కూల్ రూఫ్ విధానంపై కేటీఆర్‌కు వివరిస్తున్న అధికారులు
సాక్షి, హైదరాబాద్: భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో కూల్‌రూఫ్ పాలసీ అమలుకు శ్రీకారం చుడుతున్నట్లు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె. తారక రామారావు తెలిపారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభా వాన్ని నివాస గృహాలు, వాణిజ్య కార్యాలయాలపై తగ్గించేందుకు తీసుకొచ్చిన ‘తెలంగాణ కూల్‌రూఫ్ విధానం 2023–28’ను మంత్రి కేటీఆర్ సోమవారం పురపాలక శాఖ కార్యాలయంలో ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 600 చదరపు గజాలకుపైగా విస్తీర్ణంలో నిర్మించే అపార్ట్‌మెంట్లు, ఇతర వాణిజ్య సముదాయాల్లో కూల్ రూఫ్ పాలసీని తప్పనిసరి చేస్తున్నట్లు తెలిపారు. కూల్‌రూఫ్ పాలసీ ఉంటేనే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చేలా నిబంధనలను మారుస్తామన్నారు. 600 గజాల్లోపు విస్తీర్ణంలో నిర్మించుకొనే ఇళ్లకు కూల్‌రూఫ్ విధానాన్ని ఆప్షన్‌గా ఇస్తున్నట్లు చెప్పారు.
అలాగే ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాలు, డబుల్ బెడ్‌రూం ఇళ్లపై కూల్‌రూఫ్ విధానం అమలు చేస్తామన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, రోడ్లు, ఫుట్‌పాత్‌లు, సైక్లింగ్ ట్రాక్‌లు మొదలైన వాటిని ఈ విధానం ద్వారానే నిర్మించనున్నట్లు వివరించారు.
తెలంగాణ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొనే...
రాష్ట్రంలో దాదాపు 50 శాతం జనాభా పట్టణ ప్రాంతాల్లో నివసిస్తోందని, దేశంలోనే మూడవ అతిపెద్ద పట్టణీకరణ రాష్ట్రంగా ఉన్న తెలంగాణ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కూల్‌రూఫ్ విధానాన్ని అమల్లోకి తెచ్చినట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు.
2030 నాటికి హైదరాబాద్‌లో 200 చదరపు కిలోమీటర్లు, రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో 100 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కూల్ రూఫింగ్ కిందకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరం జీహెచ్‌ఎంసీ పరిధిలో 5 చదరపు కిలోమీటర్ల మేర, ఇతర పట్టణాల్లో 2.5 కిలోమీటర్ల మేర కూల్ రూఫ్‌ను అమలు చేస్తామన్నారు.
పట్టణాల్లో వేడిని తగ్గించాలి..
పట్టణాల్లో జరిగే నిర్మాణాల వల్ల ఉత్పన్నమవుతున్న వేడిని ఎదుర్కోవడానికి వాతావరణ అనుకూలమైన శీతలీకరణ పరిష్కారాలను ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పాతకాలంలో పెంకుటిళ్లు, డంగు సున్నం, మట్టి గోడలు వేడిని ఆపాయని... ప్రస్తుతం భవన నిర్మాణాల్లో విచ్చలవిడిగా వినియోగిస్తున్న ఇనుము, స్టీల్, ఇతర ఖనిజాలతో వేడి పెరిగిందన్నారు. భవిష్యత్ వాతావరణ సవాళ్లను పరిష్కరించే దిశలో రూఫ్ కూలింగ్ పాలసీ తప్పనసరని ఆయన చెప్పారు.
న్యూయార్క్ లక్ష్యంకన్నా మిన్నగా...
విదేశాల్లోకన్నా అధిక విస్తీర్ణంలో తెలంగాణలో కూల్‌రూఫ్ పాలసీని తీసుకురావాలని నిర్ణయించినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. అమెరికాలోని న్యూయార్క్ కూల్‌రూఫ్ నిర్దేశిత లక్ష్యం 10 లక్షల చదరపు అడుగులు లేదా 0.1 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అయితే కేవలం హైదరాబాద్, ఔటర్ రింగ్‌రోడ్డు కింద 1,000 చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువ వైశాల్యం ఉందని, ఔటర్ లోపల 20 శాతం ప్రాంతాన్ని కూల్ రూఫింగ్ కిందకు తీసుకురానున్నట్లు చెప్పారు.
పెట్టుబడి తిరిగి వచ్చేస్తుంది..
కూల్‌రూఫ్ విధానం అమలు కోసం చదరపు మీటర్‌కు రూ. 300 మాత్రమే ఖర్చవుతుందని మంత్రి కేటీఆర్ వివరించారు. ఈ విధానం వల్ల ఏసీ ఖర్చులు, కరెంట్ బిల్లులు తగ్గే అవకాశం ఉన్నందున పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందన్నారు. తన ఇంటి మీద కూల్ రూఫింగ్ కోసం పెయింటింగ్ చేసినట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. కూల్ రూఫ్ కోసం ముందుకొచ్చే వారికి శిక్షణ అందించేందుకు పురపాలక శాఖ సిద్ధంగా ఉందన్నారు.
త్వరలో ‘మన నగరం’అనే కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించినట్లు చెప్పిన మంత్రి కేటీఆర్... దీనిలో భాగంగా భవన నిర్మాణ వ్యర్థాలను సేకరించి వాటిని కూల్ రూఫింగ్‌కు దోహదపడే సామగ్రిగా మార్చి ఉపయోగించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, జీహెచ్‌ఎంసీ మేయర్ జి. విజయలక్ష్మి, కూల్‌రూఫ్ నిపుణులు, ప్రొఫెసర్ విశాల్ గార్గ్, సీఆర్‌ఆర్‌సీ సభ్యురాలు నీతూ జైన్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, సీడీఏఎం సత్యనారాయణ, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment