కామారెడ్డిలో జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న కేటీఆర్
సాక్షి, కామారెడ్డి: పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆర్‌ఎస్‌ఎస్ మనిషి అని, ఆయన ఎన్నికల తర్వాత పది పన్నెండు మంది ఎమ్మెల్యేలతో కలసి బీజేపీలో చేరడం ఖాయమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ‘‘ఓటుకు కోట్లు కేసులో అరెస్టైన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు సీటుకు రేటు కడుతున్నాడు. అందుకే వాళ్ల పార్టీ నేతలే ఆయనను రేటెంతరెడ్డి అంటున్నారు..’’ అని విమర్శించారు. శనివారం కేటీఆర్ కామారెడ్డి జిల్లా కేంద్రంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఇక్కడి డిగ్రీ కాలేజీ మైదానంలో జరిగిన కామారెడ్డి నియోజకవర్గ బీఆర్‌ఎస్ కార్య కర్తల సమావేశంలో మాట్లాడారు.
దక్షిణ భారత దేశం నుంచి వరుసగా మూడుసార్లు ముఖ్యమంత్రి ఎవరూ కాలేదని.. సీఎం కేసీఆర్ మాత్రం ఈసారితో కచ్చితంగా హ్యాట్రిక్ సాధిస్తారని కేటీఆర్ పేర్కొన్నారు. దేశమంతటా తెలంగాణ గురించే చర్చ నడుస్తోందని, ఇక్కడ బీఆర్‌ఎస్ విజయం కోసం మహారాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఆ రాష్ట్రంలో చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, జెడ్పీ మెంబర్లు బీఆర్‌ఎస్‌తో కలసి రావడానికి సిద్ధంగా ఉన్నారని.. తెలంగాణలో గెలి చాక మహారాష్ట్రలోనూ గులాబీ జెండా ఎగుర వేద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మహా రాష్ట్రలో సాధించే విజయంతో కేంద్రంలో కీలక భూమిక పోషిస్తామని పేర్కొన్నారు.
దేశ రాజకీయాలకు దిక్సూచిగా..
సీఎం కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా సంచలనమే నని కేటీఆర్ చెప్పారు. ‘‘మొదట సిద్దిపేటలో పోటీ చేసిన ఆయన టీఆర్‌ఎస్‌ను స్థాపించారు. కరీంనగర్‌లో పోటీచేసి ఢిల్లీకి తెలంగాణవాదాన్ని తీసుకువెళ్లారు. మహబూబ్‌నగర్‌లో పోటీ చేసి దేశాన్ని ఒప్పించి రాష్ట్రం సాధించారు. గజ్వేల్‌లో పోటీచేసి ఉద్యమ తెలంగాణను ఉజ్వల తెలంగాణగా తీర్చిదిద్దారు. పదేళ్ల స్వల్పకాలంలోనే వందేళ్ల ప్రగతి సాధించారు. కామారెడ్డిలో భారీ మెజారిటీతో విజయం ద్వారా హ్యాట్రిక్ సీఎంగా రికార్డు సాధించి, దేశ రాజకీయాలకు దిక్సూచిగా నిలుస్తారు..’’ అని పేర్కొన్నారు.
కామారెడ్డిలో కేసీఆర్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయగానే కాంగ్రెస్, బీజేపీల నాయకులు వణికిపోయి పోటీచేయడంకన్నా ఇంట్లో పడుకోవడమే మంచిదనే భావనతో ఉన్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ను దేశంలోనే అఖండ మెజారిటీతో గెలిపించడం ద్వారా సరికొత్త చరిత్ర లిఖించాలని పిలుపునిచ్చారు. కర్ణాటక నుంచి కాంగ్రెస్ వాళ్లకు అడ్డగోలుగా డబ్బులు వస్తాయని, అదానీ నుంచి బీజేపీ వాళ్లకు డబ్బులు వస్తున్నాయని.. బీఆర్‌ఎస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సూచించారు.
నామినేటెడ్ పదవులు ఇస్తాం.
రకరకాల సమీకరణాల దృష్ట్యా టికెట్ల కేటాయింపులో ముదిరాజ్‌లు, మరికొన్ని కులాలకు అవకాశం దక్కలేదని.. అయితే వారికి ఎమ్మెల్సీలుగా, చైర్మన్లుగా అవకాశం ఇస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్ పోటీచేసే కామారెడ్డి నియోజకవర్గంలోని గ్రామాల వారీగా, పట్టణాల్లో వార్డుల వారీగా ప్రత్యేక మేనిఫెస్టోలు రూపొందించి, అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.
కామారెడ్డి నియోజకవర్గానికి తనతోపాటు మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్‌లు ఇన్‌చార్జులుగా ఉంటారని తెలిపారు. ఏ ఊరికి ఏం కావాలో నివేదికలు రూపొందించి అప్పగించాలన్నారు. సభలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎంపీ బీబీ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment