రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బందనకల్‌లో బుధవారం గోదావరి జలాలకు పూజలు చేస్తున్న మంత్రి కేటీఆర్
సిరిసిల్ల: రాష్ట్రంలో రైతులను సంఘటితం చేసి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా పనిచేస్తోందని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బందనకల్‌లో బుధవారం గోదావరి జలాలతో నిండిన ఊర చెరువు వద్ద జలహారతి పట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో చేపట్టిన కాళేశ్వరం, సీతారామ, పాలమూరు ఎత్తిపోతల పథకాలతో కోటీ 25 లక్షల ఎకరాలకు సాగు నీరు అందనుందని చెప్పారు. రాష్ట్రంలో జల విప్లవంతో హరిత విప్లవం, నీలి విప్లవం, శ్వేత విప్లవం, పింక్ విప్లవం వస్తుందన్నారు. ఐదు విప్లవాలతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం ధాన్యాగారంగా మారిందని, సారవంతమైన భూములతో దేశానికి ఆదర్శంగా ఉంటామని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని 46 వేల చెరువులను నింపుతామని, దీంతో కరెంటు అవసరం లేకుండా రెండు పంటలు పండుతాయని తెలిపారు. ఇంటింటికీ పాడి గేదెలను అందించే యోచనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
ఆరు మీటర్ల భూగర్భ జలం పెరిగింది
ఏ రాష్ట్రంలో లేని విధంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏడాదిలోనే ఆరు మీటర్ల భూగర్భ జలం పెరిగిందని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలోనే యువ ఐఏఎస్‌లకు శిక్షణ ఇచ్చే ముస్సోరిలో సిరిసిల్ల వాటర్ మేనేజ్‌మెంట్ పాఠ్యాంశమైందని, ఇది గర్వకారణమన్నారు. సిరిసిల్ల మానేరు వాగులో 365 రోజులు నీరు నిల్వ ఉంటుందన్నారు. మేడిగడ్డ నుంచి గోదావరి జలాలు మల్లన్నసాగర్ వరకు రావడం ఒక అద్భుతమని, అది కేసీఆర్ పట్టుదలతోనే సాధ్యమైందన్నారు. సముద్ర మట్టానికి 82 మీటర్ల ఎత్తులో ఉన్న గోదావరి నీటిని 618 మీటర్ల ఎత్తుకు తరలించి రైతుల సాగు నీటి కలను కేసీఆర్ సాకారం చేశారన్నారు.
కాంగ్రెసోళ్లకు సిగ్గు లేదు
కాంగ్రెసోళ్లకు సిగ్గు లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో మంచి పనులు చేస్తే ఓర్వలేరని, ఏది చేసినా వక్రభాష్యం చెబుతున్నారని ఆరోపించారు. ఏ ఒక్కరికీ రైతు బంధు ఎగ్గొట్టే ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. ఈ నెల 13న కాంగ్రెస్ పార్టీ జల దీక్ష చేస్తామని ప్రకటించిందని, కుందేళ్లను చంపి న నక్కలే సంతాప సభ పెట్టినట్లుగా ఉందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. చెరువులు నిండుతుంటే, పంటలు పండుతుంటే కాం గ్రెసోళ్ల కళ్లు మండుతున్నాయని ఆరోపించారు. ఎగువ మానేరును దసరా నాటికి నింపుతామని, మధ్యమానేరుతో పాటు మల్లన్నసాగర్ నుంచి కూడెల్లి వాగు ద్వారా ఎగువ మానేరులోకి గోదావరి జలాలను తరలిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment