సిరిసిల్ల రోడ్‌షోలో మాట్లాడుతున్న కేటీఆర్
సాక్షి, సిరిసిల్ల : కారు పెట్టే కూతతో కూటమి గూబ గుయ్యిమనాలని మంత్రి కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఢిల్లీ గులాములు కావాలా? తెలంగాణ గులాబీలు కావాలో తేల్చుకోవాలని కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంతోపాటు వేములవాడలో ప్రచా రానికి చివరిరోజైన బుధవారం నిర్వహించిన రోడ్‌షోలో కేటీఆర్ మాట్లాడారు. ‘తెలంగాణలో ఎన్నికల ఫలితం బట్టే రేపు ఢిల్లీ గద్దె మీద కూర్చునే వ్యక్తి కూడా ఇక్కడి నుంచే నిర్ణయమవుతుంది. ఈ ఫలితానికి రాహుల్, చంద్రబాబు, మోదీలు గజగజ వణకాలి’అని పేర్కొన్నారు.
‘ఒక్క కేసీఆర్‌ను ఎదుర్కోవడానికి నలుగురైదురు ఒక్కటై వస్తున్నరు. ప్రధాని మోదీ పచ్చి ఝూటా మనిషి. రాహుల్ వచ్చి అడ్డం పొడుగు మాట్లాడుతుండు. ఎమర్జెన్సీ పెట్టినోళ్లు మనకు ప్రజాస్వామ్యం మీద పాఠాలు చెబుతుండ్రు. డిసెంబర్ 11 తర్వాత రాహుల్ వీణ, బాబు ఫిడేల్ వాయించుకోవాల్సిందే’అన్నారు. కేసీఆర్ నన్ను మం త్రిని చేసి చేనేత, జౌళి శాఖ తనకే అప్పగించార ని తెలిపారు. బతుకమ్మ చీరలు, ప్రభుత్వ ఆర్డర్లతో సిరిసిల్లలో నేతన్నల ఆత్మహత్యలు ఆగాయన్నారు. టీఆర్‌ఎస్ పాలనలో 80 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చామని, 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నా రు.
సర్వేలతో ఆగం జేస్తుండ్రు
కాంగ్రేసోళ్ల డైలాగుల్లో కొత్తదనం ఏమీ లేదని కేటీఆర్ విమర్శించారు. ‘పేపరు చూడంగనే పాసిపోయిన ముఖాలే కనబడుతున్నయి. రాహుల్ సీట్లు, బాబు నోట్లిచ్చినా ఓట్లు మాత్రం టీఆర్‌ఎస్‌కే’అని చెప్పారు. ‘జానారెడ్డి, ఉత్తమ్, రేవంత్, అరుణ వారి నియోజవర్గాల గడప కూడా దాటుతలేరు. కాంగ్రెస్‌లో పోటుగాళ్లనుకునేటోళ్లకే దిక్కులేదు. ఈ మధ్యకాలం లో సర్వేలని అందర్నీ ఆగం జేస్తున్నరు. నేను కూడా 70 నియోజకవర్గాలు తిరిగిన, సెంచరీ కొట్టుడు ఖాయం. అందరూ తట్ట, బుట్టా కట్టుకుని పోవుడు పక్కా’అని కేటీఆర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment