సాక్షి ప్రతినిధి, వరంగల్: దేశంలో, రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దివాళాకోరు రాజకీయాలకు పాల్పడుతున్నాయని.. పచ్చటి తెలంగాణను విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కె.తారక రామారావు మండిపడ్డారు. ఆ రెండు పార్టీలు ప్రజల బాగోగులను ఏనాడూ పట్టించుకోలేదని.. అంబానీలు, అదానీలకు ఊడిగం చేయడంలోనే మునిగిపోయాయని ఆరోపించారు. దేశాన్ని, రాష్ట్రాన్ని ఎక్కువకాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ.. కరువు, కరెంటు కోతలు, దారిద్య్రాన్ని మిగిల్చిందని విమర్శించారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అరాచకపాలనను ప్రశ్నిస్తే దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. సోమవారం హనుమకొండ జిల్లా వేలేరు మండలం సోడాషపల్లిలో సుమారు రూ.152 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం సోడాషపల్లి క్రాస్‌రోడ్‌లో నిర్వహించిన రైతు కృతజ్ఞత సభలో ప్రసంగించారు. కేటీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే..
‘‘కొందరు రాజకీయ నిరుద్యోగులు పనికిమాలిన పాదయాత్రలు చేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఒక్క చాన్స్ ఇవ్వండి అని పీసీసీ అధ్యక్షుడు అడుక్కుంటున్నాడు. మీ దిక్కుమాలిన పార్టీకి ప్రజలు 10 చాన్సులు ఇచ్చారు. ఏం చేశారు? గుడ్డి గుర్రాల పళ్లు తోమారా? కరెంట్, సాగు, తాగునీరు ఇవ్వలేదు. ఇప్పుడేమో ఎగతాళిగా మాట్లాడుతూ.. ఒక్క చాన్స్ ఇవ్వండి అని అడుక్కుంటే మీకు ఓటెయ్యాలా? రేవంత్‌రెడ్డి రెచ్చగొట్టే మాటలను ఎవరూ నమ్మరు.
మతం పేరుతో మంటపెడ్తున్న బీజేపీ
బీజేపీ మతం పేరుతో మంటలు రేపుతూ, కులం పేరిట కుంపట్లు పెడుతూ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తోంది. కేంద్రంలో అరాచక పాలన సాగిస్తున్న బీజేపీని విమర్శిస్తే దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తున్నారు. ఇలాంటి దాడులకు భయపడేది లేదు. ఎందాకైనా పోరాడుతాం. అన్నింటి ధరలు పెంచి ప్రజలపై భారం మోపినందుకు మోదీని దేవుడని అనాలా? బండి సంజయ్ ఏం మాట్లాడుతాడో ఎవరికీ అర్థం కాదు. కిషన్‌రెడ్డికి మెదడు మోకాళ్లలో ఉందో, అరికాళ్లలో ఉందో అర్థం కాదు.
ప్రజలంతా మా కుటుంబమే..
కేసీఆర్‌ను విమర్శించేందుకు విపక్షాలకు ఏ కారణమూ దొరకక కుటుంబ పాలన అని విమర్శలు చేస్తున్నారు. బరాబర్ చెప్తున్నా.. మాది కుటుంబ పాలనే.. నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలంతా మా కుటుంబ సభ్యులే. ప్రతి కుటుంబంలో కేసీఆర్ భాగస్వామే. 65లక్షల మందికి పెట్టుబడి సాయం ఇచ్చి రైతులందరికీ పెద్దన్న అయ్యారు. 45లక్షల మందికి ఆసరా పెన్షన్లతో వృద్ధులను కడుపులో పెట్టుకున్నారు. 12 లక్షల మందికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ఇచ్చి పేదింటి ఆడబిడ్డలకు మేనమామ అయ్యారు.
ఇందులో కులం పంచాయతీ లేదు. మతం పిచ్చి లేదు. జనహితమే మా అభిమతంగా పని చేస్తున్నాం. పల్లె ప్రగతి ద్వారా గ్రామాలు, పట్టణాలు బాగు పడుతున్నాయి. సీఎం కేసీఆర్ ముందు చూపుతో పంజాబ్, హరియాణాలతో తెలంగాణ రైతులు పోటీ పడుతున్నారు..’’అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమాల్లో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ఎంపీలు పసునూరి దయాకర్, మాలోతు కవిత, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు టి.రాజయ్య, దాస్యం వినయభాస్కర్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, అరూరి రమేష్, వొడితెల సతీశ్‌కుమార్, శంకర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
నిందితుడు సైఫ్ అయినా.. సంజయ్ అయినా వదలం..
పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి మృతిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం, పార్టీపరంగా ప్రీతి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు.
కాలేజీలో జరిగిన ర్యాగింగ్ వల్ల మనస్తాపానికి గురై డాక్టర్ ప్రీతి చనిపోవడం చాలా బాధాకరమని.. కానీ ఈ విషయాన్ని కొందరు అనవసరంగా రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘నిందితులు ఎవరైనా, ఎంతటివారైనా వదిలేది లేదు. నిందితుడు సైఫ్ అయినా.. సంజయ్ అయినా వదిలిపెట్టబోం..’’అని వ్యాఖ్యానించారు.
వాళ్లవి దివాళాకోరు రాజకీయాలు
Published Tue, Feb 28 2023 1:27 AM | Last Updated on Tue, Feb 28 2023 1:27 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment