సాక్షి, హైదరాబాద్ : ఎన్నికల తరుణంలో ప్రజల దృష్టిని మరల్చేందుకు మహాకూటమి నేతలు చిల్లర వ్యూహాలకు తెరలేపుతున్నారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రజలు టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తున్నారని తెలిసి చివరగా సర్వేల పేరిట మైండ్ గేమ్ ఆడుతున్నారని ఆరోపించారు. బుధవారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. ‘లగడపాటి రాజగోపాల్, నేను వాట్సాప్‌లో ఎన్నికలపై మెసెజ్‌లు పంపుకున్నాం. నవంబర్ 20న టీఆర్‌ఎస్‌కు 65 నుంచి 70 సీట్లు వస్తాయని అప్పుడు నాకు మెసేజ్ పెట్టారు. అదే విషయాన్ని చంద్రబాబుకు పంపానని తెలిపారు. అయితే వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉందని, టీఆర్‌ఎస్‌కు ప్రజల్లో ఆదరణ ఉందని చెప్పాను. నవంబర్ 20 తర్వాత రాజగోపాల్ ఎలాంటి సర్వేలు చేయలేదు. రెండు పత్రికలతో కలసి మైండ్‌గేమ్ ఆడుతున్నారు. గత ఎన్నికల్లో ఏపీలో ఇలాంటివే చేశారు. ఇప్పుడూ అదే చేస్తున్నారు. గోబెల్స్‌కు చంద్రబాబు తమ్ముడిలాంటి వారు. ఓటమి భయంతో సర్వేల పేరుతో ఏదో చేయాలని చూస్తున్నారు. రాజగోపాల్ చిలకజోస్యాలు చెల్లవు. ఆయన జోస్యం చెప్పాలనుకుంటే రెండు చిలుకలు పంపిస్తాం. ఇప్పటికైనా ఆయన చిల్లర పనులు ఆపాలి.
ప్రచారాన్ని అడ్డుకుంటారా..?
కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్థి చేసిన దాన్ని ఎవరూ సమర్థించొద్దు. ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకుంటానని ఆయన ప్రకటించారు. రాహుల్‌గాంధీ విషయంలో మేం అలాగే ప్రకటిస్తే ఎలా ఉంటుంది. ఆ అంశంపై ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. మాది ఆపద్ధర్మ ప్రభుత్వం. ఆ అంశంతో సంబంధం లేదు. హైకోర్టు వ్యాఖ్యలు న్యాయస్థానం అభిప్రాయం. రాహుల్‌గాంధీకి ఏ విషయంపైనా అవగాహన లేదు. కుంజలాన్ ప్రాజెక్టును కుంభకర్ణ ప్రాజెక్టు అంటున్నారు. నేను కేసీఆర్ కొడుకుగానే రాజకీయాల్లోకి వచ్చినా.. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఇక్కడి దాకా చేరుకున్నా. రాహుల్ పేరులో గాంధీ అనే తోక తీసేస్తే ఆయన ఏంటి? ప్రజలు, దేశం కోసం ఆయన ఏ ఉద్యమాలు చేశారు. ఎన్నికల్లో మహాకూటమి, రాహుల్ ఇచ్చిన హామీలు విచిత్రంగా ఉన్నాయి. డబుల్ బెడ్రూం ఇళ్లకు ఓసారి ఉచి త సాయం అంటారు.. మళ్లీ రుణం అంటారు. రూ.2 లక్షల రుణమాఫీ అంటారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటక, పంజాబ్‌లో ఎందుకు చేయట్లేదు.
బీజేపీకి ఒక్క సీటు రాదు..
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకున్న జీఎస్టీని మేం సమర్థించాం. నోట్ల రద్దుతో ప్రజలకు మేలు జరుగుతుందని భావించాం. అదేమీ జరగలేదు. రాజ్యసభ చైర్మన్ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీ అభ్యర్థి కాబట్టే బీజేడీకి మద్దతిచ్చాం. తెలుగు వ్యక్తి కాబట్టి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు తెలిపాం. అంతేతప్ప బీజేపీతో మాకు ఎలాంటి సంబంధంలేదు. రాష్ట్రంలో బీజేపీ లేదు. మా ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్. అందుకే ఆ పార్టీని లక్ష్యంగా చేసుకుని మా రాజకీయ వ్యూహం ఉంటోంది. బీజేపీకి రాష్ట్రంలో ఒక్క సీటు రాదు. డిసెంబర్ 11 తర్వాత ఏదైనా జరగొచ్చు. లోక్‌సభ ఎన్నికలకు సమయం ఉంది. మా వ్యూహం మాకు ఉంది. దేశ రాజకీయాల్లో ఏన్నో మార్పులు వస్తాయి. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటయ్యాక లోక్‌సభ ఎన్నికలకు 3 నెలల సమయం ఉంటుంది. అప్పుడు టీఆర్‌ఎస్ పాత్ర ఎలా ఉంటుందనేది చూడొచ్చు.
కేసీఆర్ వెంటే పేదలు..
స్వీయ అస్థిత్వం కోసం ఏర్పడ్డ తెలంగాణ.. అభివృద్ధి దిశగా సాగుతోంది. సీఎం కేసీఆర్ పరిపాలనలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. సాగునీరు, కరెంటు, సంక్షేమంలో అత్యుత్తమ విజయాలను నమోదు చేశాం. పేదలు కేసీఆర్ వెంటే ఉన్నారు. మహాకూటమి, ఇతర ప్రత్యర్థి పార్టీలకు ఇవి కన్పించట్లేదు. కేసీఆర్ శరీరంపై, భాషపై, శరీరభాషపై ఎన్నో విమర్శలు వచ్చాయి. కేసీఆర్ ఏంటో ప్రజలకు తెలుసు. డిసెంబర్ 11న ప్రజలు సరైన తీర్పు ఇస్తారు.
చంద్రబాబు అవకాశవాది..
చంద్రబాబు ఒక్క వైఎస్సార్‌సీపీతో తప్ప అన్ని పార్టీలతో కలిశారు. అవసరం కోసం ఏ పార్టీతో అయినా కలుస్తారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ను విలన్‌గా చూపి బీజేపీతో జతకట్టారు. నాలుగేళ్లు కలిసి ఉండి ఇప్పుడు బీజేపీని విలన్‌గా చూపిస్తూ కాంగ్రెస్‌తో కలిశారు. పార్టీ ఫిరాయింపులపై చంద్రబాబు మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది. టీడీపీ నుంచి గెలిచిన రేవంత్‌రెడ్డి, ఆర్.కృష్ణయ్య చంద్రబాబు కాంగ్రెస్‌లో చేరారు. ఏపీలో 24 మంది వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకున్నారు. చంద్రబాబు అవకాశవాది. చంద్రబాబు తెలంగాణలో కాంగ్రెస్‌ను కొన్నారు. కూటమి అధికారంలోకి వస్తే ఏపీని లోకేశ్‌కు వదిలి ఇక్కడికి వస్తారేమో. టీఆర్‌ఎస్ భారీ ఆధిక్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. కాంగ్రెస్‌లో 40 మంది సీఎం అభ్యర్థులు ఉన్నారు. మొదటి వరుసలో ఉండే 10 మంది ఓడిపోతున్నారు. కొడంగల్‌లోనూ టీఆర్‌ఎస్ గెలుస్తుంది.
Published Thu, Dec 6 2018 2:14 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment