k taraka rama rao
-
మూడోసారీ మా ప్రభుత్వమే
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ తర్వాత మూడు వేర్వేరు సంస్థల ద్వారా లోతుగా సర్వే చేశామని.. బీఆర్ఎస్కు 72 నుంచి 82 సీట్లు వస్తాయని స్పష్టంగా తేలిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.తారకరామారావు చెప్పారు. రాష్ట్రంలో మూడోసారి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందనడంలో ఎలాంటి అనుమానం లేదని ధీమా వ్యక్తం చేశారు. బుధవారం కేటీఆర్ మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ చేశారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘మాపై వ్యతిరేకత ఉన్నట్టు సోషల్ మీడియాలో హడావుడి జరగడం, అక్కడక్కడా మౌఖిక ప్రచారమే (మౌత్ టాక్) తప్ప క్షేత్రస్థాయిలో ఓటరుకు ఎలాంటి గందరగోళం లేదు. అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. మొదట్లో మేం కూడా కొంత గందరగోళపడినా క్షేత్రస్థాయి నుంచి మాకు మంచి ఫీడ్‌బ్యాక్ వచ్చింది. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కామారెడ్డిలో మూడో స్థానంలో, కొడంగల్‌లో రెండో స్థానంలో నిలిచే పరిస్థితి ఉన్నపుడు కాంగ్రెస్ గెలిచే అవకాశం ఎక్కడుంది? కాంగ్రెస్ దిగ్గజాలైన కోమటిరెడ్డి సోదరులు, జానారెడ్డి కుమారుడు, జగ్గారెడ్డి వంటివారు కూడా ఓడిపోతున్నారు. బీజేపీ రెండు, మూడు సీట్లకే పరిమితం అవుతుంది. మేం ఖమ్మంలో ఆరు స్థానాల్లో, నల్లగొండలో 7 నుంచి 9 సీట్లలో కచ్చితంగా గెలుస్తాం. మిగతా నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఉన్నా మా పార్టీ పరిస్థితి నిక్షేపంగా ఉంది. వాపు చూసి బలుపు అనుకుంటున్నారు రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయి ఆరంభంలో కొంత కాంగ్రెస్ వైపు మళ్లడంతో ఆ వాపును చూసి బలుపు అనుకుంటున్నారు. అది పాలపొంగు వంటి హడావుడి మాత్రమే. క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న బీఆర్ఎస్ కేడర్ కసిగా పనిచేస్తున్నారు. హుజూరాబాద్, గోషామహల్, కరీంనగర్, కోరుట్లలోనూ గెలుస్తున్నాం. మాకు 15 నుంచి 18 చోట్ల బీజేపీ నుంచి, మిగతా చోట్ల కాంగ్రెస్ నుంచి పోటీ ఉండగా.. మేం మాత్రం అన్నిచోట్లా పోటీలో ఉన్నాం. ముదిరాజ్‌లకు టికెట్ల సర్దుబాటులో అవకాశం ఇవ్వలేకపోయాం. కాసాని జ్ఞానేశ్వర్, ఎర్ర శేఖర్ తదితరుల చేరికతో ఈ విషయాన్ని ఆ సామాజికవర్గం అర్థం చేసుకుంది. బీజేపీతో ఎన్నడూ అంటకాగలేదు కేసీఆర్ 50ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ బీజేపీతో అంటకాగలేదు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్‌లలో కాంగ్రెస్ పార్టీ బీజేపీకి అనుకూలంగా వ్యవహరించింది. ప్రస్తుత ఎన్నికల్లో ముస్లిం పట్ల బద్ధ వ్యతిరేకత కలిగిన బండి సంజయ్, అర్వింద్, రాజాసింగ్‌లపై కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను నిలబెట్టింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బీజేపీ ఏజెంట్‌గా పనిచేస్తూ మోదీని ఒక్కసారి కూడా విమర్శించలేదు. విపక్ష నేతల ఇళ్లపై జరుగుతున్న ఈడీ, ఐటీ దాడులను మాకు అంటగట్టడం సరికాదు. రైతుబంధు దుబారా, ధరణి రద్దు అంటూ కాంగ్రెస్.. ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద దొంగ రిపోర్టులతో బదనాం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నాయి. తెలంగాణను అప్పుల పాలు చేశామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆరోపణలు చేయడం విడ్డూరం. మోదీ ప్రతీ కుటుంబంపై రూ.5లక్షల అప్పు మోపారు. ఆయన ప్రియమైన ప్రధాని కాదు.. పిరమైన ప్రధాని. కేసీఆర్ అంటే భయంతోనే.. తెలంగాణకు ఉన్న ఏకైక గొంతు కేసీఆర్. ఆయన జాతీయ పార్టీలకు కొరుకుడు పడని కొయ్య. మూడోసారి అధికారంలోకి వస్తే ఏకు మేకు అవుతాడనేది కాంగ్రెస్, బీజేపీల భయం. కర్నాటక, గుజరాత్ల నుంచి రాష్ట్రంలోని ఆ పార్టీ నేతలకు వస్తున్న డబ్బుకు అడ్డూ అదుపు లేదు. ఆ రెండు జాతీయ పార్టీలకు 28 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. కానీ మాకు మాత్రం తెలంగాణే కేంద్రం. వాళ్లు తెలంగాణను గెలవాలనుకుంటున్నారు. మేం తెలంగాణను గెలిపించాలని అనుకుంటున్నాం. తెలంగాణ ఏకైక గొంతు కేసీఆర్‌ను కాపాడుకోవాలా వద్దా అని ప్రజలు తేల్చుకోవాల్సిన సందర్భం ఇది. కొత్త పింఛన్లు, రేషన్‌కార్డులు ఇస్తాం జనవరి నుంచి కొత్త రేషన్ కార్డులు, కొత్త ఆసరా పింఛన్లు ఇవ్వడం ప్రారంభిస్తాం. బీడీ కార్మీకులకు 2023 వరకు కటాఫ్ పెంచి కొత్తగా లక్షన్నర మందికి పింఛన్లు ఇస్తాం. భర్తను కోల్పోయిన భార్యల పేరిట పింఛన్ వచ్చేలా చర్యలు తీసుకుంటాం. గల్ఫ్ కార్మీకులకు ఉచిత బీమా కల్పిస్తాం. ఆటో డ్రైవర్లకు రూ.వంద కోట్ల మేర వాహన ఫిట్నెస్ చార్జీలు రద్దు చేస్తాం. జాబ్ క్యాలెండర్, టీఎస్పీఎస్సీ ప్రక్షాళన, ఉద్యోగ నియామకాలు సక్రమంగా నిర్వహించడం వంటి అంశాలపై ఇప్పటికే యువతకు స్పష్టత ఇవ్వడంతోపాటు దీనిని మరింత బలంగా ప్రచారం చేస్తాం. ఈసీ అనుమతివ్వగానే రైతుబంధు సొమ్ము రూ.19,445 కోట్ల పంట రుణాల మాఫీకిగాను ఇప్పటికే రూ.14వేల కోట్ల పైచిలుకు క్లియర్ చేశాం. మిగతా రూ.5వేల కోట్ల మాఫీ ప్రక్రియ ప్రతిపక్షాల ఫిర్యాదు వల్ల ఆగింది. రుణమాఫీ చెల్లింపులకు అనుమతి ఇవ్వాల్సిందిగా ఎన్నికల సంఘాన్ని కోరాం. అనుమతి వస్తే వెంటనే రుణమాఫీ చేస్తాం. రైతుబంధు 12వ దఫా సొమ్ము విడుదల కోసం కూడా ఎన్నికల సంఘాన్ని అనుమతి కోరాం. పీఎం కిసాన్ డబ్బులు వేసే వెసులుబాటు కల్పించి రైతుబంధు విషయంలో ఇబ్బంది పెట్టడం సరికాదు. మా మేనిఫెస్టోను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు గడప గడపకు వెళ్తాం..’’అని కేటీఆర్ తెలిపారు. -
అసైన్డ్ భూములకు హక్కులిస్తాం
సిరిసిల్ల: బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాగానే దళితులు, గిరిజనులకు ఇచ్చిన అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు ఇస్తామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.తారక రామారావు హామీ ఇచ్చారు. అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు వస్తే.. వాటిని అమ్ముకోవచ్చని, పిల్లలకు ఇచ్చుకోవచ్చని, బ్యాంకుల్లో కుదువపెట్టుకోవచ్చని చెప్పారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి, చందుర్తి, కోనరావుపేట, వేములవాడ, తంగళ్లపల్లి మండల కేంద్రాల్లో ఆయన రోడ్‌షోలు నిర్వహించి ఎన్నికల ప్రచారం చేశారు. ‘‘దరిద్రానికి నేస్తం కాంగ్రెస్ హస్తం. వారిని నమ్ముకుంటే నష్టపోయేది తెలంగాణ సమాజమే. గ్యారంటీ లేని కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ఇస్తుంది. రేవంత్‌రెడ్డి ఎప్పుడు జైలుకు పోతాడో ఆయనకే తెలియదు. 24 గంటలు కరెంట్ ఇచ్చే కేసీఆర్ కావాలా.. మూడు గంటల కరెంట్ అంటున్న కాంగ్రెస్ కావాలా తేల్చుకోవాలి. ఎన్నికలప్పుడు ఆగం కావొద్దు. ఆలోచించి ఓటేయాలి’’అని కేటీఆర్ కోరారు. ఆరున్నరేళ్ల పాలనలో ఎంతో చేశాం.. రాష్ట్రాన్ని కేసీఆర్ దేశానికే ఆదర్శవంతంగా చేశారని కేటీఆర్ చెప్పారు. తమ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో రెండేళ్లు కరోనాతో, మరో ఏడాది సమయం లోక్‌సభ, ఇతర ఎన్నికల కోడ్‌తో వృధా అయిందన్నారు. పక్కాగా పాలన సాగినది ఆరున్నరేళ్లేనని, ఇంత తక్కువ సమయంలోనే రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశామని చెప్పారు. బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే.. రేషన్‌కార్డులు ఇస్తామని, పెన్షన్లు పెంపు, 93 లక్షల కుటుంబాలకు బీమా, రేషన్‌కార్డులపై సన్నబియ్యం వంటివి అమలు చేస్తామని హామీ ఇచ్చారు. రైతుబంధును రూ.16 వేలకు పెంచుతామని, వంటగ్యాస్ సిలిండర్‌ను రూ.400కే అందిస్తామని ప్రకటించారు. సిరిసిల్ల ప్రాంతంలో 370 ఎకరాల్లో ఆక్వా హబ్ వస్తుందని, దీంతో ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. బాధ్యతలు పెరిగాయి ‘‘ప్రతి ఊరికి, ప్రతి ఇంటికి రావాలని ప్రతి ఒక్కరిని కలవాలని నాకు ఉంటుంది. కానీ బాధ్యతలు పెరిగాయి. మంత్రిగా, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రాష్ట్రమంతటా తిరగాల్సి వస్తుంది. మీరే చూస్తున్నారు. నేను రోజూ ఎన్ని ప్రాంతాల్లో, ఎన్ని సభల్లో పాల్గొంటున్నానో. మిమ్మల్ని కలవలేక పోతున్నందుకు బాధగా ఉంది..’’అని తంగళ్లపల్లి రోడ్‌షోలో కేటీఆర్ పేర్కొన్నారు. మీ ఆశీర్వాదంతో గెలిచాక ఎలాంటి తలవంపులు తేలేదని, సిరిసిల్ల ఎమ్మెల్యేగా గర్వపడేలా పనిచేశానని చెప్పారు. ఈ రోడ్‌షోలలో వేములవాడ బీఆర్ఎస్ అభ్యర్థి చెల్మెడ లక్ష్మీనర్సింహరావు, జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, ఉమ్మడి జిల్లా మాజీ జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, స్థానిక నాయకులు పాల్గొన్నారు. -
రేవంత్ కాదు.. రేటెంతరెడ్డి
సాక్షి, కామారెడ్డి: పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆర్ఎస్ఎస్ మనిషి అని, ఆయన ఎన్నికల తర్వాత పది పన్నెండు మంది ఎమ్మెల్యేలతో కలసి బీజేపీలో చేరడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ‘‘ఓటుకు కోట్లు కేసులో అరెస్టైన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు సీటుకు రేటు కడుతున్నాడు. అందుకే వాళ్ల పార్టీ నేతలే ఆయనను రేటెంతరెడ్డి అంటున్నారు..’’ అని విమర్శించారు. శనివారం కేటీఆర్ కామారెడ్డి జిల్లా కేంద్రంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఇక్కడి డిగ్రీ కాలేజీ మైదానంలో జరిగిన కామారెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ కార్య కర్తల సమావేశంలో మాట్లాడారు. దక్షిణ భారత దేశం నుంచి వరుసగా మూడుసార్లు ముఖ్యమంత్రి ఎవరూ కాలేదని.. సీఎం కేసీఆర్ మాత్రం ఈసారితో కచ్చితంగా హ్యాట్రిక్ సాధిస్తారని కేటీఆర్ పేర్కొన్నారు. దేశమంతటా తెలంగాణ గురించే చర్చ నడుస్తోందని, ఇక్కడ బీఆర్ఎస్ విజయం కోసం మహారాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఆ రాష్ట్రంలో చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, జెడ్పీ మెంబర్లు బీఆర్ఎస్తో కలసి రావడానికి సిద్ధంగా ఉన్నారని.. తెలంగాణలో గెలి చాక మహారాష్ట్రలోనూ గులాబీ జెండా ఎగుర వేద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మహా రాష్ట్రలో సాధించే విజయంతో కేంద్రంలో కీలక భూమిక పోషిస్తామని పేర్కొన్నారు. దేశ రాజకీయాలకు దిక్సూచిగా.. సీఎం కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా సంచలనమే నని కేటీఆర్ చెప్పారు. ‘‘మొదట సిద్దిపేటలో పోటీ చేసిన ఆయన టీఆర్ఎస్ను స్థాపించారు. కరీంనగర్లో పోటీచేసి ఢిల్లీకి తెలంగాణవాదాన్ని తీసుకువెళ్లారు. మహబూబ్‌నగర్‌లో పోటీ చేసి దేశాన్ని ఒప్పించి రాష్ట్రం సాధించారు. గజ్వేల్‌లో పోటీచేసి ఉద్యమ తెలంగాణను ఉజ్వల తెలంగాణగా తీర్చిదిద్దారు. పదేళ్ల స్వల్పకాలంలోనే వందేళ్ల ప్రగతి సాధించారు. కామారెడ్డిలో భారీ మెజారిటీతో విజయం ద్వారా హ్యాట్రిక్ సీఎంగా రికార్డు సాధించి, దేశ రాజకీయాలకు దిక్సూచిగా నిలుస్తారు..’’ అని పేర్కొన్నారు. కామారెడ్డిలో కేసీఆర్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయగానే కాంగ్రెస్, బీజేపీల నాయకులు వణికిపోయి పోటీచేయడంకన్నా ఇంట్లో పడుకోవడమే మంచిదనే భావనతో ఉన్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ను దేశంలోనే అఖండ మెజారిటీతో గెలిపించడం ద్వారా సరికొత్త చరిత్ర లిఖించాలని పిలుపునిచ్చారు. కర్ణాటక నుంచి కాంగ్రెస్ వాళ్లకు అడ్డగోలుగా డబ్బులు వస్తాయని, అదానీ నుంచి బీజేపీ వాళ్లకు డబ్బులు వస్తున్నాయని.. బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సూచించారు. నామినేటెడ్ పదవులు ఇస్తాం. రకరకాల సమీకరణాల దృష్ట్యా టికెట్ల కేటాయింపులో ముదిరాజ్‌లు, మరికొన్ని కులాలకు అవకాశం దక్కలేదని.. అయితే వారికి ఎమ్మెల్సీలుగా, చైర్మన్లుగా అవకాశం ఇస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్ పోటీచేసే కామారెడ్డి నియోజకవర్గంలోని గ్రామాల వారీగా, పట్టణాల్లో వార్డుల వారీగా ప్రత్యేక మేనిఫెస్టోలు రూపొందించి, అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. కామారెడ్డి నియోజకవర్గానికి తనతోపాటు మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్‌లు ఇన్చార్జులుగా ఉంటారని తెలిపారు. ఏ ఊరికి ఏం కావాలో నివేదికలు రూపొందించి అప్పగించాలన్నారు. సభలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎంపీ బీబీ పాటిల్ తదితరులు పాల్గొన్నారు. -
గోదావరి నీళ్లతో మూసీని నింపుతాం
నాగోలు/అంబర్పేట్/మన్సూరాబాద్ (హైదరాబాద్): మహా నగరంలో ఉన్న చారిత్రక మూసీ నదిని స్వచ్ఛమైన గోదావరి నీళ్లతో నింపుతామని ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కె.తారకరామారావు చెప్పారు. నార్సింగి వద్ద గోదావరి జలాలను మూసీలో కలిపి మురుగు నీరు లేకుండా చర్యలు చేపడతామని, దీనికోసం దేశంలో ఎక్కడా లేనివిధంగా ఎస్టీపీ ప్లాంట్లను నిర్మిస్తామని తెలిపారు. హైదరాబాద్‌కు గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చిన మూసీని గత ప్రభుత్వాలు పట్టించుకోక మురికి కూపంగా మారిపోయిందన్నారు. సోమవారం రూ.52 కోట్ల అంచనా వ్యయంతో మూసారంబాగ్ వద్ద మూసీ నదిపై నిర్మించ తలపెట్టిన హైలెవెల్ బ్రిడ్జికి కేటీఆర్ శంకుస్థాపన చేసి మాట్లాడారు. మూసీపై రూ.545 కోట్లతో 14 బ్రిడ్జిలను నిర్మిస్తున్నామని, వీటికి అద్భుతమైన డిజైన్లను రూపొందించేందుకు మన ఇంజనీర్లతో విదేశాల్లో అధ్యయనం చేయించామని తెలిపారు. సినిమాల్లో చూపిన మాదిరిగా బ్రిడ్జి డిజైన్లు ఉంటాయని, శంకుస్థాపన చేసిన వంతెనలు 18 నెలల్లో పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మురుగునీటి శుద్ధిలో దేశంలోనే హైదారాబాద్ మొదటి స్థానంలో ఉందని వివరించారు. ఇప్పుడు రోజుకు 2వేల మిలియన్ లీటర్ల సామర్థ్యంతో ఎస్టీపీల నిర్మాణం చేస్తున్నామని, ఇవి పూర్తయితే మూసీలోకి పూర్తిస్థాయి శుద్ధి చేసిన నీటిని వదిలే పరిస్ధితి ఏర్పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుదీర్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్, అహ్మద్ బలాల, ఎమ్మెల్సీలు యెగ్గె మల్లేశం, బొగ్గారపు దయానంద్ గుప్త, మేయర్ గద్వాల విజయలక్ష్మి పాల్గొన్నారు. సీఎం కలను నెరవేరుస్తాం మంచిరేవుల నుంచి ఘట్కేసర్ దాకా మూసీ నదిని అద్భుతంగా సుందరీకరించాలన్న సీఎం కేసీఆర్ కలను నెరవేరుస్తామని కేటీఆర్ చెప్పారు. 160 కి.మీ. ఓఆర్ఆర్ చుట్టూ తిరగకుండా మధ్యలో మూసీ నది మీదుగా వెళ్లేలా బ్రిడ్జిలు, రోడ్లు నిర్మిస్తామని తెలిపారు. రూ. 5వేల కోట్లతో రెండో విడత ఎస్ఎన్డీపీ పనులు త్వరలోనే చేపడతామని తెలిపారు. వారం పది రోజుల్లో 40 వేల డబుల్ బెడ్ రూం ఇళ్లను పారదర్శకంగా పంపిణీ చేస్తామని వెల్లడించారు. జీవో 118లో చిన్న చిన్న సాంకేతిక సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని కేసీఆర్ తెలిపారు. ఎల్బీ నగర్‌లోని కామినేని ఫ్లైఓవర్ల కింద ఏర్పాటు చేసిన ఆక్సిజన్ పార్కు అద్భుతంగా ఉందని కేటీఆర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్‌రెడ్డికి కితాబునిచ్చారు. కేటీఆర్ పార్కు మొత్తం కలియతిరిగి అక్కడ ఏర్పాటుచేసిన ఆకృతులను ఆసక్తిగా తిలకించి.. జీహెచ్ఎంసీ కార్మికులతో ఫొటోలు దిగారు. హైదరాబాద్ మతసమరస్యానికి ప్రతీక అని, పార్లమెంటులో లేని మతసమరస్యాం మన హైదరాబాద్‌లో ఉందని కేటీఆర్ అన్నారు. గణేశ్ నిమజ్జనం పురస్కరించుకొని మిలాద్ ఉన్ నబీ ర్యాలీ వాయిదా వేసుకోవడం ఒకరిని ఒకరు గౌరవించుకుంటున్నారనే దానికి నిదర్శనమని తెలిపారు. -
ఇప్పటిదాకా చూసింది ట్రైలరే..
సాక్షి, హైదరాబాద్/ ముషీరాబాద్: రాష్ట్రంలో ఇప్పటివరకు తాము చూపినది ట్రైలర్ మాత్రమేనని, త్వరలోనే ప్రతిపక్షాలకు అసలు సినిమా చూపిస్తామని మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు వ్యాఖ్యానించారు. పచ్చగా ఉన్న హైదరాబాద్‌లో కులమతాల పేరిట చిచ్చు పెట్టాలనుకునే దుర్మార్గులు, చిల్లర పార్టీల ఆటకట్టించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు–వీఎస్టీ జంక్షన్ మధ్య దాదాపు రూ.450 కోట్ల వ్యయంతో నిర్మించిన స్టీల్ ఫ్లైఓవర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించి మాట్లాడారు. ‘‘55 ఏళ్లు అధికారం ఇచ్చినా ఏమీ చేయని దుర్మార్గులు.. ఇప్పుడు పదేళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్నా ఏమీ చేయని అసమర్థులు.. మళ్లీ వస్తున్నారు. మతం పేరిటో, కులం పేరిటో చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అభివృద్ధిలో ముందుకు పోతున్న మనకు కాళ్లల్లో కట్టెలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఏడాదిలో వారం పదిరోజులపాటు కర్ఫ్యూ ఉండేది. ప్రజల మధ్య ఏదో ఓ పంచాయతీ పెట్టి కొన్ని రాజకీయ పార్టీలు పబ్బం గడుపుకొనేవి. ఇప్పుడు మతాలు, కులాలకు అతీతంగా అంతా కలసిమెలసి ముందుకు పోతున్నాం, చిల్లర పార్టీలు, నాయకుల మాటలకు మోసపోతే హైదరాబాద్ మళ్లీ వందేళ్లు వెనక్కుపోతుంది..’’అని కేటీఆర్ పేర్కొన్నారు. మరోసారి బీఆర్ఎస్ను గెలిపించి, కేసీఆర్‌ను హ్యాట్రిక్ ముఖ్యమంత్రిని చేద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు. ట్రాఫిక్ చిక్కులకు పరిష్కారం ఒకప్పుడు అందరం ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ ప్రాంతంలో సినిమాలు చూసిన వాళ్లమేనని.. సినిమా చూసి బయటికి వచ్చాక ట్రాఫిక్‌లో ఇరుక్కుని ఇబ్బందిపడిన వారమేనని కేటీఆర్ చెప్పారు. ఈ స్టీల్ ఫ్లైఓవర్‌తో చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్ చిక్కులకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు. సీఎం కేసీఆర్ సూచనల మేరకు ఈ ఫ్లైఓవర్‌కు మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పేరు పెట్టినట్టు తెలిపారు. కార్మికుల తరఫున పోరాడిన నాయిని పేరు దీనితో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. ఇందిరాపార్కును అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని.. లోయర్ ట్యాంక్‌బండ్, అప్పర్ ట్యాంక్‌బండ్‌ను కలుపుతూ టూరిస్ట్ ప్రాంతంగా తీర్చిదిద్దుతామని కేటీఆర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, స్థానిక ఎమ్మెల్యే ముఠాగోపాల్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్లో చేరిన కల్వకుర్తి నేత ఉప్పల వెంకటేశ్ కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన ఉప్పల వెంకటేశ్, మరికొందరు ఇతర పార్టీల నాయకులు శనివారం తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీలను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్లేనని.. ఢిల్లీ గులాములకు, తెలంగాణ ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న పోరాటంలో ప్రజలు ఆగం కావొద్దని పేర్కొన్నారు. కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధి బాధ్యత తమదని చెప్పారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాల్లో ఈసారి బీఆర్ఎస్ అభ్యర్థులే విజయం సాధించాలన్నారు. -
ఇంతకంటే అభివృద్ధా?.. రుజువు చేస్తే రాజీనామా చేస్తా.. కేటీఆర్ సవాల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి కంటే బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మెరుగైన అభివృద్ధి జరుగుతున్నట్టు నిరూపిస్తే తక్షణమే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని పురపాలక, ఐటీశాఖల మంత్రి కె. తారక రామారావు సవాల్ చేశారు. ఔటర్ రింగ్‌రోడ్డు లీజులో అవినీతి జరిగిందంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తప్పుడు ఆరోపణలు చేశారని మండిపడ్డారు. శాసనసభ వానాకాల సమావేశాల్లో భాగంగా శనివారం ‘రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన, పల్లె ప్రగతి– పట్టణ ప్రగతి కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలు– సాధించిన ఫలితాలు’అంశంపై లఘు చర్చ జరిగింది. ఈ సందర్భంగా పలువురు సభ్యులు లేవనెత్తిన అంశాలపై కేటీఆర్ సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు. తాను చెబుతున్నవి తప్పు అయితే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఓడించాలని, లేదంటే కాంగ్రెస్‌కు డిపాజిట్లు రాకుండా ఓడించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ, రేవంత్‌రెడ్డిలపై ఘాటుగా విమర్శలు చేశారు. కేటీఆర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. తెలంగాణలో ఉన్నదంతా సంక్షేమమే.. ‘‘రాష్ట్ర బడ్జెట్ అంటే విపక్షాలకు జమాఖర్చుల లెక్క మాత్రమే. బీఆర్ఎస్కు ఇది రాష్ట్ర ప్రజల జీవనరేఖ. తెలంగాణ నమూనా అంటే సమగ్ర, సమ్మిళిత అభివృద్ధి. ఇక్కడ సంక్షేమమే తప్ప సంక్షోభం లేదు. దేశంలో ఇంటింటికీ మంచినీళ్లు ఇచ్చిన మొదటి రాష్ట్రం తెలంగాణ. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు తెలంగాణలో ఉంది. వరి ఉత్పత్తిలో, తలసరి ఆదాయంలో దేశంలో టాప్. 24 గంటల ఉచిత విద్యుత్, ఎకరానికి రూ.10 వేల పెట్టుబడి, రైతులకు జీవితబీమా ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఐటీ ఉద్యోగాలు అత్యధికంగా కల్పించిన రాష్ట్రం తెలంగాణ. ఇది మా పనితనం. ప్రతిపక్ష నేతల్లా మేం ఊక దంపుడు ఉపన్యాసాలు చెప్పం. భట్టి విక్రమార్క, రఘునందన్‌రావులకు సవాల్ చేస్తున్నా. నేను చెప్పింది తప్పయితే.. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ కంటే మెరుగ్గా అభివృద్ధి ఉందని రుజువు చేస్తే.. రేపు పొద్దున్నే నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా.. తెలంగాణ ఎవరో ఇస్తే వచ్చింది కాదు తెలంగాణ ఇచ్చింది మేమేనని కాంగ్రెస్ వాళ్లు అంటున్నారు. కంటెంట్ లేని కాంగ్రెస్‌కు, కమిట్మెంట్ ఉన్న కేసీఆర్‌కు పోలికనా? 1968లో 370 మంది ఉద్యమకారులను కాల్చి చంపిందెవరు? 1971లో 11 మంది ఎంపీలను గెలిపించినా వారి ఆశయాలను తుంగలో తొక్కి కాంగ్రెస్‌లో కలిసిపోయింది వాస్తవం కాదా? 2004లో మాటిచ్చి 2014 దాకా 1000 మందిని చంపింది కాంగ్రెస్ వారు కాదా? ఇవాళ మళ్లీ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. వెయ్యి మందిని పొట్టన పెట్టుకున్న బలిదేవత సోనియా అని రేవంత్‌రెడ్డి అన్నమాటలు మరిచిపోయారా? కర్ణాటకలో గెలిచారని తెలంగాణలో కాంగ్రెస్ నేతలు కలలు కంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ఎప్పుడో విశ్వసనీయత కోల్పోయింది. నలుగురు నాయకులు కలసి కూర్చుని మాట్లాడలేని వాళ్లు.. 4 కోట్ల మందిని పాలిస్తారంటే నమ్మాలా? కాంగ్రెస్‌కు నాయకుల్లేక పక్క పార్టీల నుంచి నాయకులను తెచ్చుకున్నారు. మేం ప్రధాని మోదీకే భయపడలేదు. ఇక్కడ వీళ్లకు భయపడతామా? ప్రజలతో బీఆర్ఎస్ది పేగు బంధం తెలంగాణ కవి అలిశెట్టి ప్రభాకర్ తన కవితలో ‘‘జాగ్రత్త.. ప్రతి ఓటు మీ పచ్చి నెత్తుటి మాంసపు ముద్ద.. చూస్తూ చూస్తూ వేయకు గద్దకు. ఓటు కేవలం కాగితం మీద గుర్తు కాదు.. మీ జీవితం..’’అని చెప్పారు. ప్రజలు తప్పుడు నిర్ణయం తీసుకుంటే గందరగోళంలో పడతారు. తెలంగాణ ప్రజలతో బీఆర్ఎస్ది పేగుబంధం. తుచ్చ రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ ఐదు దశాబ్దాల పాలనను, నాటి అంధకారాన్ని గుర్తుకు తెచ్చుకోండి..’’అని కేటీఆర్ పేర్కొన్నారు. నోటికి వచ్చినట్టు మాట్లాడితే అంతు చూస్తాం! ఔటర్ రింగ్ రోడ్డు టోల్ ప్రాజెక్టు (టీవోటీ)ను ఐఆర్బీ సంస్థకు కట్టబెట్టడాన్ని తప్పుపడుతూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ‘‘ఒకాయన (రేవంత్‌రెడ్డి) బయట ఉండి నోటికి వచ్చినట్టు మాట్లాడారు. ఆ ప్రభావం భట్టి మీద పడినట్టు ఉంది. ఐఆర్బీ సంస్థ దివాలా తీసిందంటూ ఏదేదో మాట్లాడారు. కాంగ్రెస్ పాలిత రాజస్థాన్, కర్ణాటకలలోనూ పలు టోల్స్ నిర్వహణ కాంట్రాక్టులను ఆ సంస్థ పొందింది. మహారాష్ట్రలో కూడా ఇచ్చారు. ఇక్కడ కూడా జాతీయ రహదారుల సంస్థ నిబంధనలకు అనుగుణంగా టెండర్ నిర్వహించి లీజుకు ఇవ్వడం జరిగింది. ఆయన (రేవంత్) ఎందుకు ఈ సంస్థ గురించి మాట్లాడారో, దానికి కారణమేంటో మాకు తెలుసు. ఆర్టీఐ (సమాచార హక్కు) అంటే కొందరికి ‘రూట్ టు ఇన్‌కం’గా మారిపోయింది. రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలపై ఐఆర్బీ సంస్థ వెయ్యికోట్ల పరువు నష్టం దావా వేసింది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్ కూడా కేసు పెట్టారు. రేవంత్ అంతు చూస్తాం’’అని కేటీఆర్ పేర్కొన్నారు. కోనరావుపేటనా.. కోనసీమనా? ఇటీవల దర్శకుడు వెల్దంటి వేణు బలగం సినిమాను సిరిసిల్ల జిల్లాలోని కోనరావుపేట గ్రామంలో తీశారు. ఆ సినిమా చూసి మా కుటుంబసభ్యులే ఇది కోనరావుపేటనా? కోనసీమనా? అని ఆశ్చర్యపోయారు. తెలంగాణలోని ఏ పల్లెకు వెళ్లినా ఇప్పుడు ఇదే పరిస్థితి. రివర్స్ మైగ్రేషన్ చూస్తున్నాం ఇప్పుడు. హైదరాబాద్ అభివృద్ధిని, భూముల విలువను పొరుగు రాష్ట్ర నేతలు గుర్తించారు. వారికి అర్థమైన విషయాలు విపక్షాలకు అర్థం కావట్లేదు. -
అభివృద్ధిని చూడలేకే చిల్లర మాటలు..
వనస్థలిపురం (హైదరాబాద్): బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూడలేకనే ప్రతిపక్ష నాయకులు చిల్లర మాటలు మాట్లాడుతున్నారని ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కె.తారక రామారావు మండిపడ్డారు. ప్రతిపక్షాల నేతలు అడ్డగోలుగా మాట్లాడటం సరికాదని.. కేసీఆర్ వయసును గౌరవించాలని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ హ్యాట్రిక్ సీఎంగా నిలుస్తారని చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లోని హస్తినాపురం జీఎస్ఆర్ కన్వెన్షన్‌లో జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. రిజిస్ట్రేషన్లపై ఆంక్షలతో ఇబ్బందిపడుతున్న కాలనీలకు విముక్తి కల్పించేందుకు ప్రభుత్వం తెచ్చిన జీవో 118 కింద ఎల్బీనగర్ నియోజకవర్గంలోని 4వేల మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డితో కలసి రెగ్యులరైజేషన్ సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. అనంతరం కేటీఆర్ మాట్లాడారు. దేశంలో నంబర్‌వన్‌గా నిలిపాం ‘ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు’అని సామెత ఉందని, తెలంగాణ ప్రభుత్వం ఇళ్లు కట్టించి ఇవ్వడంతోపాటు పేద అమ్మాయిల పెళ్లికి ఆర్థిక సాయం కూడా చేస్తాందని కేటీఆర్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా తలసరి ఆదాయంలో దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును అతి తక్కువ కాలంలో పూర్తిచేశామని, రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ఇంటింటికి సురక్షిత తాగునీరు ఇచ్చామని పేర్కొన్నారు. నల్లగొండ ఫ్లోరైడ్, పాలమూరు వలసల సమస్యలు తొలగిపోయాయని పేర్కొన్నారు. గతంలో గాందీ, ఉస్మానియా, నిమ్స్ మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉండేవని.. ఇప్పుడు హైదరాబాద్ నలుమూలలా 10వేల బెడ్లతో కార్పొరేట్ స్థాయి వైద్యం అందించే ఆస్పత్రుల నిర్మాణం చేపట్టామని తెలిపారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామన్నారు. వేల కుటుంబాలకు లబ్ధి: సుధీర్‌రెడ్డి తాను కాంగ్రెస్‌లో ఉన్నప్పట్నుంచే రిజిస్ట్రేషన్లపై ఆంక్షల సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నానని, దీనికోసమే బీఆర్ఎస్లో చేరానని ఎమ్మెల్యే సు«దీర్‌రెడ్డి చెప్పారు. మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రిజిస్ట్రేషన్ల సమస్యను పరిష్కరించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు బొగ్గారపు దయానంద్‌గుప్తా, ఎగ్గె మల్లేశం, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
దళితులు ధనికులు కావాలె.. ఏ పార్టీ వాళ్లయినా దళితబంధు ఇద్దాం
సిరిసిల్ల: సమాజంలో అణచివేతకు గురై, అట్టడుగున ఉన్న దళితులను ధనికులను చేసే లక్ష్యంతో దేశంలోనే ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ తెలంగాణలో దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గురువారం రాష్ట్ర ఎస్సీ, గిరిజన, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి పోడుభూములకు పట్టాలు, ఎస్సీ చిరువ్యాపారులకు ఆర్థిక సాయం అందించారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ దళితబంధులో తొలి విడతలో ప్రతి నియోజ కవర్గానికి 100 కుటుంబాలకు అందించామని, విప్లవాత్మక మార్పులు వచ్చాయని అన్నారు. రెండో విడతలో ప్రతి నియోజకవర్గానికి 1100 యూనిట్లు అందిస్తామని తెలిపారు. ఏ పార్టీ వారైనా అందరికీ దళితబంధు ఇస్తామన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ధనికులు ఏ నీళ్లు తాగుతారో.. వీర్నపల్లి తండాలోనూ అవే నీళ్లు తాగేలా ఇంటి ముందు నల్లా పెట్టి నీళ్లు అందిస్తున్నామన్నారు. కొమురం భీమ్ స్ఫూర్తితో జల్, జమీన్, జంగల్ నినాదాలతో నీళ్లు సాధించి, పోడుభూములకు పట్టాలిచ్చి, కొత్తగా 5 లక్షల ఎకరాల్లో 8 శాతం పచ్చదనాన్ని పెంచామన్నారు. 70 ఏళ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం 9 ఏళ్లలో చేసి చూపించామని, తొమ్మిదేళ్లలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని కేటీఆర్ వివరించారు. రైతులకు బీమా చేయిస్తున్న ఏకైక ప్రభుత్వం మనదే అన్నారు. సీఎం కేసీఆర్ సాహసోపేత నిర్ణయాలతో తెలంగాణ రాష్ట్రం దేశానికి మోడల్‌గా మారిందని రాష్ట్ర ఎస్సీ, గిరిజన, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. వ్యవసాయ కాలేజీకి బాబూ జగ్జీవన్‌రామ్ పేరు తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల వ్యవసాయ కళాశాలకు బాబూ జగ్జీవన్‌రామ్ కళాశాలగా నామకరణం చేశారు. ఆయన వర్ధంతి సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన జగ్జీవన్‌రామ్ విగ్రహాన్ని మంత్రులు ఆవిష్కరించారు. 128 మంది ఎస్సీ చిరువ్యాపారులకు రూ.62 లక్షల మేరకు ఆర్థిక సాయం చెక్కులను పంపిణీ చేశారు. జిల్లాలో 1,614 మంది గిరిజనులకు 2,558.34 ఎకరాల పోడు భూములకు పట్టాలను అందించారు. జెడ్పీ చైర్పర్సన్ అరుణ, వేములవాడ ఎమ్మెల్యే రమేశ్‌బాబు, కలెక్టర్ అనురాగ్ జయంతి, టీపీటీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
రూపు మారిన పురాలు
సాక్షి, హైదరాబాద్: తొమ్మిదేళ్లలో తెలంగాణలోని పట్టణాల అభివృద్ధిలో గణనీయమైన మార్పు వచ్చిందని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కె.తారక రామారావు చెప్పారు. పురపాలక శాఖ ద్వారా రూ.1.21 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. రాష్ట్రానికి వస్తున్న ఆదాయంలో 70% పట్టణాల నుంచేనని, ఈ నేపథ్యంలో పట్టణాల్లో మౌలిక వసతుల కల్పన కోసం అప్పులు తెచ్చినట్లు తెలిపారు. మౌలిక వసతుల కోసం తెచ్చే అప్పులు భవి ష్యత్తు పెట్టుబడేనని ఆయన పేర్కొన్నారు. బుధవారం మెట్రోరైల్ భవన్లో జరిగిన కార్యక్రమంలో తొమ్మిదేళ్లలో పురపాలక శాఖ అభివృద్ధి నివేదిక, ఎంఏయూడీ వార్షిక నివేదికను మంత్రి విడుదల చేశారు. పట్టణాల అభివృద్ధిపై 2014 మొదలుకుని ప్రతి ఏటా ప్రగతి నివేదికను విడుదల చేస్తున్నామని, ఈసారి దశాబ్ది నివేదిక పేరిట 2014 నుంచి సాధించిన ప్రగతిని అందులో పొందుపరిచినట్లు తెలిపారు. గత పదేళ్లలో 462 శాతం ఎక్కువ వ్యయం 2004 నుంచి 2014 వరకు పట్టణాల్లో మౌలిక వసతుల కోసం చేసిన రూ.26,211.50 కోట్ల ఖర్చుతో పోలిస్తే.. గత పదేళ్లలో 462 శాతం ఎక్కువ వెచ్చించామన్నారు. ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.1,21,294 కోట్లలో రూ. 1,11,360 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ నిధులు కాగా, కేవలం రూ.9,934 కోట్లు మాత్రమే కేంద్ర ప్రభుత్వ నిధులని తెలిపారు. అన్ని రంగాలలో గతంలో కంటే అనేక రెట్లు ఎక్కువ ఖర్చు చేశామని, మౌలిక వసతుల కల్పనలో గణనీయమైన వృద్ధి సాధించామని, ఇందులో భాగంగానే 26 మున్సిపాలిటీలకు కేంద్రం అవార్డులు ఇచ్చిందని చెప్పారు. అధిక శాతం జీహెచ్ఎంసీ పరిధిలోనే.. పదేళ్లలో పట్టణాల్లో మౌలిక సదుపాయాల కోసం చేసిన వేల కోట్ల వ్యయంలో అధిక భాగం జీహెచ్ఎంసీ పరిధిలోనే జరిగిందని కేటీఆర్ వివరించారు. 2004–14 కాలంలో రూ.4,636.38 కోట్లు వెచ్చిస్తే, 2014–23 మధ్య కాలంలో రూ.44,021.99 కోట్లు వెచ్చించామని, ఇది దాదాపు 850 శాతం అధికమని అన్నారు. ౖఈ మధ్య కాలంలో జీహెచ్ఎంసీ ఎస్ఆర్డీపీ, సీఆర్ఎంపీ, హెచ్ఆర్డీసీ, ఎస్ఎన్డీపీ వంటి ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేసి ప్రణాళికా బద్ధంగా మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం వల్లనే ఇది సాధ్యమైందని చెప్పారు. ఎస్ఆర్డీపీ ద్వారా సుమారు 35 ఫ్లై ఓవర్లు నిర్మించామని, కానీ ఉప్పల్, అంబర్‌పేట ఫ్లై ఓవర్లను నేషనల్ హైవే అథారిటీ పూర్తి చేయలేక పోతోందని అన్నారు. మున్సిపాలిటీల్లో రూ.238 కోట్లతో పనులు హైదరాబాద్ చుట్టూ ఉన్న మున్సిపాలిటీల్లో రూ.238 కోట్లతో 19 పనులు చేపట్టామని, అందులో ఏడు పనులు పూర్తి కాగా, మిగతావి కూడా వేగంగా జరిగేలా ఆదేశాలిచ్చినట్లు కేటీఆర్ తెలిపారు. నగరంలో ప్రధాన రహదారుల నాణ్యత పెరిగిందని, వరద ఇబ్బందులను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. చెరువుల సుందరీకరణను పెద్ద ఎత్తున చేపట్టామని, ఎస్ఎన్డీపీ కింద నాలాలను అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. గతంలో ముంపు వల్ల 150 కాలనీలు ఇబ్బంది పడేవని, ఎస్ఎన్డీపీ వల్ల ఈ బాధ తప్పిందని పేర్కొన్నారు. 2050 నాటికి నగరంలో తాగునీటి సమస్య లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ప్రజారవాణాను మెరుగుపర్చడంలో భాగంగా మెట్రో విస్తరణ, బస్సుల ఎలక్ట్రిఫికేషన్, పాతబస్తికీ మెట్రో కనెక్టివిటీ, భవిష్యత్తులో నిరంతర నీటి సరఫరా, నాలాల మరమ్మతు లాంటి కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని, ఈ దిశగా చర్యలు చేపట్టినట్లు వివరించారు. శామీర్‌పేట్, మేడ్చల్ వైపు డబుల్ డెక్కర్ స్కైవేలు కట్టనున్నట్లు చెప్పారు. మెట్రో రైళ్లలో రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో కోచ్‌ల సంఖ్యను పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. -
చూసింది ట్రైలరే.. సినిమా ముందుంది!
సాక్షి, హైదరాబాద్: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 95–100 సీట్లను కచ్చితంగా గెలిచి తీరుతామని మంత్రి కె. తారక రామారావు స్పష్టం చేశారు. గత 9 ఏళ్లలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ట్రైలర్ మాత్రమేనని... అసలు సినిమా ముందుందని చెప్పారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ మాట చెప్పట్లేదని, తెలంగాణ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ మదిలో ఎన్నో ప్రణాళికలు ఉన్నాయన్నారు. పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు మూడోసారి ఆశీర్వదిస్తారనే నమ్మకం తనకుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. గురువారం హైదరాబాద్ నానక్‌రాంగూడలో కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) నూతన కార్యాలయాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ఎన్నికల్లో 63 సీట్లు గెలుచుకున్నామని, ఆ సమయంలో 10 సీట్లు అటుఇటు చేసి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని కొందరు కుయుక్తులు చేశారని కేటీఆర్ ఆరోపించారు. చిన్న రాష్ట్ర ఏర్పాటే విఫలమని ప్రకటించి ఏదో చేద్దామని ప్రయత్నించారని, కానీ ప్రజలకు స్పష్టత ఉండటంతో 2018 ఎన్నికల్లో తమకు 88 సీట్లిచ్చి గెలిపించారని చెప్పారు. అభివృద్ధి కేవలం డైలాగ్‌లు కొడితేనే, ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తేనో జరగదని, నాయకుడికి స్థిరచిత్తం, ధృడసంకల్పం, ప్రజలకు మంచి చేయాలనే ఆరాటం ఉంటేనే సాక్షాత్కారం అవుతుందన్నారు. సమగ్ర, సమీకృత, సమతౌల్య అభివృద్ధికి తార్కాణం తెలంగాణ అని వ్యాఖ్యానించారు. ఐపీఎస్, ఐఏఎస్‌లకు టెంపర్.. ‘రాజకీయ నాయకులు అధికారంలోకి వస్తే తొలి ఏడాది విధానాలను అర్థం చేసుకోవడానికి, కుర్చీ సర్దుకోవడానికే సరిపోతుంది. చివరి ఏడాది మళ్లీ ఎన్నికల హడావుడి ఉంటుంది. మధ్యలో ఉండేది మూడేళ్లే. ఈ సమయంలో ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు నాయకులకేం తెలుసు.. మేము కదా పర్మినెంట్ ఆర్టిస్టులం.. వాళ్లు గెస్ట్ అర్టిస్టులు. ఐదేళ్లకొకసారి మారిపోతారని అనకుంటారు. వాళ్ల టెంపర్ వాళ్లది’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. 250 కి.మీ. వరకూ మెట్రో విస్తరణ... హైదరాబాద్‌లో మెట్రో రైలును 250 కి.మీ. వరకూ విస్తరిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. 31 కి.మీ. శంషాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రోను రెండున్నర ఏళ్లలో పూర్తి చేస్తామని చెప్పారు. బీహెచ్ఈఎల్ నుంచి హయత్‌నగర్ వరకు, ఈసీఐఎల్ నుంచి నానక్‌రాంగూడ వరకూ మెట్రోను విస్తరిస్తామని తెలిపారు. జేబీఎస్ నుంచి తుర్కపల్లి వరకు, ప్యాట్నీ నుంచి కొంపల్లి వరకు ఒక్కోటి 18.5 కి.మీ. మేర స్కైవాక్‌ను నిర్మించనున్నామని... భవిష్యత్తు అవసరాల రీత్యా ఈ స్కైవాక్‌ల మధ్యలో మెట్రో పిల్లర్లను సైతం నిర్మిస్తామని కేటీఆర్ తెలిపారు. రూ. 4 వేల కోట్లతో చేపట్టిన 16 సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ)ల నిర్మాణం సెపె్టంబర్‌కు పూర్తవుతుందన్న కేటీఆర్... ఎస్టీపీల నుంచి వచ్చే నీటిని నిర్మాణరంగ అవసరాలకు వినియోగించుకోవాలని డెవలపర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ జి.రంజిత్‌రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి. ప్రకాశ్‌గౌడ్, సీఐఐ తెలంగాణ చైర్మన్ సి. శేఖర్‌రెడ్డి, క్రెడాయ్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ జి.రాంరెడ్డి, తెలంగాణ చైర్మన్ సీహెచ్ రాంచంద్రారెడ్డి, అధ్యక్షుడు డి.మురళీకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వర్షాకాల సమస్యలపై అప్రమత్తంగా ఉండండి
సాక్షి, హైదరాబాద్: వానాకాలంలో ప్రజలు ఎదుర్కొనే సమస్యలపై మున్సిపల్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు ఆదేశించారు. మ్యాన్‌హోల్స్, నాలాలు, వరదనీటి కాలువల వల్ల గతంలో తలెత్తిన సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. రాష్ట్రంలోని పట్టణాల్లో ఆయా మునిసిపాలిటీలు చేపట్టిన వర్షాకాల సన్నద్ధత ప్రణాళికలపై పురపాలక శాఖలోని వివిధ విభాగాల అధికారులతో మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పురపాలికలతోపాటు హైదరాబాద్‌లో తలెత్తే ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. వర్షాల కారణంగా ప్రాణ నష్టం జరగకుండా చూడటమే అధికారుల ప్రథమ ప్రాధాన్యత అని, ఆ దిశగా యంత్రాంగం పనిచేయాలని మంత్రి సూచించారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ చేపట్టిన ఎస్ఎన్డీపీ ప్రాజెక్టు పనుల పురోగతిని ఆరా తీశారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి, ఆయా ప్రాంతాలలో అవసరమైన డీవాటరింగ్ పంపులు, ఇతర ఏర్పాట్లు చేసుకుని సన్నద్దంగా ఉండాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. నగరవ్యాప్తంగా ప్రారంభించిన వార్డు కార్యాలయాల పనితీరుపైన మంత్రి కేటీఆర్ ఈ సమావేశంలో ప్రత్యేకంగా చర్చించారు. ప్రస్తుతం ఏర్పాటు చేసిన వార్డు కార్యాలయాల వ్యవస్థ ప్రారంభ దశలోనే ఉన్నదని, ఈ దశలో ఎదురయ్యే సవాళ్లను ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ ముందుకు పోవాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ పలువురు నగర పౌరులతో ఫోన్లో మాట్లాడి సమస్యలు, వాటి పరిష్కారం జరిగిన తీరు అడిగి తెలుసుకున్నారు. -
కరీంనగర్ పేరు చెబితే.. ప్రతిపక్షాల గుండెఝల్లు
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఉద్యమకాలం నుంచి ‘కరీంనగర్ పేరు చెబితే ఝల్లు మనాలే’ అని పాటలు పాడుకున్నామని, ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలకు గుండెఝల్లు మంటోందని మున్సిపల్ మంత్రి కె.తారకరామారావు అన్నారు. కరీంనగర్‌లోని మానేరు నదిపై నిర్మించిన తీగల వంతెనను మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్‌లతో కలిసి బుధవారం ప్రారంభించారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కరీంనగర్లో రూ.220 కోట్లతో తీగల వంతెన, రూ.410 కోట్లతో మానేరు రివర్‌ఫ్రంట్ వంటి ప్రాజెక్టులతో నగరం అభివృద్ధి చెందుతోందన్నారు. మానేరు నది మొత్తం 180 కి.మీల పొడవునా సుజల దృశ్యంగా మార్చాలన్న పట్టుదలతో పనిచేస్తున్నామన్నారు. ఉద్యమకాలంలో జలదృశ్యంలో మొదలై.. రాబోయే దసరా నాటికి మానేరు సుజల దృశ్యంగా ఆవిష్కారం కాబోతుందని ప్రకటించారు. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని కాళోజీ అన్నట్లుగా.. ‘నా తెలంగాణ కోటి మాగాణం’గా చేస్తున్నామన్నారు. కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలతో గోదావరి–కృష్ణా నీటిని ఒడిసి తెలంగాణ బీడుభూములను సస్యశ్యామలం చేశామన్నారు. పనిచేసే వారికి పట్టం కట్టండి.. కరీంనగర్ అభివృద్ధిలో మంత్రి గంగుల కమలాకర్ సంకల్పాన్ని కేటీఆర్ ప్రశంసించారు. సీఎం ముద్దుగా ‘కరీంనగర్ భీముడు’ అని పిలుచుకునే గంగుల కమలాకర్ చొరవతోనే అందమైన జంక్షన్లు, రోడ్లతో నగరం సర్వాంగ సుందరంగా మారిందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన్ను వెన్నుదట్టి మరోసారి ప్రోత్సహించాలని ప్రజలను కోరారు. అదే సమయంలో ప్రణాళికా సంఘం బోర్డు ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్‌ను ఎంపీగా కోల్పోయామని వాపోయారు. ఇపుడున్న ఎంపీ ఏం మాట్లాడుతడో ఆయనకే తెలియదని విమర్శించారు. నగరంలో పదెకరాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో గుడి కట్టిన నాయకుడు ఉన్నాడా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పల్లెప్రగతి నుంచి పట్టణప్రగతి వరకు దేశంలో మనమే నెంబర్ వన్‌గా ఉన్నామన్నారు. వ్యవసాయ, పారిశ్రామిక, సంక్షేమ రంగాల్లో సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ దూసుకుపోతోందని, అందులో కరీంనగర్ తెలంగాణలోనే అగ్రభాగంలోనే ఉందని తెలిపారు. అందుకే, పనిచేసేవారిని ప్రోత్సహించాలని కోరారు. పనిచేయని వారిన చెత్తబుట్టలో వేయాల్సిన బాధ్యత మీదేనని ప్రజలకు పిలుపునిచ్చారు. తమ ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లని.. అభివృద్ధే తమ కులమని.. జనహితమే తమ మతం అని ముగించారు. ప్రాజెక్టులతో కరీంనగర్‌కు ప్రపంచస్థాయి గుర్తింపు : గంగుల అంతకుముందు మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. ఉద్యమకాలం నుంచి కరీంనగర్ అంటే సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక అభిమానమని గుర్తుచేశారు. కేబుల్ వంతెన, మానేరు రివర్‌ఫ్రంట్ ఆగస్టు 15 నాటికి మొదటి దశ ప్రారంభిస్తామన్నారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద వాటర్ ఫౌంటేన్ ప్రారంభమవుతుందని, ఈ ప్రాజెక్టులతో నగరానికి ప్రపంచస్థాయి గుర్తింపు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇన్ని అవకాశాలు కల్పించిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి. వినోద్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ గతంలో చెప్పినట్లుగా కరీంనగర్‌ను లండన్ తరహాలో తీర్చిదిద్దుతున్నారన్నారు. రాష్ట్రం ఇస్తే ఏం చేస్తారన్న వెక్కిరింపులను దాటి.. నదులను ఎత్తి కోటి ఎకరాలకు నీళ్లు తెచ్చామని, నిరంతర కరెంటు ఇస్తున్నామని చెప్పారు. -
మూడు సిలిండర్లు మాకెందుకివ్వరు?
సిరిసిల్ల: ఉచితాలు వద్దని, రేవుడీ కల్చర్ అంటూ.. తెలంగాణ ప్రభుత్వాన్ని నిందించిన దేశ ప్రధాని నరేంద్రమోదీ.. ఏటా మూడు సిలిండర్లు, నిత్యం అర లీటరు పాలు ఉచితంగా ఇస్తామంటూ కర్ణాటక ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడాన్ని రాష్ట్ర మంత్రి కె.తారక రామారావు తప్పుపట్టారు. మోదీ దేశానికి ప్రధానమంత్రా? లేక ఒక్క కర్ణాటకకేనా అని ప్రశ్నించారు. సిలిండర్ ధరను రూ.400 నుంచి రూ.1,200కు పెంచిన బీజేపీ సర్కార్.. తెలంగాణ రాష్ట్రంలో మూడు సిలిండర్లు ఉచితంగా ఎందుకు ఇవ్వదని, మిగతా రాష్ట్రాల్లోనూ ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. పాలపైనా జీఎస్టీ వేసిన కేంద్ర ప్రభుత్వం హామీలను ఎవరూ నమ్మే పరిస్థితి లేదని పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, సిరిసిల్ల, గంభీరావుపేట మండలాల్లో వడగండ్ల వానలతో దెబ్బతిన్న పంటలను, తడిసిన ధాన్యాన్ని మంత్రి కేటీఆర్ మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 90 శాతం వరకు వరి నష్టం రాష్ట్రంలో నీరు పుష్కలంగా ఉండడంతో రైతులు ఎక్కువగా యాసంగి సీజన్లో వరిని సాగు చేశారని, అయితే అనూహ్యంగా వచ్చిన వడగండ్ల వానలతో పంటలు దెబ్బతిన్నాయని కేటీఆర్ చెప్పారు. వరి పంట 30 శాతం నుంచి 90 శాతం మేరకు నష్టం జరిగిందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటివరకు 19 వేల ఎకరాల్లో 17 వేల మంది రైతులకు పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశామన్నారు. ఇంకా క్షేత్రస్థాయిలో ఎన్యుమరేషన్ జరుగుతోందని చెప్పారు. సీఎం కేసీఆర్ ఇప్పటికే ఐదు జిల్లాల్లో పర్యటించారని, నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల చొప్ను ఆర్థిక సాయం అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మేరకు ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటించారని గుర్తుచేశారు. ఇలావుండగా.. రైతాంగానికి రైతుబంధు, రైతు బీమా, ఉచిత కరెంటు, నీరు ఇచ్చే తెలంగాణ వ్యవసాయ విధానం కావాలని దేశమంతా కోరుకుంటోందని కేటీఆర్ చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7.50 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, గతేడాది ఈ సమయానికి కేవలం 4 లక్షల టన్నుల ధాన్యం కొన్నామని వివరించారు. పంటలు వేసిన అసైన్డ్ భూములు, పోడు భూములకు కూడా నష్ట పరిహారం ఇస్తామన్నారు. మహిళల భద్రతకు ‘అభయ’యాప్ మహిళల భద్రతకు రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు రూపొందించిన ‘అభయ’యాప్‌ను మంత్రి కేటీఆర్ సిరిసిల్ల మినీ స్టేడియంలో ఆవిష్కరించారు. జిల్లా పోలీస్ క్రీడోత్సవాల ముగింపు వేడుకల్లో పాల్గొన్న మంత్రి.. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పర్యవేక్షణలో రాష్ట్రంలోనే తొలిసారి రూపొందించిన ‘అభయ’యాప్‌ను ఆవిష్కరించారు. ఆటోల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఉమెన్ సెఫ్టీ కోసం ఈ క్యూఆర్ కోడ్ పనిచేస్తుందని, ట్రాక్ మై లొకేషన్ పోలీసులకు షేర్ అవుతుందన్నారు. ఈ యాప్‌ను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని మంత్రి వెల్లడించారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, కలెక్టర్ అనురాగ్ జయంతి, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు. కాగా సచివాయంలోకి ఎంపీ రేవంత్‌రెడ్డిని ఎందుకు అనుమతించడం లేదని విలేకరులు ప్రశ్నించగా.. ‘అది సచివులు ఉండే చోటు, సచివులకే ప్రవేశం ఉంటుంది..’అంటూ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. -
మోదీకి ఘర్‌వాపసీ తప్పదు
ప్రజలు కేసీఆర్‌ను ఆశీర్వదిస్తారు.. తెలంగాణలో మళ్లీ గులాబీ జెండాయే ఎగురుతుంది. కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టిన తొలి సీఎంగా రికార్డు సాధిస్తారు. ఎవరు ఎన్ని చెప్పినా కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అనే భావనంలో ప్రజలు ఉన్నారు. రైతులు, పేదల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను దేశానికి పరిచయం చేసేందుకు బయలుదేరిన కేసీఆర్‌ను ప్రజలు ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాం. సాక్షి, హైదరాబాద్: ప్రధాని మోదీ, బీజేపీపై బీఆర్ఎస్ కార్యానిర్వాహక అధ్యక్షుడు కె. తారక రామారావు విరుచుకుపడ్డారు. ఏటీఎం అంటే అదానీ టూ మోదీకి డబ్బుల ప్రవాహమే అని ఆయన కొత్త భాష్యం చెప్పారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తమకు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీయేనని, బీజేపీకి ఈసారి కూడా వందకుపైగా సీట్లలో డిపాజిట్లు గల్లంతవుతాయని జోస్యం చెప్పారు. ఈ నెల 27న బీఆర్ఎస్ 23వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూ విశేషాలు ఆయన మాటల్లోనే... ఏటీఎం అంటే... ఏటీఎం అంటే అదానీ నుంచి మోదీకి డబ్బుల ప్రవాహం సాగడమే. అవినీతి గురించి మోదీ ఆయన మంత్రులు మాట్లాడటం విడ్డూరం. సీబీఐ, ఈడీలను చేతిలో పెట్టుకొని కేంద్రం ఆటలాడుతోంది. కానీ ఎప్పుడూ కాలం ఒకేలా ఉండదు. ç2024లో మోదీకి గుజరాత్‌కు ఘర్ వాపసీ తప్పదు. 2024లో ప్రధాని పదవి ఖాళీ కాక తప్పదు. ఎవరేం అనుకున్నా తెలంగాణలో గత ఎన్నికల్లో 108 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయిన బీజేపీకి ఈసారి 103 స్థానాల్లో మళ్లీ డిపాజిట్లు దక్కవు. మోదీ అప్పట్లో రాష్ట్రం విడిచి తిరగలేదా..? గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉంటూ మోదీ 2010 నుంచి 2014 వరకు పాలన గాలికొదిలేసి గాలి తిరుగుడు తిరగలేదా? తెలంగాణలో మౌలికవసతులు కల్పించాకే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టిపెట్టారు. గుజరాత్లో నేటికీ మంచినీరు, విద్యుత్ కొరత వంటి సమస్యలు ఉన్నాయి. తెలంగాణలో సమస్యలు లేవనడం లేదు. మా కార్యకలాపాలకు కేంద్రం తెలంగాణయే. ఢిల్లీ కేంద్రంగానే పార్టీని నడపాలనే ఖానూన్ ఏమీ లేదు. హైదరాబాద్ కేంద్రంగా జాతీయ రాజకీయాలను శాసించవచ్చు. ప్రజల ఆశీర్వాదం, ఆదరణ మాకు లభిస్తే రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? ఆ ఆరోపణలు పాత చింతకాయ పచ్చడి... పరివార్‌వాదీ, ఎంఐఎంతో అనుబంధం, మా కుటుంబంపై అవినీతి ఆరోపణలు పాత చింతకాయ పచ్చడి. ప్రజలకు ఇష్టం లేకుంటే మమ్మల్ని తిరస్కరిస్తారు. కర్ణాటకలో 40–50 మంది బీజేపీ నేతల కుటుబ సభ్యులకు టికెట్లు ఇవ్వడం పరివార్‌వాదీ కాదా? అక్కడ బీజేపీకి వర్తించని నిబంధనలు మాకే వర్తిస్తాయా?. కరప్షన్ క్యాప్టెన్ మోదీ.. క్యాప్షన్ బీజేపీ. అదానీ, ప్రధాని అవిభక్త కవలలు. మోదీ అత్యంత అవినీతిపరుడు. పాలన చేతకాని అసమర్థుడు. బీజేపీకి ఎన్నికల బాండ్ల రూపంలో రూ. 20 వేల కోట్లు ఎక్కడ నుంచి వచ్చాయి? ఎంఐఎం అనే పార్టీ భుజంపై తుప్పుబట్టిన తుపాకీ పెట్టి ఎన్నిసార్లు కాల్చినా ప్రజలకు స్పష్టత ఉంది. పేదల కోసం పనిచేసే వారిని ప్రజలు ఆదరిస్తారు. బీజేపీ చేసే మతపరమైన రాజకీయం తెలంగాణ చైతన్యం ముందు చెల్లదు. విస్తరణ బాటలో ఉన్నాం... 60 లక్షల సైన్యంగల పార్టీ బీఆర్ఎస్. దేశంలోనే ఇంత పెద్ద బలగం, సైన్యం ఉన్న పార్టీ మరొకటి లేదు. జాతీయ పార్టీగా రూపాంతరం చెందినా ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల్లోకి ఇంకా బలంగా వెళ్లలేదు. ఇప్పుడిప్పుడే మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల్లోకి విస్తరించే ప్రయత్నంలో ఉన్నాం. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారినా మా జెండా, ఎజెండా, మా నాయకుడు, గుర్తు మారలేదు. తెలంగాణనే మాకు మొదటి ప్రాధాన్యం. తెలంగాణ మోడల్‌ను దేశానికి చూపుతున్నాం. తెలంగాణ ఆత్మగౌరవ బావుటాను ఇతర రాష్ట్రాల్లో ఎగురవేయడానికి బయలుదేరాం. అంతే కాని తెలంగాణను వదిలి వెళ్లలేదు. శిఖండి రాజకీయం.. మహాభారతంలో శిఖండి రాజకీయం చేసినట్లు నేరుగా గెలవలేక కొత్త పార్టీలు, చిన్న పార్టీలను అడ్డుపెట్టుకొని బీజేపీ నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. ఈ పార్టీల నాయకులు నిద్రలేచింది మొదలు కేసీఆర్‌ను, రాష్ట్ర ప్రభుత్వాన్ని తిట్టడమే తప్ప తెలంగాణ ప్రయోజనాల కోసం కేంద్రాన్ని అడిగే పరిస్థితి లేదు. అమిత్ షా అడ్డగోలుగా మాట్లాడినా ఒక్కరూ ప్రశ్నించరు. బీజేపీపై మరకపడకుండా చూస్తూ బీఆర్ఎస్ ఓట్లను చీల్చడమే వారి పని. తెలంగాణ ప్రజలు దీన్ని అర్థం చేసుకొని బీఆర్ఎస్కు అండగా నిలుస్తారు. ఎన్నికల సమాయత్తానికే సమ్మేళనాలు.. ఎన్నికల ఏడాదిలో కేడర్‌ను సిద్ధం చేసేందుకు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నాం. ఈ సమ్మేళనాల నుంచి వస్తున్న ఫీడ్ బ్యాక్‌ను దృష్టిలో పెట్టుకొని చిన్నాచితకా లోటుపాట్లు ఉంటే సవరించుకుంటాం. మే నుంచి యువజన, విద్యార్థి సమ్మేళనాలు నిర్వహిస్తాం. విద్యార్థి విభాగాన్ని బలోపేతం చేసేలా జూన్ నుంచి బీఆర్ఎస్వీ ఎన్రోల్మెంట్ ప్రారంభిస్తాం. రాష్ట్రంపై కేంద్రం చూపుతున్న వివక్ష, రాష్ట్ర ప్రభుత్వ విజయాలను విద్యార్థులు, యువతకు వివరించి మత కలహాలతో చిచ్చు పెట్టే పార్టీ కావాలా లేదా తెలంగాణను పచ్చగా చేసే పార్టీ కావాల ఆలోచించుకోవాలని చెప్తాం. వారికి భవిష్యత్తులో అవకాశాలు.. పార్టీలో టికెట్లు ఆశించడం అసహజ విషయమేమీ కాదు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందనే స్పష్టత మా పార్టీ నేతలకు ఉంది. ఎమ్మెల్యే టికెట్ వచ్చిన వారు ఎన్నికల్లో కొట్లాడతారు. రాకున్నా పార్టీ నిర్ణయానికి కట్టుబడే వారికి రేపు మరో అవకాశం వస్తుంది. తొమ్మిదేళ్లలో అనేక మంది విద్యార్థి, యువజన నాయకులకు ఎమ్మెల్సీలుగా, కార్పొరేషన్ల చైర్మన్లుగా, కమిషన్ల సభ్యులుగా అవకాశం ఇచ్చాం. మాట ఇచ్చిన వారందరినీ అకామిడేట్ చేసుకున్నాం. ఎవరికైనా అవకాశాలు రాకుంటే భవిష్యత్తులో ఇస్తాం. గవర్నర్ వ్యవస్థతో కేంద్రం రాజకీయం... గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టుకొని ప్రతిపక్ష ప్రభుత్వాల గొంతును కేంద్రం నులుముతున్న తీరును దేశం గమనిస్తోంది. గవర్నర్ వ్యవస్థతో రాజకీయం చేసి రాష్ట్రాలను ఇబ్బందులు పెట్టడం ప్రజాస్వామ్యానికి ప్రమాదం. కొందరికి ఆదరణ లేకే... పాదయాత్రల పేరిట కొందరు ఆపసోపాలు పడినా ప్రజలు పట్టించుకోవడం లేదు. మీడియా దృష్టిని ఆకర్షించేందుకు, అస్తిత్వం కోల్పోతామనే చిల్లర ప్రయత్నాలతో కాంగ్రెస్‌కు బీఆర్ఎస్ డబ్బులు ఇచ్చిందని కొందరు ఆరోపిస్తున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికతోపాటు కరీంనగర్, నిజామాబాద్ లోక్ సభ, ఇతర ఉపఎన్నికల సమయంలో కాంగ్రెస్, బీజేపీ ఏకమై పనిచేశాయి. అదానీతో మోదీకి సంబంధం లేదని బీజేపీ నేతలు భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేస్తారా? ప్రమాణాలు, ఇమానాల మీద తేలేదుంటే కోర్టులు ఎందుకు? ఇంకో పార్టీకి డబ్బులు పంపే ఖర్మ మాకేంటి? వాళ్లందరికీ పంచేంత డబ్బులు మా వద్ద లేవు. బీజేపీ, కాంగ్రెస్‌లు తెలంగాణకు ఉపద్రవాలు. ఎంత త్వరగా వదిలించుకుంటే తెలంగాణకు అంత మంచిది. జాతీయ పార్టీ ఒకేసారి దేశమంతా పోటీ చేయాలని లేదు... బీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారినంత మాత్రాన దేశమంతా ఒకేసారి పోటీ చేయాలన్న రూలేమీ లేదు. రెండు స్థానాల నుంచి 300 స్థానాలకు చేరుకొనేందుకు బీజేపీకి 30–40 ఏళ్లు పట్టింది. 2024లో 543 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయాలనే తొందరేమీ మాకు లేదు. పట్టుదొరికి బలంగా ఉన్న చోట, గెలిచే అవకాశం, పార్టీ విస్తరణకు అవకాశం ఉన్న చోట పోటీ చేస్తాం. మహారాష్ట్రలో 48 ఎంపీ సీట్లలో పోటీ చేస్తామా, ఇతరులతో అవగాహన ఉంటుందా ఇప్పుడే చెప్పలేము. జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ విస్తరణకు పనిచేస్తూనే రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి రావడాన్ని మొదటి కర్తవ్యంగా పనిచేస్తాం. దేశంలో రాజకీయ శూన్యత నేపథ్యంలో బీఆర్ఎస్ బలమైన పార్టీగా ఎదుగుతుంది. కుమారస్వామికి మద్దతు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జనతా దళ్ (సెక్యులర్) నేత కుమారస్వామికి మద్దతివ్వాలని పార్టీ సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ ఎన్నికల్లో ప్రచారం చేయాలని కుమారస్వామి కోరితే పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. మా ప్రత్యర్థి కాంగ్రెస్సే.. తెలంగాణలో మాకు కాంగ్రెస్ పార్టీయే ప్రత్యర్థి. క్షేత్రస్థాయిలో అంతోఇంతో కాంగ్రెస్ ఉన్నా టీపీసీసీ అధ్యక్షుడి ఒంటెద్దు పోకడలతో కేడర్, లీడర్లు నిరాసక్తతతో ఉన్నారు. 2018లో 19 సీట్లు వస్తే ఈసారి కాంగ్రెస్‌కు డబుల్ డిజిట్ వస్తుందో రాదో తెలియదు. కాంగ్రెస్‌తో ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు ఉండదు. మునుగోడు ఉపఎన్నికలో కమ్యూనిస్టులు మద్దతు ఇచ్చారు. భవిష్యత్తులో వారితో పనిచేసే విషయంలో ఎన్నికల నాటికి నిర్ణయం ఉంటుంది. అదానీ షేర్ల స్కాం అంశం విషయంలో పార్లమెంటు సంయుక్త కమిటీ (జేపీసీ) ఏర్పాటు డిమాండ్ కోసం కాంగ్రెస్‌తోపాటు ఇతర విపక్షాలతో కలసి కేవలం ఫ్లోర్ కోఆర్డినేషన్ కోసం పనిచేశాం. -
రాష్ట్రంలో బీజేపీ ఖాళీ.. ఢిల్లీలో ప్రధాని కుర్చీ ఖాళీ
అమిత్ షా జీ.. త్వరలో అధికారంలోకి కాదు..బీజేపీ అంధకారంలోకే. త్వరలో రాష్ట్రంలో బీజేపీ ఖాళీ.. ఢిల్లీలో ప్రధాని కుర్చీ ఖాళీ. 2024లో వైఫల్యాల మోదీకి గుజరాత్ ఘర్‌వాపసీ తప్పదు. మరోసారి మోదీని ప్రధాని పీఠం ఎక్కిస్తే దేశాన్ని బలిపీఠం ఎక్కించినట్టేననే బలమైన భావనలో ప్రజలున్నారు. సాక్షి, హైదరాబాద్: బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా చేవెళ్ల సభలో చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి కె. తారక రామారావు ఆదివారం రాత్రి ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించారు. ‘డియర్ అమిత్‌షా జీ..త్వరలో అధికారంలోకి కాదు.. బీజేపీ అంధకారంలోకే.. త్వరలో రాష్ట్రంలో బీజేపీ ఖాళీ.. ఢిల్లీలో ప్రధాని కుర్చీ ఖాళీ.. 2024లో వైఫల్యాల మోదీకి గుజరాత్ ఘర్‌వాపసీ తప్పదు.. మరోసారి మోదీని ప్రధాని పీఠం ఎక్కిస్తే దేశాన్ని బలిపీఠం ఎక్కించినట్టేననే భావనలో ప్రజలున్నా రు’ అంటూ అమిత్‌షా వ్యాఖ్యలపై ఎక్కడికక్కడ కౌంటర్ ఇస్తూ ఆయన చేసిన వరుస ట్వీట్లు ఇలా.. అదానీ చేతిలో బీజేపీ స్టీరింగ్ ‘కారు స్టీరింగ్ కాదు.. బీజేపీ స్టీరింగే అదానీ చేతికి చిక్కింది. కార్పొరేట్ దోస్తు కబంధహస్తాల్లో కమలం విలవిలలాడుతోంది. హిండెన్‌బర్గ్ రిపోర్ట్‌తో బీజేపీ ఫుల్ పిక్చర్‌ను దేశప్రజలు 70 ఎంఎంలో చూసేశారు. ఇంకా ఏ ట్రైలర్ అవసరం లేదు. తెలంగాణలో గల్లీ బీజేపీ నేతల పగటివేషాలు నడవవు. ఢిల్లీ పెద్దల పగటికలలు నెరవేరవు. అదానీపై జేపీసీ వేయని బీజేపీకి సిట్టింగ్ జడ్జి విచారణ అడిగే హక్కుందా?. ముక్కునేలకు రాసినా..మోకాళ్ల యాత్ర చేసినా..మోసాల మోదీని తెలంగాణ నమ్మదు. బట్టేబాజ్ బీజేపీని తెలంగాణ సమాజం క్షమించదు. కరప్షన్‌కు కెప్టెన్.. మోదీ. క్యాప్షన్.. బీజేపీ. ఎంఐఎం భుజంపై తుప్పుపట్టిన బీజేపీ తుపాకీపెట్టి ఎంతకాలం కాలుస్తారు?. తెలంగాణలో సొంత బలం లేని పార్టీ బీజేపీ. పల్లెపల్లెనా బలగం కలిగిన పార్టీ బీఆర్ఎస్’. నిస్సిగ్గుగా సుద్దులా? ‘బారాణా తీసుకుని చారాణా కూడా ఇవ్వని బీజేపీకి మిగిలేది బూడిదే. అదానీ విషయంలో జేపీసీ కాదు కదా కనీసం సిట్ కూడా వేయని వారు అవినీతి గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. గుజరాత్లో మోదీ హయాంలో మీరు హోంమంత్రిగా ఉన్నప్పుడు పేపర్ లీకుల్లో గుజరాత్ నంబర్‌వన్‌గా ఉన్నమాట నిజం కాదా?. గత ఎనిమిదేళ్లలో గుజరాత్లో 13సార్లు పేపర్లు లీక్ కాలేదా?. ఈ దేశంలో ‘వ్యాపం’ లాంటి అతి జుగుప్సాకరమైన స్కాం చేసింది మీ బీజేపీ ప్రభుత్వం కాదా?. అటువంటి మీరు నిస్సిగ్గుగా సుద్దులు మాట్లాడటం మీకే చెల్లింది’. పీఎం కేర్స్‌లో ఎంత జమైందో చెబుతారా? ‘పీఎం కేర్స్‌లో ఎంత జమైందో, ఏవిధంగా ఖర్చ యిందో చెప్పని వారు, కాగ్ ఆడిట్ పీఎం కేర్స్‌కు వర్తించదని నిస్సిగ్గుగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసిన వారు, కాగ్ మాత్రమే కాక అన్ని రకాల బ్యాంక్స్ ఆడిట్లతో కట్టిన ప్రాజెక్టులపై మాట్లాడటం అవివేకం కాక మరేమిటి?. ఎనిమిదేళ్లుగా కృష్ణా నదిలో తెలంగాణ వాటా తేల్చకుండా, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించకుండా ఇక్కడికొచ్చి ఎవరో మీ గులాములు రాసిచ్చిన స్క్రిప్టును వల్లెవేస్తే నమ్మేదెవరు?’ అంటూ కేటీఆర్ తన వరుస ట్వీట్లను ముగించారు. మీకు ఫ్రెండ్ ఫస్ట్.. నేషన్ లాస్ట్.. ‘ఐటీఐఆర్ హైదరాబాద్, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా, హైదరాబాద్ మెట్రో రెండోదశ, ఐఐఎం, ఐసెర్, ట్రిపుల్ ఐటీ, ఎన్ఐడీ, నవోదయ, మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలకు శంకుస్తాపన చేసినందుకు కృతజ్ఞతలు. ఓహ్.. ఆగండాగండి.. ఇవేవీ ఆయన చేయలేదు’ అంటూ అమిత్ షాను ఉద్దేశించి రాష్ట్రమంత్రి కేటీఆర్ మరో ట్వీట్లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గడిచిన తొమ్మిదేళ్లలో తెలంగాణ కంటే మెరుగ్గా పనిచేసిన బీజేపీ పాలిత రాష్ట్రం పేరు ఒక్కటీ ఎందుకు చెప్పలేకపోయారు’ అని మంత్రి కేటీఆర్ అమిత్‌షాను ప్రశ్నించారు. ‘ఆకాశాన్నంటుతున్న పప్పు, ఉప్పు, నూనె ధరలు నియంత్రించే సోయి లేదు. ప్రజలపై పెట్రోధరల భారాన్ని తగ్గంచాలన్న సోయి కూడా లేదు. గ్యాస్ ధరలను భరించలేకపోతున్న మహిళలపై కనికరం లేదు. కానీ ఆగమేఘాలపై అదానీ కంపెనీని ఆదుకోవడమే మీ ఏకైక లక్ష్యం. దేశం కోసం కాదు.. దోస్తు కోసం ప్రజల రెక్కల కష్టాన్ని ధారపోస్తున్న వైనం. సామాన్యుడు ప్రశ్నిస్తున్నాడు.. ప్రధాని ప్రాధాన్యాల్లో పేదవాడు ఎక్కడ?. దేశానికి అర్దమైంది.. మీకు ఫ్రెండ్ ఫస్ట్.. నేషన్ లాస్ట్’ అంటూ కేటీఆర్ బీజేపీపై మండిపడ్డారు. -
ఊరూరా పండుగలా..
సాక్షి, హైదరాబాద్: పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈసారి పెద్ద ఎత్తున నిర్వహించాలని భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నిర్ణయించింది. కొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతోపాటు.. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఆత్మీయ సమ్మేళనాలకు పార్టీ శ్రేణుల్లో మంచి స్పందన వస్తుండటంతో.. ఈ ఉత్సాహాన్ని కొనసాగించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. పార్టీ ఆవిర్భావం సందర్భంగా ఊరూరా పండుగలా ఘనంగా కార్యక్రమాలు నిర్వహించాలని.. అన్ని స్థాయిల పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు పాల్గొనేలా చూడాలని నిర్ణయించింది. ఏప్రిల్ 27న బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో ముందు, తర్వాత నిర్వహించే కార్యక్రమాలపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.తారకరామారావు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. దీనికి అనుగుణంగా పార్టీ శ్రేణులు సిద్ధంకావాలని సూచించారు. 25 నుంచి కార్యక్రమాలు.. ఈ నెల 25వ తేదీన పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్చార్జుల అధ్యక్షతన నియోజకవర్గ స్థాయి పార్టీ ప్రతినిధుల సభలు నిర్వహించుకోవాలని కేటీఆర్ పార్టీ శ్రేణులకు సూచించారు. పార్టీ జిల్లా అధ్యక్షులు ఈ సమావేశాల నిర్వహణను సమన్వయం చేస్తారని, కనీసం 2.5 వేల నుంచి 3 వేల మంది వరకు సభలో పాల్గొనేలా చూడాలని ఆదేశించారు. ప్రతి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు, వార్డుల్లో అదే రోజున ఉదయం పార్టీ జెండాలను ఎగరవేసి.. పండుగలా జరుపుకోవాలని, ఆ తర్వాత నియోజకవర్గ సమావేశాలకు రావాలని నేతలకు సూచించారు. రోజంతా జరిగే పార్టీ నియోజకవర్గ ప్రతినిధుల సభలో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి, ప్రజలకు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, పార్టీ తరఫున చేపట్టిన కార్యక్రమాలన్నింటిపై విస్తృతంగా చర్చించనున్నట్టు తెలిపారు. ప్రతినిధుల సభకు నియోజకవర్గ పరిధిలోని గ్రామ, వార్డు పార్టీ అధ్యక్షులు, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులతోపాటు అన్నిస్థాయిల ప్రజా ప్రతినిధులు, కార్పొరేషన్ల చైర్పర్సన్లు హాజరుకావాలని చెప్పారు. తెలంగాణభవన్‌లో ఆవిర్భావ దినోత్సవం ఈ నెల 27న హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ వేడకలను నిర్వహించనున్నట్టు కేటీఆర్ తెలిపారు. అదేరోజున పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన పార్టీ జనరల్ బాడీ సమావేశం జరుగుతుందని.. సుమారు 300 మంది పార్టీ జనరల్ బాడీ ప్రతినిధులు అందులో పాల్గొంటారని వివరించారు. ఈ సమావేశంలో పలు రాజకీయ తీర్మానాలను ప్రవేశపెడతారని.. వాటిపై విస్తృతంగా చర్చించి, ఆమోదిస్తారని వెల్లడించారు. తెలంగాణవ్యాప్తంగా ఈ నెలాఖరులో వరి కోతలు ఉండటం, ఎండల తీవ్రత దృష్ట్యా.. పార్టీ ఆవిర్భావ దినం సందర్భంగా నిర్వహించే బహిరంగసభ, ప్రతినిధుల సభను వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. వీటిని కలిపి అక్టోబర్ 10న వరంగల్‌లో మహాసభ నిర్వహిస్తామని ప్రకటించారు. ఆత్మీయ సమ్మేళనాల కొనసాగింపు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణను పార్టీ అధినేత కేసీఆర్ అభినందించారని కేటీఆర్ తెలిపారు. ఈ ఆత్మీయ సమ్మేళనాలను మే నెలాఖరు దాకా కొనసాగించాలని కేసీఆర్ సూచించారని.. ఈ మేరకు చర్యలు చేపడుతున్నామని వివరించారు. మూడు నియోజకవర్గాలకు ఇన్చార్జులు సిట్టింగ్ ఎమ్మెల్యే జి.సాయన్న మృతి నేపథ్యంలో కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్చార్జిగా మర్రి రాజశేఖర్‌రెడ్డిని కేసీఆర్ నియమించారు. ఇక గోషామహల్ ఇన్చార్జిగా నంద కిషోర్ వ్యాస్ బిలాల్, భద్రాచలం ఇన్చార్జిగా ఎంపీ మాలోతు కవితలను నియమించారు. ప్రస్తుతం నియోజకవర్గంలో కొనసాగుతున్న ఆత్మీయ సమ్మేళనాలతోపాటు పార్టీ ఆవిర్భావ దిన వేడుకలు, ఇతర కార్యక్రమాల నిర్వహణకు బాధ్యులుగా ఉంటారని ప్రకటించారు. -
భావి తరాల కోసం ‘కూల్ రూఫ్’
సాక్షి, హైదరాబాద్: భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో కూల్‌రూఫ్ పాలసీ అమలుకు శ్రీకారం చుడుతున్నట్లు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె. తారక రామారావు తెలిపారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభా వాన్ని నివాస గృహాలు, వాణిజ్య కార్యాలయాలపై తగ్గించేందుకు తీసుకొచ్చిన ‘తెలంగాణ కూల్‌రూఫ్ విధానం 2023–28’ను మంత్రి కేటీఆర్ సోమవారం పురపాలక శాఖ కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 600 చదరపు గజాలకుపైగా విస్తీర్ణంలో నిర్మించే అపార్ట్మెంట్లు, ఇతర వాణిజ్య సముదాయాల్లో కూల్ రూఫ్ పాలసీని తప్పనిసరి చేస్తున్నట్లు తెలిపారు. కూల్‌రూఫ్ పాలసీ ఉంటేనే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చేలా నిబంధనలను మారుస్తామన్నారు. 600 గజాల్లోపు విస్తీర్ణంలో నిర్మించుకొనే ఇళ్లకు కూల్‌రూఫ్ విధానాన్ని ఆప్షన్‌గా ఇస్తున్నట్లు చెప్పారు. అలాగే ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాలు, డబుల్ బెడ్రూం ఇళ్లపై కూల్‌రూఫ్ విధానం అమలు చేస్తామన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, రోడ్లు, ఫుట్‌పాత్‌లు, సైక్లింగ్ ట్రాక్‌లు మొదలైన వాటిని ఈ విధానం ద్వారానే నిర్మించనున్నట్లు వివరించారు. తెలంగాణ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొనే... రాష్ట్రంలో దాదాపు 50 శాతం జనాభా పట్టణ ప్రాంతాల్లో నివసిస్తోందని, దేశంలోనే మూడవ అతిపెద్ద పట్టణీకరణ రాష్ట్రంగా ఉన్న తెలంగాణ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కూల్‌రూఫ్ విధానాన్ని అమల్లోకి తెచ్చినట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. 2030 నాటికి హైదరాబాద్‌లో 200 చదరపు కిలోమీటర్లు, రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో 100 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కూల్ రూఫింగ్ కిందకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరం జీహెచ్ఎంసీ పరిధిలో 5 చదరపు కిలోమీటర్ల మేర, ఇతర పట్టణాల్లో 2.5 కిలోమీటర్ల మేర కూల్ రూఫ్‌ను అమలు చేస్తామన్నారు. పట్టణాల్లో వేడిని తగ్గించాలి.. పట్టణాల్లో జరిగే నిర్మాణాల వల్ల ఉత్పన్నమవుతున్న వేడిని ఎదుర్కోవడానికి వాతావరణ అనుకూలమైన శీతలీకరణ పరిష్కారాలను ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పాతకాలంలో పెంకుటిళ్లు, డంగు సున్నం, మట్టి గోడలు వేడిని ఆపాయని... ప్రస్తుతం భవన నిర్మాణాల్లో విచ్చలవిడిగా వినియోగిస్తున్న ఇనుము, స్టీల్, ఇతర ఖనిజాలతో వేడి పెరిగిందన్నారు. భవిష్యత్ వాతావరణ సవాళ్లను పరిష్కరించే దిశలో రూఫ్ కూలింగ్ పాలసీ తప్పనసరని ఆయన చెప్పారు. న్యూయార్క్ లక్ష్యంకన్నా మిన్నగా... విదేశాల్లోకన్నా అధిక విస్తీర్ణంలో తెలంగాణలో కూల్‌రూఫ్ పాలసీని తీసుకురావాలని నిర్ణయించినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. అమెరికాలోని న్యూయార్క్ కూల్‌రూఫ్ నిర్దేశిత లక్ష్యం 10 లక్షల చదరపు అడుగులు లేదా 0.1 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అయితే కేవలం హైదరాబాద్, ఔటర్ రింగ్‌రోడ్డు కింద 1,000 చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువ వైశాల్యం ఉందని, ఔటర్ లోపల 20 శాతం ప్రాంతాన్ని కూల్ రూఫింగ్ కిందకు తీసుకురానున్నట్లు చెప్పారు. పెట్టుబడి తిరిగి వచ్చేస్తుంది.. కూల్‌రూఫ్ విధానం అమలు కోసం చదరపు మీటర్‌కు రూ. 300 మాత్రమే ఖర్చవుతుందని మంత్రి కేటీఆర్ వివరించారు. ఈ విధానం వల్ల ఏసీ ఖర్చులు, కరెంట్ బిల్లులు తగ్గే అవకాశం ఉన్నందున పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందన్నారు. తన ఇంటి మీద కూల్ రూఫింగ్ కోసం పెయింటింగ్ చేసినట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. కూల్ రూఫ్ కోసం ముందుకొచ్చే వారికి శిక్షణ అందించేందుకు పురపాలక శాఖ సిద్ధంగా ఉందన్నారు. త్వరలో ‘మన నగరం’అనే కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించినట్లు చెప్పిన మంత్రి కేటీఆర్... దీనిలో భాగంగా భవన నిర్మాణ వ్యర్థాలను సేకరించి వాటిని కూల్ రూఫింగ్కు దోహదపడే సామగ్రిగా మార్చి ఉపయోగించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, జీహెచ్ఎంసీ మేయర్ జి. విజయలక్ష్మి, కూల్‌రూఫ్ నిపుణులు, ప్రొఫెసర్ విశాల్ గార్గ్, సీఆర్ఆర్సీ సభ్యురాలు నీతూ జైన్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, సీడీఏఎం సత్యనారాయణ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ తదితరులు పాల్గొన్నారు. -
పంట నష్టపోయిన రైతులకు భరోసా ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: స్థానిక వ్యవసాయ అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించడం ద్వారా అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు భరోసా కల్పించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు పార్టీ నేతలకు సూచించారు. ఎమ్మెల్యేలు ప్రభుత్వ కార్యక్రమాల అమలును పర్యవేక్షించడంతో పాటు పంచాయతీరాజ్ రోడ్ల మరమ్మతు పనులు వర్షాకాలం లోపు పూర్తయ్యేలా సమన్వయం చేసుకోవాలని చెప్పారు. ఉపాధి హామీ, పంచాయతీరాజ్, పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా చేసిన పనులకు బిల్లుల చెల్లింపుపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని తెలిపారు. ఉపాధి హామీ పథకానికి సంబంధించి కేంద్రం నుంచి రూ.1,300 కోట్ల నిధులు పెండింగ్‌లో ఉన్నందునే బిల్లుల చెల్లింపు ఆలస్యమైందని వివరించారు. సీఎం కేసీఆర్ సందేశాన్ని ప్రతి కార్యకర్తకు చేరేలా చూడాలని కేటీ ఆర్ ఆదేశించారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య ప్రజాప్రతినిధులు, పార్టీ ఇన్‌చార్జీలతో సోమవారం ఆయన టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏప్రిల్ 27న జెండా పండుగ పార్టీ జిల్లా ఇన్చార్జీల ఆధ్వర్యంలో ఏప్రిల్ 20 నాటికి ఆత్మీయ సమ్మేళనాలు పూర్తి చేయడంతో పాటు బీఆర్ఎస్ కార్యకలాపాలు విస్తృతంగా కొనసాగించాలని కేటీఆర్ సూచించారు. కేసీఆర్ తన సందేశంలో పేర్కొన్నట్టుగా.. ఉద్యమకాలం నుంచి పార్టీకి అండగా ఉంటూ రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చేందుకు కార్యకర్తలు చేసిన కృషిని, పార్టీతో వారి అనుబంధాన్ని గుర్తు చేస్తూ.. తెలంగాణ అభివృద్ధి ప్రస్థానం అందరికీ అర్థమయ్యేలా వివరించాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు రాష్ట్రం పట్ల చూపిస్తున్న వివక్షపై ఆత్మీయ సమ్మేళనాల్లో ప్రత్యేకంగా చర్చించాలన్నారు. ఏప్రిల్ 20 నాటికి ఆత్మీయ సమ్మేళనాలు పూర్తి చేసి, 25న నియోజకవర్గ స్థాయిలో బీఆర్ఎస్ ప్రతినిధుల సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. 1,000 నుంచి 1,500 మంది పార్టీ ప్రతినిధులతో ఈ సమా వేశాలు జరుగుతాయని తెలిపారు. ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అన్ని గ్రామాలు, వార్డుల్లో జెండా పండుగ కార్యక్రమం ఉంటుందన్నారు. ప్లీనరీకి ఆహ్వానం అందిన ప్రతినిధులు హాజరు కావాలని కేటీఆర్ సూచించారు. -
వాళ్లవి దివాళాకోరు రాజకీయాలు
సాక్షి ప్రతినిధి, వరంగల్: దేశంలో, రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దివాళాకోరు రాజకీయాలకు పాల్పడుతున్నాయని.. పచ్చటి తెలంగాణను విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కె.తారక రామారావు మండిపడ్డారు. ఆ రెండు పార్టీలు ప్రజల బాగోగులను ఏనాడూ పట్టించుకోలేదని.. అంబానీలు, అదానీలకు ఊడిగం చేయడంలోనే మునిగిపోయాయని ఆరోపించారు. దేశాన్ని, రాష్ట్రాన్ని ఎక్కువకాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ.. కరువు, కరెంటు కోతలు, దారిద్య్రాన్ని మిగిల్చిందని విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అరాచకపాలనను ప్రశ్నిస్తే దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. సోమవారం హనుమకొండ జిల్లా వేలేరు మండలం సోడాషపల్లిలో సుమారు రూ.152 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం సోడాషపల్లి క్రాస్‌రోడ్‌లో నిర్వహించిన రైతు కృతజ్ఞత సభలో ప్రసంగించారు. కేటీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘‘కొందరు రాజకీయ నిరుద్యోగులు పనికిమాలిన పాదయాత్రలు చేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఒక్క చాన్స్ ఇవ్వండి అని పీసీసీ అధ్యక్షుడు అడుక్కుంటున్నాడు. మీ దిక్కుమాలిన పార్టీకి ప్రజలు 10 చాన్సులు ఇచ్చారు. ఏం చేశారు? గుడ్డి గుర్రాల పళ్లు తోమారా? కరెంట్, సాగు, తాగునీరు ఇవ్వలేదు. ఇప్పుడేమో ఎగతాళిగా మాట్లాడుతూ.. ఒక్క చాన్స్ ఇవ్వండి అని అడుక్కుంటే మీకు ఓటెయ్యాలా? రేవంత్‌రెడ్డి రెచ్చగొట్టే మాటలను ఎవరూ నమ్మరు. మతం పేరుతో మంటపెడ్తున్న బీజేపీ బీజేపీ మతం పేరుతో మంటలు రేపుతూ, కులం పేరిట కుంపట్లు పెడుతూ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తోంది. కేంద్రంలో అరాచక పాలన సాగిస్తున్న బీజేపీని విమర్శిస్తే దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తున్నారు. ఇలాంటి దాడులకు భయపడేది లేదు. ఎందాకైనా పోరాడుతాం. అన్నింటి ధరలు పెంచి ప్రజలపై భారం మోపినందుకు మోదీని దేవుడని అనాలా? బండి సంజయ్ ఏం మాట్లాడుతాడో ఎవరికీ అర్థం కాదు. కిషన్‌రెడ్డికి మెదడు మోకాళ్లలో ఉందో, అరికాళ్లలో ఉందో అర్థం కాదు. ప్రజలంతా మా కుటుంబమే.. కేసీఆర్‌ను విమర్శించేందుకు విపక్షాలకు ఏ కారణమూ దొరకక కుటుంబ పాలన అని విమర్శలు చేస్తున్నారు. బరాబర్ చెప్తున్నా.. మాది కుటుంబ పాలనే.. నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలంతా మా కుటుంబ సభ్యులే. ప్రతి కుటుంబంలో కేసీఆర్ భాగస్వామే. 65లక్షల మందికి పెట్టుబడి సాయం ఇచ్చి రైతులందరికీ పెద్దన్న అయ్యారు. 45లక్షల మందికి ఆసరా పెన్షన్లతో వృద్ధులను కడుపులో పెట్టుకున్నారు. 12 లక్షల మందికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ఇచ్చి పేదింటి ఆడబిడ్డలకు మేనమామ అయ్యారు. ఇందులో కులం పంచాయతీ లేదు. మతం పిచ్చి లేదు. జనహితమే మా అభిమతంగా పని చేస్తున్నాం. పల్లె ప్రగతి ద్వారా గ్రామాలు, పట్టణాలు బాగు పడుతున్నాయి. సీఎం కేసీఆర్ ముందు చూపుతో పంజాబ్, హరియాణాలతో తెలంగాణ రైతులు పోటీ పడుతున్నారు..’’అని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ఎంపీలు పసునూరి దయాకర్, మాలోతు కవిత, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు టి.రాజయ్య, దాస్యం వినయభాస్కర్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, అరూరి రమేష్, వొడితెల సతీశ్‌కుమార్, శంకర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు. నిందితుడు సైఫ్ అయినా.. సంజయ్ అయినా వదలం.. పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి మృతిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం, పార్టీపరంగా ప్రీతి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. కాలేజీలో జరిగిన ర్యాగింగ్ వల్ల మనస్తాపానికి గురై డాక్టర్ ప్రీతి చనిపోవడం చాలా బాధాకరమని.. కానీ ఈ విషయాన్ని కొందరు అనవసరంగా రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘నిందితులు ఎవరైనా, ఎంతటివారైనా వదిలేది లేదు. నిందితుడు సైఫ్ అయినా.. సంజయ్ అయినా వదిలిపెట్టబోం..’’అని వ్యాఖ్యానించారు. -
శత్రుదేశంపై దండయాత్రలాగా తెలంగాణపైకి ఉసిగొల్పుతున్నారు: కేటీఆర్
భూపాలపల్లి: ‘శత్రుదేశం మీద కక్ష గట్టి దండయాత్రకు దిగినట్లుగా.. ప్రధాని నరేంద్ర మోదీ వేట కుక్కల్లాంటి కేంద్ర సంస్థలను తెలంగాణపైకి ఉసిగొల్పుతున్నారు. పీఎం మోదీ దేవుడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అంటాడు. అదానీకి దేవుడా? లేక ఆయనకు దేవుడా? ఒక్క చాన్స్ ఇవ్వాలని అడుగుతున్న కాంగ్రెస్ పార్టీకి 75 ఏళ్లలో పదిసార్లు అవకాశం ఇస్తే అభివృద్ధి జరిగిందా?..’అని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రశ్నించారు. భూపాలపల్లి నియోజకవర్గంలో రూ.276 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు గురువారం ఆయన ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడారు. పదిసార్లు గెలిపిస్తే సోయి లేదా? ‘టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రానున్న ఎన్నికల్లో ఒక్క చాన్స్ ఇవ్వండి అంటూ అడుక్కుంటున్నాడు. 75 ఏళ్లలో పదిసార్లు గెలిపిస్తే సోయి లేదా.. గుడ్డి గుర్రాల పళ్లు తోమారా?.. ఇవ్వాళ మళ్లీ మొరుగుతున్నారు. కాంగ్రెస్ హయాంలో అర్ధరాత్రి కరెంట్, పేలిపోయిన మోటార్లు, కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు, పాము కాట్లు, విద్యుత్ షాక్‌తో రైతులు మృతి చెందిన సంఘటనలు ఎన్నో చూశాం. మనిషి చచ్చిపోతే దహనం అనంతరం స్నానం చేసేందుకు కరెంటు సరఫరా కోసం బతిమిలాడే పరిస్థితి ఉండేది. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో గరిష్టంగా 13,662 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉండగా.. ఇప్పుడు ఒక్క తెలంగాణలోనే 14,700 మెగావాట్ల డిమాండ్ ఉందంటే రాష్ట్రం ఏమేరకు అభివృద్ధి చెందిందో అర్థం చేసుకోవచ్చు..’అని మంత్రి అన్నారు. మాది వసుదైక కుటుంబ పాలన.. ‘రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అక్కడ బీజేపీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణలో రాజ్యాంగ బద్ధంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆ పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేస్తే రకరకాల మాటలు మాట్లాడతారా? మీరు చేస్తే సంసారం.. మేము చేస్తే వ్యభిచారమా?. ప్రజల మనసులను గెలవాలంటే ఏం చేశామో, ఏం చేస్తామో చెప్పాలే తప్ప ఇష్టమొచ్చినట్లు మాట్లాడకూడదు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రతి ఒక్కరికీ కావాల్సిన పథకాలు అందిస్తూ ఒక మామలా, అన్నలా, పెద్ద కొడుకులా, తాతలా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలోని 4 కోట్ల మందీ కేసీఆర్ కుటుంబమే. మాది వసుదైక కుటుంబ పాలన..’అని చెప్పారు. పార్టీ పేరు మాత్రమే మారింది.. ‘ఎన్నికల యుద్ధానికి యువత సిద్ధం కావాలి. పార్టీ పేరు మాత్రమే మారింది. డీఎన్ఏ రంగు, గుర్తు కూడా అలాగే ఉంది. వ్యవసాయం, విద్యుత్, విద్య, వైద్య రంగాల్లో తెలంగాణ మాదిరిగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పెట్టారు. నిన్న, మొన్న వచ్చిన కొంతమంది చిల్లరగాళ్లు ఏవేవో మాట్లాడుతున్నారు. వాళ్ళకు కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా సమాధానం ఇవ్వాలి. ఆ పార్టీలు పిచ్చోళ్ల చేతిలో ఉంటే తెలంగాణ ఆగమైతది. కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేదా? మీకు పదవులు వచ్చేవా?’అని కేటీఆర్ ప్రశ్నించారు. సభలో మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, జి.జగదీశ్‌రెడ్డి, ఎంపీ దయాకర్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదనాచారి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. -
రాష్ట్రంపై ‘శత్రు’ వైఖరి: మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రాజెక్టులకు కేంద్ర సహకారం కోసం ఎన్ని ప్రతిపాదనలు పంపినా పట్టించుకోవడం లేదని మంత్రి కె.తారక రామారావు విమర్శించారు. హైదరాబాద్‌లో మెట్రోరైలు విస్తరణకు ఉన్న డిమాండ్‌పై ఏమాత్రం స్పందించడం లేదని.. మరోవైపు బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని నగరాలలో మెట్రో ప్రాజెక్టులకు కేంద్ర వాటాతో పాటు సావరిన్ గ్యారంటీల పేరిట పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోందని మండిపడ్డారు. అయినా హైదరాబాద్ ప్రజల ఆకాంక్ష, పెరుగుతున్న నగర అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వమే మెట్రో ప్రాజెక్టు విస్తరణ కోసం కృషి చేస్తోందని చెప్పారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా శనివారం ప్రశ్నోత్తరాల సమయంలో మెట్రో రైలు ప్రాజెక్టు పొడిగింపు అంశంపై సభ్యులు అరికపూడి గాంధీ, దానం నాగేందర్, ప్రకాశ్‌గౌడ్, భట్టి విక్రమార్క.. చార్మినార్ పాదచారుల ప్రాజెక్టు (సీపీపీ)పై ఎంఐఎం సభ్యులు.. ఎస్‌ఎన్‌డీపీపై దానం నాగేందర్, వివేకానంద అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానాలు ఇచ్చారు. కోటీ 20లక్షల మంది నివసిస్తున్న హైదరాబాద్‌కు నిధులు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వానికి మనసు రావడం లేదని, శత్రుదేశంపై పగబట్టినట్టుగా తెలంగాణపై కక్షగట్టి వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అసెంబ్లీలో కేటీఆర్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘కాంగ్రెస్ హయాంలో చేపట్టిన మెట్రో ప్రాజెక్టు ఒప్పందం మేరకే ప్రస్తుతం మూడు కారిడార్లలో ఎల్అండ్టీ సంస్థ ద్వారా నిర్వహణ ప్రక్రియ కొనసాగుతోంది. రూ.6,250 కోట్లతో ఎయిర్పోర్ట్ వరకు మెట్రో విస్తరణకు శ్రీకారం చుట్టాం. రాయదుర్గ్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు ఈ ఎక్స్‌ప్రెస్ మెట్రోను మూడేళ్లలో పూర్తిచేయనున్నాం. హైదరాబాద్ మెట్రో ఉద్యోగాల్లో 80 శాతం వరకు తెలంగాణ వాళ్లే ఉన్నారు. కాంగ్రెస్ హయాంలో కుదిరిన ప్రైవేట్, పబ్లిక్ పార్ట్నర్షిప్ ఒప్పందంలో భాగంగా మెట్రో టికెట్ ధరలను పెంచుకునే అధికారాన్ని నిర్వహణ సంస్థకే ఇచ్చారు. అయినా ఇష్టానుసారం ధరలు పెంచకూడదని ప్రభుత్వం తరఫున చెప్పాం. ఆర్టీసీ ధరలతో పోల్చి మెట్రో టికెట్ ధరలు ఉండాలన్నాం. పాతబస్తీలో మెట్రో రైలు ప్రాజెక్టును పొడిగించే విషయంలో ఇటీవలే ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌తో సమావేశమయ్యాను. ముందుగా రూ.100 కోట్లతో రోడ్ల విస్తరణ పూర్తిచేసి పనులు చేపట్టనున్నాం. హైదరాబాద్ ఆత్మ ఎప్పటికీ చెదిరిపోదు హైదరాబాద్ సాంస్కృతిక వైభవాన్ని కాపాడాల్సిన బాధ్యత మాపై ఉంది. చార్మినార్ సంరక్షణ కోసం పాదచారుల ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. ఎన్ని అధునాతన భవంతులు వెలిసినా హైదరాబాద్ ఆత్మ ఎప్పటికీ చెదిరిపోదు. మూసీనదిపై అఫ్జల్‌గంజ్ వద్ద ఐకానిక్ పెడస్ట్రియన్ బ్రిడ్జి నిర్మాణం కోసం టెండర్లు పిలిచాం. మరో పెడస్ట్రియన్ బ్రిడ్జిని నయాపూల్ వద్ద నిర్మించే యోచనలో ఉన్నాం. గుల్జార్‌హౌస్, మీరాలం మండి, ఆషుర్ ఖానాకు పూర్వవైభవం తీసుకొస్తున్నాం. మదీనా నుంచి పత్తర్‌ఘట్టి వరకు పనులు పూర్తికావొచ్చాయి. పాతబస్తీలో సుందరీకరణ, సెంట్రల్ లైటింగ్ పనులు చేపట్టాం. చార్మినార్ నుంచి దారుల్–ఉలం స్కూల్ వరకు రోడ్డు వెడల్పు పనులు పూర్తయ్యాయి. హుస్సేనీ ఆలం నుంచి దూద్‌బౌలి వరకు విస్తరణ పనులు జరుగుతున్నాయి. హెరిటేజ్ భవంతుల పూర్వ వైభవం కోసం ఎంత ఖర్చయినా వెనుకాడబోం. ఎస్ఎన్డీపీ ఏ నగరంలోనూ లేదు హైదరాబాద్‌లో రూ.985.45 కోట్లతో వ్యూహాత్మక నాలాల అభివృద్ధి (స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం (ఎస్ఎన్డీపీ)) చేపట్టాం. జీహెచ్ఎంసీ పరిధిలో 35 పనులకు 11 పూర్తిచేశాం. పరిసర మున్సిపాలిటీల్లో 21 పనులకుగాను 2 పూర్తిచేశాం. నగరంలో వందేండ్ల క్రితం నిర్మించిన నాలాలే ఉన్నాయి. పలుచోట్ల నాలాలపై 28వేల మంది పేదలు ఇండ్లు కట్టుకున్నారు. ప్రస్తుతం ఎస్ఎన్డీపీ ఫేజ్–2కు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. పలు కాలనీల్లో గత వర్షాకాలంలో ముంపు సమస్య కొంతమేర తగ్గింది..’’ అని కేటీఆర్ వివరించారు. 9 నెలల్లో పిల్లలు వస్తారు – మీరు రారు! సభలో మొదట సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో మెట్రోరైలు ప్రాజెక్టు వచ్చిందని, కానీ ఇప్పుడు ఆదాయాన్ని మొత్తంగా నిర్వహణ సంస్థకే దోచిపెడుతున్నారని ఆరోపించారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. ‘‘60 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఆమాత్రం చేయలేరా?’’ అని నవ్వుతూ అంటూనే.. ‘‘మాట్లాడితే తొమ్మిది నెలల్లో మేం వస్తాం అంటున్నారు. తొమ్మిది నెలల్లో పిల్లలు వస్తారు. మీరు రారు’’ అని వ్యాఖ్యానించారు. దీనితో సభలో అంతా ఒక్కసారిగా ఘొల్లుమన్నారు. ఇక సంగారెడ్డి మెట్రో ప్రాజెక్టు గురించి జగ్గారెడ్డి అడుగుతున్న విషయాన్ని కేటీఆర్ ప్రసంగం తర్వాత గుర్తుచేయగా నవ్వుతూ.. ‘‘9 నెలల్లో వస్తారుగా.. అప్పుడు చూసుకోండి’’ అని పేర్కొన్నారు. అప్పటికే మైక్ ఆపేయడంతో ఆ మాటలు రికార్డులకు ఎక్కలేదు. ప్రతిపాదనలన్నీ వెనక్కే.. కోటీ 20లక్షల మంది నివసిస్తున్న హైదరాబాద్‌కు నిధులు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం శత్రుదేశంపై పగబట్టినట్టుగా తెలంగాణపై కక్షగట్టి వ్యవహరిస్తోంది. హైదరాబాద్‌లో మెట్రో పొడిగింపు కోసం కేంద్ర ప్రభుత్వ వాటా ఇవ్వాలని కేంద్ర మంత్రిని కలుద్దామంటే అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. అధికారులను పంపించినా సానుకూల స్పందన రాలేదు. ఢిల్లీ మెట్రో అధికారులతో హైదరాబాద్ మెట్రో ఆడిటింగ్ చేయించాం. హైదరాబాద్ ఎయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్ మెట్రోకు కేంద్ర ప్రభుత్వ సాయం కోరితే వయబిలిటీ లేదని, ఇతర కారణాలు చూపుతూ నిధులు కేటాయించడం లేదు. వడ్డించేవాళ్లు మనవాళ్లయితే అన్నట్టుగా కేంద్రం వ్యవహరిస్తోంది. బెంగళూరు మెట్రోకు కేంద్రం 20 శాతం వాటాతోపాటు రూ.29వేల కోట్లకుపైగా సావరిన్ గ్యారెంటీ ఇచ్చింది. చెన్నై మెట్రోకు కేంద్రం వాటా, సావరిన్ గ్యారంటీ కలిపి రూ.58,795 కోట్లు కేటాయించింది. యూపీ లోని ఆరు పట్టణాలకు 20 శాతం వాటాతో పాటు సావరిన్ గ్యారంటీ ఇస్తోంది. – మంత్రి కేటీఆర్ -
కోట్ల వసూళ్లకు పాల్పడుతున్నాడు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం అసెంబ్లీలో పద్దుల గురించి చర్చ సందర్భంగా కాంగ్రెస్ సభ్యులు ధరణికి సంబంధించి లేవనెత్తిన అంశాలపై మంత్రి కేటీఆర్ జోక్యం చేసుకుంటూ రేవంత్‌తో సహవాసంతో సభలోని కాంగ్రెస్ సభ్యులు కూడా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ అరాచకంగా, అడ్డగోలుగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ‘‘ఆయన ఏం భాష మాట్లాడుతున్నాడు? ఒక పార్టీ అధ్యక్షుడు మాట్లాడే భాషేనా అది? ముఖ్యమంత్రి ఎవరు అయితే వారు ప్రగతి భవన్లో ఉంటారు. అది అధికార నివాసం. అలాంటి ప్రగతి భవన్‌ను బాంబులతో పేల్చేస్తానని ఎలా మాట్లాడతాడు? కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి సహచర్యంతో శ్రీధర్‌బాబు సైతం తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నిజానికి శ్రీధర్‌బాబు, భట్టి మంచివారే. కానీ పార్టీలో సహవాస దోషంతో ఇలా తయారయ్యారు. వాళ్ల అధ్యక్షుడు అడ్డగోలుగా మాట్లాడే అలవాటుతో వీళ్లు కూడా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. వాళ్ల అధ్యక్షుడు బ్లాక్మెయిల్ చేసి రూ. కోట్లకు కోట్లు వసూళ్లు చేస్తున్నాడు. ఇందుకోసం కొందరు విశ్రాంత తహసీల్దార్లు, ప్రైవేటు వ్యక్తులతో ఓ దఫ్తర్ (కార్యాలయం)నే తెరిచాడు. చివరకు సమాచార హక్కు చట్టాన్ని కూడా ఆదాయ మార్గంగా మార్చుకున్నాడు. అట్లాంటి వాళ్లకు ధరణితో ఇబ్బందులు అనిపిస్తాయి... సాధారణ ప్రజలకు కాదు. ధరణి రద్దు, ప్రగతి భవన్ పేల్చివేతే మీ విధానామా? ధరణిని రద్దు చేసి లంచాల కోసం రైతులను పీడించిన కాంగ్రెస్ హయాంలోని పద్ధతినే తేవాలనుకుంటున్నారా? ఏ విషయం చెప్పండి’’ అని కేటీఆర్ ప్రశ్నించారు. ధరణిని రద్దు చేయాలంటూ భట్టి, శ్రీధర్‌బాబు చేసిన డిమాండ్‌పై మంత్రి వేముల ప్రశాంతరెడ్డి జోక్యం చేసుకుని, ‘‘మరి మీ అధ్యక్షుడు ప్రగతి భవన్‌ను బాంబులతో పేల్చేస్తానంటున్నాడు. దానిపై సీఎల్పీ వైఖరి ఏమిటో కూడా చెబితే బాగుంటుంది’’ అని పేర్కొన్నారు. లోపాలపుట్ట ధరణి.. దాన్ని రద్దు చేయాలి: భట్టి, శ్రీధర్‌బాబు పేదలను ముప్పుతిప్పలు పెడుతున్న ధరణి పోర్టల్‌ను రద్దు చేయాలని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క, ఆ పార్టీ సభ్యుడు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు డిమాండ్ చేశారు. పద్దులపై చర్చలో భాగంగా వారు ఈ అంశాన్ని ప్రస్తావించారు. భూముల పట్టాకు సంబంధించి గతంలో ఉన్న చాలా కాలమ్స్‌ను తొలగించి ధరణిని తీసుకొచ్చారని, ఇది పేదల తీవ్ర ఇబ్బందిగా మారిందని వారు పేర్కొన్నారు. పట్టా రికార్డుల్లో దశాబ్దాలుగా పేరు ఉన్నప్పటికీ ధరణిలో కాస్తు కాలమ్‌ను తొలగించడంతో చాలా మంది భూమి హక్కులు కోల్పోవాల్సి వచ్చిందన్నారు. ఆ భూములు బడా బాబుల పరమయ్యాయని భట్టి, శ్రీధర్‌బాబు ఆరోపించారు. కొంత భూభా గానికి సంబంధించి ఏదైనా సమస్య ఏర్పడితే మొత్తం సర్వే నంబర్‌నే నిషేధిత జాబితాలో ఉంచుతున్నారని విమర్శించారు. గతంలో అసైన్ చేసిన భూములను కూడా ఇప్పుడు వెనక్కు తీసుకొని వేలం ద్వారా బడాబాబులకు కేటాయిస్తున్నారని శ్రీధర్‌బాబు ఆరోపించారు. ఫార్మాసిటీ కోసం పేదల భూములను ఎకరా రూ. 8 లక్షలకు తీసుకొని రూ. 1.30 కోట్లకు ఎకరం చొప్పున బడా బాబులకు కట్టబెట్టారని ఆరోపించారు. ధరణితో ప్రజల్లో సంతోషం: మంత్రి ప్రశాంత్‌రెడ్డి ధరణి పోర్టల్‌పై కాంగ్రెస్ సభ్యుల ఆరోపణలను మంత్రి ప్రశాంత్‌రెడ్డి తోసిపుచ్చారు. సాధారణ ప్రజలు ధరణితో పూర్తి సంతోషంగా ఉన్నారని, అది అందుబాటులోకి వచ్చిన తర్వాత 24 లక్షల లావాదేవీలు జరిగాయని చెప్పారు. ధరణిని రద్దు చేసి మళ్లీ లంచాల బాగోతం, ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులను ఎందుకు కోరుతున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ తీరుపై ప్రజలే నిర్ణయం తీసుకుంటారన్నారు. అయితే ధరణి బాధలు ఏమిటో క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలిస్తే తెలుస్తాయని, ఓ తహసీల్దార్‌ను హత్య చేసే వరకు సమస్య ఏర్పడిందంటే సమస్య తీవ్రత తెలియడం లేదా? అని భట్టి ప్రశ్నించారు. నిరూపించకుంటే శ్రీధర్‌బాబు క్షమాపణ చెప్పాలి.. శ్రీధర్‌బాబు చేసిన ఆరోపణలను మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. అలా ఎకరం కాదుకదా.. కనీసం ఒక్క గజం ఇచ్చినట్లు నిరూపించాలని, లేనిపక్షంలో శ్రీధర్‌బాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వెంటనే ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్‌ను కోరారు. ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోని శ్రీధర్‌బాబు... ధర విషయంలో తాను చెప్పింది తప్పయితే ఎంతకు ఇచ్చారో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. దీంతో ఆయన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. భూసంబంధిత సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైతే వేరే వ్యవస్థలు పుట్టుకొస్తాయని, ఇది మంచి పరిణామం కాబోదని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. -
బీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభోత్సవానికి కేటీఆర్ గైర్హాజరు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్‌లో బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం మధ్యాహ్నం ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి బీఆర్ఎస్ జాతీయ విధానాన్ని ఆవిష్కరించనున్నారు. అయితే, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి కేటీఆర్ హాజరుకాలేకపోతున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. జపాన్ బిజినెస్ వరల్డ్ లీడర్స్‌తో సమావేశం ఉన్న నేపథ్యంలో కేటీఆర్ ఢిల్లీ పర్యటన రద్దు చేసుకున్నారు. ఈ క్రమంలోనే జపాన్ కంపెనీ బోష్ ఆఫీస్ ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు కేటీఆర్.ఇందుకోసం సీఎం కేసీఆర్ అనుమతి తీసుకున్నారు. ఇదీ చదవండి: KCR BRS: మరో ప్రస్థానం -
పార్లమెంటుకు అంబేడ్కర్ పేరు పెట్టాలి
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీలో కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టాలని అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఈ మేరకు మంగళవారం మంత్రి కేటీఆర్ శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం వల్లే తెలంగాణ వచ్చింది. ఆయన చూపిన బాటలోనే నడుస్తున్నాం. అంబేడ్కర్తత్వాన్ని టీఆర్ఎస్ ఆచరణలో చూపింది. అంబేడ్కర్ లక్ష్యం సమానత్వం. ఆయన భాషా ఆధిపత్యం, ప్రాంతీయ ఆధిపత్యంతోపాటు అన్నిరకాల ఆధిపత్యాలకు వ్యతిరేకంగా పోరాడారు. ఆయనలా సమగ్రంగా సమాజాన్ని అర్థం చేసుకున్నవారు ఎవరూ లేరు. తాను రాసిన రాజ్యాంగం దుర్వినియోగమైతే దాన్ని తానే ముందుగా తగలబెడతానని అంబేడ్కర్ అన్నారు. దేవుడు కోసం గుడి కడితే... దెయ్యాలు ముందే వచ్చి కూర్చుంటే గుడిని ధ్వంసం చేయక తప్పదు. అంబేడ్కర్ కొన్ని కులాలు, వర్గాలకు మాత్రమే ప్రతినిధి కాదు. ఆయన మహాత్ముడితో సరిసమాన వ్యక్తి. అంబేడ్కర్ మహిళలకు కూడా సమాన హక్కులుండాలన్నారన్నారు. ఆ బిల్లు ఆమోదం పొందకపోవడంతో రాజీనామా చేశారన్నారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రతీక పార్లమెంట్. దానికి ఆ పేరు పెట్టడానికి ఇంతకు మించిన వ్యక్తి లేరు. అందుకే అంబేడ్కర్ పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం’అని ఆ తీర్మానంలో కోరారు. ఏకగ్రీవ ఆమోదం కాంగ్రెస్ సభాపక్ష నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ ప్రవేశపెట్టిన తీర్మానానికి పూర్తి మద్దతు ఇస్తున్నామన్నారు. ఈ దేశంలో స్వేచ్ఛ లేదని, ఎవరైనా స్వేచ్ఛగా మాట్లాడితే ఐటీ, ఈడీ దాడులతో భయపెడుతున్నారని ఆరోపించారు. ఈ దేశ సంపద కొన్ని వర్గాలకు మాత్రమే అందుతోందన్నారు. ఈ దేశంలో సోదరభావం లేకుండా పోయిందని ఆరోపించారు. పార్లమెంట్‌కు అంబేడ్కర్ పేరు పెడితే.. ఈ దేశ నిర్మాణం సరిగ్గా సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పంజగుట్టలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎంఐఎం కూడా ఈ తీర్మానానికి మద్దతు తెలిపింది. అనంతరం పార్లమెంటుకు అంబేడ్కర్ పేరు పెట్టాలనే ప్రతిపాదనకు సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. జనవరిలో అంబేడ్కర్ విగ్రహావిష్కరణ తమ తీర్మానానికి మద్దతు తెలిపిన భట్టి, ఇతర నేతలకు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ కూడా ఈ తీర్మానానికి మద్దతు తెలిపితే బాగుండేదన్నారు. పంజగుట్టలో విగ్రహం ఏర్పాటు అంశంపై కేటీఆర్ స్పందిస్తూ... గతంలో విగ్రహాలు పెట్టిన విషయాన్ని తానేమీ కాదనడం లేదని, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అయినా ట్యాంక్‌బండ్ సమీపంలో 125 అడుగుల విగ్రహాన్ని పెడుతున్నామని, ప్రస్తుతం విగ్రహ నిర్మాణం సాగుతోందన్నారు. జనవరిలో ఆ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని చెప్పారు. ఇదీ చదవండి: ఆనాటి తారకరాముడి డైలాగ్‌తో అదరగొట్టిన కేటీఆర్.. అసెంబ్లీలో చప్పట్ల మోత! -
రోడ్లపై రయ్.. రయ్..
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక కార్ల రేసింగ్ ఈవెంట్ ‘ఫార్ములా ఈ– రేసింగ్’(ఈ–ప్రిక్స్)కు ఆతిథ్యం ఇచ్చేందుకు హైదరాబాద్ నగరం సిద్ధమవుతోంది. ఫార్ములా ఈ–చాంపియన్‌షిప్ తొమ్మిదో సీజన్ (2022–23)లో భాగంగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 11వ తేదీన నగరంలో ఈ–రేసింగ్ (సింగిల్ సీట్ ఎలక్ట్రిక్ వాహనాలకు నిర్వహించే పోటీలు) జరగనుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం మేనేజింగ్, ఎగ్జిక్యూటివ్ కమిటీలను ఏర్పాటు చేసింది. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె. తారక రామారావు చైర్మన్‌గా మేనేజింగ్ కమిటీని, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఎంఏయూడీ (అర్వింద్‌కుమార్) చైర్మన్‌గా ఎగ్జిక్యూటివ్ కమిటీని నియమించారు. ఈ మేరకు సోమవారం అర్వింద్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. దేశంలో ఏబీబీ ఎఫ్ఐఏ ఫార్ములా ‘ఈ–రేసింగ్’కు ఆతిథ్యం ఇస్తున్న తొలి నగరంగా హైదరాబాద్ రికార్డు సృష్టించనుంది. 2011 నుంచి 2013 వరకు గ్రేటర్ నోయిడాలోని బుద్ధ్ అంతర్జాతీయ సర్క్యూట్లో ఫార్ములా వన్ రేసు జరిగిన తర్వాత దేశంలో జరగబోయే రెండో అతి పెద్ద రేసింగ్ ఈవెంట్ ఇదే కావడం గమనార్హం. సర్క్యూట్లలో కాదు.. వీధుల్లో రోడ్లపైనే ఫార్ములా వన్ రేసులు ప్రత్యేకంగా నిర్మించిన పర్పస్ బిల్డ్ (తాత్కాలిక) సర్క్యూట్లలో జరుగుతాయి. అయితే ఫార్ములా ఈ–ప్రిక్స్ మాత్రం నగర వీధుల్లోని రోడ్లపైనే జరుగుతాయి. మోటార్ స్పోర్ట్ అభిమానులకు వినోదం పంచడంతో పాటు ఎలక్ట్రిక్ వాహన వినియోగాన్ని ప్రోత్సహించేందుకు వీటిని నిర్వహిస్తున్నారు. వచ్చే ఫిబ్రవరి 11న హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ చుట్టూ నెక్లెస్ రోడ్డులో సచివాలయం కాంప్లెక్స్, లుంబినీ పార్కు మీదుగా ఏర్పాటు చేసిన 2.37 కిలోమీటర్ల ట్రాక్ మీద ఈ–రేసింగ్ సాగనుంది. భారత్ తరఫున బరిలో ‘మహీంద్రా’ విద్యుత్ కార్లతో జరిగే ఈ తొమ్మిదో సీజన్ రేసింగ్ పోటీలకు ఆతిథ్యం ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ సంవత్సరం జనవరిలో ‘ఫార్ములా ఈ’సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. కాగా రేసింగ్ చాంపియన్‌షిప్ క్యాలెండర్‌ను గత జూన్ 29న ఎఫ్ఐఏ (ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి–ఎల్ ఆటోమొబైల్ ) వరల్డ్ మోటార్ స్పోర్ట్స్ కౌన్సిల్ ఆమోదించింది. సుమారు పదేళ్ల క్రితం గ్రేటర్ నోయిడాలోని బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్లో నిర్వహించిన ఫార్ములా వన్ పోటీల ద్వారా ప్రపంచ మోటార్ స్పోర్ట్స్ మ్యాప్‌లోకి భారత్ ప్రవేశించింది. వచ్చే ఏడాది జరిగే ఈ–రేసింగ్ నిర్వహణకు ఆతిథ్యం ఇవ్వడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా రేసింగ్‌కు ఆతిథ్యం ఇస్తున్న 13 నగరాల్లో ఒకటిగా హైదరాబాద్ నిలిచింది. ఈ రేసింగ్‌లో భారత్ నుంచి మహీంద్రా కంపెనీకి చెందిన ‘మహీంద్ర రేసింగ్’జట్టు పోటీ పడుతోంది. మేనేజింగ్ కమిటీలో.. చైర్మన్‌గా మంత్రి కేటీఆర్,సభ్యులుగా మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, మహీంద్రా రేసింగ్ టీమ్ ప్రిన్సిపాల్, సీఈవో దిల్బాగ్ గిల్, ఏస్ అర్బన్ రేస్ ఏండీ అండ్ సీఈవో, ఎఫ్ఐఏ ప్రతినిధి, కమిటీ నిర్ణయించిన ముగ్గురు నిపుణులు లేదా బ్రాండ్ అంబాసిడర్లు, చైర్మన్ నిర్ణయం మేరకు ఇతర సభ్యుడు, మెంబర్ కన్వీనర్‌గా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ ఉంటారు. ఎగ్జిక్యూటివ్ కమిటీలో చైర్మన్‌గా ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (ఎంఏయూడీ), సభ్యులుగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్, జాయింట్ సీపీ ట్రాఫిక్, ఏస్ అర్బన్ గ్రీన్కో గ్రూప్ ఎండీ, అర్బన్ రేస్ నుంచి ఇద్దరు ప్రతినిధులు, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ ప్రాజెక్టు డైరెక్టర్, ఎండీ, జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్, హెచ్ఎండీఏ సీఈ, టీఎస్ఎస్పీడీసీఎల్, ఆర్ అండ్ బీ, జీహెచ్ఎంసీ, వాటర్‌బోర్డు, కలెక్టరేట్ తదితర విభాగా లకు చెందిన అధికారులు ఉంటారు.