మనం గెలిస్తే కేసీఆర్‌ సీఎం | We will distribute sweets before they share seats: KTR | Sakshi
Sakshi News home page

మనం గెలిస్తే కేసీఆర్‌ సీఎం

Published Wed, Oct 24 2018 2:17 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

We will distribute sweets before they share seats: KTR - Sakshi

స్టేషన్‌ ఘన్‌పూర్‌లో జరిగిన సభలో కార్యకర్తలు బహూకరించిన కత్తితో కేటీఆర్‌

సాక్షి, జనగామ: ‘మనం గెలిస్తే రాష్ట్రంలో కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారని స్పష్టంగా చెబుతున్నాం. అదే కాంగ్రెస్‌ పార్టీలో 40 మంది పోటీపడుతున్నారు. ఎవరు సీఎం అవుతారో చెప్పే దమ్ము ఆ పార్టీకి లేదు. ఢిల్లీ నుంచి పంపే సీల్డ్‌ కవర్ల సంస్కృతి ఆ పార్టీది’అని మంత్రి కల్వకంట్ల తారక రామారావు విమర్శించారు. జనగామ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గ కేంద్రంలో మంగళవారం జరిగిన టీఆర్‌ఎస్‌ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడారు. కోర్టుల పేరుతో కాంగ్రెస్‌ పార్టీ అభివృద్ధికి అడ్డుపడుతోందని ఆరోపించారు.

రాష్ట్రంలో జరుగుతున్న ప్రగతిని ప్రజాకోర్టులో తెలుసుకోవడం కోసమే ముందస్తు ఎన్నికలకు వెళ్లినట్లు తెలిపారు. కాంగ్రెస్, టీడీపీ, కోదండరాం, సీపీఐ కూటమి కట్టి సీట్ల కోసం కుస్తీలు పడుతున్నారన్నారు. ‘వాళ్లు సీట్లు పంచుకునేలోపు మనం గెలిచి స్వీట్లు పంచుకోవడం పక్కా’అని అన్నారు. జనవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని, ఈ ఎన్నికల్లో కష్టపడి పని చేసిన కార్యకర్తలకు అప్పుడు అవకాశం కల్పిస్తామన్నారు.

‘కాబోయే లీడర్‌ కేటీఆర్‌ సాక్షిగా చెబుతున్నా.. మన పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేస్తాను’అని ఆపద్ధర్మ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. తనకు రాజకీయంగా జన్మనిచ్చిన ఘన్‌పూర్‌ అభివృద్ధి కోసం పూర్తి పూచీకత్తును తీసుకుంటున్నానని హామీ ఇచ్చారు. పార్టీ అభ్యర్థి టి.రాజయ్య తన పట్ల తప్పుగా ప్రవర్తించినా ఎప్పుడు నేను అసమ్మతి వ్యక్తం చేయలేదన్నారు.

మహాకూటమికి ఘోర పరాభవం తప్పదు
ఇబ్రహీంపట్నం రూరల్‌: ఈ ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థులకు ఘోర పరాభవం తప్పదని కేటీఆర్‌ అన్నారు. కూటమిలో సీట్ల కోసం కిందామీద పడుతున్నారని ఎద్దేవా చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ ముఖ్యకార్యకర్తల సమావేశం మంగళవారం బొంగుళూరు సమీపంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో జరిగింది. కేటీఆర్‌ మాట్లాడుతూ రోజూ వస్తున్నాం.. పోతున్నాం.. సీట్ల పంచాయితీ తెగడం లేదని కోదండరాం సార్‌ చెబుతున్నారని, ‘ఎల్లయ్యకు ఎడ్లులేవు.. మల్లయ్యకు బండి లేదు’అన్నట్లుగా.. టీడీపీకి కేడర్‌ లేదు, కాంగ్రెస్‌కు లీడర్లు లేరని ఎద్దేవా చేశారు.

మహాకూటమి పొరపాటున అధికారంలోకి వస్తే నెలకొక ముఖ్యమంత్రి 60 నెలలు 60 మంది ముఖ్యమంత్రులు మారే పరిస్థితి దాపురిస్తుందన్నారు. లిపాప (కవర్‌) నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థి ఊడిపడతారని, సీల్డ్‌ కవర్‌ ముఖ్యమంత్రి కావాలా.. సింహం లాంటి మన కేసీఆర్‌ సీఎం కావాలో మీరే ఆలోచించుకోవాలని కేటీఆర్‌ ప్రజలను కోరారు. సమావేశంలో భువనగిరి ఎంపీ డాక్టర్‌ బూర నర్సయ్యగౌడ్, శాసన మండలి చీఫ్‌ విప్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర విద్య, వనరుల అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌ నాగేందర్‌గౌడ్, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కేటీఆర్‌ సమక్షంలో కార్యకర్తల నిరసన
రాజయ్య మాట్లాడుతున్న సమయంలో ‘కడియం శ్రీహరి నాయకత్వం వర్ధిల్లాలి’అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. శ్రీహరి మాట్లాడానికి ఉపక్రమిస్తున్న సమయంలో కడియంకు అనుకూలంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. రాజయ్యకు మద్దతు వద్దంటూ నినదించారు. లేచి నిలబడి ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. కడియం వారిని శాంతింపచేయడానికి ప్రయత్నించారు. కేటీఆర్‌ మాట్లాడుతున్న సమయంలోనూ రాజయ్య వద్దంటూ కార్యకర్తలు నిరసన తెలిపారు. కడియం, రాజయ్య మధ్య వర్గపోరు తీవ్రస్థాయిలో ఉన్న నేపథ్యంలో భారీ స్థాయిలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement