యాలయాలను త్వరలోనే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించి, జిల్లా ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యేలా షెడ్యూల్ రూపొందించాలని ఆదేశించారు. పార్టీ కార్యాలయాల ప్రారంభం తర్వాత.. కార్యకర్తలకు శిక్షణా కార్యక్రమాలను ప్రారంభించాలని సూచించారు. సభ్యత్వ నమోదుపై సమీక్షించేందుకు ఈ నెల 21న మరోమారు పార్టీ కార్యనిర్వాహక సమావేశం నిర్వహిస్తామని కేటీఆర్ ప్రకటించారు. క్షేత్రస్థాయిలో చురుకైన కార్యకర్తలను గుర్తించి సోషల్ మీడియా కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
కొత్త పదవులు వచ్చినపుడు కొత్త భాష ..
తెలంగాణ భవన్‌లో జరిగిన భేటీలో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల మీద కూడా లోతుగా విశ్లేషణ జరిగింది. రాజకీయ పార్టీలకు కొత్త అధ్యక్షులు వచ్చినపుడు కొత్త కార్యక్రమాలు, కొత్త భాష సహజమేనని కేటీఆర్ వ్యాఖ్యానించారు. వాటిపై టీఆర్‌ఎస్ కూడా తగిన కార్యాచరణతో ముందుకు పోతుందని తెలిపారు. ఈటల రాజేందర్ వ్యవహారం ప్రస్తావనకు రాగా.. టీఆర్‌ఎస్ ఆయనకు ఇవ్వాల్సిన దాని కంటే ఎక్కువ గుర్తింపునే ఇచ్చిందని కేటీఆర్ పేర్కొ న్నట్టు తెలిసింది. ఈటల టీఆర్‌ఎస్‌లో ఉంటూ కొత్త పార్టీ ఏర్పాటు గురించి ఆలోచించాడని, అయినా చివరి నిమిషం వరకు ఆయనను పార్టీలో కొనసాగించేందుకు తాను వ్యక్తిగతంగా కూడా ప్రయత్నించానని కేటీఆర్ పేర్కొన్నట్టు సమాచారం.
కొండల్ కుటుంబానికి అండగా ఉంటాం
టీఆర్‌ఎస్ పార్టీ విద్యార్థి విభాగంతో పాటు పార్టీ కోసం సుదీర్ఘకాలం పనిచేసిన నల్లగొండ జిల్లా చండూరు మండలానికి చెందిన దివంగత తిరుమణి కొండల్ కుటుంబాన్ని ఆదుకుంటామని మంత్రి కేటీఆర్ అన్నారు. ఏడాది క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడి గత నెల క్రితం వరకు చికిత్స పొందుతూ మరణించిన కొండల్ కుటుం బం బుధవారం తమకు సహాయం అందించాల్సిందిగా తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ను కలిసింది. ఈ సందర్భంగా కొండల్ భార్యను ఓదార్చిన మంత్రి కేటీఆర్, తగిన సహాయం చేస్తామని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment