శుక్రవారం సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో జరిగిన సభలో మాట్లాడుతున్న కేటీఆర్ ; సభకు హాజరైన జనం
సాక్షి, సిరిసిల్ల: కాంగ్రెస్ పవర్ కట్ అయితేనే తెలంగాణకు కరెంటు వచ్చిందని మంత్రి కె.తారకరామారావు అన్నారు. నాటి చీకటి రోజులను గుర్తుకు తెచ్చుకుని.. ఆలోచించి ఓటెయ్యాలని ఆయన ప్రజలకు విజ్ఙప్తి చేశారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో బహిరంగ సభలో, గంభీరావుపేటలో రోడ్ షోలో కేటీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో ఆరు గంటలు కూడా కరెంటు ఇవ్వలేదన్నారు. అప్పుడు కరెంటు ఉంటే వార్త, ఇప్పుడు కరెంటు పోతే వార్త అవుతోందని చెప్పారు.
సోనియాగాంధీ వల్లే తెలంగాణకు కరెంటు వచ్చిందని కాంగ్రెసోళ్లు నీతిలేని కూతలు కూస్తున్నారని, అదే నిజమైతే వాళ్లు అధికారంలో ఉన్న కర్నాటక, పంజాబ్ రాష్ట్రాల్లో ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. కేసీఆర్‌ది కుటుంబ పాలన అంటూ రాహుల్ చేసిన విమర్శలపై స్పందిస్తూ.. ‘కాంగ్రెస్‌లో మోతీలాల్ నెహ్రూ నుంచి రాహుల్‌గాంధీ దాకా అందరూ ఉంటే తప్పులేదు కానీ కేసీఆర్ కుటుంబం ఉండొద్దా? ఎన్టీఆర్ మనమలు, మనమరాళ్లు, చంద్రబాబు కొడుకు ఎమ్మెల్యే కాకుండానే మంత్రి కావొచ్చు.. కానీ మేం రాజకీయాల్లో ఉండొద్దా?’అని ప్రశ్నించారు. ప్రజలు గెలిపిస్తేనే తాము రాజకీయాల్లో ఉన్నామని, పనిచేయకపోతే ఎందుకు గెలిపిస్తరని కేటీఆర్ ప్రశ్నించారు.
సింహం సింగిల్‌గానే..
‘ఒక్క సీఎం కేసీఆర్‌ను ఎదుర్కొనేందుకు అందరూ ఒక్కటవుతున్నరు. కాంగ్రెస్, టీడీపీ, కోదండరాం, సీపీఐ ఒక్కటై ఐదారు కండువాలు కప్పుకొని వస్తున్నరు. వాళ్లను చూసిన జనం సంక్రాంతికి గదరా గంగిరెద్దులు వచ్చేది గిప్పుడెందుకు అని ముచ్చట్లు పెడున్నారు’ అని కె.తారకరామారావు ఎద్దేవా చేశా>రు. నలుగురైదురుగు కలసి ఒక్కటవుతున్నారంటే అది మన బలమా? కాదా? రాహుల్‌గాంధీ, చంద్రబాబు, మోదీ, మాయావతి ఇట్లా ఢిల్లీ, యూపీ, అమరావతి నుంచి వచ్చేవాళ్లు అందరూ టూరిస్టులే. ఎన్నికలప్పుడు వచ్చి పోయేవాళ్లే.. మిగిలేది పక్కా లోకల్ మనిషి కేసీఆర్ మాత్రమే’అని వ్యాఖ్యానించారు. సింహం సింగిల్‌గానే వస్తుందన్నారు. గుంపులుగా వచ్చేవారెవరో మీకే తెలుసని చెప్పారు.
మోదీ చుట్టపు చూపోడే ..
‘తెలంగాణకు చుట్టపుచూపుగా వచ్చిన ప్రధాని నరేం ద్ర మోదీ.. తెలంగాణలో కరెంటు వస్తలేదు. కనబడుతలేదు అని నిజామాబాద్‌లో అన్నారు.. హెలికాప్టర్‌లో తిరిగితే కనబడదు. ముట్టుకొని చూడు నీకే కనబడుతది’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
పని బాగుంటే లక్ష మెజార్టీ ఇవ్వండి
‘కేసీఆర్‌ను గద్దె దించేదాక సిపాయి ఉత్తరకుమార్‌రెడ్డి గడ్డం తీసుకోడట. దాంతో మనకు పోయేదేముంది? గడ్డం పెంచేటోడు గబ్బర్‌సింగ్ అయితడా. కాంగ్రెసోళ్లు ఇంటి కిరాయి కడుతాం, బాసన్లు తోముతాం, డైపర్లు మార్చుతాం అంటూ వస్తున్నరు. వాళ్లు మామూలోళ్లు కాదు’అని కేటీఆర్ అన్నారు. బడిపిల్లలకు ఏడాదికోసారి పరీక్షలు వచ్చినట్లు, తమకు ఐదేళ్లకోసారి పరీక్ష వస్తుందని, ఈ సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని ఓటర్లను కోరారు. సొల్లు మాటలను నమ్మి ఆగం అయితే 50 ఏళ్లు వెనక్కి వెళతారని చెప్పారు. ‘కాంగ్రెస్‌కు 60 ఏళ్లు అధికారం ఇచ్చారు. నాలుగేళ్లు మాకు అవకాశం ఇచ్చారు. మా పనితీరు బాగుంటే లక్ష మెజార్టీతో గెలిపించండి. అభివృద్ధి చేయకపోతే డిపాజిట్ గల్లంతయ్యేలా తీర్పునివ్వండి’ అని కేటీఆర్ కోరారు.
నాది లోకలే..
‘సిరిసిల్లలో పోటీ చేయడానికి నేను లోకల్ కాదట.. సోనియా ఈదేశానికి లోకలా? ఆమెను నెత్తిమీద పెట్టుకుని ఊరేగించాలా?’ అని కేటీఆర్ అన్నారు. పదేళ్లు ఎమ్మెల్యేగా పనిచేశాక కూడా అవే మాటలా అని ప్రశ్నించారు. తన తాతది ముస్తాబాద్ మండలం మోహినికుంట అని, నర్మాల ఎగువమానేరు ప్రాజెక్టు భూములు కోల్పోయిన నిర్వాసితులమేనని కేటీఆర్ అన్నారు. నాన్‌లోకల్ అని మాట్లాడుతున్న వాళ్లు బతుకుదెరువు కోసం ఎలా హైదరాబాద్‌లో ఉంటున్నారో.. తాము కూడా హైదరాబాద్ వెళ్లామన్నారు.
కూటమిని బొందపెట్టండి
కాంగ్రెస్ సొల్లు కబుర్లు నమ్మొద్దు
సీల్డ్ కవర్ సీఎంలు మనకొద్దు
మోమిన్‌పేట రోడ్ షోలో కేటీఆర్
మోమిన్‌పేట: తెలంగాణ అభివృద్ధి చెందకుండా అడ్డుపడుతున్న ఏపీ సీఎం చంద్రబాబును కాంగ్రెస్ పార్టీ భుజాలపై మోస్తోందని, కూటమి పేరుతో ఓట్లడుగుతున్న ఆ పార్టీలను బొంద పెట్టాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. వికారాబాద్ జిల్లా మోమిన్‌పేటలో శుక్రవారం రాత్రి రోడ్‌షోలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే వరకు గడ్డం తీయనని శపథం చేసిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాటలు నమ్మొద్దన్నారు. గడ్డం పెంచుకున్న ప్రతిఒక్కరూ గబ్బర్‌సింగ్ కాలేరని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్సోళ్ల సొల్లు మాటలకు జనం నవ్వుకుంటున్నారని తెలిపారు.
చంద్రబాబు 30 లేఖలు రాశారు
వికారాబాద్ నియోజకవర్గంలోని లక్ష ఎకరాలకు సాగు నీరిచ్చేందుకు పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని తీసుకువస్తే..దీన్ని అడ్డుకునేందుకు చంద్రబాబు కేంద్రానికి 30 లేఖలు రాశారన్నారు. ఎవరాపినా జిల్లాకు సాగునీరు తెచ్చే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు. ఉత్తరాలు రాసి నీళ్లను అడ్డుకున్న బాబును ఆయనతో జతకట్టిన కాంగ్రెస్‌ను ఓటు ద్వారా తరిమికొట్టాలని సూచించారు. రాష్ట్రంలో నేడు 24గంటలు విద్యుత్ సరఫరా చేస్తుంటే.. ప్రధాని నరేంద్రమోదీ కరెంటు లేదనడం విడ్డూరంగా ఉందన్నారు.
రాష్ట్రంలో ఎక్కడైనా..ఎప్పుడైనా విద్యుత్ తీగలను పట్టుకొని చూడాలని..అప్పుడే సరఫరా ఉందా లేదా అనేది తెలుస్తుందని చెప్పారు. ఒక్క కేసీఆర్‌ను ఎదిరించడానికి దేశంలోని పహిల్వాన్‌లందరూ వస్తున్నారని, ఎంతమంది వచ్చినా..అధికారంలోకి వచ్చేది టీఆర్‌ఎస్ పార్టీయేనని ధీమా వ్యక్తం చేశారు. సీల్డు కవర్ సీఎంలు మనకొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలన్న వారు చేతులు ఎత్తాలని కేటీఆర్ పేర్కొనగా.. అక్కడున్న వారంతా చేతులు ఎత్తారు. మొండి చేతులు కాదు పిడికిలి బిగించి చెప్పాలని..ఇప్పటికే మొండి చేతులతో మోసపోయామని చమత్కరిస్తూ ప్రజలను ఉత్తేజపరిచారు.
మోమిన్‌పేట రోడ్‌షోలో మాట్లాడుతున్న కేటీఆర్
Comments
Please login to add a commentAdd a comment