తంగళ్లపల్లి రోడ్ షోకు హాజరైన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్
సిరిసిల్ల: బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి రాగానే దళితులు, గిరిజనులకు ఇచ్చిన అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు ఇస్తామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.తారక రామారావు హామీ ఇచ్చారు. అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు వస్తే.. వాటిని అమ్ముకోవచ్చని, పిల్లలకు ఇచ్చుకోవచ్చని, బ్యాంకుల్లో కుదువపెట్టుకోవచ్చని చెప్పారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి, చందుర్తి, కోనరావుపేట, వేములవాడ, తంగళ్లపల్లి మండల కేంద్రాల్లో ఆయన రోడ్‌షోలు నిర్వహించి ఎన్నికల ప్రచారం చేశారు.
‘‘దరిద్రానికి నేస్తం కాంగ్రెస్ హస్తం. వారిని నమ్ముకుంటే నష్టపోయేది తెలంగాణ సమాజమే. గ్యారంటీ లేని కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ఇస్తుంది. రేవంత్‌రెడ్డి ఎప్పుడు జైలుకు పోతాడో ఆయనకే తెలియదు. 24 గంటలు కరెంట్ ఇచ్చే కేసీఆర్ కావాలా.. మూడు గంటల కరెంట్ అంటున్న కాంగ్రెస్ కావాలా తేల్చుకోవాలి. ఎన్నికలప్పుడు ఆగం కావొద్దు. ఆలోచించి ఓటేయాలి’’అని కేటీఆర్ కోరారు.
ఆరున్నరేళ్ల పాలనలో ఎంతో చేశాం..
రాష్ట్రాన్ని కేసీఆర్ దేశానికే ఆదర్శవంతంగా చేశారని కేటీఆర్ చెప్పారు. తమ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో రెండేళ్లు కరోనాతో, మరో ఏడాది సమయం లోక్‌సభ, ఇతర ఎన్నికల కోడ్‌తో వృధా అయిందన్నారు. పక్కాగా పాలన సాగినది ఆరున్నరేళ్లేనని, ఇంత తక్కువ సమయంలోనే రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశామని చెప్పారు. బీఆర్‌ఎస్ మళ్లీ గెలిస్తే.. రేషన్‌కార్డులు ఇస్తామని, పెన్షన్లు పెంపు, 93 లక్షల కుటుంబాలకు బీమా, రేషన్‌కార్డులపై సన్నబియ్యం వంటివి అమలు చేస్తామని హామీ ఇచ్చారు. రైతుబంధును రూ.16 వేలకు పెంచుతామని, వంటగ్యాస్ సిలిండర్‌ను రూ.400కే అందిస్తామని ప్రకటించారు. సిరిసిల్ల ప్రాంతంలో 370 ఎకరాల్లో ఆక్వా హబ్ వస్తుందని, దీంతో ఉద్యోగాలు వస్తాయని చెప్పారు.
బాధ్యతలు పెరిగాయి
‘‘ప్రతి ఊరికి, ప్రతి ఇంటికి రావాలని ప్రతి ఒక్కరిని కలవాలని నాకు ఉంటుంది. కానీ బాధ్యతలు పెరిగాయి. మంత్రిగా, బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రాష్ట్రమంతటా తిరగాల్సి వస్తుంది. మీరే చూస్తున్నారు. నేను రోజూ ఎన్ని ప్రాంతాల్లో, ఎన్ని సభల్లో పాల్గొంటున్నానో. మిమ్మల్ని కలవలేక పోతున్నందుకు బాధగా ఉంది..’’అని తంగళ్లపల్లి రోడ్‌షోలో కేటీఆర్ పేర్కొన్నారు. మీ ఆశీర్వాదంతో గెలిచాక ఎలాంటి తలవంపులు తేలేదని, సిరిసిల్ల ఎమ్మెల్యేగా గర్వపడేలా పనిచేశానని చెప్పారు. ఈ రోడ్‌షోలలో వేములవాడ బీఆర్‌ఎస్ అభ్యర్థి చెల్మెడ లక్ష్మీనర్సింహరావు, జెడ్పీ చైర్‌పర్సన్ న్యాలకొండ అరుణ, ఉమ్మడి జిల్లా మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment